మైత్రీ ఎక్స్ ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మైత్రీ ఎక్స్ ప్రెస్ లేదా (బెంగాలీ: মৈত্রী এক্সপ্রেস మైత్రీ ఎక్స్ ప్రెస్, హిందీ: मैत्री एक्सप्रेस) లేదా ఢాకా-కోల్ కతా ఎక్స్ ప్రెస్ అనేది ఒక అంతర్జాతీయ ప్యాసింజర్ రైలు సర్వీసు. ఇది బంగ్లాదేశ్ దేశ రాజధాని ఢాకా, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతా మధ్య నడుస్తుంది. రెండు వేర్వేరు దేశాల్లోని ముఖ్యనగరాలను కలుపుతూ నడిచే ఏకైక రైల్వే లింకు ఇది.[1] మైత్రీ అంటే అర్థం స్నేహం. అంటే రెండు దేశాల మధ్య నడిచే ఈ రైలు భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ఉన్న విదేశీ మైత్రీ సంబంధాలకు గుర్తు.[2] బెంగాలీ కొత్త సంవత్సరం సందర్భంగా 2008 ఏప్రిల్ 14నాడు ఈ రైలు సర్వీసు ప్రారంభించబడింది.

చరిత్ర[మార్చు]

1947 లో భారత దేశ విభజనకు ముందు భారత దేశానికి చెందిన పశ్చిమ బెంగాల్ నుంచి, పాకిస్థాన్ పరిధిలోని తూర్పు బెంగాల్ (ఆ తర్వాత 1956లో దీనికి తూర్పు పాకిస్థాన్ అని పేరుపెట్టారు) భూభాగంలో గల కోల్ కతా, గోవాలాండా, ఢాకా, నారాయణ గంజ్ ప్రాంతాలకు ప్రతిరోజు రైళ్లు నడుస్తుండేవి.[1] అయితే దేశ విభజన తర్వాత కొంతకాలం అర్ధాంతరంగా భారత్, బంగ్లాదేశ్ ల మధ్య రైలు సర్వీలు నిలిచిపోయాయి. 2001లో రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా తిరిగి రైలు సేవల పునరుద్ధరణపై ఒప్పందం కుదిరింది. జూలై 8, 2007 నాడు మొదటి రైలులో అధికారుల బృందం కోల్ కతా నుంచి ఢాకాకు వెళ్లారు.[3] భారత రక్షణ దళం డిమాండ్ మేరకు ఇరుదేశాల మధ్యనున్న నో-మాన్స్’ లాండ్ వైపు "బాక్స్ ఫెన్సింగ్" విధానాన్ని ప్రవేశపెట్టారు. 2008 ఏప్రిల్ 14నాడు బెంగాళీల కొత్త సంవత్సరం రోజున ఈ రైలు కోల్ కతాలోని కోల్ కతా రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది. అప్పటి భారత రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రియ రంజన్ దాస్ మున్షీ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాల కృష్ణ గాంధీ, భారత్ కు బంగ్లాదేశ్ హై కమిషనర్ గా ఉన్న లిఖత్ అలీ చౌదరీ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి భారత విదేశాంగ శాఖ మంత్రి, ప్రస్తుత భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అధికారికంగా కోలకతా- ఢాకా సరిహద్దులో జెండా ఊపారు.[1] ఇదే సమయంలో మరో రైలు ఢాకాలో ప్రయాణికులను తీసుకుని కోల్ కతాకు బయలుదేరింది.

మార్గం[మార్చు]

కోల్ కతా, ఢాకా మధ్య కేవలం మైత్రీ ఎక్స్ ప్రెస్ రైలు ఒక్కటే నడుస్తుంటుంది.[4] ఈ రైలు కోల్ కతా నుంచి ఢాకా చేరే సరకి సుమారు 375 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇమిగ్రేషన్ తనిఖీ కోసం రెండు చోట్ల ఈ రైలును ఆపుతారు. వీటిలో ఒకటి భారత్ వైపు గెడే దగ్గర మరొకటి బంగ్లాదేశ్ వైపు దర్శన దగ్గర ఆపుతారు. ఈ రైలు గమ్యాన్ని చేరేందుకు10–11 గంటల వ్యవధి తీసుకుంటుంది. ఇప్పటికీ బంగ్లాదేశ్ వైపు రైలు లైను విద్యుదీకరించ బడలేదు. అందువల్ల మొత్తం ప్రయాణమంతా బ్రాడ్ గేజ్ డీజిల్ లోకోమొటివ్ తో నడపబడుతుంది. మైత్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణంలో రెండు ప్రధాన నదులపై ఉన్న వంతెనలు దాటాల్సి ఉంటుంది. ఒకటి దిగువ గంగానది పై నిర్మించిన హర్డింగే వంతెన కాగా, మరొకటి యమునా నది పై నిర్మించిన యమునా మల్టి పర్పస్ వంతెన. ఇవి రెండు కూడా బంగ్లాదేశ్[5] లోనే ఉన్నాయి.

బుకింగ్[మార్చు]

ఈ రైలుకు ఆన్ లైన్ బుకింగ్ ఉండదు. కేవలం స్థానికంగా వాడే నగదును చెల్లించి మాత్రమే ఈ క్రింది బుకింగ్ సెంటర్లలో టికెట్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణ టికెట్లు ముందుగానే తీసుకోవడం వీలు కాదు. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు ఎటువైపు వెళ్లాలనా ఆ దేశపు వీసా తప్పని సరి. వీసా, పాస్ పోర్టు ఉంటేనే రైలు టికెట్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ బుకింగ్ దగ్గరికి ప్రయాణికులందరు రాలేక పోతే ఆథరైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఢాకాలో కమలాపూర్ ప్రధాన రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవాలి. కోల్ కతాలో డల్ హౌసీ స్క్వేర్ లోని ఫెయిర్ లీ ప్లేస్ అంతర్జాతీయ టికెట్ బుకింగ్ కౌంటర్ లో గానీ, కోల్ కతా స్టేషన్ లో గానీ టికెట్లు తీసుకోవాలి. రైలు బయలుదేరే సోమ, బుధ, శుక్రవారాల్లో కోల్ కతా కౌంటర్ లో సాయంత్రం 18:00–22:00 గంటల మధ్య మాత్రమే టికెట్లు ఇస్తారు. ఫెయిర్ లీ ప్లేస్ కౌంటర్లో ప్రతీరోజు ఉదయం 08:00– సాయంత్రం 20:00 గంటల వరకు టికెట్లు ఇస్తారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Kolkata-Dhaka Moitree Express flagged off". The Times of India. Times Internet Limited. 14 April 2008. Archived from the original on 2012-10-20. Retrieved 2015-07-21.
  2. "Dhaka-Calcutta train link resumes". BBC News. BBC. 14 April 2008. Retrieved 2015-07-21.
  3. Sudworth, John (8 July 2007). "First India-Bangladesh train link". BBC News. BBC. Retrieved 2008-04-17.
  4. "Maitree Express timetable". cleartrip.com. Archived from the original on 2015-05-27. Retrieved 2015-07-21.
  5. "Bangladesh Agrees to Consider Increasing Maitree Express Frequency". The New Indian Express. newindianexpress.com. 14 April 2008. Archived from the original on 2015-10-31. Retrieved 2015-07-21.

బయటి లింకులు[మార్చు]