అభిజ్ఞాన శాకుంతలము

వికీపీడియా నుండి
(అభిజ్ఞాన శాకుంతలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శకుంతల ఆగి వెనుకకు దుష్యంతుని వైపు చూచు దృశ్యము, రాజా రవివర్మ (1848-1906)

అభిజ్ఞాన శాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. శాకుంతలము ఒక గొప్ప శృంగారభరిత నాటకము. దేవలోకములో నర్తకి అయిన మేనక, విశ్వామిత్రుడు చేయుచున్న ఘోర తపస్సును భగ్నము చేయుటకు దేవేంద్రునిచే పంపబడి, ఆ కార్యము సాధించు క్రమములో విశ్వామిత్రుని వలన ఒక బాలికకు జన్మనిచ్చి, ఆ బాలికను అడవిలో వదలి దేవలోకమునకు వెడలిపోవును. ఆ బాలిక అడవిలోని ఆకులపై పడిన నీటి బిందువులను ఆహారముగా ఒక హంస ద్వారా గ్రహించి ప్రాణము నిలుపుకొనును. అటుపై, ఆ బాలికను మహర్షి కణ్వుడు మార్గమధ్యమున చూసి జాలితో పెంచుకొనుటకు తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి, ఆమెకు శకుంతల అని నామకరణము చేయును. శాకుంతలములచే కాపాడబడి, పెంచబడినది కావున శకుంతల అయినది.

కథా సంగ్రహం[మార్చు]

అభిజ్ఞాన శాకుంతలం (నాటకం)

హస్తినాపురానికి రాజు దుష్యంతుడు. అతను ఒక రోజు వేటకు వెళతాడు. ఒక జింకను వెంటాడుతూ కణ్వ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ తపోవనంలో కణ్వ మహర్షి దత్తపుత్రిక శకుంతలను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.


ఆ సమయంలో ఒక తుమ్మెద శకుంతలను ఇబ్బంది పెడుతుంటుంది. దుష్యంతుడు పాలిస్తున్న రాజ్యంలో శకుంతల వంటి అందగత్తెను తుమ్మెదలు బాధించడం ఏమిటంటూ చెలికత్తెలు ఆటపట్టిస్తారు. ఆమాటలు విన్న దుష్యంతుడు తుమ్మెదల్ని తరిమి కొడతారు. దుష్యంతుడ్ని చూసిన శకుంతల కూడ అతని ప్రేమలో పడుతుంది.


శకుంతల పేరుకు ఒక చరిత్ర వుంది. కొన్నేళ్ల క్రితం విశ్వామిత్రునికి తపోభగం కలిగించడానికి ఇంద్రుడు మేనకను పంపుతాడు. అలా మేనక విశ్వామిత్రులకు ఒక పాప పుడుతుంది. అయితే, ఆ పాపను వదిలి మేనక ఒక వైపు విశ్వామిత్రుడు మరోవైపు పోతారు. ఆ పసిపాపను శాకుంతలములు అనే పక్షులు కాపాడుతాయి. ఆ పాపను కణ్వుడు తెచ్చి పెంచుతాడు. శాకుంతలములు కాపాడిన పాప కనుక శకుంతల అని పేరు పెడతాడు. ఆ పాప పెరిగి పెద్దద్దై గొప్ప అందగత్తె అవుతుంది.


జాతకం ప్రకారం శకుంతలను దుష్టగ్రహాలు పీడిస్తుంటాయి. ఆ గ్రహాల్ని శాంతింపచేయడానికి కణ్వుడు సోమతీర్థానికి వెళుతాడు. రాక్షస మూకలు, ఏనుగుల గుంపులు భీభత్సం సృష్టించకుండ తపోవనాన్ని సంరక్షించాలని మునులు దుష్యంతుడ్ని కోరుతారు. రాజు కొన్నాళ్ళు అక్కడే విడిది చేస్తాడు. శకుంతల అతనికి అతిథి మర్యాదలు చేస్తుంటుంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరు మరింత దగ్గరై గాంధర్వ వివాహం  చేసుకుంటారు.


కొన్ని రోజుల  తరువాత దుష్యంతుడు హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. కణ్వుడు లేని సమయంలో అతని కూతురిని తీసుకుని వెళ్లడం సాంప్రదాయం కాదనుకుంటాడు. గుర్తుగా తన పేరు చెక్కివున్న ఒక వజ్రపు వుంగరాన్ని శకుంతలకు ఇస్తాడు. దాని మీద  ఎన్ని అక్షరాలున్నవో అని రోజులు గడవక ముందే తన మనుషుల్ని పంపుతానంటాడు. కణ్వుని ఆశిస్సులతో శకుంతలను సాదరంగా హస్తినకు రప్పించుకుంటానంటాడు.


శకుంతల అనుక్షణం దుష్యంతుడినే తలుచుకుంటూ ఈలోకాన్ని మరచిపోతుంది. ఒక రోజు దుర్వాసుడు వచ్చి బిక్షం అడుగుతాడు. పరధ్యానంలోవున్న శకుంతల ముని రాకను  గమనించదు. దుర్వాసుడు రెండోసారి అరుస్తాడు. అప్పుడూ శకుంతల గమనించదు. తనకు జరిగినపరాభవానికి దుర్వాసుడు రగిలిపోతాడు. శకుంతల  ఎవరి గురించి ఆలోచిస్తున్నదో  అతనే ఆమెను పూర్తిగా మరిచిపోవాలని శపిస్తాడు. ముని తనను శపించిన విషయం కూడ శకుంతలకు తెలీదు. శకుంతల చెలికత్తెలు వెళ్ళీ మునిని శాపవిముక్తి చేయమని ప్రాధేయపడతారు.  దుష్యంతుడు శకుంతలను మరిచిపోయినా జ్ఞాపికను చూపగానే అతనికి తిరిగి జ్ఞాపకం వస్తుంది అంటాడు దుర్వాసుడు. శకుంతల దగ్గర ఎలాగూ ఉంగరం భద్రంగా వుంది కనుక ఇక ముని శాపం ప్రభావం లేనట్టేనని చెలికత్తెలు భావిస్తారు. ముని శాపం విషయాన్ని శకుంతలకు చెప్పరు.


కణ్వుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేనాటికి శకుంతల గర్భం దాల్చి వుంటుంది. దుష్యంతుని వంటి సద్గుణాల రాజు అల్లునిగా దొరికినందుకు అతను సంతోషిస్తాడు.  ఇద్దరు శిష్యులను తోడుగా ఇచ్చి శకుంతలను దుష్యంతుని దగ్గరకు పంపుతాడు.


దారిలో శచీతీర్థం దగ్గర పడవలో పోతూ  నదిని మొక్కుకుంటుంది  శకుంతల. ఆ సమయంలో, దుష్యంతుని జ్ఞాపిక అయిన ఆమె వేలి వుంగరం ఆమెకు తెలియకుండానే నదిలో జారిపోతుంది.  దుర్వాసుని శాపం ప్రకారం ఏనాడో శకుంతలను మరిచిపోయిన దుష్యంతుడు ఆమె ఎదురుగా వచ్చి నిలబడినా గుర్తు పట్టలేడు. స్వార్ధపరులైన స్త్రీలు భోగపరాయణుల్ని తేనెలొలుకు కల్ల మాటలతో ఆకర్షిస్తారని నిందించి  రాజసభలో ఆమెను అవమానిస్తాడు.   కణ్వుని శిష్యులు కూడ శకుంతలను నిర్దయతో వదిలిపోతారు.


నిస్సహయురాలైన శకుంతలను ఆమె తల్లియైన మేనక ఆదుకుంటుంది. ఒక అప్సరసను పంపి శకుంతలను కశ్యప ముని తపోవనానికి చేరుస్తుంది. అక్కడే ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది శకుంతల. అతడే భరతుడు.


శకుంతల జారవిడిచిన ఉంగరాన్ని ఒక ఎర్రని చేప మింగుతుంది. ఆ చేప ఒక జాలరికి దొరుకుతుంది. ఆ జాలరి  కూర వండడానికి చేపను కోసినపుడు దాని కడుపులో వుంగరం బయటపడుతుంది. ఆ వుంగరం అనేక మలుపులు తిరిగి దుష్యంతునికి చేరుతుంది. దాన్ని చూడగానే దుష్యంతునికి శాపవిమోచన జరిగి గతం అంతా గుర్తుకు వస్తుంది. శకుంతలకు తాను చేసిన అన్యాయం తెలిసివచ్చి కుమిలిపోతాడు. విచారంలో మునిగి రాజ్యంలో ఉత్సవాలన్నింటినీ రద్దు చేసే స్తాడు.


ఇంద్రుని సూచన మేరకు కశ్యపుని తపోవనానికి వెళ్ళిన దుష్యంతునికి సింహపు కూనలతో ఆడుకుంటున్న భరతుడు కనిపిస్తాడు. అతను తన కొడుకే అని పోల్చుకుంటాడు. అక్కడే శకుంతలను కూడ కలిసి అందరి ముందు క్షమాపణ కోరుతాడు. శకుంతల అతన్ని మన్నిస్తుంది. కశ్యపుని ఆశిస్సులతో శకుంతల, భారతుడ్ని వెంట బెట్టుకుని దుష్యంతుడు హస్తినపురికి ప్రయాణమౌతాడు.

అలా కథ సుఖాంతం అవుతుంది.

(కథా సంగ్రహం రాసింది – ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ))

ప్రశస్తి[మార్చు]

జర్మన్ మహాకవి గోథే ఈ నాటకానువాదాన్ని చదివి ఆత్మని ఆకట్టుకొని కట్టిపడేసేవి అన్నిటికీ, తృప్తి పరచి విందు చేయగల అన్నిటికీ నెలవైనది శాకుంతలం . యౌవన వసంత పుష్పాలు, పరిణత హేమంత ఫలాలూ ఒక్కసారే ఒకే చోట అక్కడ. …స్వర్గ మర్త్య లోకాలు ముడివడిన ఆ పేరు, ఆ చోటు శాకుంతలం. అని వ్యాఖ్యానించారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

  1. అబ్బరాజు, మైథిలి. "సహృదయ ప్రమాణం, సంస్మరణీయ శోభ- శాకుంతలం [1]". http://vaakili.com/patrika. Archived from the original on 16 మార్చి 2016. Retrieved 26 October 2014. Check date values in: |archive-date= (help); External link in |website= (help)CS1 maint: discouraged parameter (link)