లయన్ (2016 చిత్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lion
Australian release poster
దర్శకత్వంGarth Davis
స్క్రీన్ ప్లేLuke Davies
దీనిపై ఆధారితంA Long Way Home 
by Saroo Brierley
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంGreig Fraser
కూర్పుAlexandre de Franceschi
సంగీతం
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లు
విడుదల తేదీs
2016 సెప్టెంబరు 10 (2016-09-10)(TIFF)
నవంబరు 25, 2016 (United States)
జనవరి 19, 2017 (Australia)
జనవరి 20, 2017 (United Kingdom)
సినిమా నిడివి
118 minutes[1]
దేశాలు
  • Australia
  • India
  • United States
భాషలుEnglish[1]
Hindi
Bengali
బడ్జెట్$12 million[2]
బాక్సాఫీసు$140.3 million[3]

లయన్ (ఆంగ్లం: Lion) 2016 లో విడుదల అయిన ఒక వాస్తావాధారిత ఆస్ట్రేలియన్ చలన చిత్రం. సరూ బ్రెయిర్లీ తన ఆత్మకథ గా రాసుకొన్న ఎ లాంగ్ వే హోం A Long Way Home ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. భారతదేశానికి చెందిన సరూ, తన కుటుంబం నుండి ఎలా దూరం అయ్యాడో, తన మూలాలను తెలుసుకోవటానికి, తిరిగి కుటుంబాన్ని చేరుకోవటానికి ఎంత కష్టపడ్డాడో ఈ చిత్రం చూపుతుంది. పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొన్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా $140 మిలియన్ లని వసూలు చేసి వాణిజ్యపరంగా కూడా జయప్రదం అయ్యింది. ఆస్ట్రేలియన్ చలనచిత్ర రంగంలో ఇది ఒక రికార్డుగా మిగిలిపోయింది.

కథ[మార్చు]

1986 లో కథనం మొదలౌతుంది. సరూ (సన్నీ పవార్) తన తల్లి (ప్రియాంక బోస్) , అన్నయ్య గుడ్డు (అభిషేక్ భారతే), చెల్లెలు తో కలిసి మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వా లో నివాసం ఉంటాడు. గుడ్డు, సరూ లు రైళలోని బొగ్గు ముక్కలను దొంగిలించి వాటికి విక్రయించి పాలు, ఆహారం కుటుంబానికి సమకూరుస్తుంటారు. ఒక సారి గుడ్డు పాలు కొనే సమయంలో సరూ దృష్టి అక్కడ తయారు అవుతున్న జిలేబీ ల పై పడుతుంది. సరూ గుడ్డుని జిలేబీ కొనిపెట్టమని అడుగుతాడు. గుడ్డు తాము ఇంకా చాలా సంపాదించినపుడు తనకి ఎన్ని కావాలంటే అన్ని జిలేబీలను కొనిపెడతానని అప్పటికి వాయిదా వేస్తాడు. డబ్బు కోసం తాము చేసే పనుల వంటిదే మరొక పని చేయటానికి ఒక సాయంత్రం గుడ్డు బయలుదేరగా, సరూ తాను కూడా అతనితో వస్తానని మారాం చేస్తాడు. గుడ్డు చేయబోయే పనిని సరూ చేయలేడు అని గుడ్డు వారిస్తూ ఉన్నా, సరూ ససేమిరా ఒప్పుకోడు. చేసేది లేక గుడ్డు సరూను తన వెంట దగ్గరలో ఉన్న రైల్వే స్టేషనుకు తీసుకెళ్తాడు. స్టేషను చేరే లోపు సరూ నిద్ర లోకి జారుకొంటాడు. గుడ్డు సరూను మేల్కొల్పాలని చూస్తాడు కానీ సరూ నిద్ర నుండి తేరుకోలేకపోతాడు. దీంతో గుడ్డు సరూను స్టేషనులోని ఒక బెంచీ మీద పడుకోబెట్టి, తాను వచ్చే వరకు అక్కడే ఉండమని ఎక్కడికీ వెళ్ళవద్దని చెప్పి తన పనికి వెళ్ళిపోతాడు. సరూ నిద్ర మేల్కొనే సమయానికి చుట్టుప్రక్కల గుడ్డు లేక పోగా అతనిని వెదుక్కొంటూ, ఖాళీగా నిలచి ఉన్న ఒక రైలు ఎక్కుతాడు. గుడ్డు కనబడకపోగా అదే రైలులో మరల నిద్రలోకి జారుకొంటాడు సరూ. ఈ సారి సరూ నిద్ర మేల్కొనే సమయానికి రైలు కదిలిపోయి ఉంటుంది. చాలా రోజుల తర్వాత రైలు కలకత్తా చేరుకొంటుంది. అక్కడి వారితో మాట్లాడటానికి సరూ కు బెంగాలీ రాదు. అప్పటికీ టికెట్ కౌంటరు వద్దకు వెళ్ళి తాము నివాసం ఉంటున్న చోటు అయిన గణేశ్ తలై కు టికెట్ తీసుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ, టికెట్ విక్రయదారు కు సరూ చెప్పే స్టేషను ఏదో అర్థం కాక, ప్రక్కకు నెట్టి వేయబడతాడు. ఆ రాత్రి అదే స్టేషనులో అనాథ పిల్లలతో కలిసి నిద్రపోతాడు, కానీ కొందరు కిడ్నాపర్లు వారిని బంధించటానికి రావటంతో సరూ అక్కడి నుండి పారిపోవలసి వస్తుంది.

కలకత్తా మహానగరంలో అలాగే తచ్చాడుతున్న సరూను నూర్ (తానీషా చటర్జీ) అనే మహిళ చూస్తుంది. సరూని తన అపార్ట్ మెంట్ కి తీసుకెళుతుంది. రామ (నవాజుద్దీన్ సిద్ధికీ) అనే వ్యక్తి సరూని ఇంటికి చేర్చటంలో సహాయం చేస్తాడని చెబుతుంది. కానీ నూర్-రామ లు ఏదో దురుద్దేశ్యంతో ఉన్నారని అర్థం చేసుకొన్న సరూ, నూర్ వెంటబడుతున్నా, అక్కడి నుండి పారిపోతాడు. దీనావస్థలో హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాలలో కాలం వెళ్ళదీస్తున్న సరూ ను రెస్టారెంటు కిటికీ గుండా చూసిన ఒక యువకుడు సరూ ను పోలీసులకు అప్పగిస్తాడు. సరూ మూలాలు తేల్చలేని వారు, అతనిని ఒక అనాథ శరణాలయంలో చేరుస్తారు. మూడు నెలల తర్వాత శ్రీమతి సూద్ (దీప్తి నావల్) సరూ గురించి పత్రికలలో ప్రకటనలు వేయించిందని, కానీ దానికి ఎటువంటి జవాబు రాలేదని సరూకి తెలుపుతుంది. ఒక ఆస్ట్రేలియన్ జంట మాత్రం సరూని దత్తత తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతుంది. సరూ కి చిన్న చిన్న ఇంగ్లీషు పదాలు నేర్పుతుంది. 1987 లో శ్రీమతి సూద్, సరూని టాస్మేనియా కు చెందిన హోబార్ట్ లో నివాసం ఉంటున్న జాన్ బ్రేయిర్లీ (డేవిడ్ వెన్హాం), స్యూ (నైకోల్ కిడ్మాన్) ల వద్దకు పంపుతుంది. సరూ వారి వద్ద సుఖ సంతోషాల మధ్య పెరుగుతూ ఉంటాడు. ఒక సంవత్సరం తర్వాత మంతోష్ (కేశవ్ జాదవ్) అనే మరో భారతీయ బాలుడిని వారు సంతతిగా తెచ్చుకొంటారు. కానీ మంతోష్ క్రొత్త చోటుకు అలవాటు పడలేక విపరీతమైన మానసిక ధోరణి, స్వీయ హానికి పాల్పడటం వంటివి చేస్తుంటాడు.

20 ఏళ్ళ తర్వాత యువకుడిగా ఎదిగిన సరూ (దేవ్ పటేల్) హోటాల్ మేనేజ్ మెంట్ చదవటానికి మెల్బోర్న్ వెళతాడు. అమెరికన్ విద్యార్థిని అయిన లూసీ (రూనీ మారా) తో ప్రేమలో పడతాడు. అక్కడి భారతీయ విద్యార్థులతో చేసే విందులో సరూ కి జిలేబీ కనబడుతుంది. జిలేబీ సరూని జ్ఙాపకాల దొంతర్లలోకి నెట్టుతుంది. కలవరపడ్డ సరూని స్నేహితులు అడగగా, తన గతం గురించి వారికి చెబుతాడు. స్నేహితులందరూ అతనిని గూగుల్ ఎర్త్ (Google Earth) గురించి చెబుతారు. దానిని ఉపయోగించి అతని పుట్టిన ప్రదేశం గురించి వెదకమని సలహా ఇస్తారు. సరూ గూగుల్ ఎర్త్ లో తన అన్వేషణ ను మొదలు పెడతాడు. 80వ దశకంలో భారతీయ రైళ్ళు ఎంత వేగంతో నడిచేవి, కలకత్తా కు ఏయే ప్రదేశాల నుండి రైళ్ళు వచ్చేవి, ఇత్యాది వివరాలన్నీ సేకరించి, ఏయే ప్రదేశాలు తన స్వస్థలం అయ్యి ఉండవచ్చునో మ్యాప్ తయారు చేసుకొంటాడు. ఈ అన్వేషణలో అడుగడుగునా తన కుటుంబం తనను కోల్పోయినందుకు ఎంతగా బాధపడి ఉంటుందో తలచుకొని మానసిక వేదనకు గురి అవుతూ ఉంటాడు. ఈ సతమమ మానసిక స్థితిలో ప్రియురాలు లూసీ తో కూడా సంబంధాలు తెంచుకొంటాడు.

పెంపుడు తల్లి స్యూ ఆరోగ్యం క్షీణించగా సరూ తన వద్దకు వెళతాడు. తాను గొడ్రాలిని కానని, ఈ ప్రపంచంలో చాలా మంది అనాథలు ఉన్నారని, తన వంతుగా కొంతైనా వారి బాధను తీర్చుదామని మాత్రమే తాను వారిరువురినీ దత్తత తీసుకొందని సరూ కు తెలుపుతుంది స్యూ. స్యూ వద్దనే కాలం గడుపుతున్న సరూకు మాత్రం తన మూలాల అన్వేషణ లో ఎటువంటి ఫలితం కనబడదు. ఒక సాయంత్రం మాత్రం తన తల్లి రాళ్ళు కొట్టిన ప్రదేశం సరూకు గూగుల్ ఎర్త్ లో కనబడుతుంది. అక్కడికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషను, ఆ స్టేషను లో ఉండే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు తన జ్ఙాపకాలతో సరిపోలటంతో గణేష్ తలై ఎక్కడ ఉందో సరూ కనిపెడతాడు. స్యూ కు విషయం తెలుపగా, విశాల దృక్పథంతో ఆమె అతని ప్రయత్నాలకు పూర్తి మద్దతు తెలుపుతుంది.

సరూ భారతదేశం బయలుదేరి ఎట్టకేలకు తాను పుట్టిన ప్రదేశం చేరుకొంటాడు. అక్కడ ఇంగ్లీషు మాట్లాడగలిగే ఒక వ్యక్తి తో అతని తల్లి, సోదరిని అక్కున చేర్చుకొని భావోద్రేకాలకు గురి అవుతాడు. తాను తప్పిపోయిన రోజే గుడ్డు ప్రమాదవశాత్తు రైలు క్రింద పడి చనిపోయాడని తెలుసుకొని బాధపడతాడు. ఏ నాటికి అయినా సరూ తిరిగి వస్తాడనే ఆశ తోనే తాను ఈ ఊరి వదిలి వెళ్ళలేదని సరూ తల్లి అతనితో చెబుతుంది. ఫిబ్రవరి 2012 లో నిజజీవితం లో సరూ తన కుటుంబాన్ని చేరుకొన్న వీడియో, సరూ తన పెంఫుడు తల్లిదండ్రులను తన అసలు తల్లికి పరిచయం చేసే వీడియో, అసలు తల్లి పెంపుడు తల్లి కి సరూను చక్కగా చూసుకొన్నందుకు ధన్యవాదాలు తెలిపే వీడియో లతో చిత్రం ముగుస్తుంది. సరూ అని అప్పటి వరకూ అనుకొన్న తన అసలు పేరు షేరూ అని తెలుసుకొంటాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Lion (PG)". British Board of Film Classification. 2 December 2016. Retrieved 2 December 2016.
  2. "Lion, Starring Dev Patel, Nicole Kidman, and Rooney Mara, Notches Four Golden Globe Nominations (Including Best Picture) and Zurich Film Festival Diversity in Film Award". Vanity Fair (magazine). Retrieved 5 January 2017.
  3. "Lion (2016)". Box Office Mojo. Retrieved 4 August 2017.