అంటోన్ చెకోవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Антон Павлович Чехов
అంటోన్ పావ్లొవిచ్ చెకోవ్

1898లో ఓసిప్ బ్రాజ్ చిత్రించిన అంటోన్ చెకోవ్
జననం: జనవరి 29, 1860
టాగన్ రాగ్, రష్యా
మరణం:జూలై 15, 1904
బాడెన్ వైలర్, జర్మనీ
వృత్తి: వైద్యుడు, చిన్న కథల రచయిత, నాటకకర్త
జాతీయత:రష్యన్

అంటోన్ పావ్లొవిచ్ చెకోవ్ (1860-1904) ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ నాటక రచయిత. 19వ శతాబ్ది చివరిభాగాన వెలసిన రష్యన్ వాస్తవికతా సాంప్రదాయ ప్రధాన ప్రతినిధి. ది సీగల్, అంకుల్ వన్యా, త్రీ సిస్టర్స్, ది చెర్రీ ఆర్చర్డ్ వంటి సుప్రసిద్ధ రచనల నిర్మాత.

తొలిదశ

[మార్చు]

రష్యాలోని టాంగన్‌రాగ్ అనే గ్రామంలో 1860 జనవరి 29న ఒక బానిస కుమారునిగా చెకోవ్ జన్మించాడు. ఈయన తండ్రి ఒక చిల్లర దుకాణం నడిపేవాడు. తన దుకాణంలో పనిచేయమని, తానే నడుపుతున్న ఒక చర్చి గాయకబృందములో చేరమనీ కుమారున్ని ఆయన నిర్బంధించేవాడు. తల్లి చెకోవ్‌ను ఎంత ప్రేమగా చూసినా బాల్యానికి సంబంధించిన బాధాకర స్మృతులే ఆయనకు మిగిలాయి. అతని అనంతర రచనలలో చాలా వాటిలో ఆ అనుభవాల ప్రతిధ్వనులే వినిపిస్తాయి.

కొద్దికాలం పాటు గ్రీక్ బాలురకోసం నడిపే ఒక స్థానిక పాఠశాలలో చదివి, అనంతరం చెకోవ్ టౌన్ జిమ్నాసియా (ఉన్నత పాఠశాల) లో చేరి, 10 ఏళ్లు అక్కడ చదివాడు. ముఖ్యంగా గ్రీక్, లాటిన్ పురాణాలు బోధించే ఆ పాఠశాలలో ఉన్న విద్యా ప్రమాణాలు పాటించబడేవి. తండ్రి దివాళా తీయడంతో చివరి 3 ఏళ్లూ ఒంటరిగా ఉంటూ చిన్నపిల్లలకు చదువుచెబుతూ చెకోవ్ తన కాళ్ల మీద తాను నిలబడవలసి వచ్చింది. తండ్రి తక్కిన కుటుంబ సభ్యులతో సహా జీవనోపాధిని వెతుక్కుంటూ మాస్కో నగరం చేరుకొన్నాడు. 1879 శీతాకాలంలో చెకోవ్ మాస్కోలోని తన కుటుంబ సభ్యులను చేరుకొని 1892 వరకూ వారితో కలిసి ఉన్నాడు. మాస్కో విశ్వవిద్యాలయంలోని వైద్య కళాశాలలో చేరి, 1884లో వైద్య పట్టబధ్రుడయాడు. తండ్రి జీతం చాలీ చాలకుండా ఉండటం చేత కుటుంబ నిర్వహణ బాధ్యత అతనే చూడవలసి వచ్చింది. ఈయన ఇద్దరు అన్నలలో అలెక్జాండర్ పాత్రికేయుడు. నికొలాయ్ చిత్రకారుడు. వారు విలాస జీవితాలను గడుపుతూ కుటుంబ బాధ్యతను పట్టించుకొనే వారు కాదు. జర్నలిస్టుగా రచనలు చేస్తూ, హాస్య రచనలు ప్రకటిస్తూ, డబ్బు సంపాదించి తానే సంతోషంగా కుటుంబపోషణ చేశేవాడు.

రచనా జీవితం

[మార్చు]

హాస్య పత్రికలకు మారుపేరుతో ఛలోక్తులు వ్రాయడంతో చెకోవ్ రచనాజీవితం ప్రారంభమైంది. 1888 నాటికే ఆయనకు కొంత ప్రజాధరణ లభించింది. అనంతర రచనల కంటే ఆ కాలంలో చెకోవ్ చేసిన రచనలే ఎక్కువ. హాస్య రచనలతో పాటు మానవ దైన్యాన్ని, నైరాశ్యాన్ని చిత్రించే కరుణ రసభరితమైన రచనలు కూడా చెకోవ్ చేయనారంభించాడు.

1891-92 నాటి దారుణ కరువు కాటక పరిస్థుతులలో వైద్యునిగాను, వైద్యశాఖా నిర్వాహుడుగాను చెకోవ్ దేశానికి ఎనలేని సేవచేశాడు. మాస్కోకు 50 మైళ్ల దక్షిణాన గల మెలిఖోవో గ్రామంలో ఒక ఎస్టేట్ కొన్నాడు. ముసలి తల్లితండ్రులతోనూ, చెకోవ్ కు సేవచేయటానికి అవివాహితగా మిగిలిపోయిన సోదరి మరియా తోనూ ఆరేళ్ల పాటు చెకోవ్ అక్కడ జీవించాడు. ఆ కాలంలో ఆయన చేసిన రచనలు ది బటర్‌ఫ్లై, నైబర్స్ (1892), అనోనిమస్ స్టోరీ (1893), ది బ్లాక్ మాంక్ (1894), మర్డర్ ఆరియాడ్నే (1895)

చెకోవ్ రచించిన చివరి రెండు నాటకాలు: త్రీ సిస్టర్స్ (1900-01), ది చెర్రీ ఆర్చర్డ్ (1903-94). చెకోవ్ నాటకాలు రంగస్థలం మీద ప్రదర్శింపబడుతూ విశేష ఆదరణ పొందాయి. 1904 ఫిబ్రవరి 17న చెకోవ్ రచనల రజతోత్సవం సందర్భంలో ప్రదర్శించిన నాటకానికి మృత్యుముఖంలో ఉన్న చెకోవ్ ను రప్పించి, నిరాడంబరుడైన ఆయనకు బలవంతంగా ఆయనను ప్రశంసిస్తూ చేసిన ఉపన్యాసాలను వినిపించారు. ఆ ఏడాదే జూలై 14/15 న జర్మనీలోని బ్రాడెన్‌వైడర్ లో చెకోవ్ తనువు చాలించాడు. ఆయన చనిపోయిన 40 ఏళ్లకు ఆయన సంపూర్ణ రచనలు, లేఖలు 8 సంపుటాలుగా ప్రకటించబడిన తర్వాతగానీ ఆయన రచనల విశిష్టత లోకం పూర్తిగా గుర్తించలేదు. ప్రధానంగా నాటకకర్తగానే సుప్రసిద్ధుడైన విమర్శకుల దృష్టిలో 1888 తర్వాత ఆయన రచించిన కథానికలు అంతకంటే విలువైనవి.