Jump to content

విముక్త

వికీపీడియా నుండి
విముక్త
"విముక్త" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: ఓల్గా
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: స్త్రీవాదం, స్త్రీ పురుష సంబంధాలు
ప్రచురణ: స్వేచ్ఛా ప్రచురణలు
విడుదల: 2015
ప్రతులకు: స్వేచ్ఛా ప్రచురణలు

విముక్త ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన చిన్న కథల సంకలనం.[1] ఓల్గా రచించిన 'విముక్త' కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించటం ప్రగతిశీల సాహిత్యానికి ఒక గౌరవం.[2]

ఈ పుస్తకం బెంగాలి (పరమితా సేన్గుప్తా), హింది (ఆర్. శాంతసుందరి), కన్నడ (అజయ్ వర్మ అల్లూరి), కొంకణి (దామోదర్ మౌజో), మలయాళం (ఎస్. సుప్రియ), మరాఠీ (వందనా), నేపాలీ, ఒడియా (సుధీంద్ర బెహర), తమిళం (గౌరి కృపానందన్), ఇంగ్లీషు (టి.విజయ కుమార్, సి‌ విజయశ్రీ) భాషల్లోకి అనువదించబడింది.

పుస్తక పరిచయం

[మార్చు]

‘విముక్త’ సంకలనంలో సమాగమం, మృణ్మయనాదం, సైకత కుంభం, విముక్త, బంధితుడు కథలు ఉన్నాయ

గతంలో పురాణాల్ని తిరగరాసిన వారు పురాణ పాత్రలుగానే వాటిని చూశారు, చూపించారు. ఓల్గా విశిష్టత, విభిన్నత ఏమంటే, సీతనో, రాముడినో, ఊర్మిళనో, లక్ష్మణుడినో, అహల్యనో, శూర్పణఖనో, రేణుకనో.. కేవలం పాత్రలుగా కాకుండా అందులోని భావ ప్రకంపనల్ని సృజియించారు. భావనను ప్రతిబింబింపచేయాలంటే, ఆ పాత్రల స్వభావ మూలాన్ని మార్చడం అనివార్యం. రామయణంలో 'శూర్పణఖ' అసూయ స్వభావం కలది, విలన్‌ పాత్రధారి. సమాగమంలోని శూర్పణఖ అలా కాదు, ధీరోధాత్రి, అంత్ణ సౌందర్యవతి. ఈ కథలన్నింటిలో 'సీత' ఒక ప్రధానమైన భావన. ఈ మూల భావనతోనే మిగిలిన పాత్రలూ మరికొన్ని భావనలుగా గోచరిస్తాయి. అలాంటి కొంగొత్త భావనల సమాహారమే 'విముక్త' కథా సంపుటి! సమాగమంలోనో, ఇతర కథల్లోనో సీత శూర్పణఖనో, అహల్యనో కలుసుకోవడం కథ కాదు. కొత్త భావనలతో, స్త్రీ దృక్పథంతో కలపడం ఓ కొత్త కోణం.

‘కేవలం ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు…చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయకర్తలు అయినపుడే అది సాధ్యపడుతుంది’ అని రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి ఓల్గా స్పష్టంగా చెబుతారు.[3]

విముక్త సంకలనంలోని కథలు రామాయణ కథా నేపథ్యంలో సీత సూత్రధారిగా నడిచేవి. పురాణ కథలను తీసుకొని స్త్రీవాద దృక్కోణంతో మాత్రమే గాక, ఓ నూతన ఒరవడితో తిరగరాయడమనేది అద్భుత విషయమైతే ఆ అద్భుతాన్ని తనదైన శైలిలో అలతి అలతి పదాలతో సరళంగా, క్లుప్తంగా రాయడం ఓల్గా గారికే చెల్లింది. ఈ కథలన్నీ కూడా చదువరుల హృదయాలను హత్తుకొని, ఏకబిగిన చదివిస్తాయి. పౌరాణిక పాత్రల్లోని ఉదాత్తత, సహనశీలత, సంపూర్ణత వారి జీవితాల్లోని ఆయా సందర్భాల్లో వారనుభవించిన మౌన సంఘర్షణ లోంచి రూపుదిద్దుకున్నవే! సామాజిక కట్టుబాట్లు, నైతిక, నిర్దేశిక సూత్రాలననుసరించి పితృస్వామ్య ఆధారిత కుటుంబ వ్యవస్థ తన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఆదేశిక సూత్రా ల అంతర్వాహినియే ఆయా పాత్రల గుణగణాలు.[4]

ఈ పుస్తకం గురించి ఓల్గా చెప్పిన విషయం

[మార్చు]
ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా.
ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై వాటినధిగమించి
లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక,
నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే
స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తునే, అసహ్యించుకుంటునే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు - ద్వేషంతో
తమను తాము హింసించుకోడం అలవాటైన స్త్రీలు - ఆ స్త్రీల కోసం ఈ కథలు.
                                                  – ఓల్గా, రచయిత్రి

అవార్డులు

[మార్చు]

ఈ చిన్న కథల సంకలనం ‘విముక్త’ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ సంకలనాన్ని డాక్టర్ కె.రామచంద్రమూర్తి, డాక్టర్ ఎ.మంజులత, డాక్టర్ జి.యోహాన్‌బాబుల జ్యూరీబృందం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.[5]

మూలాలు

[మార్చు]
  1. ఓల్గా ‘విముక్త’కు సాహిత్య అకాడమీ పురస్కారం
  2. "స్త్రీవాద ద్పక్పథానికి జాతీయ పురస్కారం". Archived from the original on 2015-12-23. Retrieved 2015-12-28.
  3. ""విముక్త – కథా సంపుటి"". Archived from the original on 2016-07-19. Retrieved 2015-12-28.
  4. స్త్రీల అస్తిత్వ సాధికారత పునర్నిర్వచనం విముక్త..[permanent dead link]
  5. "2015 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు పొందిన పుస్తకం". Archived from the original on 2015-12-24. Retrieved 2015-12-28.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విముక్త&oldid=4076591" నుండి వెలికితీశారు