వ్యాసము (గణితం)
| వృత్త వ్యాసము | |
|---|---|
| తలం | ద్విపరిమాణీయం |
| నిర్వచనం | అతి పెద్ద జ్యా |
| వ్యాసముల సంఖ్య | అనంతం |
| ఆంగ్ల పదం | diameter |
| పరిధి తో సంబంధం | వృత్త పరిధి = π(వ్యాసము) |
ఒక వృత్తంలో కేంద్రం గుండా పోవు జ్యా ను వ్యాసము అందురు. వృత్తము అనగా ఒక సమతలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సమితి. వృత్తం పై గల బిందువుల నుండి సమాన దూరంలో గల స్థిర బిందువును కేంద్రము అందురు. వృత్తం పై ఏవేని రెండు బిందువులను కలిపిన రేఖాఖండమును వృత్త జ్యా(Chord) అందురు. వృత్తమునకు అనేక జ్యా లు గీయవచ్చు. అన్ని జ్యా లలో కేంద్రం గుండా పోవు జ్యా అతి పెద్ద జ్యా అవుతుంది. దీనిని వ్యాసము అందురు. వృత్తమున అనంతమైన వ్యాసములు గీయవచ్చు. అన్ని వ్యాసముల కొలతలు సమానంగా ఉంటాయి. వ్యాసమును ఆంగ్లంలో "డయామీటర్"(Diameter) అందురు. దీన్ని "d" తో సూచిస్తారు.
- వృత్త వ్యాసము పొడవులో సగమును వ్యాసార్థము అందురు.
- వృత్త వ్యాసము వృత్తమును రెండు సర్వ సమాన అర్థ వృత్తములుగా విభజిస్తుంది.
- వృత్త వ్యాసము గుండా పోవు రేఖ వృత్తానికి సౌష్టవాక్షం అవుతుంది. వృత్తానికి అనంతమైన సౌష్టవ రేఖలు గీయవచ్చు.
- వృత్త వ్యాసం పరిధి వద్ద చేయు కోణం 90 డిగ్రీలు లేదా సమకోణం. అనగా వృత్తం పై ఏదేని బిందువుతో వ్యాసం యేర్పరచు త్రిభుజం సమకోణ త్రిభుజం అవుతుంది.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
- వృత్త వ్యాసం (ఆంగ్లం:"diameter") అనునది గ్రీకు పదమైన διάμετρος (diametros) నుండి గ్రహింపబడినది. గ్రీకు భాషలో δια- (dia-) అనగా మధ్యచ్చేదం(అడ్డు) మరియు μέτρον (metron) అనగా కొలత. అని అర్థం. ప్రస్తుతం వృత్త వ్యాసం యొక్క పొడవును కూడా "వ్యాసము" అని పిలుస్తారు.
- ఒక కుంభాకార ఆకారము గల తలంలో వ్యాసము అనగా దాని పరిధి వద్ద ఎదురెదురుగా సమాంతరంగా గీయబడిన స్పర్శరేఖ ల మధ్య గల గరిష్ట దూరం.
జ్యా [మార్చు]
వృత్తం పైని ఏ రెండు బిందువులనైనా కలిపే రేఖా ఖండాన్ని ఆ వృత్తం యొక్క జ్యా అంటారు. వృత్త కేంద్రం గుండా పోయే జ్యాను ఆ వృత్తం యొక్క వ్యాసం అంటారు. వృత్తం యొక్క చుట్టుకొలత లోని ఒక భాగాన్ని చాపం అంటారు. చాపం యొక్క రెండు కొసలను కలిపే సరళ రేఖని జ్యా అంటారు. జ్యా ను ఆంగ్లంలో చోర్డ్ (chord) అంటారు.
గోళ వ్యాసము [మార్చు]
గోళం అనగా ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్న అంతరాళంలో గల అన్ని బిందువుల సమితి. గోళం పై గల అనంతమైన బిందువులకు సమాన దూరంలో గల స్థిర బిందువు గోళ కేంద్రము అవుతుంది. ఆ కేంద్రం గుండా పోతూ గోళం యొక్క తలంపై ఏవేని రెండు బిందువుల మధ్య దూరము గోళ వ్యాసము అవుతుంది.
చెట్టు యొక్క వ్యాసము [మార్చు]
ఒక చెట్టు యొక్క కాండము స్థూపాకారములో ఉంటుంది. దాని మధ్యచ్చేదం వృత్తాకారంగా ఉండును. ఆ ఆకారం యొక్క వ్యాసము ఆ చెట్టు యొక్క వ్యాసము అవుతుంది.
ఒక మనిషి చక్కగా నిలబడి అతని ఛాతి ఎత్తు వద్ద చెట్టు యొక్క చుట్టుకొలత లేక అడ్డుకొలత ను కొలుస్తాడు. ఈ విధంగా చెట్టును కొలవడాన్ని ఛాతి ఎత్తు వద్ద అంటారు.
ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత [మార్చు]
ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత ను ఇంగ్లీషులో Diameter at breast height, or DBH అంటారు. నిటారుగా ఉన్న చెట్టు యొక్క మాను లేక అడుగుమాను ను కొలచి దాని అడ్డుకొలతను తెలియజేయడంలో ఇది ఒక ప్రామాణిక పద్ధతి. వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో ఈ ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది.
వ్యాసము, వ్యాసార్థము ల మధ్య సంబంధం [మార్చు]
వృత్తం ఏవేని రెండు బిందువులను కలుపు రేఖా ఖండం కేంద్రం గుండా పోతే దానిని వ్యాసం అందురు. వ్యాసం లో సగ భాగమును వ్యాసార్థం లేక అర్థ వ్యాసము అందురు. దీనిని ఆంగ్లములో "radius" అందురు. దీనిని "r" తో సూచిస్తారు.
| వృత్త వ్యాసము = 2(వ్యాసార్థం) Diameter = 2(Radius) |
వ్యాసము, పరిధి మధ్య సంబంధం [మార్చు]
సాధారణంగా వృత్త పరిధి మరియు వృత్త వ్యాసము మధ్య గల సంబంధం స్థిరంగా ఉంటుంది. దీని విలువ సుమారు 22/7 ఉంటుందని అంచనా.
7 యూనిట్లు వ్యాసము గల వృత్తం యొక్క పరిధి సుమారు 22 యూనిట్లు ఉండును. అదే విధంగా 14 యూనిట్లు వ్యాసము గల వృత్తం యొక్క పరిధి 44 యూనిట్లు ఉండును. అందువలన వృత్త పరిధి, వ్యాసము ల నిష్పత్తి ఎల్లపుడూ స్థిరంగా ఉంటుంది. ఈ స్థిర సంఖ్యను గ్రీకు అక్షరమైన పై (π) తో సూచిస్తారు. దీని విలువ సుమారు 3.14... ఉంటుంది.
| వృత్త పరిధి / వృత్త వ్యాసము =π వృత్త పరిధి = π(వ్యాసము) |
చిత్రమాలిక [మార్చు]
ఇవి కూడా చూడండి [మార్చు]
|
|
|
|---|---|
| కేంద్రము · వ్యాసార్థము · వ్యాసము · వృత్త పరిధి · వృత్త వైశాల్యం · వృత్త అంతరం · వృత్త బాహ్యము · జ్యా · ఛేదన రేఖ · వృత్త ఖండం · వృత్త చాపం · సెక్టరు · అర్థ వృత్తం · స్పర్శరేఖ · రేడియన్ |