పెనాల్టీ షూట్ అవుట్ (ఫుట్‌బాల్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 పెనాల్టీ షూట్-అవుట్ (అధికారికంగా పెనాల్టీ మార్క్ నుండి కిక్ కొట్టడం అంటారు) [1] అనేది ఫుట్‌బాల్ ఆటలో సాధారణ సమయం ముగిసిన తర్వాత, అలాగే అదనపు సమయం ముగిసిన తర్వాత కూడా స్కోరు సమంగా ఉన్నప్పుడు, డ్రాగా ముగించలేని మ్యాచ్‌లో ఏ జట్టును విజేతగా నిర్ణయించాలో తేల్చే టై బ్రేకింగ్ పద్ధతి. పెనాల్టీ షూట్-అవుట్‌లో, ప్రతి జట్టు ఆటగాడు పెనాల్టీ మార్క్ నుండి బంతిని గోల్‌ లోకి కొడతారు. గోల్‌ను ప్రత్యర్థి జట్టు గోల్‌కీపర్ ఒక్కడే రక్షించుకుంటాడు. ప్రతి జట్టుకు ఐదు షాట్లు ఉంటాయి. వీటిని వేర్వేరు ఆటగాళ్లు కొట్టాలి. ఎక్కువ గోల్‌లు కొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ప్రత్యర్థి జట్టు అధిగమించలేనంత ఆధిక్యాన్ని ఓ జట్టు పొందిన వెంటనే షూట్ అవుట్‌లు ముగుస్తాయి. ఐదు జతల షాట్‌ల తర్వాత కూడా స్కోర్‌లు సమంగా ఉన్నట్లయితే, అదనపు " సడన్-డెత్ " రౌండులో షూటౌట్ జరుపుతారు. [1] షూట్-అవుట్ సమయంలో కొట్టిన గోల్‌లు కొట్టిన ఆటగాళ్ళకు గాని, జట్టుకు గానీ గోల్‌లుగా పరిగణించరు. సాధారణ ఆటలో (అదనపు సమయంతో సహా) సాధించిన గోల్‌ల లోకి వీటిని కలపరు. షూట్-అవుట్‌లో కిక్‌ కొట్టే పద్ధతి పెనాల్టీ కిక్‌ను పోలి ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా, బంతిని ఒకసారి కిక్ చేసిన తర్వాత, కిక్కరు లేదా గోల్ కీపర్ తప్ప మరే ఇతర ఆటగాడు మళ్లీ ఆడకూడదు.

పెనాల్టీ షూట్ అవుట్ అనేది డ్రాను బ్రేకు చేసే మూడు పద్ధతులలో ఒకటి; మిగిలినవి అదనపు సమయం ఆడడం, రెండు-జట్ల మధ్య మాత్రమే పోటీ ఉన్నపుడు, ప్రత్యర్థికి ఇచ్చిన గోల్స్ నియమం. [1] సాధారణంగా ఇతర పద్ధతుల ద్వారా కూడా విజేతను తేల్చని పరిస్థితి ఏర్పడినపుడు మాత్రమే షూట్-అవుట్ పద్ధతిని వాడతారు. నిర్దిష్ట మ్యాచ్ కోసం డ్రాను బ్రేకు చేసే పద్ధతి మ్యాచ్‌ను నిర్వహించే సంస్థ ముందుగా నిర్ణయిస్తుంది. చాలా ప్రొఫెషనల్ స్థాయి పోటీలలో, నియంత్రణ సమయం ముగిసే సమయానికి స్కోర్ టై అయినట్లయితే రెండు 15 నిమిషాల అదనపు సమయ వ్యవధిని ఆడతారు. అదనపు సమయ వ్యవధి తర్వాత కూడా స్కోరు టై అయితే షూట్ అవుట్ నిర్వహిస్తారు.

పెనాల్టీ షూట్-అవుట్‌లను 1970ల నుండి ఫుట్‌బాల్‌లో విస్తృతంగా వాడుతున్నప్పటికీ, చాలా మంది ఈ పద్ధతిని విమర్శించారు. ప్రధానంగా ఇది నైపుణ్యంపై కంటే అదృష్టంపైననే ఆధారపడటం, జట్టు క్రీడయిన ఫుట్‌బాల్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య వ్యక్తిగత ద్వంద్వ పోరాటాలపై ఆధారపడటం వలన, ఇది సంశయాతీతంగా ఉండడం లేదు. [2] దీనికి విరుద్ధంగా, దీనిలో ఇమిడి ఉన్న ఒత్తిడి, అనూహ్యత వలన క్రీడకు అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపును ఇస్తుందని మరి కొందరు భావిస్తారు. [3] [4]

అవలోకనం[మార్చు]

షూట్-అవుట్ సమయంలో, కిక్కరు, గోల్ కీపరు కాకుండా ఇతర ఆటగాళ్లంతా తప్పనిసరిగా సెంటర్ సర్కిల్‌లోనే ఉండాలి. [1] తన్నుతున్న జట్టుకు చెందిన గోల్ కీపరు, గోల్ లైను, పెనాల్టీ ప్రాంతాన్ని గుర్తించే రేఖల (16.5 m/18 yards) కూడలి వద్ద, అసిస్టెంట్ రిఫరీలలో ఒకరి దగ్గర నిలబడి ఉంటాడు. షూట్-అవుట్ సమయంలో సాధించిన గోల్‌లు ఆటగాళ్ల గోల్ స్కోరింగ్ రికార్డులకు జోడించబడవు. 

ఫుట్‌బాల్‌లో మ్యాచ్‌ డ్రాగా ముగియడం అనేది మామూలే. షూట్-అవుట్‌ పద్ధతిని ఆట చివరిలో మ్యాచ్-విన్నర్ అవసరమయ్యే పోటీలలో మాత్రమే వాడతారు. [1] – దీన్ని రౌండ్-రాబిన్ "లీగ్‌లు" కాకుండా నాకౌట్ "కప్" టైలలో ప్రధానంగా వాడతారు; టోర్నమెంట్‌లో ఏ జట్టు తదుపరి రౌండ్‌కు చేరుకోవాలో లేదా గెలవాలో షూట్-అవుట్‌లు నిర్ణయిస్తాయి. సాధారణంగా దీనికంటే ముందు, అదనపు సమయాన్ని ఆడతారు. అయితే ఇది తప్పనిసరేమీ కాదు; [1] కోపా లిబర్టాడోర్స్, కోపా అమెరికా (క్వార్టర్-ఫైనల్స్, సెమీ-ఫైనల్స్, మూడవ-స్థానం గేమ్), FA కమ్యూనిటీ షీల్డ్, EFL లీగ్ కప్, ఫుట్‌బాల్ లీగ్ ట్రోఫీల్లో అదనపు సమయం ఆడరు. వీటిలో, సాధారణ సమయం ముగిసిన తర్వాత నేరుగా షూట్ అవుట్‌లకు వెళ్తారు.

పెనాల్టీ షూట్-అవుట్‌లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుండి తొలగిపోతుంది. గెలిచిన జట్టు తదుపరి రౌండ్‌కు చేరుకుంటుంది లేదా ఛాంపియన్‌గా కిరీటాన్ని పొందుతుంది. అయితే FIFA మాత్రం ఈ మ్యాచ్‌ను డ్రా అయినట్టుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు, 2014 FIFA ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ సెమీ-ఫైనల్ దశలోనే నిష్క్రమించినప్పటికీ, అది కప్పు పోటీల్లో అజేయంగానే నిలిచినట్లు పరిగణించింది. [5]

విధానము[మార్చు]

2006 స్కాటిష్ కప్ ఫైనల్ షూట్ అవుట్‌లో గ్రెట్నాపై స్టీవెన్ ప్రెస్లీ స్కోర్ చేశాడు
2012 UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో ఫిలిప్ లామ్ స్కోర్ చేయబోతున్నాడు
2012 UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో డిడియర్ ద్రోగ్బా కొడుతున్న నిర్ణయాత్మక పెనాల్టీ కిక్

కిందిది పెనాల్టీ మార్క్ నుండి కిక్‌ల ప్రక్రియ యొక్క సారాంశం. ఆట నిబంధన 10 ("మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడం") లో ఈ విధానం పేర్కొనబడింది (p. 71) [1]

  1. రిఫరీ నాణేన్ని ఎగరేసి చిత్తు బొమ్మ ద్వారా ఏ గోల్‌పోస్టులోకి కిక్కులు కొట్టాలో నిర్ణయిస్తాడు. భద్రతా కారణాల దృష్ట్యా లేదా గోల్ లేదా అక్కడి నేల ఉపరితలం నిరుపయోగంగా మారితే రిఫరీ గోల్ ఎంపికను మార్చవచ్చు. [1]
  2. మొదటి కిక్‌ని ఏ జట్టు తీసుకోవాలో నిర్ణయించడానికి రిఫరీ మరోసారి నాణేన్ని ఎగరేస్తాడు.
  3. కిక్కరు, గోల్ కీపర్లు కాకుండా మిగతా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా పిచ్ సెంటర్ సర్కిల్‌లో ఉండాలి
  4. ప్రతి కిక్కూ, పెనాల్టీ కిక్ కొట్టే సాధారణ పద్ధతిలోనే కొడతారు. కిక్కును పెనాల్టీ మార్క్ నుండి కొడతారు. ఇది గోల్ లైన్ నుండి 11 m (12 yards) దూరంలో,, టచ్ లైన్ నుండి సమాన దూరంలో ఉంటుంది. గోలును ప్రత్యర్థి గోల్ కీపర్ ఒక్కడు మాత్రమే రక్షించుకుంటాడు. బంతిని తన్నేంతవరకూ, గోల్ కీపరు తన గోల్ లైన్‌లోని గోల్ పోస్ట్‌ల మధ్య ఉండాలి. అయితే అతను దూకడం, చేతులు ఊపడం, గోల్ లైన్‌తో పాటు అక్కడక్కడే కదలడం లేదా షూటర్ దృష్టి మరల్చడానికి ప్రయత్నించడం వంటివి చేయవచ్చు.
  5. అర్హత ఉన్న ఆటగాళ్ల నుండి కిక్‌లు ఎవరు కొట్టాలనే క్రమాన్ని జట్టు ఎంచుకుంటుంది.
  6. ప్రతి కిక్కరు ఒక్కసారి మాత్రమే బంతిని తన్నాలి. ఒకసారి తన్నిన తర్వాత, కిక్కరు మళ్లీ బంతిని ఆడకపోవచ్చు. రీ-కిక్‌పై నిర్ణయం పూర్తిగా రిఫరీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
  7. నిర్ణీత కిక్కరు, గోల్ కీపరు మినహా ఇరు జట్లలోని ఏ ఇతర ఆటగాడు బంతిని తాకకూడదు. [1]
  8. కిక్కర్‌ఉ ఒకసారి బంతిని తన్నాక ఆ బంతి, ప్రత్యర్థి జట్టు గోల్ కీపరు కాకుండా మరే ఇతర ఆటగాడు, అధికారి లేదా మరి ఎవరినీ తాకకుండా, గోల్ పోస్ట్‌ల మధ్య, క్రాస్‌బార్ కిందనుండి గోల్ లైన్‌ను దాటితే, కిక్ చేసే జట్టుకు గోల్ అయినట్లు లెక్క. గోల్‌ లోకి వెళ్లడానికి ముందు బంతి గోల్ కీపరును గాని, గోల్ పోస్ట్‌లను గాని, క్రాస్‌బార్‌ను గానీ ఎన్నిసార్లయినా తాకవచ్చు. 1986 ప్రపంచ కప్ షూటౌట్‌లో బ్రెజిల్, ఫ్రాన్స్ మధ్య ఒక సంఘటన జరిగింది. బ్రూనో బెలోన్ కొట్టిన బంతి పోస్టును తాకి బయటకు వచ్చి, గోల్ కీపర్ కార్లోస్‌కు వీపుకు తగిలి, ఆపై గోల్‌లోకి దూసుకెళ్లింది. రిఫరీ ఇయోన్ ఇగ్నా, ఫ్రాన్స్‌కు గోల్‌ను ఇచ్చాడు. బ్రెజిల్ కెప్టెన్ ఎడిన్హో, పోస్టుకు తగిలి వెనక్కి వచ్చినపుడే కిక్ మిస్సయినట్లు పరిగణించాలని నిరసన తెలిపాడు. అందుకు రిఫరీ అతన్ని బుక్ చేసాడు. ఆ తరువాత 1987లో, అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు ఇగ్నా నిర్ణయానికి మద్దతుగా నిబంధన 14 ను స్పష్ట పరచింది. [6]
  9. జట్లు ఒక్కొక్కటి ఐదు కిక్‌లు కొట్టేవరకు ఒకదాని తరువాత ఒకటి పెనాల్టీ కిక్ కొడతాయి. ఎప్పుడైతే, ఒక పక్షం, తన ప్రత్యర్థి అధిగమించలేనంత గోల్ ఆధిక్యత సాధించినపుడు, ఇంకా మిగిలి ఉన్న కిక్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా షూట్ అవుట్‌ను ఆపేస్తారు. ఈ ప్రాతిపదికను "బెస్ట్ ఆఫ్ ఫైవ్ కిక్స్" అంటారు. దీనికి ఉదాహరణ 2006 ప్రపంచ కప్ ఫైనల్లో ఇటలీకి చెందిన ఫాబియో గ్రోసో తన జట్టులో ఐదవ స్కోర్ చేసిన తర్వాత షూటౌట్ ముగించారు - ఫ్రాన్స్‌కు (అప్పటికి 3 గోల్‌లు చేసింది) ఇంకా ఒకటి మిగిలే ఉన్నప్పటికీ.
  10. ఈ ఐదు రౌండ్ల కిక్‌ల తర్వాత జట్లు సమాన సంఖ్యలో గోల్‌లను స్కోర్ చేసినట్లయితే, ఒక జట్టు స్కోర్ చేసి, రెండవ జట్టు మిస్ అయ్యే వరకూ ఒక్కో కిక్ అదనపు రౌండ్‌లు ఇస్తారు. దీనినే సడెన్ డెత్ అంటారు.
  11. షూట్ అవుట్ ముగిసే సమయానికి అత్యధిక గోల్స్ చేసిన జట్టు మ్యాచ్ విజేతగా నిలుస్తుంది.
  12. ఆట ముగిసే సమయానికి పిచ్‌పై ఉన్న లేదా తాత్కాలికంగా గైర్హాజరైన ఆటగాళ్ళు మాత్రమే షూట్ అవుట్‌లో పాల్గొనేందుకు అనుమతించబడతారు. [1] మ్యాచ్ ముగిసే సమయానికి, కిక్‌లకు ముందు లేదా సమయంలో ఒక జట్టులో సభ్యులు ప్రత్యర్థి కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో, ప్రత్యర్థి జట్టులో సమానమయ్యేలా దాని ఆటగాళ్ళ సంఖ్యను తగ్గించుకోవాలి; దీనిని 'రెడ్యూస్ టు ఈక్వేట్' అంటారు.
  13. షూట్-అవుట్ సమయంలో గాయపడిన గోల్ కీపర్‌ స్థానంలో మరొకరిని తీసుకోవచ్చు. [1]
  14. షూట్-అవుట్ సమయంలో ఒక గోల్ కీపరును బయటికి పంపిస్తే, గేమ్ పూర్తి చేసిన మరొక ఆటగాడు మాత్రమే గోల్ కీపర్‌గా వ్యవహరించాలి. [1]
  15. షూట్ అవుట్ సమయంలో గోల్ కీపర్ కాకుండా ఇతర ఆటగాడు గాయపడినా లేదా బయటకు పంపబడినా, ఎటువంటి ప్రత్యామ్నాయం అనుమతించబడకుండా షూట్ అవుట్ కొనసాగుతుంది. తదనుగుణంగా ప్రత్యర్థి జట్టు తన సంఖ్యను తగ్గించుకోవాలి. [1]
  16. పిచ్‌పై మిగిలి ఉన్న ఏ ఆటగాడైనా గోల్‌కీపర్‌గా వ్యవహరించవచ్చు ఆట సమయంలో ఆడిన గోల్‌కీపరే గోల్‌కీపర్‌గా వ్యవహరించాల్సిన అవసరం లేదు .
  17. గోల్ కీపర్‌తో సహా తమ జట్టులోని ఇతర అర్హత కలిగిన ఆటగాళ్లందరూ మొదటి కిక్ తీసుకునే వరకు ఏ ఆటగాడూ రెండో కిక్ తీసుకోవడానికి అనుమతించబడడు.
  18. ఆటగాళ్ళు మరొక కిక్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే (అర్హత ఉన్న ఆటగాళ్లందరూ వారి మొదటి కిక్ తీసుకున్న తర్వాత స్కోరు సమానంగా ఉంటుంది కాబట్టి), ఆటగాళ్లు మళ్ళీ అదే క్రమంలో కిక్ చేయాల్సిన అవసరం లేదు. [1]
  19. మైదానం నుండి బయటకు వెళ్ళిన ఆటగాడి కోసం కిక్‌లు ఆలస్యం కాకూడదు. ఆటగాడు కిక్ కొట్టడానికి, సమయానికి రాకపోతే, ఆ ఆటగాడి కిక్కు జప్తు చేయబడుతుంది (స్కోరు అవనట్లే).
  20. కిక్కులు కొట్టే సమయంలో, ఏ జట్టులోనైనా ఆటగాళ్ళ సంఖ్య ఏడుగురు కంటే తగ్గినా, రిఫరీ మ్యాచ్‌ను ఆపకూడదు. [1]

విమర్శలు[మార్చు]

షూట్-అవుట్‌లను కొందరు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌గాను, మరికొందరు అసంతృప్తికరమైన కాప్-అవుట్‌గానూ భావిస్తారు

పాల్ డోయల్ షూట్-అవుట్‌లను "ఉత్తేజకరమైన, ఉత్కంఠభరితమైనవి" అంటాడు. 2008 UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ షూట్-అవుట్‌ను "అద్భుతమైన ... ఫైనల్‌ని ముగించడానికి సరైన మార్గం"గా అభివర్ణించాడు. [7] రిచర్డ్ విలియమ్స్ ఈ దృశ్యాన్ని "మార్కెట్ స్క్వేర్‌లో బహిరంగంగా కొరడాతో కొట్టడం "తో పోల్చాడు.

వీటిలో వచ్చే ఫలితాన్ని నైపుణ్య పరీక్షగా కాకుండా లాటరీ లాంటిది అని కొందరు అంటారు; [7] లూయిజ్ ఫెలిపే స్కోలారి [8] రాబర్టో డొనాడోని [9] షూట్-అవుట్‌లలో తమ జట్లు వరుసగా గెలిచాక, ఓడిపోయిన తర్వాత వాటిని పైవిధంగా వర్ణించారు. మరికొందరు దీన్ని ఒప్పుకోరు. మిచ్ ఫిలిప్స్ దీనిని "మానసిక బలానికి, సాంకేతికతకూ అంతిమ పరీక్ష" అని వర్ణించాడు. [10] పాల్ డోయల్ కూడా మానసిక బలాన్ని నొక్కి చెప్పాడు. [7]

ఫుట్‌బాల్ ఆటగాడి నైపుణ్యాలలో ఒక చిన్న ఉపసమితి మాత్రమే షూట్-అవుట్ లో పరీక్షించబడుతుంది. ఇయాన్ థామ్సెన్ 1994 ప్రపంచ కప్‌ను పెనాల్టీ షూట్-అవుట్ ఉపయోగించి నిర్ణయించడాన్ని, మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌ని మినీగోల్ఫ్ గేమ్ ద్వారా నిర్ణయించడంతో పోల్చాడు. [11] షూట్ అవుట్ అనేది టీమ్ స్పోర్ట్‌లో పాటించతగని వ్యక్తుల పరీక్ష అని పరిగణిస్తారు; సెప్ బ్లాటర్, "ఫుట్‌బాల్ ఒక జట్టు క్రీడ, పెనాల్టీలు జట్టుగా ఆడేవి కాదు, ఇది వ్యక్తిగతం" అని చెప్పాడు. [12]

మూలాలు[మార్చు]

  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 "Laws of the Game17_Digital_Eng.pdf" (PDF). IFAB. Archived (PDF) from the original on 11 September 2016. Retrieved 27 January 2017.
  2. Wilson, M; Wood, G; Jordet, G. "The BASES Expert Statement on the Psychological Preparation for Football Penalty Shootouts" (PDF). British Association of Sports and Exercise Sciences. Archived from the original (PDF) on 6 January 2016. Retrieved 28 January 2015.
  3. "World Cup shootouts are great and here is how other sports can adopt the thrilling finale". USA Today. 1 July 2018. Retrieved 2 July 2018. But all those things combine to make it dramatic and compulsive viewing, the ultimate element of instant unpredictability, a quick fix for both the "short attention span" generation and all the ones before it, too. Shootouts provide all the things we like about sports. Heroes stepping into the spotlight with a single moment of brilliant or fortune. Sympathetic figures who your heart bleeds for.
  4. "Goalmouth Scramble: 10 'important' thoughts on the World Cup". New Zealand Herald. 2 July 2017. Nothing beats penalty shootouts for drama. And how great was the camera pivot to capture Manchester United legend Peter Schmeichel's reactions every time his son Kasper saved a penalty for Denmark? Truly gripping theatre.
  5. FIFA.com (11 July 2014). "Van Gaal: We can still make history". fifa.com. Archived from the original on 29 January 2018. Retrieved 3 May 2018.
  6. Carosi, Julian (July 2006). "The Corsham Referee Newsletter". Archived from the original on 6 October 2008. Retrieved 20 June 2008. and Minutes of the AGM.
  7. 7.0 7.1 7.2 Doyle, Paul (21 May 2008). "A match worthy of champions". The Guardian. London. Archived from the original on 27 May 2008. Retrieved 29 June 2008.
  8. Jackson, Jamie (2 July 2006). "Players will not blame Rooney, says Gerrard". The Observer. London. Archived from the original on 24 September 2014. Retrieved 29 June 2008. The penalties are always a lottery.
  9. Kay, Oliver (23 June 2008). "Roberto Donadoni's numbers fail to come up in lottery". The Times. London. Archived from the original on 21 August 2008. Retrieved 29 June 2008. It is," he said grimly, "a lottery.
  10. Phillips, Mitch (25 June 2008). "Mental approach holds key to penalty success". Reuters. London. Archived from the original on 7 January 2013. Retrieved 7 January 2013.
  11. Thomsen, Ian (20 July 1994). "For Soccer to Win American Hearts, It Must Create Some Heroes". International Herald Tribune. Archived from the original on 7 January 2013. Retrieved 7 January 2013.
  12. "Soccer: Blatter against shoot-out in final". International Herald Tribune. 27 September 2006. Archived from the original on 16 October 2008. Retrieved 20 June 2008.