సంబెట గురవరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంబెట గురవరాజు విజయనగరానికి సామంతునిగా సిద్ధవటం ప్రాంతాన్ని పరిపాలించిన సామంతరాజు. ధనాశతో ఆయన స్వంత ప్రజలపై ఘోరాలు చేసిన వ్యక్తి. స్త్రీలను కూడా అవమానించి ప్రజలను ధనానికై పీడించడంతో విజయనగర చక్రవర్తి వీర నరసింహదేవరాయలు ఆయనపై తన సైన్యాన్ని పంపి పట్టించి చంపించారు.[1]

పరిపాలన

[మార్చు]

విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజుగా సంబెట గురవరాజు సిద్ధవటం సీమను పరిపాలించారు. ఆయన చాలాసంవత్సరాలుగా జీవించి పరిపాలన చేసినందువల్ల ఆయనను తాత గురవరాజు అని కూడా పిలిచేవాడుక ఉండేది. ఆయన ప్రభుత్వంలో ధనాశతో ద్రవ్యాకర్షణ కొరకు ప్రజలను పన్నులకై పీడించడం చేసేవాడు. ఈ పీడించడంలో అనేక విధాలు ఉండి ఉంటాయి కానీ స్త్రీల స్తనాలకు చిరతలు పట్టించడమనే అత్యంత అసభ్యమైన, క్రూరమైన చర్య కైఫీయత్తులకెక్కి చరిత్రలో నిలిచిపోయింది.[1]

చిరతలు పట్టించడం

[మార్చు]

సంబెట గురవరాజు డబ్బు ఇవ్వని వారికి చేయించే క్రౌర్యాల్లోకెల్లా అత్యంత ఘోరమైనది, అసభ్యకరమైనదీ స్తనాలకు చిరతలు పట్టించడం. స్త్రీల గౌరవానికి భంగం కలిగించేవిధంగా ఈ చర్య ఉండేది. రెండు కర్రలను ఒక పక్క కొసలు చేర్చికట్టి రెండవ ప్రక్క కొసలను విడదీసి రెండు చేతులతో పట్టుకుని ఆ కర్రసందున అడకత్తెరలో నొక్కినట్టు నొక్కడాన్నే చిరతలు పట్టించడం అంటారు. ఈ దారుణాన్ని అమాయకురాళ్ళైన ఇళ్ళాళ్ళకు, యువతులకు కేవలం వారి భర్త లేదా తండ్రి రాజ్యానికి కట్టాల్సిన పన్ను లేదా మరే విధమైన ధనం ఇవ్వలేదన్న ఏకైక కారణంతో చేయించడం మరీ నీచంగా పరిగణింపబడింది.[1]

పతనం

[మార్చు]

సంబెట గురవరాజు తన ప్రజలను ద్రవ్యాశతో పీడించడం, డబ్బురాబట్టేందుకు అత్యంత నీచమైన శిక్షలు వేయడం ఆనాటి చక్రవర్తులైన విజయనగరం రాయల వరకూ వెళ్ళలేదు. ఐతే సంచారం చేసుకుంటూ, ప్రదర్శనలిచ్చే కూచిపూడి భాగవతులైన బ్రాహ్మణులు సిద్ధవటం ప్రాంతానికి ప్రదర్శనల నిమిత్తం వచ్చారు. ఆ సమయంలోనే స్తనాలకు చిరతలు పట్టించడమనే నీచకార్యాన్ని చూడడంతో వారు వెంటనే ఆ ప్రాంతం నుంచి లేచిపోయారు. విజయనగరానికి వెళ్ళి అక్కడ చక్రవర్తి ముందు తమ ప్రదర్శన చేసేందుకు అవకాశం కోరి పొందారు. కూచిపూడి భాగవతులు ప్రదర్శన చేస్తూ నడుమ ఉపాంగంగా గురవరాజు గురించిన వేషం ఆడారు. దానిలో సంబెట గురవరాజు వేషం, ఆయన యిద్దరు బంట్రోతుల వేషం, ఓ స్త్రీ వేషం వేసి స్త్రీ స్తనాలకు చిరతలు పట్టించి సొమ్ముకట్టించుకొమ్మని గురవరాజు తహశ్శీలు ఇచ్చినట్టు మాత్రం ప్రదర్శించారు. మిగతా ప్రదర్శన అయ్యాకా ఈ గురవరాజు విషయమేమిటని వీరనరసింహరాయలు తన ఉద్యోగులను అడుగగా కూచిపూడి భాగవతులు తమకు తెలిపిన గురవరాజు ఘోరకార్యాలను వారు వివరించారు. దీనిపై కోపించిన వీరనరసింహరాయలు విషయాన్ని చారులతో నిర్ధారించుకుని వెనువెంటనే గురవరాజుకు మరణదండన వేసి, అతనిపై యుద్ధానికి ఓ సైన్యాన్ని సిద్ధంచేసి అమలుచేయాల్సిందిగా సేనానాయకునికి ఆనతిచ్చారు.[1]

యుద్ధం

[మార్చు]

గురవరాజు మరణదండన అమలుచేసేందుకు అతనిని పట్టి పతనం చేసేందుకు గాను యుద్ధానికి రాయలు ఇసుమాల్ ఖాన్ అనే సర్దార్ ను నియమించారు. మహారాయలు ఇచ్చిన తాంబూలాన్ని స్వీకరించి ఇసుమాల్ ఖాన్ ‘‘సంబెట గురవరాజు తల తీసుకుని వస్తానని’’ ప్రతిన చేసి ససైన్యంగా బయల్దేరాడు. గురవరాజు కోటకు పశ్చిమంగా ఉన్న బండ్లకనుమపై యుద్ధం జరిగింది. కనుమపైనున్న కావలిస్థలాన్ని చిత్తుచేసి, కోటవద్దకు వెళ్ళి కోటకు పశ్చిమాన ఉన్న బండ్లకట్ట అనే మరో కొండపై ఫిరంగులు చేర్చి యుద్ధం సాగించారు. తమకు శక్తి ఉన్నంతమేరకు కోటను కాసుకోవడానికి గురవరాజు ప్రయత్నించారు. కానీ చివరకు తాళలేక శరణుకోరగా గురవరాజు తల కోసుకుని పోయారు. ఆపైన కోటలోని స్త్రీ, బాలురు ప్రాణ్యత్యాగం చేశారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.