బి.వి.రామానందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బి.వి.రామానందం (బయ్యపునీడి వెంకట రామానందం) తెలుగు సినిమా దర్శకుడు. ఇతను ఎస్.వి.రంగారావుకు తెలుగు సినిమాకు పరిచయం చేసిన వ్యక్తిగా సుపరిచితుడు. అనేక మంది నటులను సినీ పరిశ్రమకు పరిచియం చేసిన ఇతనిని "ఆంధ్రా శాంతారాం" అని అభివర్ణించేవారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

బయ్యపునీడి వెంకట రామానందం 1902 జనవరి 2న రాజమండ్రిలో జన్మించాడు. చిన్నతనంలో లలిత కళల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒకపక్క విద్యాభ్యాసం చేస్తుందగానే మరో పక్క నాటకాలలో నటించేవాడు. బెనారస్ లో ఎఫ్.ఏ పరీక్ష ఉత్తీర్ణుడైన తరువాత ఆగస్టు 1922లో వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న సమయంలో మూకీల చిత్ర నిర్మాణం సాగుతుంది. చిన్నతనం నుండి కళా రంగంలో ఆసక్తి ఉండటంతో అతను సినిమా రంగంలోకి ప్రవేశించాడు. మొదట ఫిలిం పంపిణీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. దీని కోసం కలకత్తా వెళ్ళి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి ఫిలిం పంపిణీ వ్యాపారం జరిగే తీరుని పరిశీలించి ఒక అవగాహనకు వచ్చాడు. రాజమండ్రికి వచ్చి "రాధాకృష్ణ ఫిలిం డిస్ట్రిభ్యూషన్" పేరుతో ప్యాపారం ప్రారంభించాడు. అదే సమయంలో కలకత్తా నుండి వచ్చిన సి. పుల్లయ్య రాజమండ్రిలో ఆంధ్రా సినీటోన్ స్టుడియోను స్వాధీనం చేసుకొని ఆంధ్రా టాకీస్ పతాకంపై శ్రీ సత్యనారాయణ చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. వాడుక భాషలో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ఇది. రామానందం పుల్లయ్య వద్ద సహాయకునిగా చేరాడు. ఆ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసి అనుభవం సంపాదించుకున్నాడు.[1]

నిర్మాతగా[మార్చు]

అతను చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించాలనుకున్నాడు. అతను భారత లక్ష్మీ ఫిలిమ్స్ వారితో కలసి సక్కుబాయి సినిమాను నిర్మించాడు. అది 1935 మే 21న విడుదలైంది. ఈ చిత్రంలో 50 పాటలున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తానే రాధా ఫిలిం కంపెనీ చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పి 1935లో భక్త కుచేల సినిమాను నిర్మించాడు. బళ్లారి పండితుడు సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన నాటకం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో భారీ సెట్స్ వేసి చిత్రీకరించాడు. ఈ సినిమా విజయవంతమైంది.

1938లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నాటక ఆధారంగా కచ దేవయాని చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు కూడా నిర్వర్తించాడు. ఈ సినిమాకు సంజివని అనే పేరు కూడా ఉంది. కచదేవయాని ఇతివృత్తాన్ని ఆసక్తి కరంగా తెరపై మలచి దర్శకునిగా గుర్తింపు పొందాడు. 1939లో పాడురంగ విఠల సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం కూడా విజయవంతమైంది.

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ సమయంలో అతను చిత్ర నిర్మాణాన్ని తాత్కాలికంగా ఆపుచేసి రాజామండ్రి చేరుకున్నాడు. ఆరేళ్ళ పాటు నిర్మాణం జోలికి పోలేదు. తరువాత మరల వరూధిని సినిమా నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. అతను సేలంలో ఉన్న మోడరన్ థియేటర్స్ స్టుడియోలో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. ఈ సినిమాలో కథానాయకుని పాత్రకోసం తన మేనల్లుడైన ఎస్.వి.రంగారావును ఎంపిక చేసాడు. ఆ చిత్రంలో కృష్ణదేవరాయలు, ప్రవరాఖ్యుడు పాత్రలను ఎస్.వి.రంగారావు పోషించాడు. ఈ సినిమా 1947 జనవరి 11న విడుదలైంది. కానీ విజయవంతం కాలేదు. అతనికి ఆర్థికంగా నష్టం కలిగించింది. దీనితో సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు.[2]

నటునిగా[మార్చు]

అంతవరకు పౌరాణిక సినిమాలను తీసిన అతను తన పంథాను మార్చుకుని సాంఘిక సినిమాల నిర్మాణంపై దృష్టి సారించాడు. అలా గొల్లపిల్ల సినిమాను తీసాడు. యాదవ కులస్థులు అభ్యంతరం వల్ల ఆ చిత్రానికి పెంకి పిల్ల గా శీర్షికను మార్చారు. ఆ సినిమాకు దర్శకునిగానే కాక అందులో న్యాయమూర్తి పాత్రను పోషించాడు. ఆ సినిమా విజయవంతం కాలేదు.

అస్తమయం[మార్చు]

అతను 1955లో జై వీర భేతాళ చిత్రాన్ని ప్రారంభించాడు. కానీ ఆ సినిమా పూర్తి కాకుండానే అతని ఆరోగ్యం దెబ్బతినడం మూలంగా 1955 అక్టోబరు 27న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 నవ్య వారపత్రిక - జూన్ 4, 2009 - 68, 69 పుటలు : ఆంధ్రా శాంతారాం రామానందం
  2. "ఆంధ్రా శాంతారాం 'రామానందం'". TELUGUCINEMA CHARITRA (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-22.