లవకుశ (1934 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లవకుశ
(1934 తెలుగు సినిమా)

మాస్టర్ భీమారావు (లవుడు), మాస్టర్ మల్లేశ్వరరావు (కుశుడు) లతో శ్రీరంజని సీనియర్(సీత)
దర్శకత్వం చిత్తజల్లు పుల్లయ్య
నిర్మాణం మోతీలాల్ ఛబ్రియా
చిత్రానువాదం వల్లభజోస్యుల రమణమూర్తి
తారాగణం పారుపల్లి సుబ్బారావు,
మాస్టర్ భీమారావు,
మాస్టర్ మల్లేశ్వరరావు,
పారుపల్లి సత్యనారాయణ,
శ్రీరంజని సీనియర్,
ఈమని వెంకట్రామయ్య,
కె.నాగమణి,
చారి ,
మద్దూరి బుచ్చన్నశాస్త్రి,
డా. హెచ్.వి. వెంకటాచలం,
పి.వి.రమణారావు,
రమాదేవి,
పద్మాబాల
భూషణశాస్త్రి
సంగీతం ప్రభల సత్యనారాయణ
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
సంభాషణలు బలిజేపల్లి లక్ష్మీకాంతం
నిర్మాణ సంస్థ ఈస్టిండియా ఫిలిం కంపెనీ
విడుదల తేదీ 23 డిసెంబర్ 1934
నిడివి 165 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

లవకుశ ఈస్టిండియా ఫిలిం కంపెనీ పతాకంపై మోతీలాల్ ఛబ్రియా నిర్మాతగా పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందించిన 1934 నాటి తెలుగు చలన చిత్రం. తెలుగు సినిమా. కె.వి. సుబ్రహ్మణ్యం వ్రాసిన నాటకం "లవకుశ" ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగేతరుడైన మోతీలాల్ ఛబ్రియా నిర్మించారు. "సతీ సావిత్రి" చిత్రంతో తెలుగు సినిమా పాటలు రికార్డులుగా రావడం ఆరంభమయ్యింది. "లవకుశ" సినిమాతో తెలుగు రికార్డులు ఊపందుకొన్నాయి.[1] ఈ చిత్రంలోని పాటలన్నీ గొప్పగా విజయవంతమయ్యాయి.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

లవకుశ కథాంశం ఆధారంగా ఈ సినిమాకి ముందు, తర్వాతా కలిపి భారతీయ భాషలన్నిటిలో 9 సినిమాలు నిర్మితమయ్యాయి. దీనికిముందు 1919లో ఆర్.నటరాజ ముదలియార్ లవకుశ కథాంశాన్ని శబ్దరహిత చిత్రంగా నిర్మించారు. అనంతరం ఈ సినిమాని 1934లో ఈస్టిండియా కంపెనీ తెలుగులో నిర్మించే ప్రయత్నం చేశారు. సినిమాకి ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం రచన చేశారు.[2]

నటీనటుల ఎంపిక[మార్చు]

శ్రీరాముని పాత్రకు పారుపల్లి సుబ్బారావును ఎంపిక చేశారు. సీత పాత్రలో సీనియర్ శ్రీరంజని నటించారు. లవకుశుల పాత్రలకు భీమారావు, మల్లికార్జునరావులను ఎంపికచేసుకున్నారు. రజకునిగా బి.సి.హెచ్.నరసింగరావు నటించారు. తారాగణంలోని శ్రీరంజని నాటకాల్లో పురుష పాత్రల ద్వారా కూడా సుప్రసిద్ధురాలు.[2] లక్ష్మణుని పాత్రకు ఎంపికచేసే వ్యక్తికి రాముని పాత్ర ధరించే పారుపల్లి సుబ్బారావుతో పోలికలు ఉండాలన్న ఆలోచనతో వెతికారు. శ్రమపడి అలాంటి పోలికలు గల ఈమని వెంకట్రామయ్యని పట్టుకుని లక్ష్మణుని పాత్రకు తీసుకున్నారు.

[3]

చిత్రీకరణ[మార్చు]

లవకుశ సినిమాని కలకత్తాలో నిర్మించారు. "సీత" అనే బెంగాలీ సినిమా కోసం ఉపయోగించిన రథాల్ని, సెట్టింగుల్ని ఈ తెలుగు సినిమాకి ఉపయోగించుకున్నారు.[2]

విడుదల[మార్చు]

1935 జనవరి 5 న ఆంధ్రపత్రిక లో ఇచ్చిన లవకుశ ప్రకటన
1935 జనవరి 5 న ఆంధ్రపత్రిక లో ఇచ్చిన లవకుశ ప్రకటన - ధ్వని గురించి ప్రత్యేక ప్రస్తావన

కాంట్రాక్ట్ పద్ధతిలో సినిమాలు విడుదల చేసేవారు. ఏ వూరికెళ్ళినా సినిమా ప్రింట్లు కంట్రాక్టు ముగిసిన సమయానికి తిరిగి వచ్చేవి కావు. దానితో కంట్రాక్టు పద్ధతి క్రమంగా కనుమరుగయ్యింది. అంతకుముందు థియేటర్లలో మేకులు కొట్టి, చెక్క ముక్కలతో తయారు చేసిన ప్రొజెక్టర్లతో సినిమాలు ప్రదర్శించేవారు. ఈస్టిండియా ఫిలిం కంపెనీ కలకత్తాలోని "ఛటర్జీ భూపాల్ సౌండ్ సిస్టమ్"తో ఒప్పందం కుదుర్చుకొని "సింగిల్ స్టార్ సింప్లెక్స్ ప్రొజెక్టర్ల"ను ఈ సినిమాతో ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రారంభమైన ఈ విధానాలే సాంకేతికంగా అభివృద్ధి చెంది డిజిటల్ సినిమాగా అభివృద్ధి చెందేవరకూ తెలుగు సినిమాకు మార్గదర్శకమయ్యాయి.[1]

ఫలితం[మార్చు]

ఈ సినిమా గొప్ప ప్రభంజనాన్నే సృష్టించింది. బళ్ళు కట్టుకొని సినిమాకు రావడం ఈ చిత్రంతోనే మొదలయ్యిందని చెప్పాలి. విజయవాడ దుర్గా కళామందిర్ ఆవరణ చుట్టుప్రక్కలనుండి వచ్చిన జనాలతో ఒక తిరునాళ్ళలా కనిపించేది. ఆ రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు అందరినీ ఆశ్చర్య పరచాయి.[1] తెలుగు సినిమా తొలినాళ్లలో ఈ సినిమా 40 వేల రూపాయలు విడుదల చేసి రికార్డు సృష్టించింది.[3]

పాటలు[మార్చు]

సినిమాకు సంగీత దర్శకత్వం ప్రభల సత్యనారాయణ వహించారు.[2] పాటలన్ని బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసాడు. సీత సినిమాకు ఉపయోగించిన పాటల్లో కొన్నిటి బాణీలు ఈ సినిమాకు వాడారు. కొన్ని పాటలు, పద్యాలు మాత్రం అప్పటికే ప్రచారంలో ఉన్న నాటకాలలోనివి కాగా మరికొన్నిటిని ప్రత్యేకంగా రాయించి బాణీలు కట్టించారు. అలా మొత్తానికి 21 పాటలు, 10 పద్యాలు ఉన్నాయి ఇందులో. సినిమా పాటలు జనం నోళ్ళలో నానాయి, భజన గీతాలుగా ప్రాచుర్యం పొందాయి. కాకినాడలోని సన్ రికార్డింగ్ కంపెనీ ఈ సినిమా పాటలు రికార్డులుగా విడుదల చేసింది. పాటల పుస్తకాలుగా పాటల సాహిత్యం ప్రచురించి అమ్మడం ఈ సినిమాతోనే ప్రారంభమైందని సినీ జర్నలిస్టు పులగం చిన్నారాయణ పేర్కొన్నాడు.[3]

  1. ఆహా ఏమి నా భాగ్యము స్వామీ - శ్రీరంజని
  2. రఘురామ చరితను వినవమ్మా - మాస్టర్ భీమారావు, మల్లీశ్వరరావు
  3. సాహసమేల ఈలీల జానకి వ్యధపడకే - పారుపల్లి సత్యనారాయణ
  4. హే రామా రాజీవ నయనా - పారుపల్లి సత్యనారాయణ, రంగాచారి
  5. మందం మందం మధురనినదైహి వేణు - పారుపల్లి సత్యనారాయణ
  6. ఎల్లెల్లె లంజ నీ వోటము - వెంకటాచలం, పద్మాబాయి

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

  • సూర్య దినపత్రిక - 4 జనవరి 2008 సూర్యచిత్ర అనుబంధం వ్యాసం - వినాయకరావు
  1. 1.0 1.1 1.2 హరికృష్ణ, మామిడి. "కనుడు... కనుడు రామాయణగాథ". నవతరంగం. నవతరంగం. Archived from the original on 15 మార్చి 2015. Retrieved 27 January 2015.
  2. 2.0 2.1 2.2 2.3 ఎస్.వి., రామారావు (2009). నాటి 101 చిత్రాలు (2 ed.). హైదరాబాద్: కిన్నెర పబ్లికేషన్స్. pp. 9, 10.
  3. 3.0 3.1 3.2 పులగం, చిన్నారాయణ (2016). ఆనాటి ఆనవాళ్లు (4 ed.). చెన్నై: విజయ పబ్లికేషన్స్. pp. 11–16.