కోతి, నక్క కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"ది మంకీ కింగ్" (కోతి రాజు), జోహన్ ఎలియాస్ రైడింగర్స్ బొమ్మ

కోతి, నక్క కథ (ది ఏప్ అండ్ ది ఫాక్స్) అన్నది ఈసప్‌కు ఆపాదించిన కథల్లో ఒకటి. ఇది పెర్రీ ఇండెక్స్‌లో 81వ కథగా ఉంది.[1] అయితే, ఈ కథ ఈసప్ కాలానికన్నా ముందుది. దీనికి మూలమైన ఒక ప్రత్యామ్నాయ కథ కూడా ఆసియాకు చెందిన కథ అయివుండొచ్చు.

కథ[మార్చు]

సింహం మరణానంతరం కొత్త రాజును ఎన్నుకోవడానికి జంతువులు కలుస్తాయి. చివరకు జంతువులన్నిటినీ మెప్పించి ఒక కోతి తనకు పట్టాభిషేకం చేయించుకుంటుంది. మొదట సింహాసనానికి పోటీదారుగా నక్క ఉంటుంది. కానీ, కోతి రాజు కాగానే అది రాజాస్థాన ఉద్యోగిగా మారిపోతుంది. రాజు బాగా నచ్చే పదార్థం దొరికిందని చెప్పి నమ్మిస్తుంది. కానీ, అది ఎర అని అర్థమయ్యేసరికే కోతి ఉచ్చులో చిక్కుకుంటుంది. ద్రోహం చేశావనీ, వెన్నుపోటు పొడిచావనీ కోతి నక్కను తిడుతుంది. అత్యాశతో ముందువెనుకలు చూసుకోని వ్యక్తి పరిపాలనకు అనర్హుడని కోతి సమాధానమిస్తుంది. పరిపాలించాలని ఆశపడేవారు తమను తాము అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలన్నది నీతి.

మూలం, వ్యాప్తి[మార్చు]

ఈ కథ బాగా ప్రాచీనమైనది, ఈసప్ కన్నా చాలా ముందుది అయివుండొచ్చు. ఎందుకంటే, క్రీ.పూ.7వ శతాబ్దానికి చెందిన గ్రీకు కవి ఆర్కిలోకోస్ ఈ కథను తన రచనలో ఉపయోగించుకున్న ఆధారాలు ఉన్నాయి.[2] ఐరోపాలో చాలాకాలం పాటు ఈ కథ గ్రీకు మూలాల్లోనే ఉండేది, మిగిలిన ఈసప్ అనువాదాల్లో ఈ కథ ఉండేది కాదు. అయితే, క్రీ.శ.8వ శతాబ్దం నుంచి ఐరోపా నుంచి ఈ కథ తూర్పువైపుగా మధ్యాసియాకి ప్రయాణించడం ప్రారంభించింది. 8వ శతాబ్దికి చెందిన పపేరిస్ మీద రాసిన రాతపత్రుల శకలాల మీద మధ్యాసియా భాషలైన సోగ్డియా, వీగర్ భాషల్లో ఈ కథ లభించింది.[3]

16వ శతాబ్దిలో మొదటిసారిగా ఇతర ఐరోపా భాషల్లో ఈ కథ కనిపించడం ప్రారంభమైంది. నియో-లాటిన్‌లోకి 300 దాకా ఈసప్ కథలను అనువదించిన హైరోనిమస్ ఓసియస్ ఒక పద్యంలో ఈ కథని చెప్పాడు. అలానే లాటిన్‌లోకి ఈసప్ కథలను పునఃకథనం చేసిన గాబ్రియల్ ఫెర్నో కూడా ఈ కథను రాశాడు.[4] గాబ్రియల్ ఫెర్నో కథ చివరిలో "అర్హతని చేతల ద్వారా నిరూపించుకోవాలి" అన్న నీతి వాక్యంతో ముగుస్తుంది.[5] ఫ్రెంచిలో లా ఫోంటైన్ వెర్షన్, "మిమ్మల్ని మీరు నియంత్రించుకో లేకుండానే మమ్మల్ని పరిపాలించాలని కోరుకుంటున్నారా?" అని నక్క కోతిని గద్దించినట్టుగానే గద్దిస్తూ ముగుస్తుంది.[6]

17వ శతాబ్దికి చెందిన ఆంగ్ల రచయిత, రాజకీయవేత్త రోజర్ ఎల్ ఎస్ట్రేంజ్ ఈ కథకు చేసిన వ్యాఖ్యానం ఈ కథలోని అందరినీ ఖండిస్తుంది. ఆలోచించకుండా ఎంచుకున్నందుకు ఓటర్లను (జంతువులు), అర్హత లేకుండా అధికారాన్ని స్వీకరించినందుకు కోతిని, తప్పుడు ఉద్దేశాలు కలిగి ఉన్నందుకు అసూయాగ్రస్తురాలైన నక్కని కూడా తప్పుపడుతుంది.[7][8] 17వ శతాబ్దికి చెందిన ఆంగ్లికన్ చర్చి మతాధికారి, రచయిత, ప్రధానంగా ఈసప్ కథలను అనువదించి పేరుతెచ్చుకున్నవాడు అయిన శామ్యూల్ క్రోక్సాల్ కూడా కోతిని ఎంచుకున్న జంతువులను ఖండించాడు.[9] ఈసప్ కథల సంకలనాలకు చిత్రాలు వేసి రూపకల్పన చేసిన థామస్ బెవిక్ సంకలనం మాత్రం "కోతులు అధికారంలో ఉన్నప్పుడు నక్కలు వాటితో ఆడుకోవాలని అనుకోకూడదు" అంటూ స్వలాభం కోసం, అసూయతో వ్యవహరించిన రాజాస్థానీకుడిని (నక్క) తప్పుబట్టాడు.. [10]

డ్యాన్స్ చేసే కోతి రూపంలో ఉన్న 19వ శతాబ్దానికి చెందిన జపనీస్ మినియేచర్ బొమ్మ (నెట్‌సుకె)

నాట్యమాడే కోతులు[మార్చు]

"నాట్యమాడే కోతులు" అన్న పేరుతో దీనికి ప్రత్యామ్నాయ కథ ఒకటి ఉంది. దాని ఫలితం కూడా తన మౌలిక లక్షణం చివరకు తననే దెబ్బతీస్తుందన్న అంశం మీదే ఉంటుంది. ఇది ఈసప్ కథల అనువాదకుల్లో ఒకడైన జార్జ్ ఫ్లేయర్ టౌన్‌సెండ్ 1867లో రాసింది. ఒక రాజకుమారుడు కొన్ని కోతులకు ఆస్థానంలో నాట్యం చేసేందుకు శిక్షణ ఇచ్చి వాటికి అందమైన, ఖరీదైన బట్టలు, మాస్కులు తొడిగాడు. తద్వారా అవి కోతులో మనుషులో తెలియకుండా ఏర్పాటుచేశాడు. అవి నాట్యం చేస్తున్నప్పుడు వాటి అసలు స్వరూపాన్ని బయటపెట్టే ఉద్దేశంతో ఒక రాజాస్థానీకుడు ఒక ఎత్తుగడ వేస్తాడు. కొన్ని బాదంకాయలను తెచ్చి వేదిక మీద విసిరేస్తాడు. వాటి కోసం కోతులు తమ బట్టలను, శిక్షణను అంతా మర్చిపోయి పడి ఏరుకుంటాయి.[11] ఈసప్ కథల అత్యంత ప్రాచీన సంకలనం అయిన ఈసపియా ఆఫ్‌ దెమిత్రియస్ ఆఫ్‌ ఫలేరమ్‌లో ఇది భాగం. బహుశా దీనికి ప్రాచ్య దేశాల మూలాలు ఉండి ఉండొచ్చు.[12] స్కాటిష్ అనువాదకుడు జాన్ ఓగిల్బై "ఒక ఏజిప్షియన్ రాజు, అతని కోతులు" అన్న పేరుతో కవిత్వీకరించాడు.[13] "సహజ ప్రవృత్తులను మాన్పడానికి అధ్యయనం, క్రమశిక్షణలకు శక్తి లేదు" అని రోజర్ ఎల్'ఎస్ట్రేంజ్ దీని గురించి వ్యాఖ్యానించాడు.[14] ఆంద్రె ఆస్రియెల్ అనువదించిన జర్మన్ వెర్షన్‌లో నీతిని మరింత నేరుగా: "నాట్యం నేర్పించినా కోతి కోతిగానే ఉంటుంది" అని రాశాడు.[15] [16]

మూలాలు[మార్చు]

  1. Aesopica site
  2. G.J.Van Dijk, Ainoi, Logoi, Mythoi, Leiden NL 1997, pp.144-47
  3. Matteo Compareti, "Aesop's fables in Central Asia", Academia edu
  4. Phryx Aesopus Habitu Poetico, 1673, Simius Rex p.132
  5. Fabulae Centum (1563), Fable 81, pp.187-9
  6. Fables (1668), Le renard, le singe et les animaux, VI.6
  7. Fables of Aesop (1699), "An Ape and a Fox", Fable 116
  8. The Fables of Aesop and Others (1818), “The Ape Chosen King”, pp.195-6
  9. Fables of Aesop and Others, (1722), Fable 93, "The Fox and the Ape"
  10. Miscellaneous Poems by John Byrom (first published 1773), pp.36-7
  11. Aesop’s Fables: a new revised version
  12. Francisco Rodríguez Adrados, History of the Graeco-Latin Fable, Brill 1999, vol.2, p.103
  13. Fables of Aesop paraphrased in verse (1668), pp.135-8
  14. Fable 375 "The Dancing Apes", Fables of Aesop (1692), p.343
  15. Andre Ariel, Das Affenballet
  16. A performance on YouTube