ఇస్మాయిల్ ఆదిల్‌షా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇస్మాయిల్ ఆదిల్‌షా (ఆంగ్లం: Ismail Adil Shah) బీజాపూరు సుల్తాను. ఈయన 1510 నుండి 1534 వరకు బీజాపూరును పరిపాలించాడు. తన పరిపాలనా కాలమంతా రాజ్యవిస్తరణలో గడిపిన ఇస్మాయిల్ ఆదిల్‌షా దక్కన్ ప్రాంతములో ఆదిల్‌షాల అధికారమును పటిష్టం చేశాడు.

తొలి నాళ్లు[మార్చు]

ఇస్మాయిల్ ఆదిల్‌షా బాల్యంలోనే తండ్రి యూసుఫ్ ఆదిల్‌షా తరువాత బీజాపూరు రాజైనాడు. రాజవ్యవహారాలు మంత్రి కమాల్ ఖాన్ చేతులో ఉండేవి. కమాల్ ఖాన్ పాలిస్తున్న దశలో ఆయన ఇస్మాయిల్ ఆదిల్‌షాను బంధించి రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, రాజమాత పుంజీ ఖాతూన్ పన్నాగానికి పైఎత్తువేసింది. కమాల్ ఖాన్ రాజ మందిరములో కత్తితో పొడిచి చంపబడ్డాడు.

కమాల్ ఖాన్ మరణానంతరము ఆయన కుమారుడు ఇస్మాయిల్ ఖాన్, పుంజీ ఖాతూన్‌నూ, ఇస్మాయిల్ ఆదిల్‌షానూ బంధించడానికి రాజ మందిరంపై దాడిచేయడానికి ప్రయత్నిస్తూ రాజమందిర ద్వారముల వద్ద జరిగిన ఘర్షణలో మరణించాడు. అప్పటినుండి, తల్లి సహాయముతో ఇస్మాయిల్ ఆదిల్‌షా రాజ్యవ్యవహారములో చూసుకోవడం ప్రారంభించాడు. ఇస్మాయిల్ షియా ముస్లిం మతస్తుడు. ఆయన తన రాజ్యమును షియా ముస్లిం రాజ్యముగా ప్రకటించాడు.

తన తండ్రి యూసుఫ్ ఆదిల్‌షా కాలములో శ్రీకృష్ణదేవరాయలు హస్తగతము చేసుకున్న రాయచూరు దుర్గమును తిరిగి పొందడానికి ప్రయత్నించగా కృష్ణదేవరాయలు 1520 మే 19 న ఇస్మాయిల్ ఆదిల్‌షాను చిత్తుగా ఓడించి రాయచూరును స్వాధీనం చేసుకున్నాడు. రాయచూరు ఓటమి తరువాత విజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, ఆదిల్‌షా తన పొరుగున ఉన్న ముస్లిం రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు.

1523 లో ఇస్మాయిల్ ఆదిల్‌షా తన సోదరి బీబీ మరియంను అహ్మద్‌నగర్ సుల్తాను బుర్హాన్ నిజాంషా కు ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. పెళ్లిలో నిజాంషాకు కట్నంగా షోలాపూర్ పట్టణమును ఇస్తానని, ఆదిల్‌షా రాయబారి బెల్గాంకు చెందిన అసద్ ఖాన్ వాగ్ధానము చేశాడు కానీ ఆ తరువాత వాగ్ధానమును నిలబెట్టుకోలేదు. దీని వలన రెండు రాజ్యాల మధ్య సంబంధాలు దెబ్బతిని అనేక దాడులు, యెదురుదాడులకు దారి తీసినది.

చివరి రోజులు[మార్చు]

ఇస్మాయిల్ ఆదిల్‌షా 1534లో కోయిలకొండ దగ్గర కులీ కుత్బుల్ ముల్క్ తో జరిగిన యుద్ధములో అస్వస్థుడై 1534, ఆగష్టు 27న[1] జ్వరంతో మరణించాడు. ఈయన్ను గుల్బర్గా జిల్లా, షాహాపూర్ తాలూకాలోని గోగి గ్రామం వద్ద సమాధి చేశారు. ఆయన మరణము తర్వాత పెద్ద కొడుకు మల్లూ ఆదిల్‌షా రాజ్యాన్ని చేపట్టాడు. మల్లూ పాలన నచ్చని ప్రజలు, పూంజీ ఖాతూన్ మద్దతుతో అసద్ ఖాన్ లారీ అనే ఉద్యోగి నాయకత్వములో తిరుగుబాటు చేసి చిన్నకొడుకు ఇబ్రహీం ఆదిల్‌షాను గద్దెకెక్కించారు.

మూలాలు[మార్చు]

  1. Nelaturi, Venkataramanayya (1935). "Studies in the history of the third dynasty of Vijayanagara ". University of Madras.  పేజీ.44

మూస:బీజాపూరు సుల్తానులు