వాసలీన్ సంఘటన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాసలీన్ సంఘటన, ఇంగ్లాండు బౌలరు జాన్ లీవర్, బంతిని స్వింగ్ లేదా సీమ్‌ చేయగల సామర్థ్యాన్ని పెంచడానికి అక్రమమైన మార్గాలను ఉపయోగించినట్లుగా ఆరోపించబడిన సంఘటన. ఇలాంటి అక్రమ మార్గాల్లో క్రికెట్ బంతి రూపు మార్చడాన్ని 'డాక్టరింగ్' అంటారు. జాన్ లీవర్, బంతికి ఒక వైపున వాసలీన్‌ను రుద్ది, అది స్వింగ్ అయ్యే అవకాశాలను పెంచే ప్రయత్నం చేసాడని ఆరోపణకు గురైన సంఘటన అది.

ఈ సంఘటన చెన్నైలో భారత్ ఇంగ్లాండుల మధ్య 1977 జనవరి 14-19 తేదీల్లో జరిగిన మూడో టెస్టులో జరిగింది. ఢిల్లీ, కోల్‌కతాలో ఘోర పరాజయాలతో భారత్ అప్పటికే సీరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. బాల్ ట్యాంపరింగ్ నిబంధనలు క్రికెట్ బాల్‌కు చెమట, ఉమ్మి (సహజంగా ఉత్పత్తి అయ్యే పదార్థాలు) పూసి, బంతికి ఒక వైపున మెరుపు తెప్పించే ప్రయత్నం చేయడాన్ని అనుమతిస్తాయి. బంతి పరిస్థితిని మార్చే వాసలీన్ పూయడం వంటి ఇతర మార్గాలను నిషేధించాయి.

లీవర్, అతని బౌలింగ్ భాగస్వామి బాబ్ విల్లిస్, ఇద్దరూ నుదుటి నుండి కారిన చెమట కళ్లలో పడడంతో ఇబ్బంది పడ్డారు. ఆ చెమట కళ్ళమీదకు కారకుండా చేసేందుకు కళ్లపైన వాసలీన్‌ పూసిన గాజుగుడ్డ కట్టుకొమ్మని జట్టు ఫిజియోథెరపిస్టు ఒక తెలివితక్కువ సలహా ఇచ్చాడు. ఆటమధ్యలో ఆ గాజుగుడ్డ జారి కళ్ళపైన పడుతూ ఉండడంతో విల్లిస్ దాన్ని తీసేసాడు. చివరికి లీవర్ కూడా దాన్ని తీసివేసి, స్టంపుల దగ్గర నేలపై పెట్టాడు. దాన్ని అంపైర్లు, భారత జట్టు సభ్యులూ గమనించారు. లీవర్ అప్పటికే బంతిని మెరిపించడానికి తన నుదిటి చెమటను ఉపయోగించి ఉన్నాడు. మెరుపు కోసం బంతిని కనుబొమ్మలపై ఉండే చెమటతో రుద్దడం లీవర్‌కు బాగా అలవాటు.

అప్పటికే సీరీస్ కోల్పోయి ఒత్తిడిలో ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ, వాసలీన్ రాసుకున్నది కళ్ళ మీదకు చెమట కారకుండా ఉండటానికేననే వివరణను ఒప్పుకోలేదు. బంతికి మెరుపు ఇచ్చేందుకు లీవర్ అక్రమమైన పద్ధతులను ఉపయోగించాడని అతను వాదించాడు. క్రికెట్ బాల్‌పై జరిపిన పరీక్షల్లో జిడ్డు పదార్థం ఉన్నట్లు తేలింది. వాసలీన్‌ను ఉద్దేశపూర్వకంగా బంతికి పూసారా లేదా అనేది ఆ తరువాత వివాదాస్పదమైంది. ఆ పర్యటనలో అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లలో లీవర్ చూపిన బౌలింగు ప్రదర్శన కూడా ప్రశ్నార్థకమైంది.

మూలాలు[మార్చు]

  • Selvey (December 11, 2008). "The rankling history of our Vaseline Incident". The Guardian.