స్టోయిసిజం
స్టోయిసిజం అనేది సా.పూ 3వ శతాబ్దంలో పురాతన గ్రీకు దేశంలో ఏథెన్స్ నగరంలో ఆవిర్భవించిన తత్వశాస్త్ర భావన. జెనో ఆఫ్ సిటియం దీనికి ఆద్యుడు. ఈ భావనలు ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిని స్టోయిక్స్ అని అంటారు.
ఈ భావన ప్రకారం ధర్మంతో (virtue) కూడిన జీవితమే మానవునికి ఉత్తమైన మార్గం. వేరే భౌతిక సంపత్తులైన ఆరోగ్యం, సంపద, సుఖం మొదలైనవి మంచివీ కాదు, చెడ్డవీ కాదు.[1]
స్టాయిసిజం పురాతన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలలో సా. శ 3 వ శతాబ్దం వరకూ పరిఢవిల్లింది. దీనిని అనుసరించిన వారిలో మార్కస్ ఓరీలియస్ (Marcus Aurelius) చక్రవర్తి ముఖ్యుడు. సా. శ 4 వ శతాబ్దంలో క్రైస్తవం రాజ్యమతం అయినప్పటి నుంచి దీని ప్రాబల్యం తగ్గిపోయింది. అయితే సాంస్కృతిక పునరుజ్జీవన కాలం నుంచి నియో స్టాయిసిజం పేరుతోనూ, ప్రస్తుతం ఆధునిక స్టాయిసిజం పేరుతోనూ పునరుత్తేజం పొందింది.[2]
స్టోయిసిజం విధ్వంసక భావోద్వేగాలను అధిగమించేందుకు స్వీయ-నియంత్రణ, ధైర్యాన్ని అభివృద్ధి చేసుకోమని బోధిస్తుంది. విశ్వభావనను అర్థం చేసుకోవడానికి స్పష్టమైన, నిష్పాక్షికమైన ఆలోచనాపరుడిగా మారమని ఈ తత్వం బోధిస్తుంది. ఈ తత్వం ప్రకారం మానవులంతా ఒకే విశ్వాత్మ నుంచి ఉద్భవించిన వారే కాబట్టి వాళ్ళందరూ సౌభ్రాతృత్వంలో మెలగాలి, ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. సాంఘిక సంబంధాల్లో హోదా, ఆస్తులు మొదలైనవి అడ్డు కాకూడదని కూడా ఈ తత్వం బోధిస్తుంది.
పేరు
[మార్చు]స్టోయిసిజాన్ని మొదట్లో ఈ భావనకు ఆద్యుడైన జెనో పేరు మీదుగా జెనోనిజం అనేవారు. అయితే కొద్ది కాలంలోనే ఆ పేరును మార్చేశారు, ఎందుకంటే ఈ తత్వశాస్త్రాన్ని అనుసరించే వారు ఆ వ్యవస్థకు పుట్టించిన వారితో సహా ఎవరైనా సంపూర్ణమైన వ్యక్తులు కాదని నమ్ముతారు. అలాగే తమ తత్వం కొంతమంది వ్యక్తులు స్థాపించిన సాంప్రదాయంగా మిగిలిపోకూడదని భావించారు.[3]
ఈ స్టోయిసిజం అనే పదం స్టోవా పికీలే (Stoa Poikile) అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఈ పదానికి అర్థం స్తంభాలతో ఏర్పాటు చేసిన వసారా లాంటిది. ఇది పురాతన ఏథెన్స్ లో అగోరా అనే స్థలంలో ఉంది. ఇక్కడ జెనో, అతని అనుచరులు కూడి తమ భావనలు పంచుకుంటూ చర్చలు చేసేవారు.[4][5] స్టోయిసిజాన్ని అనుసరించేవారిని స్టోయిక్స్ అని వ్యవహరిస్తారు.
తాత్విక వ్యవస్థ
[మార్చు]అన్ని పురాతన తత్వశాస్త్రపు సిద్ధాంతాల కన్నా స్టోయిసిజం పూర్తిగా క్రమబద్ధంగా ఉందని ప్రకటించుకున్నది.[6] తత్వశాస్త్రం అంటే సత్ప్రవర్తనతో కూడిన ధార్మిక జీవితాన్ని గడపడమేనని స్టోయిక్స్ విశ్వసించారు. ఈ ధార్మిక విధానం, తర్కం, అందరూ ఒకటేననే అద్వైత భావన, సహజమైన నైతిక నియమాల ద్వారా నిర్మితమైనది.[7] ఇది ఆలోచనాత్మకమైన జీవితాన్ని గడపడానికి ముఖ్యమైనది. అవన్నీ పెద్ద తాత్విక సంభాషణలో భాగం.[8] స్టోయిక్స్ నైతికతకు పెద్దపీట వేశారు. తర్కం గురించి వారి ఆలోచనలు తరువాతి తత్వవేత్తలలో మంచి ఆసక్తిని రేకెత్తించాయి.
విధ్వంసకర భావాలను అరికట్టేందుకు స్వీయ నియంత్రణే ప్రధానమని స్టోయిసిజం విశ్వసిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ Sharpe, Matthew. "Stoic Virtue Ethics Archived 2018-11-13 at the Wayback Machine." Handbook of Virtue Ethics, 2013, 28–41.
- ↑ Becker, Lawrence C. (2001). A New Stoicism. Princeton: Princeton University Press. ISBN 978-1400822447.
- ↑ Robertson, Donald (2018). Stoicism and the Art of Happiness. Great Britain: John Murray.
- ↑ "Definition of STOIC".
- ↑ Williamson, D. (1 April 2015). Kant's Theory of Emotion: Emotional Universalism. Palgrave Macmillan US. p. 17. ISBN 978-1137498106.
- ↑ Long, A.A.; Sedley, D.N. (1987). The Hellenistic Philosophers. Cambridge: Cambridge University Press. pp. 160.
- ↑ Aetius, Stoicorum Veterum Fragmenta, 2.35
- ↑ Long, A.A.; Sedley, D.N. (1987). The Hellenistic Philosophers. Cambridge: Cambridge University Press. p. 161. ISBN 9780521255615. OCLC 13004576.