వికీపీడియా:సమావేశం/కర్ణాటక సంగీత కృతుల స్వేచ్ఛా హక్కుల విడుదల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదె ఓ మనసా?
నిధి చాల సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగ పల్కు మనసా

2014 మే నెలలో తాడేపల్లిగూడెం త్యాగరాజ గానసభ వారు నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో సరైన అనుమతులు తీసుకుని రికార్డ్ చేసిన కర్ణాటక సంగీత కృతులను స్వేచ్ఛా లైసెన్స్‌లతో పునర్విడుదల చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కార్యక్రమంలో భాగంగా సంగీత విద్వాంసులకు కాపీహక్కుల గురించీ, స్వేచ్చాహక్కుల ద్వారా సంగీతాన్ని విడుదల చేయడం యొక్క ప్రాధాన్యతను గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తారు. 30కి పైగా కర్ణాటక సంగీత కృతులు, రాగాలాపనలు స్వేచ్ఛాలైసెన్సులతో విడుదల చేయనున్నాము.

వేదిక-సమయం[మార్చు]

కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మండల పరిషత్తు సంఘభవనంలో ఆగస్టు 8, 2014న మధ్యాహ్నం 3గంటల నుంచి కార్యక్రమం నిర్వహించనున్నాం.

కార్యక్రమ ప్రణాళిక[మార్చు]

స్వేచ్ఛా నకలు హక్కుల విడుదల[మార్చు]

మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మొదట ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తారు. అనంతరం కార్యక్రమానికి అధ్యక్షత వహించే వ్యక్తి ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు సభనుద్దేశించి మాట్లాడతారు. ముఖ్య అతిథులు పాలగిరి రామకృష్ణారెడ్డి, కంచికామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు సరస్వతుల హనుమంతరావు, నిర్వాహకులు సూరంపూడి పవన్ సంతోష్, బి.కె.విశ్వనాథ్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.45 నిమిషాలకు కాపీహక్కుదారు, వికీపీడియన్ సూరంపూడి మీనా గాయత్రి కాపీహక్కులను స్వేచ్ఛా నకలు హక్కులలోకి మార్చేందుకు అవసరమైన లీగల్ డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు చేతులమీదుగా సంబంధిత గీతాలు, ఆలాపనల ఆడియో సీడీలను స్వేచ్ఛా నకలు హక్కులలో విడుదల చేస్తారు. అనంతరం మాణిక్యాలరావు, పాలగిరి రామకృష్ణారెడ్డి లాంఛనంగా కొన్ని ఆడియో ఫైళ్లను కామన్స్‌లోకి తగిన లైసెన్సులతో చేరుస్తారు. ఆపైన పది నిమిషాల పాటు తేనీటి విరామం ఉంటుంది.

కాపీరైట్ల గురించి అవగాహన సదస్సు[మార్చు]

సాయంత్రం 4.30 నిమిషాల నుంచి సంప్రదాయ కర్ణాటక సంగీతం, భజన గీతాలు, నాటక సంగీతం వంటి వివిధ శాఖలకు చెందిన స్థానిక కళాకారులకు కాపీహక్కుల గురించి ప్రాథమికమైన అవగాహన కలిగినచేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తాము. కార్యక్రమంలో భాగంగా సూరంపూడి పవన్ సంతోష్ కాపీహక్కులు ఎలా ఎవరికి ఎన్ని సంవత్సరాల పాటు చెల్లుతాయి? ఆ కాపీహక్కులను స్వేచ్ఛా నకలు హక్కులలో మార్చడం వల్ల కళాకారులకు కలిగే ఉపయోగం, సంగీతానికి జరిగే మేలు వంటి మౌలికమైన కాపీహక్కుల వివరాలను గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తారు. కార్యక్రమంలో స్థానిక బార్‌కౌన్సిల్ సభ్యులు అనంతరం కళాకారులకు కాపీహక్కుల గురించి ఉన్న లోతైన సందేహాలకు సమాధానాలు ఇస్తారు.

నేపథ్యం[మార్చు]

కర్ణాటక సంగీతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషీయుల ఉమ్మడి సొత్తు. వీనులవిందైన కర్ణాటక సంగీత కృతులను భాషాభేదం లేకుండా దక్షిణ భారతీయులందరూ ఆదరిస్తుంటారు. ఐతే కర్ణాటక సంగీతం, రాగాలు, విద్వాంసులు తదితరాల గురించి మంచి సమాచారంతో పేజీలు ఉన్నాయి. ఐతే ఆ వివరాలను పాఠకులు అర్థంచేసుకునేందుకు వీలుగా సంబంధిత ఆడియో క్లిప్‌లు మాత్రం లేవు. ఈ కొరత అన్ని భాషల కర్ణాటక సంగీత పేజీల ఒక లోటుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక సంగీతకారులతో ఉన్న పరిచయాలను వినియోగించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. గత నెలలో తాడేపల్లిగూడెం త్యాగరాజ గానసభ నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ముందుగా కళాకారుల అనుమతినీ, నిర్వాహకుల అంగీకారాన్ని రికార్డెడ్‌గా స్వీకరించాము. ఆ కచేరీలను పవన్ సంతోష్, మీనా గాయత్రి రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక సంగీత కృతుల స్వేచ్ఛా నకలు హక్కుల విడుదల కార్యక్రమం జరుగుతోంది.

పాల్గొనే సభ్యులు[మార్చు]

తప్పకుండా పాల్గొనేవారు[మార్చు]

తప్పకుండా పాల్గొనే వికీపీడియన్లు ఈ కింద సంతకం చేయగలరు:

పాల్గొనే ప్రయత్నం చేసేవారు[మార్చు]

వీలున్నంతవరకూ పాల్గొనే ప్రయత్నం చేస్తామనే సభ్యులు ఈ కింద సంతకం చేయగలరు:

సంప్రదించేందుకు[మార్చు]

కార్యక్రమానికి హాజరయ్యేవారు అవసరమైతే సంప్రదించాల్సిన మెయిల్ ఐడీ pavansanthosh.s@gmail.com

నివేదిక[మార్చు]

పూర్వరంగం[మార్చు]

కార్యక్రమం[మార్చు]

కాపీహక్కుల విడుదల[మార్చు]

కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మండల పరిషత్తు సంఘభవనంలో ఆగస్టు 8, 2014న మధ్యాహ్నం 3గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ఆ సమయానికి తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన కళా, సంగీత, సాంస్కృతిక, రాజకీయ ప్రముఖులు కార్యక్రమ వేదికకు విచ్చేశారు. కార్యక్రమాన్ని నిర్వాహకుడు పవన్ సంతోష్ ప్రారంభించి అతిథులను ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచికామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు సరస్వతుల హనుమంతరావు మాట్లాడుతూ "సంగీత విద్వాంసులు సాధారణంగా కాపీహక్కులు విడిచిపెట్టడాన్ని, స్వేచ్ఛగా అందరూ వినియోగించుకోవడాన్ని అంగీకరించరని, ఐతే వికీపీడియన్లుగా గాయత్రి, సంతోష్ స్వేచ్ఛాహక్కుల్లో కొన్ని కృతులు విడిచిపెట్టడం వల్ల కర్ణాటక సంగీతానికి ప్రాచుర్యం పరంగా, విజ్ఞాన సర్వస్వ సమాచార అభివృద్ధి పరంగా జరిగే మేలును వివరించిన పద్ధతి వల్ల విద్వాంసులు తేలికగా అంగీకరించారని" తెలిపారు. మరో ముఖ్య అతిథి కంచికామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు అమ్మనమంచి బలరామశాస్త్రి మాట్లాడుతూ "ఏ సాంకేతిక ఉపకరణాలు విరివిగా అందుబాటులో లేని కాలం నుంచి మాట్లాడుతున్నానని, ఇప్పుడు కార్యరంగం ఇంటర్నెట్‌కి మారిపోయిందని, కర్ణాటక సంగీతాన్ని ఇంటర్నెట్ ద్వారా విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరగాలని" ఆకాంక్షించారు. అనంతరం కాపీహక్కులు కలిగివున్న మీనా గాయత్రి ఆడియో ఫైళ్ళను CC-BY-SA 4.0 లైసెన్సులో విడుదల చేసేందుకు సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. లాంఛనంగా ఆ కాపీహక్కులు విడుదలైన ఆడియోల సీడీలను తాడేపల్లిగూడెం పట్టణ ప్రథమ పౌరుడు బొలిశెట్టి శ్రీనివాస్‌కు, రాజమండ్రి హరికథ కళాశాల ప్రిన్సిపాల్, ప్రముఖ హరికథకురాలు నేమాని నాగలక్ష్మి, కర్ణాటక సంగీత విద్వాంసులు అమ్మనమంచి బలరామశాస్త్రి, సరస్వతుల హనుమంతరావులకు పవన్ సంతోష్, మీనా గాయత్రి అందజేశారు. కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన విద్వాంసులు శృతిరవళి ఫోన్ ద్వారా సందేశం తెలిపారు

అవగాహన సదస్సు[మార్చు]

బ్యానర్

కార్యక్రమానికి హరికథ, కర్ణాటక సంగీతం మొదలైన విభాగాలకు చెందిన గాత్ర, వాద్యకళాకారులు విచ్చేశారు. వారికి పవన్ సంతోష్ కాపీహక్కుల గురించిన అవగాహన కలగజేశారు. ముందుగా కాపీహక్కుల గురించి తయారుచేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సంతోష్ కాపీహక్కుల వివరణలు మౌలికంగా వివరించారు. అనంతరం ప్రత్యేకించి సంగీత విద్వాంసుల పరంగా కాపీహక్కులు ఎలా పనిచేస్తాయన్న విషయంపై అవగాహన అందించారు. ఈ అవగాహన సదస్సులో కొందరు కళాకారులు వేసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆపైన తాము ఆలపించే కృతుల్లో కొన్నిటిని సీసీ బై ఎస్‌ఎ లైసెన్స్‌లో విడుదలచేయడం ద్వారా కలిగే వ్యక్తిగత, విశాల ప్రయోజనాలు వివరించారు. వ్యక్తిగత స్థాయిలో పేరుప్రఖ్యాతులు పెరగడమే కాక కళాకారునికి ఉండే ఆత్మసంతృప్తి కలుగుతుందని, విశాల ప్రాతిపదికన కర్ణాటక సంగీతంలో ప్రాచుర్యం కోల్పోతున్న కొన్ని అపురూపమైన కీర్తనల స్వరవిన్యాసం శాశ్వతంగా పరిరక్షించవచ్చన్నారు. గతంలో అన్నమాచార్యులు చేసిన కృతులు రాగిరేకులపై చెక్కించడంతో మిగిలాయి కానీ వాటిని ఎలా పాడేవారు, నిర్దిష్టమైన స్వరం ఏమిటి అన్న వివరాలు కాలం ఉధృతిలో కోల్పోవడంతో 20వ శతాబ్దిలో అనేకమైన అన్నమయ్య కీర్తనలను ఆయన నిర్దేశించిన రాగంలోనే తిరిగి విద్వాంసులు స్వరం చేయాల్సివచ్చిందని పేర్కొన్నారు. గురుశిష్య సంప్రదాయం వల్లనూ, అన్నమయ్య తర్వాత వందలయేళ్ల ఇటీవలి వ్యక్తులు కావడంతోనూ త్యాగరాజ, ముత్తుస్వామి, శ్యామశాస్త్రి, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, ఊత్తుకుడి వంటివారి కృతులు ఎలా స్వరం చేశారో తెలుస్తున్నా భవిష్యత్ కాలంలో అనూహ్యమైన సాంస్కృతిక మార్పులు చోటుచేసుకుంటూ ఉండడంతో దురదృష్టవశాత్తూ లుప్తమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో తరతరాలకు ఈ సంగీత వాహిని సాగాలంటే విద్వాంసులు వీలువెంబడి కొన్ని కృతులు సీసీ బై ఎస్‌ఎ లైసెన్స్‌లో విడుదల చేయాలని పేర్కొన్నారు.

వికీప్రాజెక్టుల్లో ఆడియోల ఎక్కింపు[మార్చు]

  • రికార్డ్ చేసిన ఆడియోలను OGG ఫార్మాట్‌లోకి మార్చారు. కచేరీగా రికార్డ్ చేసిన ఆడియో ఫైల్స్‌ని విడివిడి కీర్తనలు, ఆలాపనలుగా కట్ చేశారు.
  • ఆయా కీర్తనలను విడివిడిగా గాయకులు, వాగ్గేయకారుల వివరాలు ఇస్తూ ఫైల్‌ని వికీమీడియా కామన్స్‌కు ఎక్కించారు.
  • అనంతరం తెలుగు వికీపీడియాలోని వాగ్గేయకారులు, కీర్తనల పేజీల్లో, వికీసోర్స్‌లో సంబంధిత కీర్తనల పేజీలలో ఈ ఆడియో ఫైల్స్ ఉదహరిస్తూ చేర్చారు. ఉదాహరణ:అన్నమాచార్యులు

భవిష్యత్ కార్యకలాపాలు[మార్చు]

  • ఈ ఫైల్స్ ఎక్కింపు పూర్తిచేసి, కర్ణాటక సంగీతానికి సంబంధించిన సాంస్కృతిక వారసత్వం పంచుకునే తమిళ, మలయాళ, కన్నడ భాషలకు సంబంధించిన వికీపీడియాల్లోనే కాక ఆంగ్లం, హిందీ వంటి భాషల వికీపీడియాల్లో కూడా తత్సంబంధిత పేజీల్లో ఈ ఆడియో ఫైల్స్ చేర్చడం.
  • కంటెంట్, అవగాహన వంటి విషయాలలో సత్ఫలితాలు అందించిన ఈ ప్రయత్నాన్ని పూర్తిస్థాయి ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, భవిష్యత్తులో దక్షిణ భారతీయ భాషల వికీపీడియాలను కర్ణాటక సంగీత ఆడియోలతో సుసంపన్నం చేయడం.

బయటి లింకులు[మార్చు]