వాల్-ఈ
వాల్-ఈ | |
---|---|
దర్శకత్వం | ఆండ్ర్యూ స్టాన్‌టన్ |
స్క్రీన్ ప్లే |
|
కథ |
|
నిర్మాత | జిమ్ మారిస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం |
|
కూర్పు | స్టీఫెన్ స్టాఫర్ |
సంగీతం | థామస్ న్యూమన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | వాల్ట్ డిజ్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీs | జూన్ 23, 2008(లాస్ ఏంజలెస్) జూన్ 27, 2008 (ఉత్తర అమెరికా) |
సినిమా నిడివి | 98 నిమిషాలు |
దేశం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
బడ్జెట్ | $18 కోట్లు[1] |
బాక్సాఫీసు | $53.33 కోట్లు [2] |
వాల్-ఈ 2008లో విడుదలైన ఒక అమెరికా కంప్యూటర్-యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా. పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ వారు వాల్ట్ డిజ్నీ కోసం ఈ సినిమాను నిర్మించారు. ఆండ్ర్యూ స్టాన్‌టన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించి, కథను అందించడంలో పాలు పంచుకున్నారు. కథ రాసిన మరో వ్యక్తి జిం రియర్‌డన్, ఈ చిత్రానికి నిర్మాత జిం మారిస్. యానిమేషన్ చిత్రం కావున నటీనటులు పాత్రలకు గొంతునందించిన వారవుతారు. అలా ఈ చిత్రంలో నటీనటులు బెన్ బ్రట్, ఎలిసా నైట్, జెఫ్ గార్లిన్, ఫ్రెడ్ విలియార్డ్, జాన్ రాట్జ్ర్న్‌బర్గ్, కేథి నజిమి, సిగర్నీ వీవర్.
భవిష్యత్తులో భూమిపై చెత్త పేరుకుపోవటం వలన మనిషి మనుగడ సాగలేక మనుషులు భూమిని వదిలేస్తారు. అలాంటి నిర్మానుష్య భూమిపై చెత్తను సేకరించి, భద్రపరిచేందుకు వీలుగా చేసే రోబోట్ ఒకటి మాత్రమే మిగులుతుంది. ప్రతి రోజు చెత్తను తీసి ఘనాకారపు కుప్పలుగా చేస్తూ, ఒక చిన్న మిడతతో స్నేహం చేస్తుంది. ఆగ్జియం నౌక నుండి పంపబడిన అన్వేషక రోబోట్ తో ప్రేమలో పడి విశ్వాంతరాళాల ప్రయాణం చేయడమే ఈ సినిమా నేపథ్యం.
ఫైండింగ్ నీమో చిత్రం తీసిన అనుభవంతో అంతరిక్షం ఎలా ఉంటుందో కల్పన చేస్తూ రూపొందించిన గ్రాఫిక్స్ ఈ చిత్రంలో వాడారు. వాల్-ఈ చిత్రంలో సంభాషణలు చాలా తక్కువ. చాలా వరకు పాత్రలకు డైలాగులు లేవు. పూర్తి శరీర హావభావాలతో, రోబోటిక్ శబ్దాలతో సంభాషణలు నడుస్తాయి.
ఈ సినిమా మాధ్యమంగా జనాలలో ఉన్న ఖర్చుపెట్టే వ్యసనం, బడా కంపెనీల నియంత్రుత్వ వైఖరి, జ్ఞాపకాలు నెమరువేసుకోవటం, ప్రకృతిపై మనిషి చేస్తున్న దుశ్చర్యలు, ఊబకాయం, ప్రపంచ నాశనం లాంటి విషయాలను బయలు చేసారు చిత్ర నిర్మాతలు.
వాల్ -ఈ అమెరికాలో 2008 జూన్ 27 న విడుదలయింది. ఈ సినిమా వెనువెంటనే విజయం చవిచూసింది. 18 కోట్ల అంచనా వ్యయంతో మొదలై, విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా 53.33 కోట్ల డాలర్లను సంపాదించింది. ఉత్తమ యానిమేటెడ్ చిత్రం విభాగంలో 2008 సంవత్సరపు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. ఆస్కార్ అవార్డ్ కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా ఎన్నో అవార్డులు పొందింది. 21వ శతాబ్దపు ఉత్తమ నూరు చిత్రాలలో 29వ చిత్రంగా పేరుగాంచింది.
కథ
[మార్చు]2805వ సంవత్సరంలో భూమి నిర్మానుష్యంగా, చెత్తతో నిండిపోయి ఉంటుంది. మనుషులందరినీ బై-ఎన్-లార్జ్ అనే సంస్థ పెద్ద పెద్ద అంతరిక్షయానాలలో భూమి నుండి అంతరిక్షంలోకి తీసుకుపోతుంది. భూమిని శుభ్రపరిచేందుకు, చెత్తను ఒక చోట కుప్పగా చేర్చేందుకు వాల్-ఈ అనే ఒక రోబోట్లను భూమిపై ఉంచేస్తుంది. అన్ని వాల్-ఈలు మూలన పడినా, ఒకటి మాత్రం ఆ వాతావరణంలో మసలటం నేర్చుకుంటుంది. మిగతా నిరర్ధక వాల్-ఈ ల విడి భాగాలను అమర్చుకుని భూమిపై ఒకటే నివసిస్తుంది. ఒకరోజు వాల్-ఈకి ఒక మొలక దొరుకుతుంది. ఆ మొలకను అది తన నివాస స్థానానికి తీసుకొచ్చి భద్రపరుస్తుంది. తరువాత ఈవ్ అనే మరొక రోబోట్ భూమిపై పరిస్థితులు అంచనా వేసేందుకు పంపబడుతుంది. వాల్--ఈ ఈవ్ తో ప్రేమలో పడుతుంది. మెల్లిగా ఈవ్ కూడా వాల్-ఈను గమనిస్తుంది. వాల్-ఈ ఈవ్ ను తన నివాస స్థలానికి తీసుకు వెళ్ళి మొక్కను చూపించగానే ఈవ్ అంతకు ముందు రూపొందించబడిన ప్రణాళిక ప్రకారం మొక్కను తీసుకొని సుప్తావస్థ లోకి వెళ్ళిపోతుంది. వాల్-ఈకి ఈ విషయం తెలీక విధవిధాలుగా ఈవ్ ను సచేతనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈవ్ ను తీసుకునేందుకు వచ్చిన అంతరిక్షయానంతో పాటుగా వాల్-ఈ కూడా ఆగ్జియం అంతరిక్షయానానికి చేరుకుంటాడు.
ఆగ్జియంలో నివసిస్తున్న మనుషులు అక్కడి సౌకర్యాలకి అలవాటు పడిపోయి బాగా లావైపోతారు, నడక మరిచిపోయి పొడవాటి పడవల్లాంటి మంచాలపై ఒక చోటు నుండి మరోచోటికి వెళుతూంటారు. రోబోట్లే మనుషులకు కావాల్సినవన్ని చేసిపెడుతూ ఉంటాయి. ఆ షిప్ కెప్టెన్ మెక్‌క్రీతో సహా అందరు ఒక విధంగా రోబోట్ల చెప్పుచేతల్లో ఉంటారు. ఆటో అనే కృత్రిమ మేధస్సు మొత్తం షిప్పును మెక్‌క్రీ ఆదేశాల మేరకు నడుపుతూంటుంది. ఈవ్ తెచ్చిన మొక్క గురించిన అవగాహన లేని మెక్‌క్రీ ఆటో ప్రకారం నడుచుకుంటాడు, నిజానికి ఆ మొక్కను షిప్ లో ఒక స్థానంలో ఉంచితే షిప్ తిరిగి భూమికి వస్తుంది, తద్వారా మనుషులు మళ్ళీ భూమిపై జనజీవనం సాగించవచ్చు. ఈ విషయం ఆటోకు నచ్చదు. జిఓ-4 అనే తన సహాయక రోబోట్ తో మొక్కని దొంగిలిస్తుంది ఆటో. ఈవ్ వాల్-ఈ నే మొక్కను కాజేసాడనుకుంటుంది.
మొక్క మాయమవడంతో, అందుకు కారకమైన ఈవ్ ను బాగు చేసేందుకు కార్యశాలకు ఇతర రోబోట్లు తీసుకువెళతాయి. అక్కడ ఈవ్ కు చిత్రహింస జరుగుతోందనుకున్న వాల్-ఈ ఈవ్ ను, ఈవ్ తో పాటు సరిగా పనిచేయని రోబోట్లను విడుదల చేస్తాడు. ఈవ్ ను, వాల్-ఈని రోగ్ రోబోట్స్ గా షిప్ వ్యవస్థ గుర్తించి ప్రచారం చేస్తుంది. వాల్-ఈ పై కోపంతో ఉన్న ఈవ్, వాల్-ఈను తిరిగి పంపివేయాలని నిర్ణయించుకుంటుంది. ఇది జరుగుతుండగా జిఓ-4 మొక్కను తిరిగిపంపే వాహనంలో ఉంచటం చూసి వాల్-ఈ ఆ మొక్కను తిరిగి సంపాదిస్తుంది.
ఈవ్ మొక్కను తిరిగి మెక్‌క్రీ వద్దకు తెస్తుంఫి. అప్పటికే ఈవ్ ద్వారా రికార్డ్ చేసిన భూమి ఉపరితల పరిస్థితులను చూసిన మెక్‌క్రీ భూమికి తిరిగి వెళ్ళాల్సిందేనని నిర్ణయిస్తాడు. ఈ విషయం ఆటోకు నచ్చదు. 2110లో ఆటోకు రహస్యంగా అప్పటి కెప్టెన్ భూమికి తిరిగి వెళ్ళకూడదని చెప్పిన ఆజ్ఞ గురించి ఆటో చెబుతుంది. వెంటనే వాల్-ఈ ను, ఈవ్‌ను నిర్విర్యం చేసి చెత్తగా అంతరిక్షంలోకి వదిలేస్తుంది ఆటో. ఈవ్ తనంతట తాను సచేతనమై వాల్-ఈను కాపాడుతుంది. కానీ మొక్కను కాపాడే క్రమంలో వాల్-ఈ నొక్కుకు పోతుంది. కెప్టెన్ ఆటోను, జిఓ-4 ను నిర్వీర్యం చేసేస్తాడు. ఈవ్ మొక్కను నిర్ణీత స్థానంలో ఉంచి, షిప్ భూమికి వెళ్ళేలా చేస్తుంది.
భూమికి చేరాక ఈవ్ వాల్-ఈను తిరిగి తన ఆకారంలోకి తయారు చేస్తుంది. అప్పటికే వాల్-ఈ జ్ఞప్తిని కోల్పోతుంది. వాల్-ఈకి ఆఖరుగా ఈవ్ ఒక ముద్దిస్తుంది. ఆ ముద్దు వాల్-ఈకు గత స్మృతిని తిరిగి ఇస్తుంది. ఒక పక్క వాల్-ఈ, ఈవ్ ప్రేమలో పడతారు, మరో పక్క మనుషులు భూమిని పునర్వైభవానికి తెచ్చేందుకు, మానవ నాగరికత పెంచేందుకు సిద్ధమవుతారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Brooks Barnes (June 1, 2008). "Disney and Pixar: The Power of the Prenup". The New York Times. Retrieved January 12, 2009.
- ↑ "WALL-E (2008)". Box Office Mojo. Retrieved August 20, 2016.