మైనరు బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైనరు బాబు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
తారాగణం శోభన్ బాబు ,
వాణిశ్రీ
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ శ్రీ సారథి & టి.పి.ఆర్. కంబైన్స్
భాష తెలుగు

మైనరు బాబు "శ్రీ సారథి & టి.పి.ఆర్. కంబైన్స్" బ్యానర్‌పై తాతినేని ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ సాంఘిక సినిమా 1973 సెప్టెంబరు 7 వ తేదీన విడుదలయ్యింది.

సంక్షిప్త కథ[మార్చు]

తన కొడుకు రాము జీవితంలో ఆకలి, బాధ అనేవి అనుభవించకుండా సుఖంగా వెలగాలనే ఏకైక లక్ష్యంతో రాఘవయ్య అహోరాత్రాలు కష్టపడి ప్రతి పైసా కూడబెట్టి కొద్ది సంవత్సరాలలోనే లక్షాధికారి అయ్యాడు. ఒక పెద్ద ఫ్యాక్టరీకి యజమాని అయ్యాడు. ఈ క్రమంలో కొడుకు జీవితం ఎటు నడుస్తుందో గమనించలేదు. తండ్రి గారాబంతో, అంతులేని భోగభాగ్యాలతో రాము "మైనరు బాబు" అయ్యాడు. ఒకనాడు ఒక హోటల్ యజమానితో తగాదా వచ్చి ఆ హోటల్‌నే కొని మూసేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఇంటికొచ్చి తండ్రిని రెండు లక్షలు ఇమ్మంటాడు. కొడుకు దురుసు తనానికి రాఘవయ్య బాధపడ్డా, కొడుకు సంతోషం కోసం ఆ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడతాడు. రాఘవయ్య ఆప్తస్నేహితుడు అయిన గిరి సమయానికి వచ్చి రాముని ఆ డబ్బును తీసుకోనివ్వకుండా అడ్డు పడతాడు. ఈ తరం కుర్రవాళ్ళకి డబ్బు విలువ తెలియదని, పెద్దలు సంపాదించి పెట్టిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఒక్కటే తెలుసని విమర్శిస్తాడు. రాము అభిమానం, అహం దెబ్బతింటాయి. ఈ తరం కుర్రాళ్ళు ఏమాత్రం అశక్తులు కారనీ తలుచుకుంటే వాళ్ళూ సంపాదించగలరని, పెద్దవాళ్ళకన్నా ఘనకార్యాలనే సాధించగలరని గిరితో సవాల్ చేస్తాడు రాము. కానీ గిరి పెట్టిన ఆంక్ష ప్రకారం తన తండ్రి పేరును గాని, డబ్బును కానీ వాడుకోకుండానే తన లక్ష్యాన్ని సాధించి చూపిస్తానని ఛాలెంజ్ చేసి కట్టుబట్టలతో ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. తను ఎంత బ్రతిమాలినా వినిపించుకోకుండా రాము వెళ్ళిపోయినందుకు రాఘవయ్య కుంగిపోతాడు. పిల్లలు ప్రయోజకులు కావాలంటే తమ కాళ్ళమీద తాము నిలబడి బ్రతకటం నేర్చుకోవాలని, రాము తీసుకున్న నిర్ణయం సముచితమని, రాఘవయ్యకు ధైర్యం చెబుతాడు గిరి.

ఎంత తిరిగినా ఏ ఉద్యోగం దొరక్క, రాము చివరకు ఒక క్వారీలో రాళ్ళుకొట్టే కూలీగా చేరతాడు. అలవాటు లేని ఆ కష్టానికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతాడు. అక్కడే పనిచేస్తున్న లక్ష్మి అతని సేద తీర్చి అన్నం పెడుతుంది. వేరే తేలికైన ఉద్యోగం చూసుకోమని సలహా ఇస్తుంది. కార్మికులకు, మధ్యతరగతి కుటుంబాలకు అప్పులిచ్చి, చక్రవడ్డీలు కట్టి వాళ్ళ రక్తం తాగే భూపాలయ్య దగ్గర అప్పులు వసూలు చేసే గుమాస్తాగా చేరాడు.

తను అనుకోకుండా సహాయం చేసిన అమ్మాయి గీత, ఒకప్పుడు తనకు ప్రాణభిక్ష పెట్టిన లక్ష్మి కూతురే అని తెలుసుకుంటాడు. ఆమెను తన తల్లిగా, గీతను చెల్లెలిగా చూసుకుంటూ తృప్తిగా కాలం గడుపుతున్నాడు. అదేపేటలో ఉన్న పూసలమ్ముకునే సీతాలు అనే అమ్మాయితో అంతకు ముందే ఏర్పడిన పరిచయం పెరిగి ప్రణయంగా మారింది.

భూపాలయ్య కుడి భుజం కోటిగాడు కూలీల పేటలో చేస్తున్న అత్యాచారాలను చూడలేక రాము ఒకనాడు ఎదురుతిరిగి వాణ్ణి చిత్తుగా తంతాడు. ఆ కారణంగా భూపాలయ్య రాముని ఉద్యోగం లోంచి తీసేస్తాడు భూపాలయ్య. కానీ కొన్నాళ్ళలోనే భూపాలయ్య కొడుకైన కుమార్ సాయంతో కారు విడి భాగాలు తయారు చేసే ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అదే ఫ్యాక్టరీలో గీత కూడా పనిచేస్తోంది. కుమార్, ఆమె ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్ళి జరగడానికి వీలులేదని భూపాలయ్య ఆంక్ష పెట్టడంతో కుమార్ ఎదురు తిరుగుతాడు. సీతాలు సాయంతో రాము ఆ భూపాలయ్య కళ్ళ ఎదురుగానే కుమార్‌కు, గీతకు పెళ్ళి జరిపిస్తాడు. దానితో గోపాలయ్య ఉగ్రుడై రామును సర్వనాశనం చేస్తానని, సీతాలు బ్రతుకును నేలరాచి మట్టిపాలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కార్మికులంతా రాముకు అండగా నిలబడ్డారు.

ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు? లక్ష్మి, గీత నిజజీవితంలో రాముకు ఏమవుతారు? రాఘవయ్య కొడుకు చుట్టూ అల్లుకున్న కలలు ఏమౌతాయి? గిరి ఆశయం నెరవేరుతుందా? మొదలైన ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో లభిస్తాయి.[1]

నటీనటులు[మార్చు]

  • శోభన్ బాబు
  • ఎస్.వి.రంగారావు
  • గుమ్మడి
  • రాజబాబు
  • అల్లు రామలింగయ్య
  • చంద్రమోహన్
  • మిక్కిలినేని
  • పొట్టి ప్రసాద్
  • కె.వి.చలం
  • వాణిశ్రీ
  • అంజలీదేవి
  • లీలారాణి
  • సలీమా
  • లక్ష్మీకాంతమ్మ
  • రమణారెడ్డి
  • సూర్యకాంతం
  • హలం

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
  • మాటలు: ఆత్రేయ, భమిడిపాటి రాధాకృష్ణ
  • పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, శ్రీశ్రీ, ఆత్రేయ
  • సంగీతం: టి.చలపతిరావు
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్
  • కళ: జి.వి.సుబ్బారావు
  • కూర్పు: ఎన్.ఎం.శంకర్
  • నృత్యం: హీరాలాల్, తంగప్ప, సుందరం

పాటలు[మార్చు]

క్ర.సం. పాట రచన గాయనీ గాయకులు
1 ఓ మనిషీ ఓహో మనిషీ శ్రమశక్తిని తెలుసుకుని క్రమశిక్షణ మలుచుకుని శ్రీశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 బేబీ బేబీ బేబీ నీ పేరేంటో చెప్పు బేబీ సి.నా.రె. ఘంటసాల బృందం
3 కారున్న మైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు ఆత్రేయ పి.సుశీల
4 అంగట్లో అన్నీ ఉన్నాయ్ అల్లుని నోట్లో శని ఉంది వాట్ టుడూ సి.నా.రె. పిఠాపురం బృందం
5 నేను నువ్వూ ఇలాగే ఉండిపోతే సి.నా.రె. రామకృష్ణ, పి.సుశీల
6 రమ్మంటె గమ్ము నుంటాడందగాడు బలే అందగాడు హత్తెరి సి.నా.రె. ఘంటసాల, పి.సుశీల
7 మనదే మనదేలే ఈ రోజు మనకందరికీ పండుగలే ఈ రోజు కొసరాజు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం

మూలాలు[మార్చు]

  1. గీత (1973). మైనరు బాబు పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 26 May 2021.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు[మార్చు]