జవాహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధానమంత్రిత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జవాహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధానమంత్రిత్వం భారతదేశానికి బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం రాగానే 1947 ఆగస్టు 15 నుంచి ప్రారంభమై 1952 ఏప్రిల్ 15 వరకూ కొనసాగింది. దీనికి ముందు అధికార బదిలీ పథకంలో భాగంగా బ్రిటీష్ వారు ఏర్పరిచిన వైస్రాయ్ కౌన్సిల్ (దీనినే మధ్యంతర ప్రభుత్వంగా పిలుస్తారు) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1952లో భారతదేశ వ్యాప్తంగా తొలి సాధారణ ఎన్నికల్లో గెలిచి నెహ్రూ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో తొలి సారి ప్రధానమంత్రిత్వం ముగిసింది.

Nజవాహర్ లాల్ నెహ్రూ

అధికార స్వీకరణ[మార్చు]

1946లో కేంద్ర ప్రభుత్వానికి, ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకు జరిగిన ఎన్నికల్లో సాధారణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ముస్లిం నియోజకవర్గాల్లో ముస్లిం లీగ్ ఎక్కువ స్థానాలు గెలిచాయి. బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి 1946లో భారతదేశానికి అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. అధికార బదిలీ తీరుతెన్నులు, ఆ తర్వాత ఏర్పడబోయే భారత దేశ రాజ్యాంగ మౌలిక స్వరూపం వంటి విషయాలపై కాంగ్రెస్, ముస్లింలీగ్ పక్షాలతో ఒక అంగీకారానికి వచ్చి వెనువెంటనే తాత్కాలిక ప్రభుత్వం, రాజ్యాంగ సభ ఏర్పాటుచేసేందుకు క్యాబినెట్ మిషన్ పేరిట బ్రిటీష్ క్యాబినెట్ సభ్యులు భారతదేశానికి వచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు అని స్పష్టం అయ్యాక 1946లో కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 12 కాంగ్రెస్ కమిటీలు పటేల్ పేరును ప్రతిపాదించాయి. 1942లోనే మహాత్మా గాంధీ "నా వారసుడు పటేల్ కాదు, రాజాజీ కాదు. జవాహర్ లాల్ నెహ్రూనే నా రాజకీయ వారసుడు" అని తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 1946 కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కోరిక మేరకు నెహ్రూ పేరును వర్కింగ్ కమిటీ సభ్యులు ప్రతిపాదించారు. పార్టీ కమిటీలు పటేల్ నే కోరుతున్న విషయం సూచన మాత్రంగా ప్రస్తావించినా నెహ్రు విరమించుకునేందుకు ఇష్టపడక పోవడంతో అతని ఎన్నికకు అనుకూలంగా పటేల్ ను విరమింపజేశాడు గాంధీ. అలా 1946లో తద్వారా కాంగ్రెస్ అధ్యక్ష పదవి, భావి భారత ప్రధానమంత్రిత్వం నెహ్రూకు లభించాయి.

అలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాలో నెహ్రు, ఇతర ముఖ్య సభ్యులు కాంగ్రెస్ తరఫున క్యాబినెట్ మిషన్ చర్చల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారాల పరిధి, రాష్ట్రాల స్థాయిలో ప్రతిపాదించిన గ్రూపింగులు ఐచ్ఛికం కావాలా, నిర్బంధం కావాలా వంటి పలు అంశాల్లో కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల నడుమ ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. క్యాబినెట్ మిషన్ వారు ఇరుపక్షాలకూ విడివిడిగా వేరే హామీలిచ్చి తాత్కాలికంగా ఒప్పించినా జవాహర్ లాల్ నెహ్రు లండన్ లో బ్రిటిష్ వారు కాంగ్రెస్ కి అనుకూలమయ్యారన్న అంచనా మీద 1946 జూలై 10న క్యాబినెట్ మిషన్ విషయంలో తమకు సమ్మతమైన వ్యాఖ్యానాన్నే అనుసరిస్తామని చేసిన ప్రకటన అనంతరం ఆ ఏర్పాటును కూడా జిన్నా తిరస్కరించాడు. అనంతరం ముస్లిం లీగ్ తాత్కాలిక ప్రభుత్వం, రాజ్యాంగ సభలని బహిష్కరించి ప్రత్యక్ష కార్యాచరణ దినం పేరిట కలకత్తాలో మత హింసను ప్రేరేపించింది. మరోవైపు కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1946 సెప్టెంబర్ నెలలో ఆ తాత్కాలిక ప్రభుత్వాన్ని నెహ్రు నాయకత్వంలో ఏర్పాటుచేశారు. అక్టోబరులో జిన్నా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించడంతో ముస్లిం లీగ్ సభ్యులు కూడా నామినేట్ అయ్యారు. లీగ్ సభ్యులు ప్రభుత్వాన్ని పనిచెయ్య నివ్వక పోవడంతో 1947 జనవరి నాటికి నెహ్రూ, ఇతర కాంగ్రెస్ సభ్యులు తాత్కాలిక ప్రభుత్వం నుంచి వైదొలిగారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం రావడంతో కొలువైన తొలి భారత మంత్రివర్గంలో ప్రధానిగా నెహ్రు ప్రమాణ స్వీకారం చేశాడు.

దేశవిభజన: సమస్యలు, పరిష్కార యత్నాలు[మార్చు]

1947లో ప్రధానమంత్రిగా నెహ్రు ప్రమాణ స్వీకారం చేసేనాటికి దేశ విభజన నిర్ణయం జరిగిపోయింది. కాంగ్రెస్ తరఫున నెహ్రు కూడా ఈ నిర్ణయంలో భాగస్వామి అయ్యాడు.

మత హింస[మార్చు]

భారతదేశ విభజనలోనే మత ప్రాతిపదికన పంజాబ్, బెంగాల్ ప్రావిన్సులను విభజించడమూ ఉంది. వైస్రాయ్ మౌంట్ బాటన్ ఈ పనిని రాడ్ క్లిఫ్ కి అప్పగించాడు. రాడ్ క్లిఫ్ తన పనిని 1947 ఆగస్టు 9 నాటికే చేసి, ఫలితాలు బాటన్ కి అప్పగించాడు. ముందు వీలైనంత త్వరగా సరిహద్దు అవార్డుగా పిలిచే ఆ నిర్ణయాన్ని ప్రకటించాలని మౌంట్ బాటన్ భావించాడు. కానీ రాడ్ క్లిఫ్ నివేదిక అందించేసరికి మౌంట్ బాటన్ ఆలోచన మారిపోయింది. అధికార బదిలీకి ముందు ఆ నిర్ణయం ప్రకటిస్తే దాని కారణంగా జరిగే హింసకు బ్రిటిష్ వారు బాధ్యులు అవుతారని, కాబట్టి ఆగస్టు 15 తర్వాత ప్రకటించాలని నిర్ణయించాడు.

ఎప్పటికీ విభజన తర్వాత ఏ ప్రాంతం ఏ దేశానికి చెందుతుందన్న నిర్ణయం వెలువడకపోయే సరికి గందరగోళం పెరిగిపోయింది. అల్లర్లు, దాడులు, మత హింస సర్వసాధారణం అయింది. బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి, పాకిస్తాన్ కి అధికార బదిలీ జరిగాక, ఆగస్టు 17న సరిహద్దు ప్రకటించారు. హిందూ, సిక్ఖు, ముస్లింలలో ఏ వర్గాన్ని అది సంతృప్తిపరచలేదు. అవతలి మతవర్గాన్ని లక్ష్యం చేసుకుని లూటీలు, హత్యలు, కిడ్నాపులు, అత్యాచారాలు జరిగాయి. హిందువులు, సిక్ఖులు పశ్చిమ పంజాబ్ నుంచి తూర్పుకి, ముస్లింలు తూర్పు పంజాబ్ నుంచి పశ్చిమ పంజాబ్ కి వలసలు రాసాగారు.

ఈ హింసని అరికట్టడం ప్రధానిగా నెహ్రూకు, అతని మంత్రిమండలికి అత్యంత ప్రాధాన్యమైన అంశం అయింది. పశ్చిమ పంజాబ్ లో ముస్లిం సాయుధ దళాల హింసను అనుభవించి ఎలాగో తప్పించుకుని వచ్చినవారు, మరికొందరు కలిసి ఢిల్లీలో ముస్లింల మీద దాడులు చేశారు.