ఎం.ఎస్.షీలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఎస్.షీలా
వ్యక్తిగత సమాచారం
మూలంకర్ణాటక
సంగీత శైలిభారత శాస్త్రీయ సంగీతం
వృత్తిశాస్త్రీయ గాత్ర విద్వాంసురాలు
వాయిద్యాలుగాత్రం
వెబ్‌సైటుhttp://www.mssheela.com

ఎం.ఎస్.షీలా ఒక శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసురాలు. ఈమె శాస్త్రీయ సంగీతంతో పాటు, లలిత సంగీతం, భక్తి సంగీతాలలో కూడా నిష్ణాతురాలు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లి ఎం.ఎన్.రత్న కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఈమె మొదట తన తల్లి వద్ద సంగీతాన్ని నేర్చుకుంది. తరువాత ఆర్.కె.శ్రీకంఠన్ వద్ద పూర్తిస్థాయిలో సంగీతాన్ని అభ్యసించింది. ఈమె బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బంగారుపతకాన్ని గెలుచుకుంది. [1]

సంగీతవృత్తి[మార్చు]

ఈమె అతి చిన్నవయసు నుండే సంగీత ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈమె దేశ విదేశాలలో అనేక కచేరీలు చేసింది. దూరదర్శన్‌లోను, ఆకాశవాణిలోను సంగీత సమ్మేళనాలలో, జాతీయ కార్యక్రమాలలో, ప్రత్యేక సందర్భాలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా దేశాలు పర్యటించి అనేక సంగీత కచేరీలు చేసింది. ఈమె అమెరికా పర్యటనను కర్టాటక ప్రభుత్వం స్పాన్సర్ చేసింది. ఈమె మధ్యప్రాచ్యదేశాలలో, లండన్‌లో కూడా సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.[1]

ఈమె ఆకాశవాణి, దూరదర్శన్‌లలో కర్ణాటక సంగీతం, లలిత సంగీతం రెండు విభాగాలలోను ఏ గ్రేడు కళాకారిణిగా ఎంపికయ్యింది. ఈ విధంగా కర్ణాటక సంగీతం, లలిత సంగీతాలలో ఏ గ్రేడు కళాకారిణిగా ఎంపికైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి మహిళ ఈమె.[1]

ఈమె శ్రీవిద్యాదర్శని, నినాద, సదాశివ మాధుర్య, లలితా సహస్రనామ, వెంకటేశ్వర సుప్రభాతం, శారదా సుప్రభాతం, సౌందర్యలహరి, లలితా త్రిశతి, గాన సుశీలం, ఆడిసిదలు యశోద, పాలించు కామాక్షి, హరిదాస నామన, హిమాద్రి సుతే పాహిమాం, శివానందలహరి, వచనామృతం వంటి అనేక ఆడియో కేసెట్లు, సి.డి.లు రికార్డు చేసింది. [1]

ఈమె భరతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. 1990వరకు నాట్యప్రదర్శనలు కూడా ఇచ్చింది.[1] ఈమె తన భర్త బి.కె.రామస్వామితో కలిసి హంసధ్వని క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించి శాస్త్రీయ సంగీత అభివృద్ధికి పాటు పడింది. ఆ సంస్థ ద్వారా వర్క్‌షాపులు నిర్వహించడం, కేసెట్లను విడుదల చేయడం, యువకళాకారులచే సంగీత కచేరీలు నిర్వహించడం, హంసధ్వని వార్షికోత్సవాలను జరపడం, సంగీతంలో నిష్ణాతులైనవారికి హంసధ్వని పురస్కారాలను ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపట్టింది.[2]

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

ఈమెకు అనేక పురస్కారాలు, బిరుదులు లభించాయి. 1997లో మద్రాసు సంగీత అకాడమీ వార్షిక సంగీతోత్సవాలలో ఈమెను ఉత్తమ గాయనిగా ఎంపిక చేసింది. కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ ప్రశస్థితో సన్మానించింది. కర్ణాటక రాష్ట్ర ఫిల్మ్‌ ఛేంబర్ ఈమెను 1997-98 సంవత్సరానికి ఉత్తమ నేపథ్య గాయనిగా ఎన్నుకుంది. 2000లో కర్ణాటక గానకళా పరిషత్ ఈమెను ఉత్తమ సంగీత కళాకారిణిగా సత్కరించి "అనన్య పురస్కారా"న్ని ఇచ్చింది. శృంగేరి శారదా పీఠం ఈమెను ఆస్థాన విదుషీమణిగా నియమించింది. 2007లో కర్ణాటక సంగీత నృత్య అకాడమీ గౌరవ పురస్కారంతో సత్కరించింది. [1]

ఈమెకు ఈ క్రింది బిరుదులు లభించాయి.

  • గానకళాపరిషత్ వారిచే "గానకళాశ్రీ"[3]
  • ఎం.ఎ.నరసింహాచార్ ఫౌండేషన్ వారిచే "గానవారిధి"
  • భక్తి భారతి ప్రతిష్టాన వారిచే "సంగీత సరస్వతి"
  • షిమోగా రామనవమి కమిటీ వారిచే "సంగీత సహ్యాద్రి శిఖరిణి"
  • బెంగళూరు నాగరత్నమ్మ ప్రసస్థి
  • గురు గౌరవకారిణి
  • సుమధుర సంగీత ధృవతార
  • సంగీత రాగ అమృతవర్షిణి
  • సంగీత గాన కళానిధి
  • సంగీత వాగ్దేవి
  • అకాడమీ ఆఫ్ మ్యూజిక్ వారిచే చౌడయ్య అవార్డు[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Ganakalashree M S Sheela". Archived from the original on 2013-10-16. Retrieved 2013-11-27.
  2. "Captivated by beauty of classical music, Sheela". newindianexpress. India. 27 November 2013. Archived from the original on 2 డిసెంబర్ 2013. Retrieved 2 మార్చి 2021. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  3. Mysore, V Subramanya (28 November 2013). "Music and dance reviews". Deccan Herald. India.
  4. "Chowdiah Award presented to Rashid Khan, Sheela". The Hindu. India. 27 November 2013.

బయటి లింకులు[మార్చు]