మరింగంటి సింగరాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరింగంటి సింగరాచార్యులు
జననం16వ శతాబ్దం
మరణం16వ శతాబ్దం
ప్రసిద్ధిదశరథనందన చరిత్ర
మతంహిందూమతం
తండ్రివేంగళాచార్యుడు

మరింగంటి సింగరాచార్యులు తెలంగాణలోని నల్లగొండ జిల్లా, దేవరకొండ ప్రాంతానికి చెందిన 16వశతాబ్దపు కవి. వైష్ణవ బ్రాహ్మణుడు. ఇతని తండ్రి వేంగళాచార్యులు. తాత తిరుమలాచార్యులు. మాద్గల్య గోత్రుడు. దశరథరాజనందన చరిత్ర అనే నిరోష్ఠ్య కావ్యాన్ని రచించాడు[1]. ఇతడు తన కవిత్వంతో ఇబ్రహీం కుతుబ్‌షానే మెప్పించి ముత్యాలహారాలు, గుర్రాలు, మదపు వెల్లగొడుగులు, అగ్రహారాలు కానుకలుగా పొంది సత్కరింపబడ్డాడు. దశరథరాజనందన చరిత్ర అను నిరోష్ఠ రామాయణం, సీతాకళ్యాణం ఇతని ముద్రిత రచనలు. తెలుగులో తొలి చతురర్థి కావ్యం నలరాఘవ యాదవ పాండవీయం వ్రాసింది ఇతనే. ఏక కాలంలో నాలుగు కథలను బోధించే ఈ కావ్యం ప్రస్తుతం అలభ్యం[2]. తెలుగులో మొట్టమొదటి నిరోష్ఠ్య కావ్యము కూడా ఇతని ఖాతాలోకి చేరుతుంది. ఇతడు రచించిన దశరథరాజ నందన చరిత్ర తెలుగు సాహిత్యంలో వెలువడిన మొట్టమొదటి నిరోష్ఠ్య కావ్యముగా పరిశోధకులు నిర్ణయించారు. ఇతడే రచించిన బిల్హణీయము అనే మరొక కావ్యంలో చిత్రకవిత్వం, బంధ కవిత్వం కనిపిస్తుంది. ఇంకా ఇతడు రామకృష్ణ విజయము అనే ద్వ్యర్థికావ్యాన్నీ, అనేక శతకాలను రచించాడు[3]. ఇతడి జీవితకాలము సా.శ.1520-1590[4] అని మరింగంటి కవుల సాహిత్యసేవపై పరిశోధన కావించిన శ్రీరంగాచార్య నిర్ధారించారు. సింగరాచార్యులు అష్టభాషాప్రవీణుడు.తన సోదరుడు మరింగంటి జగన్నాథాచార్యులతో కలిసి జంటగా శతావధానాలు చేసేవాడు. ఇతడు అబ్దుల్ కరీం, ఇబ్రహీం కుతుబ్‌షాల ఆస్థానములో కవిగా ఆశ్రయం పొందాడు.

రచనలు

[మార్చు]
  1. వరదరాజ స్తుతి
  2. శ్రీరంగ శతకము
  3. చక్రలాంఛనవిధి
  4. కవి కదంబము
  5. శతసంహిత
  6. రామకృష్ణ విజయము (ద్వర్థి కావ్యము)
  7. నాటకశాస్త్రము
  8. ధనాభిరామము
  9. ప్రేమాభిరామము
  10. నలయాదవరాఘవపాండవీయము (చతురర్థి కావ్యము)
  11. సకలాలంకార సంగ్రహము
  12. రాకాసుధాపూర్ణరసపుష్ప గుచ్ఛము
  13. ఆంధ్రభాషాభూషణము
  14. దశరథరాజ నందన చరిత్ర
  15. శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకళ్యాణము
  16. తారక బ్రహ్మరామ శతకము మొదలైనవి.

వీటిలో దశరథరాజనందన చరిత్ర, శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకళ్యాణము, తారకబ్రహ్మ రామశతము తప్ప మిగిలిన రచనలన్నీ ఇప్పుడు లభించుటలేదు. దశరథరాజనందన చరిత్ర అంతర్జాలంలో తెలుగు పరిశోధన, పొత్తపుగుడి లలో లభిస్తుంది.

బిరుదములు

[మార్చు]
  1. ఆశుకవి
  2. శతఘంటావధాన
  3. అష్టభాషాకవితావిశారద
  4. శారదాప్రశ్నవివరణ

రచనల నుండి కొన్ని పద్యాలు

[మార్చు]

కరకాచ్ఛిన్న దిగంత శాఖియయి నిర్ఘాతాహతాంగాళియై
హరినాగేంద్ర కరాతి చండ శర ధారాశ్లేష శేషాహి శే
ఖర గండస్థలియై ఘనాఘన తటిద్గర్జాతిరేక స్థితిన్
ధర యెల్లం జడి నిండసాగె జన చింతా కారణ స్థానియై

సురలను దోడుకొంచు నరిసూదనుఁడై తనరారు నిందిరా
ధరుఁడు చెలంగు నీరనిధి తట్టున కేగి నుతించు చుండఁగా
నెఱిఁగి సరోజ లోచనుఁడు నీ సురలుండిన చెంత కేగు దెం
చి రహిని నిల్చినన్ నతిని జేసిరి నిర్జరు లెల్ల నంతటన్!

(దశరథ రాజ నందన చరిత్ర కావ్యం నుండి)

తెలియక లెస్స సందె తఱి దీర్చఁగ నేఱక ఆకలాన నా
కలి యడిగించ నేఱ గెద గాడిన కాకల నాలి జాలిచే
నిలిచిన దారి నిల్చి గన నేఱక నల్కత లింత లేక చెం
తలఁ దిరగాడ సాగె జడదారియ గారెసరేగి డిందఁగన్

జిగి చన్గట్టసియాడ, తీఱయిన లేచెక్కిళ్ళ చక్కి న్నిగ
న్నిగ లీనంగ, కడాని కంటి సిరి డాల్నిండంగ, కై చిన్నియల్
తెగలై నల్దిస లాని చక్కఁగ చికిల్సేయ, న్నెరా సిగ్గెదం
దగలన్ రానెలఁ జేరి కాళ్ళకడ చెంతన్ సాగిలె న్నాతి దాన్!

( శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతా కళ్యాణము నుండి)

దివిజార్యగ్రణి పర్ణశాలకడ కేతేరన్ కృశానుండు గాం
చి వడిం జానకి నాత్మ భార్యల కడన్ శేష స్థలిం దాచి వే
దవతిం గల్పన చేయువాడుగొని సంథన్ లంకకుం బోవు లా
గవితానస్థితి నీదు కీలగు నయోధ్యా రామ! సీతాపతీ!

తన చే నంటిన బ్రహ్మహత్య విడ యత్నం జేమిటన్ లేని రు
ద్రుని సేతు క్షితి రావణార్థము జడాత్ముల్ నిల్పినా రందు రా
వన భూమీ స్థిత మౌని యోషితతి తీవ్ర క్రోధ వాక్యాను వ
ర్తన రూపంబని కాన రేమియు నయోధ్యా రామ! సీతాపతీ!

(తారక బ్రహ్మ రామ శతకము నుండి)

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్ర కవుల చరిత్రము - కందుకూరి వీరేశలింగం - మూడవభాగము - పుట 99
  2. "| తెలంగాణ సాహితీ సౌరభాలు: కుతుబ్‌షాహీల యుగం- (క్రీశ 1500 - 1600)". Archived from the original on 2015-09-20. Retrieved 2015-09-25.
  3. ముస్లిం రాజ్యంలో హిందూ ప్రధాని
  4. మరింగంటి కవుల సాహిత్యసేవ (సిద్ధాంతగ్రంథము) - డా.శ్రీరంగాచార్య - పేజీలు 26-34