హేమలత (నవల)
రచయిత(లు) | చిలకమర్తి లక్ష్మీనరసింహం |
---|---|
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శైలి | చారిత్రాత్మక నవల |
ప్రచురణ కర్త | (తెలియని ప్రచురణకర్త) (1896) వాహినీ ప్రచురణాలయం (1986) |
Text | [[s:wikisource:హేమలత|హేమలత]] at Wikisource |
హేమలత చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన చారిత్రాత్మక నవల. ఇది రాజస్థాను రాజపుత్రుల చరిత్రకు సంబంధించిన కథ.[1] 1896 లో వచ్చిన ఈ నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందింది.[2][3]
నేపథ్యం
[మార్చు]ఆంధ్రభాషలో చారిత్రాత్మక నవలా ప్రక్రియ సా.శ 19 వ శతాబ్దం చివరిభాగంలో మొదలైంది. టాడ్ అనే రచయిత దేశం అంతటి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన కథావళి సంకలనం చేశాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం దీనిని తెలుగులోకి అనువదించాడు.[4] తర్వాత ఈ నవల రాశాడు. ఈ నవల 14వ శతాబ్దం మొదటి కాలానికి సంబంధించిన కథ. రాజపుత్ర రాజైన మహారాజా లక్ష్మణసింగు అప్పటికి బాలకుడు. అతని పినతండ్రి భీమసింగు రక్షణగా ఉంటూ పరిపాలన చేస్తూ ఉంటాడు. అల్లావుద్దీన్ ఢిల్లీ నుంచి రాజ్యపరిపాలన చేస్తూ ఉంటాడు.
కథ
[మార్చు]పాలి అనే గ్రామానికి ఢిల్లీ సుల్తాన్ తరపున రహిమాన్ ఖాన్ అనే వ్యక్తి అధికార ప్రతినిథిగా ఉంటాడు. ఇతని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇతని సేవకులు కొంతమంది దారికాచి బాటసారులను దోచుకుని వారిని నిర్దాక్షిణ్యంగా చంపివేస్తుంటారు కూడా. అలాంటి సేవకులు నందుడు, గులామల్లీ అనే ఇద్దరు ఆ గ్రామంలో తలదాచుకున్న ఒక సన్యాసిని తమ రహస్యాలు విన్నాడని కాళ్ళు చేతులు కట్టి నీళ్ళలో పారేస్తారు. అతని వదిలేసిన సంచిలో ఏవో కాగితాలు తస్కరిస్తారు.
ఢిల్లీనుంచి చిత్తూరు (రాజస్థాన్ లోని చిత్తోర్) వెళుతున్న మదనసింగు, నాజరుజంగు అను రాజప్రతినిథులను కూడా రహిమానుఖాను దోపిడీ దారులు అటకాయించగా వారిలో చాలా మందిని మట్టికరిపిస్తాడు మదనసింగు. అయితే ఆ దాడిలో అతనికి గాయమవుతుంది. పాలి గ్రామంలో ఉన్న ఒక అంధుడైన వృద్ధుడు అతనికి వైద్యం చేస్తాడు. అతనికి హేమలత అనే అందమైన మనవరాలు ఉంటుంది. ఆమె మదనసింగు బాగయ్యేదాకా సేవలు చేస్తుంది. ఇద్దరూ ఒకరంటే ఒకరికి అభిమానం ఏర్పరుచుకుంటారు. మదనసింగు ఆరోగ్యవంతుడై తన రాజపుత్ర రాజ్యానికి తిరిగి వెళుతుండగా ఆ వృద్ధుడు తన గతాన్ని అతనికి తెలియజేస్తాడు. తన పేరు నారాయణ సింగు అనీ ముందుగా అల్లావుద్దీను చక్రవర్తి పినతండ్రి జలాలుద్దీను దగ్గర పనిచేసేవాడిననీ, అల్లావుద్దీను జలాలుద్దీన్ కి ద్రోహంతో చంపి చక్రవర్తియైనప్పుడు తన కన్నులు పొడిచి అంధుణ్ణి చేశాడని చెబుతాడు. తనను ఎలాగైనా చిత్తూరుకు తీసుకుని వెళ్ళమని చెబుతాడు. మదనసింగు వారిద్దరికీ మాట ఇచ్చి వెళతాడు.
రహిమాన్ ఖాను హేమలతను మోహించి ఆమెను ఎలాగైనా తన దానిని చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అందుకోసం తన దగ్గర పనిచేసే నందుడిని నియమిస్తాడు. కానీ నందుడు ఎంత ప్రయత్నించినా ఆమెను తన యజమాని దగ్గరకు చేర్చలేకపోతాడు. రహిమాను ఖాను వృద్ధుడైన బావాజీని రాజద్రోహం పేరుతో చెరసాలలో వేస్తాడు. తాత దూరం కావడంతో మూర్ఛపోయిన హేమలత విచిత్రమైన అక్కడి నుంచి మాయమవుతుంది. ఈలోపు రహిమానుఖానుకు ఢిల్లీ చక్రవర్తి నుంచి పిలుపు వస్తుంది.
నాజరు జంగు ఢిల్లీ చక్రవర్తికి రహిమాన్ ఖాను ఆకృత్యాలను గురించి తెలియజేసి ఉంటాడు. కానీ రహిమాన్ ఖాను తెలివిగా తాను యోగి నుంచి సంగ్రహించిన పత్రాలు మదనసింగు, నాజరు జంగు దగ్గర దొరికినవని చెప్పి, అందులో రాజపుత్రులు కలిసి ఢిల్లీ మీద దాడి చేయబోతున్నారనే రహస్యాన్ని తెలియజేస్తాడు. దాంతో చక్రవర్తి సంతోషించి అతని సలహా మీద వారే రాజపుత్రుల మీదకు దండయాత్రకు బయలుదేరాలని నిర్ణయిస్తారు. ముందుగా అల్లాయుద్దీన్ ఆస్థానంలోని వసంతభట్టు అనే మహారాష్ట్ర బ్రాహ్మణున్ని కపట ఉపాయంతో రాజపుత్రుల స్థానంలోకి చేరేలా చేస్తారు. అక్కడ లక్ష్మణసింగుని తియ్యని మాటలతో లోబరుచుకుని అతన్ని అపహరించాలని ప్రయత్నిస్తాడు వసంతభట్టు. కానీ ఆ ప్రయత్నాలను మదనసింగు సహాయంతో చిదానంద యోగి అడ్డుకుంటాడు.
పాత్రలు
[మార్చు]- మదనసింగు - రాజపుత్ర వంశానికి చెందిన యువకుడు
- హేమలత - రాజపుత్ర యువతి
- అల్లాయుద్దీను చక్రవర్తి
- రహిమాన్ ఖాన్ - పాలిగ్రామ పరిపాలకుడు
- భీమసింగు - రాజపుత్ర రాజు
- లక్ష్మణసింగు - రాజపుత్ర యువరాజు
- నాజరు జంగు - అల్లాయుద్దీన్ ఆస్థాన అధికారి
- చిదానందయోగి అలియాస్ జనార్ధన సింగు - సన్యాసి రూపంలోని రాజపుత్ర వంశస్థుడు, హేమలత తండ్రి
- వసంతభట్టు - అల్లావుద్దీన్ ఆస్థానంలోని మహారాష్ట్ర బ్రాహ్మణుడు
- నందుడు - రహిమాను ఖాను అనుచరుడు
- గులామల్లి - రహిమాను ఖాను అనుచరుడు
- పద్మావతి
- రాధ
మూలాలు
[మార్చు]- ↑ వోలేటి పార్వతీశం (2016). "పద్యానికి 'పాడియావు'నిచ్చిన కవీంద్రుడు". sakshi.com. సాక్షి. Retrieved May 30, 2020.
- ↑ వి. వి. ఎల్. నరసింహారావు (1993). చిలకమర్తి లక్ష్మీ నరసింహం [Chilakamarti Lakshmi Narasimham] (in ఇంగ్లీష్). న్యూఢిల్లీ: సాహిత్య అకాడమీ. p. 12. ISBN 8172014996.
- ↑ టి. గణపతి (2013). "తెలుగు నవల ఆవిర్భవ వికాసాలు". డ॥ కొత్త రవీంద్రబాబు నవలలు – సవిమర్శక పరిశీలన (PDF). శోధ్ గంగ (Ph.D.). తిరుపతి: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. Retrieved May 30, 2020.
{{cite thesis}}
: CS1 maint: url-status (link) - ↑ నోరి నరసింహ శాస్త్రి (2012). "ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల – ఈమాట". Archived from the original on 2019-08-10. Retrieved 2020-05-30.