అంబటి వెంకన్న
అంబటి వెంకన్న | |
---|---|
జననం | అంబటి వెంకట నరసింహ ఎమ్. దోమలపల్లె, నల్గొండ జిల్లా |
ప్రసిద్ధి | జానపద కళాకారుడు, రచయిత, నటుడు |
తండ్రి | గురువయ్య |
తల్లి | మనెమ్మ |
అంబటి వెంకన్న తెలంగాణకు చెందిన జానపద కళాకారుడు, రచయిత, నటుడు. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రపంచీకరణ, పలు వృత్తులు మొదలైన సామాజిక అంశాలపై పాటలు కట్టాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు నల్గొండ జిల్లా, ఎమ్. దోమలపల్లె గ్రామంలో అంబటి గురువయ్య, మనెమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ.(జానపద కళలు), బి.ఇడి. చదివాడు. ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు. తరువాత తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితుడై 2002లో తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇతడు సాహిత్యం పట్ల ఆకర్షితుడై 1996 నుండి కవితలు, కథలు, పాటలు వ్రాయడం మొదలు పెట్టాడు.[1]
రచనలు
[మార్చు]ఇతడు అంబటి వెంకన్న కవిత్వం, అంబటి వెంకన్న పాటలు, తెలంగాణ సాయుధ పోరాటపతాక దొడ్డి కొమరయ్య, పొలిమేర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అలుగెల్లిన పాట, నాన్నే నా చిరునామా, కల్లుపాట అనే పుస్తకాలను వెలువరించాడు. ఇతని కవితలు అలుగు దుంకిన అక్షరం, తంగేడువనం తొలిపొద్దు వంటి కవితా సంకలనాలలో, పాటలు తుంగ, మబ్బులు, గోగుల మల్లెలు, జిల్లెడు పూలు మొదలైన గేయసంకలనాలలో ప్రచురితమయ్యాయి. ఇతని పాటలు క్యాసెట్లు, సి.డి.ల రూపంలో వెలువడ్డాయి. జైబాలాజీ అనే సినిమాలో పాటలు రచించాడు. జై బోలో తెలంగాణ, తుపాకి రాముడు మొదలైన సినిమాలలో నటించాడు. కోహినూర్, పౌరుడు, హుష్‌కాకి, నైవేద్యం వంటి నాటకాలలో కూడా నటించాడు.
2006లో భారతీయ దళిత సాహిత్య అకాడమీ ఢిల్లీ వారి చేత అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు అందుకున్నాడు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ 2015 జూన్ 7న ఇతడిని హైదరాబాదులోని రవీంద్రభారతిలో సత్కరించింది.
మూలాలు
[మార్చు]- ↑ ఎ.నాగరాజు. "ఆయన తెలంగాణ సాహిత్యానికి వారసుడు.. ఉద్యమపాటకు ఊపిరి.. అతనే మన అంబటి". న్యూస్ 18. Retrieved 1 November 2024.