వికీపీడియా:తెవికీ వార్త/2010-09-24/తెలుగు విక్షనరీ అభివృద్ధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెవికీ వార్త
తెవికీ వార్త
తెలుగు విక్షనరీ అభివృద్ధి

తెలుగు విక్షనరీ అభివృద్ధి

టి.సుజాత, సెప్టెంబర్ 24, 2010
అక్షరాల కూర్పు పదాలు అవుతాయి. పదాల కలయికతో వాక్యాలు ఏర్పడతాయి . వాక్యాల సమూహమే కధలు , నవలలు, పద్యాలు, కావ్యాలు, నాటకాలూ అవుతాయి. భాష అనే వృక్షానికి అక్షరాలు మూలాలయితే పదాలు మొదలు (కాండం). దాని కొమ్మలూ రెమ్మలూ, పూలు, కాయలూ, పండ్లకు ఉపమానంగా కధలూ, కావ్యాలూ, భాషా సంభందిత సకలమూ అని చెప్పుకోవచ్చు. అటువంటి తెలుగు పదాలను గురించి తెలుసుకోవడానికి మనము మామూలుగా నిఘంటువు వాడుతాము. ఆయితే ఆ నిఘంటువుని భాషా పండితులు సంకలనం చేస్తారు. ఈ ఆధునిక కాలంలో, ఆన్లైన్ లో నిఘంటువు నిర్మాణానికి ఎవరైన పదాలను చేకూర్చటం, మార్చటానికి సహాయపడేవిధంగా వుండేదే విక్షనరీ. తెలుగు విక్షనరీ అన్నది వీకీపీడియా సోదర ప్రాజెక్ట్. వీకీ (ఎవరైనా త్వరగా మార్పులు చేయగలగటం) మరియు డిక్షనరీ (నిఘంటువు) ల కలయికతో విక్షనరీ అయ్యింది. దీనిలో తెలుగు నుండి తెలుగులోకి, తెలుగు పదాలకు ఇతర భాషల సమానార్థపదాల లింకులు మరియు ఇంగ్లీషు నుండి తెలుగు పదాల సూచికలు కలిగివుండే బహు భాష నిఘంటువు విక్షనరీ.
తెలుగు విక్షనరీ పేజి - అమ్మ
తెలుగు విక్షనరీలో పదాల పేజీని పరిశీలిస్తే మీకు వివిధ విభాగాలు కనపడతాయి. పక్కన వున్న బొమ్మ పై నొక్కి కాని లేక విక్షనరీ పక్కపెట్టెలో అమ్మ లింకును నొక్కి చూడండి. విక్షనరీ గురించి మరింత చర్చించే ముందు, నేను ఏ విధంగా విక్షనరీ లో ప్రవేశించింది ముచ్చటిస్తాను.

నావిక్షనరీ ప్రవేశం

నేను సాధారణ గృహిణిని. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఇదీ అదీ అని తారతమ్యం లేకుండా ఆసక్తి కరమైనవి, లోకజ్ఞానం కలిగించేవి, విషయ ప్రాధాన్యం ఉన్నవీ అన్నీ చదవడం అలవాటే. కంప్యూటర్ గురించి ఇంట్లో మా అబ్బాయి వద్ద తెలుసుకున్నాను. అంతర్జాలంలో విహరించడం బాగా అలవాటు అయింది. కొత్త విషయాలు తెలుసుకునే ఆసక్తి నన్ను వీకీ పీడియాలో ప్రవేశించేలా చేసింది. మొదట్లో ఆంగ్లవీకీ చదవడంతో ఆరంభించి తరువాత తెలుగు వికీపీడియా (తెవీకీ) ఉందని గ్రహించాను. తెవీకీని చదవడం ఆరంభించాను. ఆ తరువాత ఎర్ర లింకులను నొక్కి చూసి అక్కడ సమాచారం ఏమీ లేక పోవడం చూసి నిరాశ కలిగింది. కాని ఎర్ర లింకులు ఉన్న చోట ఎవరైనా తనకు తెలిసింది వ్రాయవచ్చని గ్రహించాను. ఎవరైనా వ్రాయచ్చు అన్న విషయం నన్ను సంభ్రమ పరచింది. కాని ఏమి వ్రాయాలో ఎలా వ్రాయాలని సందిగ్ధంలో పడ్డాను. అందుకే చిన్న విషయాలైన జాతీయాలు వ్రాశాను. నేను వ్రాసింది పది మంది చదువుతారన్న విషయం నన్ను ఆనందపరచింది. ఆ తరువాత సామెతలు, అలా అలా చిన్న చిన్నగా వ్రాస్తూనే తెవీకీలో ఎలా వ్రాయాలో అన్న విషయం కొంత అర్ధం చేసుకున్నాను.

ఆ సమయంలో (2006) నేరుగా తెలుగులో వ్రాసే వీలు లేదు. లేఖినిని ఉపయోగించి వ్రాసేదానిని. అప్పటి వరకు నేను సభ్యత్వం తీసుకోవాలని అనుకో లేదు. తరవాత చదువరిగారి పేజీలో సేకరించి పెట్టుకున్న ఆంగ్ల పదాలు కొన్నింటికి తెలుగు అనువాదం వ్రాసాను. అది చూసి చదువరి గారు నన్ను విక్షనరీ సభ్యత్వం తీసుకొని అక్కడ పని కొనసాగించమని సూచించారు. సభ్యత్వం ఎలా తీసుకోవాలో ఆయనను అడిగి తెలుసుకున్నాను. తరువాత విక్షనరీ సభ్యత్వం తీసుకున్నాను.చాలా ఆసక్తిగా కొంత కాలం అక్కడ నా పని కొనసాగించాను. వైఙాసత్య గారి ప్రతిపాదనతో వారి సహాయంతో నిర్వాహకత్వం పొందాను.

విక్షనరీ అభివృద్ధి

నేను విక్షనరీలో సభ్యత్వం తీసుకోవడానికి ముందే చదువరి గారు, వైజా సత్య గారు,మాకినేని ప్రదీపు గారు విక్షనరీని ప్రారంభించి కొంత కృషి చేసారు. వారంతా విక్షనరీలో చేర్చ వలసిన పదాలకు కావలసిన మూసలను తయారు చేయడంలో ప్రయత్నాలుచేసి వారిలో వారు చర్చలు చేసి మూసకు ఒక రూపం తీసుకు వచ్చారు. మొదటి పేజీకి ఒక రూపం తీసుకు వచ్చి సభ్యులకు పని చేయడానికి తగిన సదుపాయం కలిగించారు. అంతే కాదు మూస విషయంలోనూ నాకు కావలసిన మార్పులు చేసుకోవచ్చని సూచలు ఇచ్చారు. వారి సహకారంతో విక్షనరీలో నాకు కావలసిన మార్పులు తీసుకు వచ్చి నా పని కొనసాగించాను. పదివేల దిద్దుబాట్లు దాటి పయనించాను. ఆ సందర్భంగా వైజా సత్యగారు విక్షనరీలో నా కృషిని గుర్తించి పతకాన్ని ఇచ్చి అభినందించారు.

మాకినేని ప్రదీపు గారు విక్షనరీలో చేసిన కృషి మరువలేనిది. బాటును ఉపయోగించి ఆయన ఆంగ్లపదాల పేజీలను విక్షనరీకి చేర్చి విక్షనరీని మరింత సుసంపన్నం చేసారు. ప్రచంఢ మారుతంలా ఆయన చేసిన కృషి విక్షనరీకి ఎంతో ఉపయుక్తం అయింది. ప్రస్తుతం దాదాపు అనేక ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు విక్షనరీలో లభ్యం అవుతాయి. ఈ సందర్భంలో వైజా సత్య గారు, మాటల బాబు గారు, మాకినేని ప్రదీపు గారి కృషికి గుర్తింపుగా పతకాలను ఇచ్చి సత్కరించారు.అన్వేషి గారు విక్షనరీ మీద శ్రద్ధ చూపి పని చేసిన వారిలో ఒకరు. అ అప్పటి వరకు ఒక్కొక్క అక్షరానికి పేజీ సృష్టించిన నేను వారి సూచనతో ఆ పని కొంత ఆపి వేసాను. కొన్ని లక్షల పదాలు ఉన్న తెలుగు భాషకు పట్టికలు అవసరం లేదని నాకూ అనిపించింది. 2007లో చురుకుగా అభివృద్ధి చెందిన విక్షనరీ తరువాత కాలంలో కొంత వెనుకబడింది.అందుకు కారణం అనుభవం ఉన్న సభ్యులు విక్షనరీ మీద శ్రద్ధ తగ్గించి తెవీకీ మీద శ్రద్ధ చూపడం. మిగిలిన సభ్యులు కొంత కృషి సాగిస్తున్నా అనుభవం కలిగిన సభ్యుల మార్గదర్శకత్వం కొరవడడం ఒక కారణమే.

సాంకేతికం

ప్రారంభంలో నేను ముందుగా తయారై వున్నపేజీలో దిద్దుబాట్లు చేసాను. తరువాత దిద్దుబాట్లు జరిగిన పేజీలను కాపీ చేసి కొత్త పదంలో అతికించి కొన్ని మార్పులు చేసి పేజీలను తయారు చేసాను. తరవాత విక్షనరీ మూస ఉందని తెలుసుకుని దాని సాయంతో పేజీలను సృష్టించాను. కొత్త పదం సృష్టించడానికి అక్షర క్రమంలో లింకులు తయారు చేసి దానిలో పదాల లింకులు తయారు చేసి దాని సాయంతో పేజీని సృష్టించాను. అందుకే అక్షరమాల అనే లింకును తయారు చేసాను. ఆ లింకుని అన్ని అక్షరాల పేజీలలో ఉంచాను. వాటి సాయంతో అనేక పదాలకు మొదటి పేజీకి వెళ్ళ కుండా కావలసిన పదానికి మార్పులు చేస్తూ వచ్చాను. కొత్త పదం సష్టించడానికి మూస అందు అందరికీ అందు బాటులో లేదు. తరువాత వైజా సత్య గారి సభ్య పేజీలో మూస ఉండటం గమనించాను. అన్వేషి గారు కొత్తగా మూసకు ఒక పేజీ సృష్టించారు. తరువాత అక్కడ నూతన పదాలను సృష్టించాను. తెలుగులో వ్రాయగలగడంతో విక్షనరీలో దిద్దుబాట్లచేయడం సులభతరం అయింది.

విక్షనరీలో మార్పులు తీసుకురావడానికి నాకు ఇచ్చిన అనుమతి వలన సౌలభ్యం కొరకు నేను పదాల సృష్టిలో కొన్ని మార్పులతో మూసలను సృష్టించాను. ఉదాహరణగా కొత్తపదాల మూస మాదిరి నామవాచకము, సర్వనామము మొదలైన వాటికి ప్రత్యేక మూసలు ఉన్నాయి. నా అన్న లింకులో నామవాచక పదాలను వ్రాయ వచ్చు. ఈ మూసల వలన దిద్దుబాట్ల సమయం కొంత ఆదా చేయవచ్చు. ఇలా సాంకేతికంగా ఇతరులను చూసి నేర్చుకుని ముందుకు సాగాను.

విక్షనరీ వాడే విధానం

ముందుగా మీకు కావలసిన పదం మొదటి పేజీలోని అన్వేషణ లేక వెతుకు పెట్టె వాడి వెతకండి. ఆ పదానికి పేజీ ముందే సృష్టించబడి ఉంటే ఆ పదము మీకు నీలిరంగులో వుంటుంది. లేదంటే ఎర్ర రంగు లో కనపడే పదాన్ని నొక్కినపుడు కొత్త పేజీ సృష్టించాలా అనే సందేశం కనిపిస్తుంది. పదం వ్యాసంలో వున్న, మిగతా పేజీల వివరాలు మీకు కనబడతాయి. పదం వుంటే ఆ పదం పేజీకి వెళ్లి, మీకు కావలసిన సమాచారం చూసుకొని, మీరు మార్చాలనుకుంటే మార్చండి.

పదం లేకపోతే, మొదటి పేజీలో ప్రారంభ మూసతో కొత్తపదాల సృష్టి అనే విభాగంలో ( పదాల మూస మూల పేజి )మీరు సృష్టించ తలచిన పదాన్ని వ్రాసి ప్రక్కన ఉన్న సృష్టించు అనే బొత్తాము నొక్కండి. మీరనుకున్న పదానికి ప్రారంభ మూసతో సహా పేజీ సిద్ధం ఔతుంది. మీరు మార్పులు చేసి భద్రపరచండి. మరిన్ని వివరాలకి తెవికీలో విక్షనరీ వ్యాసం చూడండి.

పదాల చేర్చుటకు నాకు ఉత్తేజాన్నిచ్చిన సంగతులు

మనం స్వంతంగా చేర్చటానికి, మనకు తెలిసిన పదాలు విన్నవి, చదివినవి వ్రాస్తాము. నా మటుకు నేను వేమన పద్యాలను ఉదహరించడానికి పదాలను సష్టించాను. బాగా గుర్తు ఉన్న చలన చిత్రాలను ఉదహరించడానికి కొన్ని పదాలు వ్రాసాను. ఆంగ్లపదాల కొరకు కొన్ని పదాలు వ్రాసాను. తమిళ పదాల కొరకు కొన్ని పదాలను వ్రాసాను. వైద్యం, చెట్లు, ఆహారపదార్ధాలు, పక్షులు, పండ్లు, భావాలు ఇలా ఒక్కో వర్గానికి ఆలోచిస్తూ పదాలను ఎక్కుగా వ్రాసాను. జాతీయాలకు, సామెతలకు, నీతి వాక్యాలకు అనుగుణంగా పదాలను వ్రాసి వాటిని పద ప్రయోగం విభాగంలో ఉదహరించ వచ్చు. ఇలా ఎవరికి వారు ఊహించి వ్రాయ వచ్చు. పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, చంధస్సుతో కూడిన కఠినమైన కొన్ని పద్యాలు, చారిత్రక, జానపద సాహిత్యం, నాటకాలు మొదలైన వాటిలో ప్రస్తుతం మరుగున పడినవి అయినా మనకు చక్కగా అర్ధం కాగలిగిన మాటలు లభించ వచ్చు. వాటిని పదప్రయోగాలలో ఉదహరించ వచ్చు. ఉదాహరణకు అన్నమయ్య కీర్తనలలో సరికొత్తగా అనిపించే ఆకాలపు వ్యవహారిక పదాలు ఆ ప్రాంతపు యాసతో కూడిన పదాలు లభిస్తాయి. ఇలా అనేక సాహిత్యాలలో అనేక పదాలు లభించ వచ్చు. వాటిని ఉదహరిస్తూ విక్షనరీలో పదిల పరచవచ్చు.

భవిష్యత్లో చేయవలసిన పని

ఇంగ్లీషు విక్షనరీలో 2,017,991 పేజీలుండగా, మన తెలుగు విక్షనరీలో 34,751 పదాలు మాత్రమే వున్నాయి. సాధారణ వాడుకకు ఈ మాత్రము పదకోశం సరిపోయినా, ఆధునిక కాలంలో ప్రతిరోజు కొత్తపదాలు సృష్టించబడుచున్నప్పుడు, వాటిని అందరికి తెలియచెప్పటానికి విక్షనరీ అభివృద్ధి చేయవలసి వుంది.

జానపదుల యాసతో కూడిన పదాలు సాధారణ వ్యవహార పదాలకు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే అనేక భాషలకు ఆలవాలమైన మన దేశంలో భాషలు వివిధ రూపాలను సంతరించుకుంటూ ఉంటాయి. మన తెలుగును పరిశీలిస్తే, ఒరిస్సా సరిహద్దులో ఉండే వాళ్ళది, తమిళ నాడు సరిహద్దులలో ఉండే వారిది,కర్నాటక సరిహద్దులలో ఉండే వారిది రకరకాల యాసలు. అలాగే వృత్తి సంబంధిత, కుల సంబంధిత యాసలు రకరకాలున్నాయి. మన కోస్తావారిలో నెల్లూరు , ఒంగోలు, తెనాలి , ఉభయ గోదావరి ప్రాంతాలు, సీమ ప్రాంతాలు , తెలంగాణా ప్రాంతపు పదాలు అనేకం. ఇలా వివిధ పదాలు, వాటి యాసలు, నుడికారాలు కలిగిన తెలుగు పదాలను ఒక చోట నిక్షిప్తం చేయాల్సివుంది. ఈ పని తెలుగు అకాడమీ వారు కొంత చేసారు, వారి నుండి అనుమతులు తెచ్చుకుని, మరింతమందికి అందుబాటులోకి తేవాల్సిన అవసరం వుంది. ఇదేకాక, ఇప్పటివరకు బాట్ ద్వారా చేర్చిన పదాలలో కొన్ని తనిఖీ, శుద్ధి చేయవలసివుంది.

ముగింపు

విక్షనరీ అంటే ఏమిటీ, పదాల పేజీలు ఎలా వుంటాయి, సులభంగా ఎలా మనం తోడ్పడవచ్చు, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వివరించాను. మీరందరూ వీలుచేసుకొని, విక్షనరీకి మరింత అభివృద్ధికి తోడ్పాటు అందచేస్తారు కదూ. చివరిగా విక్షనరీలో నాకు చక్కని సహకారం అందించి నన్ను ప్రోత్సహించిన చదువరి గారికి,వైఙాసత్య గారికి,అన్వేషి గారికి, మాటలబాబు,విశ్వనాధ్ , మాకినేని ప్రదీపు గారికి ఇంకా ఇతర సభ్యులకు నా ధన్యవాదాలు

+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి

సుజాత గారికి నమస్కారములు. మీరు వ్రాసిన వ్యాసము చాలా బాగున్నది. మీరు తెలుగు విక్షనరీ కి, వికీపీడియా కి చేస్తున్న కృషి యెంతగానో అభినందించ దగినది. ముందు ముందు ఇదే విధముగా మరింతగా మంచి మంచి రచనలు కొనసాగినంచ గలరని ఆశిస్తున్నాను. అ భగవంతుని ఆశీస్సులు యెల్లప్పుడూ వుండాలని కోరుకుంటూ....... మీ భవదీయుడు, జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:12, 25 సెప్టెంబర్ 2010 (UTC)

  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ మీ అభినంనలకు కృతజ్ఞతలు. మీ వంటి వారి ప్రోత్సాహంతో ఇంకా ఇంకా తేవికీలో ఎంతో కొంత వ్రాయగననని అనుకుంటున్నాను.--t.sujatha 06:50, 25 సెప్టెంబర్ 2010 (UTC)

మీ సదాశయానికి ఉడతా భక్తి గా మావంతు తోడ్పాటు నందించుటకు ప్రయత్నిస్తాము. ़

వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు

విక్షనరీ లోని వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు అన్ని పుటలు తనిఖీ ప్రాధమిక స్థాయిలో ఈ రోజున అనగా ది.10.10.2010 తారీఖున పూర్తి అయినది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:53, 10 అక్టోబర్ 2010 (UTC)

  • ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేసిన మీ కృషికి ధన్య వాదాలు జె.వి.ఆర్.కె ప్రసాదు గారూ. అలాగే వీలైతే అనువాదాలూ కొత్తపదాలూ కూడా చేర్చుతూ విక్షనరీ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను.--t.sujatha 03:12, 11 అక్టోబర్ 2010 (UTC)
  • పదాల పట్టికలో కొన్ని తప్పుగా పఢ్డట్టున్నాయి. తొలగిస్తే బాగుంటుందేమో. ఉదాహరణకు అంకిచనుడు, అంగసౌష్తవము మొదలయినవి.-డి.వి.ఎన్.శర్మ.
  • డి.వి.ఎన్.శర్మ చేసిన సూచన సబబైనదే కనుక సరి చెయ్యడానికి ప్రత్నిస్తాను.t.sujatha 15:41, 16 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజి గురించి మీ సలహాలు చందాదారుడవ్వండి పాతవి