Jump to content

అన్నమయ్య పదకోశం

వికీపీడియా నుండి
అన్నమయ్య పదకోశం
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: ఆచార్య రవ్వా శ్రీహరి
సంపాదకులు: ఆచార్య రవ్వా శ్రీహరి
ముఖచిత్ర కళాకారుడు: శివ శంకర్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నిఘంటువు
ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు
విడుదల: 2012
పేజీలు: 640

అన్నమయ్య పదకోశం (తాళ్లపాకకవుల సంకీర్తన నిఘంటువు) ఆచార్య రవ్వా శ్రీహరి సంకలనం చేసిన పదకోశం. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు వారు 2012లో ముద్రించారు.

అన్నమాచార్యుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు. ఇతడు తన పదహారవ యేటనే తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కారాన్ని పొంది తన్మయుడై రోజుకొక్కటి చొప్పున సుమారు 32, 000 సంకీర్తనలు రచించాడు. వీనిలో మనకు లభించినవి 14, 358 మాత్రమే. అన్నమయ్య కుమారుడు పెదతిరుమలాచార్యుడు ఈ సంకీర్తనలు అన్నింటిని రాగి రేకులపై చెక్కించి అమూల్యమైన సంకీర్తన సాహిత్యాన్ని మనకు అందించాడు. అన్నమయ్య సంకీర్తనల్లోని భాష ఎంతో విలక్షణమైనది. ఇతడు ప్రజల వ్యవహారంలో వున్న తెలుగు భాషకు పట్టంకట్టిన మహానుభావుడు. తన సంకీర్తనల ద్వారా భక్తిభావాన్ని సామాన్య ప్రజల్లో కూడా వ్యాప్తి చేయాలనే లక్ష్యమే ఇందుకు ముఖ్య కారణం. ఒక విధంగా అన్నమయ్య తొట్టతొలి వ్యావహారిక భాషోద్యమ నిర్మాత అని చెప్పవచ్చు. భాషా వ్యవహారానికి జీవం పోసే ప్రాంతీయ మాండలిక పదాలను వాడి వాటిని మనకు గుర్తుచేశాడు. కొన్ని సంస్కృత పదాలకు అచ్చతెలుగు పదాలను సృష్టించి భాష విషయంలో తన సృజనశక్తిని ప్రకటించుకున్నాడు. అన్యభాషా పదాలను కూడా స్వీకరించాడు. తన సంకీర్తనలలో అన్నమయ్య ఎన్నో భాషా విశేషాలతో రచనలు చేశాడు.

అన్నమయ్య సాహిత్యంలో విశేషకృషి చేసిన వేటూరి ప్రభాకర శాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, వేటూరి ఆనందమూర్తి మొదలైన పండితులు కొన్ని పదాలకు అర్ధనిర్ణయం చేసారు. కాని ఇంకా అర్ధనిర్ణయం చేయాల్సిన పదాలు ఎన్నో మిగిలివున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కృషివలన ఇటీవల అన్నమయ్య కీర్తనలకు దేశంలో విశేష ప్రచారం జరుగుతున్నది. విశ్వవిద్యాలయాల్లో కూడా అన్నమయ్య సాహిత్యంపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో అన్నమయ్య సాహిత్యాన్ని చక్కగా అర్ధం చేసుకోవడానికి వీలుగా అన్నమయ్య వాడిన విశేషపదాలకు అర్ధ వివరణలు చూపే నిఘంటువు తయారుకావలసిన అవసరాన్ని ఎంతోమంది పండితులు వెలిబుచ్చారు.

2004లో రచయిత శ్రీహరి నిఘంటువు పేరుతో సూర్యారాయాంధ్ర నిఘంటువు శేషాన్ని ప్రకటించారు. అందులో కొన్ని పదాలకు అర్ధవివరణ ఇవ్వడం జరిగింది. కానీ మిగిలిన పదాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని అన్నింటికీ ప్రత్యేకంగా ఒక నిఘంటువును కూర్చాలని కాంక్షించి ప్రథమ ప్రయత్నంగా 29 సంపుటాల్లోని సంకీర్తనల్లోని క్లిష్టమైన పదాలను అన్నింటిని కార్డులపై వ్రాయడం ప్రారంభించారు. ఆయా పదాల అర్ధనిర్ణయం కోసం వివిధ నిఘంటువులు, ఆధారాల సహాయంతో నిఘంటువు నిర్మాణాన్ని కొనసాగించారు. అప్పటి తి.తి.దే. కార్యనిర్వహణాధికారులు డా. కె. వి. రమణాచారి గారు ఇలాంటి బృహత్కార్యం దేవస్థానం జరిగితే సముచితంగా ఉంటుందని భావించి కావసిన సహాయ సంపత్తిని సమకూరుస్తూ నిఘంటు నిర్మాణ బాధ్యతను రచయితకు అప్పగించారు.