స్ట్రాటోస్ఫియర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూమి వాతావరణంలోని ఐదు ప్రాథమిక పొరలను చూపే రేఖాచిత్రం: ఎక్సోస్పియర్, థర్మోస్పియర్, మెసోస్పియర్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్పియర్. (స్కేలుకు అనుగుణంగా లేదు) భూమి ఉపరితలం నుండి స్ట్రాటోస్ఫియర్ (50 కి.మీ) పైభాగం వరకు భూమి వ్యాసార్థంలో కేవలం 1% లోపే ఉంటుంది.

స్ట్రాటోస్ఫియర్ అనేది భూమి వాతావరణం లోని రెండవ పొర. ఇది ట్రోపోస్పియరుకు పైన, మీసోస్పియరుకు క్రిందన ఉంటుంది.[1] స్ట్రాటోస్ఫియరు అనేది స్తరీకరించబడిన ఉష్ణోగ్రత పొరలతో కూడిన వాతావరణ పొర. ఇందులో వెచ్చని గాలి పొరలు ఆకాశంలో ఎత్తున, చల్లని పొరలు భూమి ఉపరితలానికి దగ్గరగానూ ఉంటాయి. సూర్యుని అతినీలలోహిత (UV) రేడియేషన్‌ను ఓజోన్ పొర గ్రహించడం వల్ల ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూంటుంది.[2] ఉష్ణోగ్రత విలోమం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న ట్రోపోస్పియరుతో పోలిస్తే వ్యతిరేకంగా ఉంటుంది -ట్రోపోస్పియరులో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ట్రోపోస్ఫియరును తెలుగులో ట్రోపో ఆవరణం అనడం కద్దు.

ట్రోపోస్పియర్ ఆఫ్టర్‌గ్లో (నారింజ), స్ట్రాటోస్ఫియరు (నీలం), మెసోస్పియర్ (నల్లగా). మెసోస్పియరు వద్ద వాతావరణ ప్రవేశం ప్రారంభమవుతుంది. వ్యోమనౌక వాతావరణం లోకి రీఎంట్రీ అవుతున్న దృశ్యం

ట్రోపోస్ఫియర్ స్ట్రాటోస్ఫియరుల మధ్య ట్రోపోపాజ్ సరిహద్దు ఉంది. ఇక్కడే ఉష్ణోగ్రత విలోమం మొదలౌతుంది. భూమధ్యరేఖకు సమీపంలో, స్ట్రాటోస్ఫియరు దిగువ అంచు 20 కి.మీ. (66,000 అ.; 12 మై.) వరకు ఉంటుంది. మధ్య అక్షాంశాల వద్ద 10 కి.మీ. (33,000 అ.; 6.2 మై.), ధ్రువాల వద్ద సుమారు 7 కి.మీ. (23,000 అ.; 4.3 మై.) ఉంటుంది.[2] ఉష్ణోగ్రతలు సగటున ట్రోపోపాజ్ వద్ద −51 °C (−60 °F; 220 K) నుండి మెసోస్పియర్ దగ్గర సగటున −15 °C (5.0 °F; 260 K) వరకు ఉంటాయి.[3] ఋతువులు మారుతూంటే స్ట్రాటోస్ఫియరులో ఉష్ణోగ్రతలు కూడా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ధ్రువ రాత్రి (శీతాకాలం)లో ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి.[4] స్ట్రాటోస్ఫియరు లోని గాలులు ట్రోపోస్పియరులోని గాలివేగాలను మించి 60 m/s (220 km/h; 130 mph) కి చేరుకుంటాయి.[4]

ఓజోన్ పొర

[మార్చు]

ఓజోన్ పొర ఏర్పడటాన్ని వివరించే యంత్రాంగాన్ని బ్రిటీష్ గణిత శాస్త్రజ్ఞుడు సిడ్నీ చాప్‌మన్ 1930లో వివరించాడు.[5] పరమాణు ఆక్సిజన్ UV-C ప్రాంతంలో 240 nm కంటే తక్కువ తరంగదైర్ఘ్యాల వద్ద అధిక శక్తి గల సూర్యకాంతిని గ్రహిస్తుంది. హోమోలిటిక్‌గా విభజించబడిన ఆక్సిజన్ అణువుల నుండి ఉత్పత్తి అయిన రాడికల్స్, పరమాణు ఆక్సిజన్‌తో కలిసి ఓజోన్‌ను ఏర్పరుస్తాయి. ఓజోన్, మాలిక్యులర్ ఆక్సిజన్ కంటే చాలా వేగంగా ఫోటోలైజ్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ తరంగదైర్ఘ్యాల వద్ద బలమైన శోషణ సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ సౌర ఉద్గారాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఓజోన్ (O3) ఫోటోలిసిస్‌లో O, O2 లను ఉత్పత్తి అవుతాయి. ఆక్సిజన్ అణువు, వాతావరణం లోని మాలిక్యులర్ ఆక్సిజన్‌తో కలిసి O3 ని ఉత్పత్తి చేసి, ఈ క్రమంలో వేడిని విడుదల చేస్తుంది. వేగవంతమైన ఫోటోలిసిస్, ఓజోన్ పునరుత్పత్తి వలన స్ట్రాటోస్ఫియరు వేడెక్కుతుంది. ఫలితంగా ఉష్ణోగ్రత విలోమం ఏర్పడుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరగడం స్ట్రాటోస్ఫియరు లక్షణం; నిలువుగా మిక్సింగ్‌ అవడానికి అది నిరోధం కలిగిస్తుందంటే దానర్థం అది స్తరీకరించబడిందని. స్ట్రాటోస్ఫియరు పైభాగంలో ఉష్ణోగ్రత దాదాపు 270 K (−3 °C) ఉంటుంది. [6]

విమానం ఫ్లైట్

[మార్చు]
A generic Boeing 737-800 cruising at 32,000 feet. Below it is a pack of clouds. Above it is a vivid, ambient blue sky.
ట్రోపోస్పియర్‌లో ఉండే కల్లోలాల నుండి తప్పించుకోడానికి విమానం సాధారణంగా స్ట్రాటోస్ఫియరులో ప్రయాణిస్తుంది. ఈ చిత్రంలో నీలిరంగు పుంజం ఓజోన్ పొర. ఓజోన్ స్ట్రాటోస్ఫియరును వేడి చేస్తుంది. జెట్‌లు, వాతావరణ బెలూన్‌లు ఎగరగలిగే ఎత్తుకు పరిమితి స్ట్రాటోస్ఫియరే. ఇక్కడి గాలి ట్రోపోస్పియరులో కంటే దాదాపు వెయ్యి రెట్లు పలుచగా ఉంటుంది. [7]

వాణిజ్య విమానాలు సాధారణంగా 9–12 కి.మీ. (30,000–39,000 అ.) ఎత్తులో ప్రయాణిస్తాయి. సమశీతోష్ణ అక్షాంశాలలో ఈ ఎత్తు స్ట్రాటోస్పియర్ దిగువ ప్రాంతాలలో ఉంటుంది. [8] ఈ ఎత్తులో ప్రయాణించే విమానపు ఇంధన ఖర్చు తక్కువగా ఉంటుంది. ట్రోపోపాజ్ దగ్గర ఉష్ణోగ్రతలు, గాలి సాంద్రత తక్కువగా ఉండడం కారణంగా, ఎయిర్‌ఫ్రేమ్‌పై డ్రాగ్‌ను తగ్గిస్తుంది.

కాంకార్డ్ విమానం సుమారు 60,000 అ. (18 కి.మీ.) ఎత్తున మ్యాక్ 2 వేగంతో ప్రయాణించింది. SR-71 85,000 అ. (26 కి.మీ.) ఎత్తున మ్యాక్ 3 వేగంతో ప్రయాణించింది. ఈ రెండూ స్ట్రాటోస్ఫియరు లోనే.

జీవం

[మార్చు]

బాక్టీరియా

[మార్చు]

స్ట్రాటోస్ఫియరులో బాక్టీరియా ఉంటుంది. అంచేత ఇది జీవావరణంలో ఒక భాగం. 2001లో, ఎత్తైన బెలూన్ ప్రయోగంలో 41 కిలోమీటర్ల ఎత్తున దుమ్మును సేకరించారు. ఆ తరువాత ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు అందులో బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు. [9]

పక్షులు

[మార్చు]

కొన్ని పక్షి జాతులు ట్రోపోస్పియరులో పై స్థాయిలలో ఎగురుతున్నట్లు గమనించారు. 1973 నవంబరు 29 న ఐవరీ కోస్ట్ పైన 11,278 మీ. (37,000 అ.) ఎత్తున ఎగురుతున్న విమానపు జెట్ ఇంజను, ఒక రప్పెల్ రాబందును (జిప్స్ రుపెల్లి) లాగేసుకుంది. బార్-హెడ్ గీస్ (అన్సర్ ఇండికస్) 8,848 మీ. (29,029 అ.) ఎత్తున్న ఎవరెస్ట్ శిఖరం మీదుగా ఎగురుతూ వలస వెళ్తాయి. [10] [11]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Jones, Daniel (2003), Peter Roach; James Hartmann; Jane Setter (eds.), English Pronouncing Dictionary, Cambridge: Cambridge University Press, ISBN 978-3-12-539683-8
  2. 2.0 2.1 "The Stratosphere - overview". scied.ucar.edu (in ఇంగ్లీష్). University Corporation for Atmospheric Research. Retrieved 25 July 2018.
  3. "NWS JetStream - Layers of the Atmosphere". www.weather.gov (in అమెరికన్ ఇంగ్లీష్).
  4. 4.0 4.1 "Nasa Ozone Watch: Polar vortex facts". ozonewatch.gsfc.nasa.gov (in అమెరికన్ ఇంగ్లీష్).
  5. "CHAPTER 10. STRATOSPHERIC OZONE". acmg.seas.harvard.edu. Archived from the original on 2019-09-30. Retrieved 2020-10-20.
  6. Seinfeld, J. H., and S. N.(2006), Atmospheric Chemistry and Physics: From Air Pollution to Climate Change 2nd ed, Wiley, New Jersey
  7. "The Stratosphere - overview | UCAR Center for Science Education". National Center for Science Education. Retrieved 2021-02-06.
  8. Cheng, Daniel (2003). Elert, Glenn (ed.). "Altitude of a commercial jet airplane". The Physics Factbook. Retrieved 2022-01-21.
  9. Michael Mark Woolfson (2013). Time, Space, Stars & Man: The Story of the Big Bang. World Scientific. p. 388. ISBN 978-1-84816-933-3.
  10. "Audubon: Birds". Audubonmagazine.org. Archived from the original on 2011-09-14. Retrieved 2011-11-08.
  11. Thomas Alerstam; David A. Christie; Astrid Ulfstrand (1993). Bird Migration. Cambridge University Press. p. 276. ISBN 978-0-521-44822-2.