Jump to content

లక్నవరం సరస్సు

వికీపీడియా నుండి
లక్నవరం సరస్సు దగ్గర వేలాడే వంతెన

లక్నవరం సరస్సు ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలం లోని బుస్సాపూర్ గ్రామం దగ్గరలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

లక్నవరం సరస్సు సా.శ. 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయరాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. కళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కాకతీయ రాజులు ఆనాటి రైతాంగంపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవారనేందుకు ఈ సరస్సు సాక్షీభూతంగా నిలుస్తోంది. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్‌ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది. కోనేరు, దేవాలయం, నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో శివాలయం, నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును మాత్రమే నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ సరస్సుకు తొమ్మిది ప్రధాన తూములు ఉన్నాయి. కాంక్రీటు, ఇనుము వాడకం లేకుండా కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకపోవటం విశేషంగా చెప్పవచ్చు.

కాకతీయుల కాలం నుండి నేటివరకు లక్నవరం సరస్సు రైతులపాలిట వర్రపదాయినిగా ఉంటోంది. 8,700 ఎకరాల పంటపొలాలను సంవత్సరం పొడవునా నీరందిస్తోంది. సరస్సు నిర్మాణం సమయంలోనే సాగునీటి కోసం రంగాపుర్‌, శ్రీరాంపతి, నర్సింహుల కోట అనే నాలుగు ప్రధాన కాల్వలను నిర్మించారు. ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం లోతట్టు ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ఈ సరస్సు నిండుతుంది. 9 ప్రధాన తూముల ద్వారా నీటిని విడుదల చేసి సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి కాల్వల ద్వారా ఆయకట్టు పొలాలకు నీటిని అందిస్తారు.

అభివృద్ధి

[మార్చు]

ప్రకృతి అందాలతో అలరారుతున్న ఈ సరస్సు కొన్నేళ్ళక్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ నిరాదరణకు గురైంది. అయితే ప్రస్తుతం తెలంగాణ లోని ప్రధాన పర్యాటకకేంద్రంగా వెలుగొందుతోంది. లక్నవరం సరస్సు దీవుల మధ్య వేలాడే ఈ వంతెనను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజూ వందలాదిమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సరస్సులో ఆరు దీవులు ఉండగా ఒక్కో దీవిని ఒక్కోరకంగా ముస్తాబు చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు పర్యాటకశాఖ తగిన ఏర్పాట్లను చేస్తోంది.[2]

మూలాలు

[మార్చు]
  1. శ్రీనివాసరావు, గొల్లపూడి. "Laknavaram lake – a perfect place to unwind". thehindu.com. ఎన్. రామ్. Retrieved 12 October 2016.
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.