శ్రీ గోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ గోపాల్ (1938-1986) గా రేడియో శ్రోతలకు చిరపరిచితులైన కొంపెల్ల గోపాలకృష్ణమూర్తి రేడియో కార్యక్రమాల రూపశిల్పిగా, రచయితగా, కార్టూనిస్ట్ గా, చలనచిత్ర నటుడుగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా బహుముఖ ప్రజ్ఞాశాలి.

జీవిత సంగ్రహం

[మార్చు]

ఇతడు 1938 సం|| జనవరి 20వ తేదీన కాకినాడలో జన్మించారు. మదరాసు విశ్వవిద్యాలయం నుండి M.A. ఫిలాసఫీలో స్వర్ణపతకాన్ని పొందారు. ప్రతిభా వ్యుత్పత్తులు కలిగి శ్రీగోపాల్ గా ప్రసిద్ధులయ్యారు. 1965లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రములో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా సెలక్టు అయ్యారు. అంతకు ముందు ఫ్రీలాన్స్ రాజకీయ కార్టూనిస్ట్ గా పనిచేశారు.

తర్వాత వివిధ హోదాలలో ఆకాశవాణి మదరాసు, పోర్ట్ బ్లయర్, గోవా, విజయవాడ, కడప కేంద్రాలలో పనిచేశారు. శ్రవ్య మధ్యమంలో శక్తిని గ్రహించి అనేక రూపకాలు, నాటకాలు రూపొందించి ప్రసారం చేశారు. యువవాణి విభాగం అధిపతిగా యువశక్తికి ప్రోత్సాహం కలిగించారు.

ఆకాశవాణి వార్షిక పోటీలలో నాలుగు బహుమతులు శ్రీ గోపాల్ పొందడం విశేషం. టెన్జింగ్ ఎవరెస్టు శిఖరారోహణను గూర్చి విద్యా ప్రసారాలలో విక్రాంత గిరిశిఖరం అనే రూపకం ప్రసారం చేశారు. 1974వ సంవత్సరంలో ఆ రూపకానికి జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. భగవాన్ రమణ మహర్షిపై యువవాణి విభాగంలో సమర్పించిన రూపకానికి బహుమతి లభించింది. కొండ నుండి కడాలి దాకా అనే రూపకాన్ని గోదావరి నదిపై బాలాంత్రపు రజనీకాంత రావు నిర్వహణలో శ్రీ గోపాల్ ఒక రూపకం ప్రసారం చేసి ప్రశంసా బహుమతులందారు. చలం నవల మార్తా ఆధారంగా పుర్ణమానవుడు అనే రేడియో నాటకాన్ని రూపొందించి వార్షిక పోటీలలో బహుమతి పొందారు. 1979వ సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన ఇండో అమెరికన్ డ్రామా ప్రొడ్యూసర్ల సెమినార్ కి ఆంధ్ర రాష్ట్రం నుండి శ్రీ గోపాల్ ప్రతినిధిగా ఎంపికయ్యారు.

జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శంకరాభరణం చిత్రంలో సంగీతం మాష్టారు దాసుగా శ్రీ గోపాల్ పాత్రపోషణ ప్రేక్షకులకు చిరకాలం గుర్తువుంటుంది. ఇంకా మంచుపల్లకి, స్వాతిముత్యం, ఆలాపన, తాయారమ్మ బంగారయ్య చిత్రాలలో కూడా ఆయన నటించారు.

1979 నుండి 82 వరకు హైదరాబాదు దూరదర్శన్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. కడప ఆకాశవాణిలో పనిచేస్తూ అనారోగ్యంతో 1986 సం|| మే 18న హైదరాబాద్ లో శ్రీ గోపాల్ తనువు చాలించారు.