మొజాంబిక్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొజాంబిక్‌లోని ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న హిందూ మహిళలు

మొజాంబిక్‌లో చారిత్రికంగా హిందూ సమాజం ఉంది. వారి పూర్వీకులలో కొందరు కనీసం 500 సంవత్సరాల క్రితమే మొజాంబిక్‌ వచ్చారు. వాస్కో డ గామా రాకముందే మొజాంబిక్‌లో తమ ఆర్థిక పురోగతిని ఊహించి, వారు ఇక్కడికి వచ్చారు. 1975-1990 మధ్య అంతర్యుద్ధాల సమయంలో దేశం నుండి వలసలు మొదలయ్యాయి. 1990 లో మొజాంబిక్‌లో జరిగిన రాజకీయ, సామాజిక సంస్కరణల తర్వాత, ఇతర మైనారిటీ మతాలతో పాటు హిందూ సమాజం మరోసారి ఉత్సాహం పొందింది. 

మొజాంబిక్‌లో దాదాపు 30,000 మంది హిందువులున్నారు. నాలుగు హిందూ దేవాలయాలు ఉన్నాయి. [1] మొజాంబికన్ హిందువులలో, 1961 వరకు పోర్చుగీస్ కాలనీగా ఉన్న గోవా నుండి మొజాంబిక్‌కు వలస వచ్చిన గోవన్లే ఎక్కువ.

చరిత్ర[మార్చు]

సా.శ. 1వ సహస్రాబ్ది నాటికి భారతీయ హిందువులు, రుతుపవనాల ఆధారిత వాణిజ్య పవనాలను ఉపయోగించుకుని భారతదేశపు పశ్చిమ భాగాలు, మొజాంబిక్‌ల మధ్య వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టారని బ్లాంచే డిసౌజా పేర్కొన్నాడు. తద్వారా ఈ రెంటినీ ఆఫ్రికా తోను, అరేబియా ద్వీపకల్పంలోని ఇతర తూర్పు తీర ప్రాంతాలతోనూ కలిపారు. [2] హిందూ వ్యాపారులు ఆ విధంగా, 499లో మొజాంబిక్‌లో వాస్కో డా గామా అడుగు పెట్టక మునుపే, మొజాంబిక్‌ చేరుకున్నారు. ఈ సంగతి వాస్కోడాగామాయే ఇల్హా డి మోకాంబిక్‌లో హిందువులున్నారని తన జ్ఞాపకాల్లో రాసాడు. అయితే, ఆ ప్రారంభ కాలం నుండి, మొజాంబిక్‌లో హిందువులు ఎప్పుడూ మైనారిటీగానే ఉంటూ వచ్చారు. గోవా, డామన్, డయ్యూలలో వలసరాజ్యాల ఉనికిని కొనసాగించాలనే వాదనపై పోర్చుగల్‌తో 1960ల వివాదం తర్వాత, ఈ భూభాగాలను భారతదేశం స్వాధీనం చేసుకుంది. దానికి ప్రతిగా మొజాంబిక్‌లోని పోర్చుగీసు వలస ప్రభుత్వం, దేశంలో ఉన్న హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంది. [3] వారి ఆస్తులను, బ్యాంకు ఖాతాలనూ జప్తు చేసింది. మొత్తం హిందూ కుటుంబాలను నిర్బంధ శిబిరంలో ఉంచారు. వారి పౌరసత్వాన్ని రద్దు చేసింది. 1975లో మొజాంబిక్, పోర్చుగల్ నుండి స్వాతంత్ర్యం పొందింది. కొద్ది కాలం లోనే అంతర్యుద్ధం మొదలైంది. ఈ కాలంలో, వేలాది మంది స్థానిక హిందువులు ఐరోపాకు (ఎక్కువగా లిస్బన్‌కు), మరికొందరు దక్షిణాఫ్రికా, భారతదేశాలకు వలస వెళ్ళారు. [4]

1990 తరువాత జోక్విమ్ చిస్సానో నేతృత్వంలో మొజాంబిక్‌లో సంస్కరణలు జరగడంతో, క్రియాశీల హిందూ సంఘం మరోసారి అభివృద్ధి చెందింది. కమ్యూనిటీ ఎక్కువగా వాణిజ్య కార్యకలాపాలలో ఉంది. మాపుటోలో హిందూ కమ్యూనిటీ సెంటర్‌ ఉంది. సమాజంలోని నివాస ప్రాంతాలకు సమీపంలో చిన్న హిందూ దేవాలయాలు ఉన్నాయి. మొజాంబిక్ హిందూ సమాజం కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, మహారాష్ట్రలోని భారతీయ సంఘాలతో సామాజిక-సాంస్కృతిక సంఘాలను ఏర్పాటు చేయడానికి సంప్రదించింది. [4]

మూలాలు[మార్చు]

  1. Project, Joshua. "Gujarati in Mozambique". joshuaproject.net (in ఇంగ్లీష్). Retrieved 2021-05-06.
  2. Encyclopedia Americana (1965), Volume 15, pp. 26–32
  3. Mozambique Archived 2014-08-27 at the Wayback Machine Hindu Council of Africa
  4. 4.0 4.1 The Indian community in Mozambique High Commission of India in Mozambique