అమరావతి కథా సంగ్రహం 1-25

వికీపీడియా నుండి
(అమరావతి కథా సంగ్రహం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నూరు కథలు అమరావతి కథలు. రచన సత్యం శంకరమంచి ఈ నూరు కథల్నీ ఆంధ్రజ్యోతి వార పత్రిక వారు రెండు సంవత్సరాలపాటు 1975-77 మధ్య ధారావాహికంగా వేశారు. కథలన్నీ కూడా మానవత్వపు విలువలను ఎత్తి చూపటమేకాకుండా, సామాజిక, వ్యక్తిగత బలహీనతలను ఎండగట్టుతూ ఉంటాయి. ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.

అమరావతి కథలు వ్యాసంలో ఈ పుస్తకం గురించిన వివరాలు, అమరావతి కథల జాబితా ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క కథ గురించి మరిన్ని విశేషాలు నాలుగు వేరు వేరు వ్యాసాలలో పొందుపరచబడ్డాయి .

అమరావతి కథలు 1 నుండి 25 వరకు[మార్చు]

1.వరద[మార్చు]

 • ముఖ్య పాత్రలు-శాస్త్రిగారు, మాల సంగడు
 • బాపు బొమ్మ-శాస్త్రిగారు చెయ్యి చాచటం, మాల సంగడు నెయ్యి వేస్తూండటం
 • కథ: అమరావతిలో వరద వచ్చి అందరూ వీధిన పడిన సమయాన సమష్టి భోజనాలు కులాతీతంగా అందరూ కలసి వండుకుంటారు. వడ్డన సమయంలో, మాల సంగడు శాస్త్రిగారికి నెయ్యి వడ్డించటానికి సందేహిస్తే, శాస్త్రిగారే సంగణ్ణి పిలిచి " ఒరే సంగా! నీకు ఆకలేస్తుంది, నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపొదురా....వెయ్యరా" అని సంగడి చేత నెయ్యి వేయించుకుంటాడు. "వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే నాకు నమ్మకం లేదు! స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లొ మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది" అన్న రచయిత ముక్తాయింపుతో కథ ముగుస్తుంది
సుడిగుండంలో ముక్కుపుడక

2.సుడిగుండంలొ ముక్కుపుడక[మార్చు]

 • ముఖ్య పాత్రలు ఎలికలాళ్ళు బాచిగాడు, సింగి; భూస్వామి భూమయ్య, అతని భార్య సూర్యకాంతం
 • బాపు బొమ్మ- నీటి వలయాలు, అందులో సింగి చేతులో బిడ్డతో నుంచుని, బాచిగాడు పూర్తిగా వంగి నీళ్ళల్లో జల్లెడపడుతుంటాడు, ఆ జల్లెడ సూర్యకాంతం ముఖాకృతి కలిగి ఉంటుంది (వారి అంతర్యాన్ని జల్లెడపట్టి బాచిగాడు గ్రహించినట్టు)
 • కథ - బాచిగాడు, సింగి ఎలికలోళ్ళు, నీళ్ళల్లో జల్లెడపట్టి రంగురాళ్ళు ఏరుకొని బతుకుతుంటారు. ఒకరోజు వీరలా వారి పనిలో ఉండగా భూమయ్య, భార్య సూర్యకాంతం ప్రొద్బలంతో, పిలిచి తన భార్య ముక్కుపుడక ఆ నీళ్ళల్లొనె పొయిందని, వాళ్ళకి దొరికినా ఇవ్వలేదని అభియోగం చేసి వెంటనే ఇవ్వమని హూంకరిస్తాడు. బిత్తరపోయిన ఆ దంపతులు, దిక్కుతోచక చివరికి ఆ ముక్కుపుడక వెతికి ఇద్దామని నిర్ణయించుకుని, బాచిగాడు రొజంతా జల్లెడపట్టి ఆ ముక్కుపుడక పట్టి భూమయ్యకు సమర్పించుకుంటాడు. లోకం తెలియని సింగి భూమయ్య ఏమన్న బహుమతి ఇచ్చాడా, కనీసం పప్పన్నం అని అడుగుతుంది పాపం. బాచిగాడు చక్రవర్తి హుందాలో మంచిరాయి దొరకనీయే! మనవే పెడ్దాం అంటాడు. భూమయ్య తన ధనాధికారంతో అశక్తుడైన బాచిగాడ్ని ఎలా వాడుకుని తన పని డాంబికంగా ప్రతిఫలం ఇవ్వకుండా చేయించుకుంటాడో మనసున్న వారికి చివుక్కుమనే రీతిలో రచయిత వ్రాశారు. ఎర్ర మార్కు కథల్లో ఉండే అవేశ కావేశాలు లేకుండా, మానవ ప్రవృత్తి సహజ దర్పణంలో చూపబడింది ఈ కథలో.

3.పుణుకుల బుట్టలో లచ్చితల్లి[మార్చు]

 • పుణుకుల బుట్టలో లచ్చితల్లి
  ముఖ్య పాత్ర-సుబ్బాయి లేదా సుబ్బారావుగారు
 • బాపు బొమ్మ- ఒక మాసికల గుడ్డ చిరుగులోంచి ఒక వ్యక్తి ఆ మాసికల గుడ్డకు నమస్కరిస్తూంటాడు
 • కథ-స్థూలంగా పుణుకులమ్ముకునే సుబ్బాయి సుబ్బరావుగారుగా మారిన వైనం, అలా పెరిగి ధనవంతుడయినా, తన మూలాలు మరవకుండా, తన ఎదుగుదలకు ముఖ్య ఆధారాన్ని పూజిస్తూ ఉండటం. కథలో అంతర్గతంగా పేకాటరాయుళ్ళు, తాగుబోతులు, ఏవిధంగా తమ కాలాన్ని, ధనాన్ని వ్యర్ధపరుస్తూంటారో, ధన పరంగా కొంత ఎదుగుదల తరువాత పాత పేరు రోతగా మారి కొత్త పేరుగా రూపాంతరం చెందటం (సుబ్బాయి సుబ్బరావుగా, అతని మనుమడు బుచ్చయ్య హేమంతకుమార్ గా) చెప్పబడింది. పేకాట ఆడుతున్న చోటు, "పేకాట యజ్ఞవేదిక"గా వర్ణన చక్కటి హాస్యం. పేకాటరాయుళ్ళకు పావలా వడ్డీతొ, తాగుబోతులకు అర్ధరూపాయి వడ్డితో సుబ్బాయి అప్పివ్వడం, రెంటి వడ్డిల్లో ఉన్న పెద్ద అంతరం-సుబ్బాయి తాగుబోతుల బలహీనతను తనకనుకూలంగ ఎలా ద్రవ్యపరుచుకుంటాడో - వడ్డీ వ్యాపారుల మోసకారితనానికి అద్దంపడుతుంది.

4.రెండు గంగలు[మార్చు]

 • రెండు గంగలు
  ముఖ్య పాత్రలు వాన, శాస్త్రిగారు
 • బాపు బొమ్మ- ఆకాశగంగ, భూలోక గంగ పక్కన వానలో అనందిస్తున్న శాస్త్రిగారి భార్య
 • కథ-శాస్త్రిగారు పొలంవెళ్ళి వస్తుండగా వాన మొదలయ్యి అందులోపూర్తిగా తడిసి సంపూర్ణానందం పొంది, మళ్ళీ మామూలు లోకంలోకి వచ్చి, కొత్తగా కాపురానికి వచ్చిన తన భార్య ఏమయిందోనని ఇంటికి ఆదుర్దాగవచ్చి చూస్తే, ఆమె కూడా దొడ్లో వానలో నుంచుని వాన కృష్ణలో,కృష్ణ వానలో కలవటం (అదే రెండు గంగలు) చూసి అనందిస్తూ ఉంటుంది. కథంతా శాస్త్రిగారుతన 80వ పడిలో మనవలకి చెప్తుంటే మనకు తెలుస్తుంది. ఈ కథలో వాన, వాన పడుతున్న తీరు యెక్క వర్ణన చాలా చక్కగా ఉంటుంది. కథ వింటున్న శాస్త్రిగారి పెద్ద మనవడు "వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్యా" అంటాడు. చదువరులకు కూడా అక్కడకు వచ్చేసరికి, సరిగ్గా అదే అనిపిస్తుంది. పూర్వం, అంటే 20వ శతాబ్దపు మొదటి రోజులలో, భార్యను భర్త "ఓహోయ్" అని పిలిచేవాడని హాస్య పూరకంగా తెలుస్తుంది.అప్పట్లో పట్నవాసం వాళ్ళను పల్లె వాసులు (ఇప్పుడది తిరగబడింది) ఎలా ఆట పట్టించేవారో శాస్త్రిగారు తన భార్య గురించి "అందులో పట్నంలో కచ్చేరీ గుమాస్తాగారి కూతురేమో, వర్షంలో తడిసి జలుబుచేసి ఎక్కడ ముక్కూడగొట్టుకుంటుందో" అనుకోవటం హాస్యోక్తిగా రచయిత మలచారు.

5.బంగారు దొంగ[మార్చు]

 • బంగారు దొంగ
  ముఖ్య పాత్రలు-దొంగ, జానకి రామయ్య, భూషయ్య
 • బాపు బొమ్మ-వినాయకుడి మీద ఎక్కి కూర్చున్న భూషయ్య, కొంత డబ్బులు పడేస్తుంటే, అనందంతో అవులిస్తూ చేతులు ఎత్తి తీసుకుంటున్న దొంగ. వినాయకుడు విచారంగా తన నెత్తిన ఎక్కిన భూషయ్యను భరిస్తుంటాడు. బొమ్మ అంతర్యం అసలు దొంగ ఎవరో చెప్పటమే.
 • -కథ-ఊళ్ళొ జరిగిన ఒక సంఘటన. గుళ్ళొ దొంగతనం జరుగుతుంటే పసికట్టిన జానకిరామయ్య ఊరివారిని హెచ్చరిస్తాడు. ఊళ్ళోవాళ్ళు, వాడువీడని లేకుండా అందరూ గుడిమీదపడి దోంగను పట్టుకుని, వీరొచితంగా చావగొడతారు భూషయ్యతో సహా. కథ పేరు "బంగారం దొంగ" అని పెట్టకుండా, "బంగారు దొంగ" పెట్టడంలోని చమత్కారం కథలోని కొసమెరుపు. ఆ దొంగ, భూషయ్య చేత నియోగించబడ్డవాడు. వాడికి డబ్బిచ్చి, దొంగతనానికి పురిగొల్పి, బంగారుపూతను సంగ్రహిస్తూ వాడికి నాలుగు రూకలు పడేస్తుంటాడని భూషయ్య-దొంగల సంభాషణలో తెలుస్తుంది. బంగారం దొంగ భూషయ్య, భూషయ్యకు దొంగ (వీడికి పేరులేదు) బంగారు దొంగ. వేసంకాలం మిట్టమధ్యాహ్నం, శివాలయంలో రికామిగా జరుగుతున్న దొంగ పని బయటపెట్టడానికి మొలల వ్యాధిగ్రస్తుడైన జానకిరామయ్య పాత్రను కల్పించి రచయిత హాస్యాన్ని పండించారు.

6.ముక్కోటి కైలాసం[మార్చు]

 • ముక్కోటి కైలాసం
  ముఖ్య పాత్రలు-ముసలమ్మ, బిచ్చగాళ్ళు ఎవరికీ పేర్లు పెట్టలేదు
 • బాపు బొమ్మ-నేలమీద చాలా హీనంగా కూచుని చేతులెత్తి నమస్కరిస్తున్న ముసలిది, ఆకాశంలోనుండి ఒక అద్భుత హస్తం అమె వైపుకు తిరిగి. ఆదిదేవుడే ఆ ముసలమ్మను తన చేత్తో, పూజలే ముఖ్యమయ్యి, తోటి మనిషిని పట్టించుకోని లోకంనుండి, ఒక పర్వదినాన ఆమెను కైలాసానికి తీసుకొని వెళ్ళబోతున్నట్టు స్పురిస్తుంది
 • కథ-ఇదికూడా సంఘటనా వర్ణనమే ఒక దిక్కులేని ముసలమ్మ వైకుఠ ఏకాదశి నాడు అమరావతిలో శివాలయంలో దేవదర్శనంకోసం ప్రయత్నించటం, అశేష జనవాహినిలో పడి కొట్టుకుపోయి, ఆ జన సంద్రపు తీరాన విసిరివేయబడటం, అమె అక్కడే తనువు చాలించటం. కథలో బిచ్చగాళ్ళ దీన జీవన గాథ, అంతటి బీదరికంలోనూ వాళ్ళలో వాళ్ళు తన్నుకోవటం, తమకంటే తక్కువ వాళ్ళను చీదరించుకోవటం, దిక్కులేని ముసలమ్మను పట్టించుకోక పొగా, కసిరి ఆవతలకి పొమ్మనటం, చివరికి ముసలమ్మను "చచ్చిందిరోయ్" అని అనందంగా కనిపెట్టి, ఆ శవాన్నే పణంగా పెట్టి అడుక్కోవటానికి కూడా వెనకాడక పోవటం చాలా హృద్యంగా చిత్రీకరించారు. "ముసలమ్మ ముందు రెండు కొబ్బరిముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది గాని మింగుడు పడలేదు" అన్న వాక్యం మనస్సును ద్రవింపచేస్తుంది.
ఆరేసిన చీర

7.అరేసిన చీర[మార్చు]

 • ముఖ్య పాత్రలు సాంబడు, లచ్చి
 • బాపు బొమ్మ-సాంబడు లచ్చి, ఇద్దరికి బట్టలతో లంకె, కథలో వారిద్దరు చివరకు ఒకరి మీద మరొకరు ఎలా ఇష్టపడ్డారో తెలియచెప్తుంది
 • కథ-చాకలి సాంబడు, చాకలి లచ్చి, పెద్దవాళ్ళ బలవంతంమీద పెళ్ళాడుతారు, కాని, వారిద్దరికీ ఇతరులమీద, లచ్చికి కోటేశు మీద, సాంబడికి సీతాలు మీద, మనసు పోతూ ఉటుంది. క్షణం పడదు వాళ్ళీద్దరికీ. ఉతకటానికి వేసిన బట్టల్లోంచి కోటేశుకు చెందిన అత్తాకోడలంచు పంచ లచ్చి, సీతాలుకి చెందిన నెమిలి కంఠం చీర సాంబడు ఉతుకుతారు. సాయంత్రానికి ఉతికిన బట్టల్లోంచి తమకు నచ్చిన బట్టలు - నెమిలి కఠం చీర లచ్చి, అత్తాకోడలంచు పంచ సాంబడు కట్టుకుంటారు. ఆ బట్టల్లో వాళ్ళకి ఒకళ్ళమీద ఒకరికి ఇష్టం కలిగినట్టు సూచించి కథ ముగించారు రచయిత.

8.శివుడు నవ్వాడు[మార్చు]

 • శివుడు నవ్వాడు
  ముఖ్య పాత్రలు గుడ్డి గంగన్న, అర్చకుడు మహాదేవయ్య
 • బాపు బొమ్మ-గుడ్డి గంగన్నలోని పరమేశ్వరుణ్ణి చూస్తూ అతన్ని లేవతీస్తున్న మహాదేవయ్య, కథలోని సంఘటనకు అద్దం పడ్తుంది.
 • కథ-దేవాలయానికి ఆనుకుని ఉన్న గుడ్డి గంగన్న ఖాళీ స్థలాన్ని, అక్కడ ప్రసాదాలు అమ్మేషాపు పెట్టాలని చులాగ్గా నిర్ణయింస్తారు గుడి గుమాస్తా, ఆఫీసరు. వాళ్ళు గుడ్డి గంగన్న దగ్గరకు వచ్చి ఆ స్థలాన్ని అమ్మమని అడుగుతారు, గంగన్న తిరస్కరిస్తాడు. అతనికి రోజూ పెట్టే ప్రసాదం పెట్టటం మానేస్తారు. నాలుగు రోజులు తరువాత, ఆ ప్రసాదం మీదనే బ్రతికే గంగన్న ఆవేశంతో ఆక్రోశిస్తాడు. ఆ క్రమంలో పడిపోతున్న గంగన్నని, అర్చకుల్లో పెద్దవాడైన మహాదేవయ్య మడిలో ఉండి కూడా పట్టుకుని ప్రసాదం తినిపించి, అతని ఆకలి తీర్చటంతో, నాలుగు రోజులనుండి చిరు నవ్వు నవ్వని శివుడు నవ్వినట్టు భావించి ఆనందిస్తాడు. బిచ్చగాళ్ళు తన స్థలంలో వండుకుని పడుకొంటున్నారని గమనించిన గంగన్న"ఆ స్థలం నాదే కాని బాబూ! దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబూ"అని అనటం, మడిలో గంగన్నని ముట్టుకున్నందుకు వచ్చిన ఆక్షేపణను మహదేవయ్య "అతనూ మడిగట్టుకునే ఉన్నాడండీ" అన్న ఒక్క మాటతో కొట్టి పారెయ్యటంతో, మానవుల మనసుల్లో కొరవడుతున్నమానవత్వపు విలువలను ఎత్తి చూపారు రచయిత.

9.ఒక రోజెళ్ళి పోయింది[మార్చు]

 • ఒకరోజెళ్ళిపోయింది
  ముఖ్య పాత్ర-పిచ్చయ్యగారు
 • బాపు బొమ్మ-చాలా అర్ధవంతమైన బొమ్మలలో ఒకటి.అస్తమిస్తున్న సూర్యుడు, ఎగిరిపోతున్న పావురం, కథావిషయాన్ని ఇట్టే చెప్పగల శక్తిగలదీ బొమ్మ
 • కథ-ఇందులో పిచ్చయ్య గారన్న ఒక సామాన్య వ్యక్తి, ఒకళ్ళ అంటు-సొంటు అక్కర్లేని వ్యక్తి యొక్క దినచర్య, అతను వెళ్ళిపోయిన వైనం. అన్ని విధాలా సంతృప్తిపడగల వ్యక్తి జీవితం ఎంత హాయిగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుందో రచయిత చక్కగా వర్ణించారు. పిచ్చయ్యగారికి "కారం దివ్యంగా ఉండాలి. లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు" అన్న రెండు వాక్యాలు చదువుతుంటే ఆ సంఘటన కళ్ళకు కట్టి నవ్వు తెప్పిస్తుంది. సమాజంలోని ఎంతో మంది తమకు అక్కర్లేని పనులలో తల దూర్చి లేనిపోని చిక్కులు, సమస్యలు (అవి తీరుస్తున్నామన్న భావనతో) తెచ్చుకుంటారో, తెస్తారో (చాలాభాగం సొంత లాభంకోసం), అటువంటివారికి వారికి పూర్తి విభిన్నంగా "పిచ్చయ్యగారు ఏవీ సాధించలేదు. తగాదాలు తీర్చలేదు. సమస్యలు చర్చించలేదు. కానీ, కాలానికి తెలియకుండా కాలంలో కలసిపోయి బతికాడు. అది చాలదా? అది చాలటంలేదు చాలామందికి " అన్న చురుక్కుమనే కొసమెరుపునిచ్చి కథను రచయిత ముగిస్తాడు.

10.హరహర మహాదేవ[మార్చు]

 • హర హర మహాదేవ
  ముఖ్య పాత్ర-మోగులూరి ముసలమ్మ
 • బాపు బొమ్మ-రధంలో ఊరేగుతున్న పరమేశ్వరుడి రథ చక్రంలో మోగులూరి ముసలమ్మను చిత్రీకరించటం, ఆ చక్రాకృతిలోనే ముసలమ్మ దేవుడికి హారతి పట్టడం బొమ్మయెక్క ప్రత్యేకత
 • కథ-చాలా కాలం క్రితం, (ఈ కథారచనా సమయంలోనె) ఆకాశవాణి వారు శ్రీరామనవమి నాడు భద్రాచలం నుండి అక్కడ ప్రతి సంవత్సరం జరిగే సీతారామ కళ్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసావాళ్ళు. అందులో వ్యాఖ్యాతగా జమ్మలమడక మాధవరాయ శర్మ తన్మయుడయి ఆ కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్టు భక్తి పారవశ్యంతో చెప్పి సకలాంధ్ర శ్రోతలకు ఆనందం కలిగించేవారు. ఈ కథలో, అమరావతిలో మహా శివరాత్రి నాడు జరిగే అమరేశ్వరుని రథ యాత్రను, రచయిత ఆ పంధాలోనే, అక్షర రూపంలోనె మనముందు ఉంచినా, ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలుగ చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చిన మోగులూరి ముసలమ్మ పరమేశ్వర దర్శనం చేసుకోవటం, హారతి ఇచ్చి పరవశించటం ఈ కథకు వన్నె తెచ్చిన అంశం.

11.ధావళీ చిరిగిపోయింది[మార్చు]

 • దావళి చిరిగిపోయింది
  ముఖ్య పాత్రలు-అవధాన్లుగారు, ఆయన భార్య సోమిదేవమ్మ, ఆయన కుమారుడు పేరిశాస్త్రి
 • బాపు బొమ్మ-తల్లి దగ్గర చాలా అనందంగా పాలు తాగుతున్న బాలుడు, పాలు తాగుతూ ఒక కాలు విలాసంగా తల్లి నడుంమీద వేయబోవటం బొమ్మకు తెచ్చిన అందం, కథాంతంలోని కొసమెరుపుకు అద్దం.
 • కథ-ధావళీ మడి కట్టుకుని పూజ చేసుకోవటానికి వాడే ఒక వస్త్ర ధారణ. ఒక తరం నుంచి వేరొక తరానికి వచ్చిన అంతరం సూచిస్తూ, కథకు "ధావళీ చిరిగి పొయ్యింది" అని పేరు పెట్టడం సముచితంగా ఉంది.పండిత పుత్ర:, పరమ శుఠ: అన్న నానుడి నిజంచెయ్యటానికి, వేద పండితుడయిన అవధాన్లు గారి కుమారుడు, పేరిశాస్త్రి శతవిధాలాప్రయత్రించటం, తన కుమారుడి హీనస్థితి భరించలేక కుమిలిపోతూ అవధాన్లు గారు మరణించటం, ఈ విధంగా చూస్తే, కథ చాలా సూక్ష్మం. కాని, కథ చెప్పిన తీరు, కథలో పాత్రలచేత పలికించిన సంభాషణలు, రచయిత చెప్పదలుచుకున్న విషయాన్ని, స్పుటంగా తెలియచేస్తాయి. "అయ్యో! అయ్యో! మాలవాణ్ణి ముట్టుకుంటారుటండీ? అన్న భార్యతో అవధాన్లు గారు "పట్టు నీకూ పెడ్తాను వీబూది......నీకీ రోగం పోవటానికి" అనటం కథలోని ముఖ్య సందేశం. తన తండ్రి మరణ వార్తను తెలుపుతున్న సమయంలో, పేరిశాస్త్రి, తన తల్లి స్పర్శతో మామూలు మనిషయినట్టు, మారినట్టు సూచిస్తూ కథ ముగుస్తుంది.

12.రాగిచెంబులో చేపపిల్ల[మార్చు]

 • ముఖ్య పాత్ర-సుబ్బమ్మగారు, అమె భర్త సత్యనారాయణగారు
 • బాపు బొమ్మ- శివుని తలమీదున్న గంగ భూమ్మీద పడుతున్నట్టు, అందులో ఓ చేపపిల్ల కూడా ఉండటం చూసిన సుబ్బమ్మగారు అదెక్కడ తనమీద పడుతుందోనన్న భయంతో తప్పుకు పోతున్న భంగిమను, పరమేశ్వరుడు ఓరకంట చిలిపిగా గమనిస్తూ ఉండటం, కథ మొత్తాన్ని చెప్తుంది.
 • కథ-సుబ్బమ్మగారు తన మడి అతి చాదస్తంతో తాను బాధపడటమే కాక తన భర్తను కూడా బాధపెడుతుండటమే కథాంశం. భక్తి పేరిట లేదా మడి పేరిట ఆ కాలంలో కొంతమందిలో పెచ్చరిల్లిన పిడివాద చాదస్తాన్ని హాస్యభరితంగా ఎత్తిచూపి ఎద్దేవా చేయటం జరిగింది. "అందుకేనేమో రామయ్యగారి కర్రి ఆవు తనని పొడవటానికి వస్తుంది" అని సుబ్బమ్మగారి చేత అనిపించి, వేర్పాటు కారకమైన చాదస్తపు మడి/భక్తి, దేవుడుకూడ హర్షించడని, స్పురింపచేశారు రచయిత.

13.అద్గద్గో బస్సు[మార్చు]

 • అద్గద్గో బస్సు
  ముఖ్య పాత్రలు-గ్రామీణులు, జట్కా సాయబు
 • బాపు బొమ్మ-కొత్తగా వచ్చిన బస్సు యాంత్రిక గుర్రాలతో ఒక నదీ ప్రవాహంలా దూసుకుని పొబోతుంటే, ఒక బక్కచిక్కిన జట్కా గుర్రం ముందుకు వంగబడి, బలహీనంగా దిగులుగా ఆ బస్సువంక చూస్తూ, కథావిషయమైన కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేయటాన్ని సూచిస్తుంది.
 • కథ-ఒక సంఘటన వర్ణన. అమరావతి గ్రామంలోకి మొట్టమొదటిసారి బస్సు వచ్చినప్పుడు (20వ శతాబ్దపు మొదటి రోజులలో) ఆ సంఘటన గ్రామీణుల మీద చూపిన ప్రభావం, ఈ యాంత్రిక జీవన విధానపు మొదటి మెట్టు జట్కా సాయబును ఎలా మొట్టిపడేసిందో వివరించబడింది. కథ చివరిలో, జట్కా సాయబు అక్కసు పట్టలేక ఎవరూ చూడకుండా తన చండ్రకోలతో బస్సు మీద ఒక్క మీకు పీకుతాడు ఆ శబ్దానికి ముసలి గుర్రం చెంగున పరెగెత్తటంతో ముగుస్తుంది..

14.పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి[మార్చు]

 • పువ్వు ల్లేని విగ్రహాలు నవ్వాయి
  ముఖ్య పాత్రలు-పెద్దయ్యగారు, ఆయన కొడుకు నారాయణ
 • బాపు బొమ్మ-పరమేశ్వరుని వొళ్ళో కూచుని నారాయణ అమ్మవారికి అలంకారం చేస్తున్నట్టు, అందుకు పరమేశ్వరుడు తనవంతు సహాయం చేస్తున్నట్టుగా వేశారు. అయ్యవారి వొళ్ళొ భక్తుడు అమ్మవారి అలంకారం చేస్తూండటం చక్కటి భావన.
 • కథ-రచయిత సంఘటనా వర్ణన మీద ఎక్కువ మక్కువ ఉన్నట్టు ఈ కథా సంపుటిలో అనిపిస్తుంది. సంపుటిలో ఆ పంథాలో రచన చేయబడిన కథలు ఎక్కువ ఉన్నాయి. శివరాత్రి ఉత్సవాలకు ఊరేగింపుకు విగ్రహాలను తయారు చెయ్యటం, ఆ తరువాత జరిగిన ఊరేగింపు కథలోని ముఖ్య సంఘటన. పెద్దయ్యగారు గుడి అర్చకులలో పెద్ద. ఆయన విగ్రహాలను ఊరేగింపుకు అలంకరిస్తుంటే, ఆయన ఆరేళ్ళ కొడుకు నారాయణ తాను కూడా చేస్తానని, తండ్రి ఒళ్ళో కూచుని అలంకారం చెయ్యటానికి ప్రయత్నించటం, చివరకు అతని వల్ల అసలు పని చెడుతుండటం చూసి, పిల్లవాణ్ణి పక్కన కూచోపెట్టి, పెద్దయ్య అలంకారం పూర్తి చెయ్యటం, నారాయణ ఆ అలంకారమంతా తానే చేసినట్టు భావించి పరమానందభరితుడవటం అకట్టుకునేవిధంగా రచించారు.

15.పందిరిపట్టి మంచం[మార్చు]

 • పందిరి పట్టి మంచం
  ముఖ్య పాత్రలు-చినముత్తెం, బుల్లిరామయ్య
 • బాపు బొమ్మ-ఇది నిజంగా బాపు బొమ్మే. ఎవరైనా అందమయిన స్త్రీని "బాపు బొమ్మ"లా ఉన్నది అని వర్ణించటం ఒక వాడుక. చినముత్తెం చిత్రాన్ని చాలా అందంగా, పట్టెమంచం నేపధ్యంలో కనపడుతున్నట్టుగా, బాపు చిత్రించారు.
 • కథ-ఒక అందమైన వేశ్య,చినముత్తెం కథ ఇది. చిన ముత్తెం, భార్య పిల్లలున్న బుల్లిరామయ్య మీద మనసుపడి, అతని అధీనురాలవుతుంది. అతని కుటుంబ పోషణ కూడా తానే చేస్తూ ముప్ఫయి ఏళ్ళు గడిపి, చివరి కాలంలో, తమకోసం తన తల్లి చేయించిన, పెద్ద పట్టెమంచం బుల్లిరామయ్య పిల్లల కోసం ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ పట్టెమంచం వాళ్ళింట్లో వంశపారపర్యంగా వాడబడినట్టు సమాచారమిస్తూ, కథ ముగించారు రచయిత. వేశ్య, విటులను పట్టి పీడించి ఆస్తిపాస్తులు హరించటం, సామాన్యమని లోకోక్తి. అందుకు భిన్నంగా, వేశ్యలలో కూడ ధర్మ బద్ధులు ఉండవచ్చు అన్న ఒక కోణాన్ని చూపించారు రచయిత. ఇంకే కథలోనూ కనపడని రచయిత చిలిపితనం, ఈ కథలో చినముత్తెం అందం వర్ణించటంలో కనపడుతుంది.

16.అన్నపూర్ణ కావిడి[మార్చు]

 • అన్నపూర్ణ కావిడి
  ముఖ్య పాత్ర-శరభయ్య
 • బాపుబొమ్మ-అన్నపూర్ణ తల్లి దగ్గరనుండి ఆహారాన్ని ఆర్తితో స్వీకరిస్తున్న శరభయ్య
 • కథ-తల్లి తండ్రులు చూసిన సంబంధం కాదని, పైపై అందం చూసి పెళ్ళిచేసుకున్న అమ్మాయి అతన్ని ఛీత్కరింస్తూంటుంది. భార్య అనురాగం చూరగొనలేని అభాగ్యుడైన శరభయ్య, భార్యతో పడలేక అతను వారణాశి పారిపోవట, ఆ తరువాత "అన్నపూర్ణ కావిడి" వేసుకుని అడుక్కుని తినటం, అప్పటికి, భార్య కాంతం మీద మమకారం చావక అమరావతి తిరిగి వచ్చి, ఆమె ఇక లేదని తెలుసుకుని, ఖిన్నుడై, నిజమైన వైరాగ్యం పొందటం కథలో చక్కగా వివరించారు. చివరలో తన తదనంతరం 'అన్నపూర్ణ కావిడి' కోసం వెంపర్లాడుతున్న అవిటి సిద్ధయ్యకు శరభయ్య ఇచ్చిన సందేశపూర్వక సమాధానం కథకు మకుటం. 'అన్నపూర్ణ కావిడి" అంటే ఏమిటి, ఆ కావిడి వేసుకున్న బైరాగి జీవన విధానం ఎలా ఉంటుంది కళ్ళకు కట్టినట్టు, ఈ విషయం మీద ఏవిధమైన సమాచారం తెలియని ప్రస్తుతపు తరానికి, రచయిత తెలియచేసారు.

17.చెట్టుకొమ్మనున్న కథ[మార్చు]

 • చెట్టుకొమ్మనున్న కథ
  ముఖ్య పాత్ర-ముక్కంటి
 • బాపు బొమ్మ-నది రెండుగా విడివడి తరలివస్తున్న జనానికి దారి ఇస్తున్నట్టు, కదాంశ ప్రతిబింబం
 • కథ-సరైన అధారలు లేని చారిత్రకాంశం పుక్కిటి పురాణంగా ఉన్న వివరాలను చక్కటి కథగా వ్రాశి ఉంచారు రచయిత. ముక్కంటి చిన్నతంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ తెంపరితనానికి అలవాటుపడి, ఆ తెంపరితనంతోనె ఒక రాజ్యాన్ని స్థాపించటం, తనకు తన భార్యకు వచ్చిన ఒక సున్నిత సమస్య పరిష్కరించినవారిని వారి అవసర కాలంలో ఆదుకోవటం కథ. కథలో "ఆరువేల" కుటుంబాలు కాశినుండి తరలి తెలుగు కోస్తా ప్రాంతానికి రావటం, ఇప్పటికి అదే పేరుతో ఉన్న బ్రాహ్మణ శాఖ మూలాలకు చెందిన కథ కావచ్చుననిపిస్తుంది. అటు ఆకాశం కాక, ఇటు భూమి మీద కాక, ఎటుపడితే అటు గాలికి ఆడే చెట్టుకొమ్మ మీద కథ ఉన్నదంటూనే, రచయిత గడుసుగా ఆధారాలులేని చారిత్రిక విషయం, పుక్కిటి పురాణం, కట్టుకథ దశనుండి, వ్రాయబడ్డ కథగా మలిచారు.

18.అఖరి వేంకటాద్రి నాయుడు[మార్చు]

 • ఆఖరి వెంకటాద్రి నాయుడు
  ముఖ్య పాత్ర-వేంకటాద్రి నాయుడు
 • బాపు బొమ్మ-తాళంచెవులు ఎత్తుకుని అల్లరికి పారిపోతున్న మనవణ్ణి పట్టుకోవటానికి పంచ ఒక చేత పట్టుకుని వడివడిగా పరుగెత్తుతున్న వేంకటాద్రి నాయుడు, కథాంశపు చిత్రం
 • కథ-అమరావతి పూర్వపు పాలకుల వంశజుడు రాజ్యాలు, జమీలు అన్నీ పోయినాక కూడా ప్రజలందరి మన్ననలు పొందుతూ జీవించిన విధం కథాంశం

19.ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే[మార్చు]

 • ఎవరు పాడిన ఆ ఏడక్షరాలే
  ముఖ్య పాత్రలు-పానకాలు, పరమేశు, పెద్ద దొరగారు, వీరాస్వామి
 • బాపు బొమ్మ-సన్నాయిలే ఆయుధాలుగా కొట్టుకుంటున్న పరమేశు, పానకాలు. కథలోని సంఘటనకు హాస్యపూరక చిత్రీకరణ
 • కథ-దేవుడి ఊరేగింపులో, గుడి వాయిద్య గాళ్ళు చేసిన గలాభా, వాళ్ళ సంగీత విద్యారాహిత్యం, ఒకళ్ళమీద ఒకరికి పడక, చివరికి వాళ్ళ సన్నాయిలతోనే కొట్టుకోవటం చక్కగా వర్ణించారు. పెద్దదొరగారు గుడి వాయిద్యగాళ్ళకు ఇచ్చిన మాన్యాలకు తగ్గ ఫలితం దేవుడిగుడికి అవసరానికి రాకపోవటం చూసి, వెరొక వాయిద్యగాణ్ణి తయారు చెయ్యటానికి, వీరాస్వామిని తంజావూరు పంపి పదివేలు ఖర్చుచేసి విద్య చెప్పించినా ఫలితం లేక అతని విద్యను ప్రదర్శించటాని ఏర్పరిచిన కచేరి అభాసుపాలు కావటం చూసి దొరగారు హతాశులవటంతో కథ ముగుస్తుంది. కడుపునిండిన బేరం చందంగా గుడి వాయిద్య గాళ్ళ ప్రవర్తన మానవ ప్రవృత్తికి ఒక ఉదాహరణగా రచయిత చెప్పటం జరిగింది.

20.పచ్చగడ్డి భగ్గుమంది[మార్చు]

 • ముఖ్య పాత్రలు-లచ్మి, రాములుమామ
 • బాపు బొమ్మ లచ్మి నెత్తిమీదకు గడ్డి మోపు ఎత్తుతూ సహాయ పడుతున్న రాములుమామను లచ్మి మురిపంగా చూస్తూండటం కథకు భావయుక్తంగా చిత్రించారు బాపు.
 • కథ-ఒక పల్లెటూరి పడచు జాలి గాథ. లచ్మి చక్కటి పిల్ల, నలుగురితో కలసిపొయ్యేది, గడ్డికోసి అమ్ముకుంటూ గౌరవంగా తాను బ్రతకటమేగాక, తాగుబోతు తండ్రిని కూడా పోషిస్తూ ఉంటుంది. గడ్డి ధర అడుగుతూ నర్మగర్భంగా "రూపాయేనంటే నీ ధర! ఐదురూపాయలిస్తా తీస్కో" అన్న ఆకతాయి పోలాయికి, కీలెరిగి వాతపెట్టినట్టు "బాబూ గడ్డి గొడ్లకా? మీకా?" అని బదులిచ్చి నోరుమూయిస్తుంది. వయసుగాడైన రాములుమామ లచ్మి ఒకరిమీద ఒకరు మనసుపడ్డప్పటికీ, కట్నం డబ్బులకు బ్రమిసి సీతాలుని పెళ్ళాడ్తాడు రాములు. తాగుపోతు తండ్రి తంత్రంతో అరవై ఏళ్ళ పైబడ్డ ముసలివాడికి మూడో భార్య అయ్యి, ఆరునెలలు తిరగకుండా బొట్టులేకుండా తిరిగొస్తుంది లచ్మి. పచ్చగడ్డిలాగ చక్కగా ఉండవలసిన ఆమె జీవతం ఆవిధంగా భగ్నం కావటమే, "పచ్చగడ్డి భగ్గుమంది" అని పేరు పెట్టడంలోని ఔచిత్యం. "ఇప్పుడా లచ్మి ముఖంలో నవ్వు లేదయ్యా! ఇపుడా లచ్మి ముఖంలో బొట్టు లేదయ్యా! అని అతి తక్కువ మాటలతో గుండేల్ని పిండేసే కరుణరసాన్ని పండించటమే కాక, కథలో మరొక చోట "రంగు రంగుల చీరలు కట్టుకుని రండి!రండి! అని పిలిచే కొమ్మలు" అని వ్రాసి "కొమ్మ" పదానికి " మగువ లేదా స్త్రీ అనే అర్ధం కూడ ఉన్నదని (సామాన్యంగా పద్యాలలో వాడతారలా) చదువరులకు తెలియచేసారు రచయిత.

21.లేగదూడ చదువు[మార్చు]

 • ముఖ్య పాత్రలు-చిట్టి, లేగదూడ
 • బాపు బొమ్మ-అమాయకంగా చిన్నారి చిట్టి తాను నేర్చున్నాననుకున్న అక్షరాలు లేగదూడకు చూపించబోతుంటే, ఆ అక్షరాలను నాకి చెరివేస్తుంటుంది లేగదూడ. ఈబొమ్మ కొంచెం పెద్దదిగా ఉంటే బాగుండును, ముద్దులొలికే ఈ రెండు ప్రధాన పాత్రలను చక్కగా చూడొచ్చు అనిపించే విధంగా చిత్రించారు.
 • కథ-గ్రామీణ వాతావరణాన్ని చక్కగా మన కళ్ళముందుంచారు రచయిత. పిల్లలు పొద్దున్నే లేవటం, బడికి వెళ్ళటం, లేగదూడ గంతులు, నాలుగేళ్ళు నిండని చిన్నారి చిట్టి చదువుకోవాలనే తాపత్రయం, చిట్టి-లేగదూడల సాన్నిహిత్యం కథలోని ఆకర్షణలు. గ్రామీణ ప్రాంతంలోని పిల్లల అమాయకత్వం, ముద్దు ముచ్చట్లు ఎత్తిచూపుతూ, చివరలో "బళ్ళోవెయ్యని పసిపాపకటే,నోరులేని లేగదూడకంటే చాలా చదువుకొన్నాం మనం కాని...." అని ముగిస్తూ మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్న ప్రపంచంమీద ఒక చురక వేసి ముగించారు.

22.ఆవతలొడ్డు పొంగింది[మార్చు]

 • ముఖ్య పాత్రలు-పిల్లలు
 • బాపుబొమ్మ-కృష్ణమ్మ తల్లి శిరోజాలే అలలుగా వాటిమీద పిల్లలుతో నిండిన లంక, పైన పూర్ణ చంద్రుడు, పిల్లల వంక మురిపెంగా చూస్తున్నట్టు కృష్ణమ్మ.
 • కథ-స్థూలంగా, చీకటిపడేప్పటికి లంకలో చిక్కుకుపోయి గాభరాపడుతున్న ఒక అభాగ్యుణ్ణి రక్షించటానికి పిల్ల సైన్యం మొత్తం ఒక పడవను ఎత్తుకుకుని పోయి ఆ లంకలో వాళ్ళూ చిక్కడిపోవటం, వారిని రక్షించటానికి వారి పెద్దలు పడ్డ ఆరాటం, కంగారు, ఇంతాచేసి చివరకు, పిల్లలంతా పెద్దల్ని చూసినాక, తాము తెచ్చుకున్న ప్రమాద పరిస్థితి మర్చిపోయి, ఆటల్లో మునిగి పోవటం, ఒక దృశ్యకావ్యంగా కనపడుతుంది. అప్పటి కాలంలో పిల్లలు "చర్ పట్టి, కుందులు" అనే ఆటలు ఆడుకునేవారని చదువరులకు తెలుస్తుంది. పిల్లల్లో ఉండే సహజ సాహసాసక్తి, పరోపకార బుద్ధి చక్కగా వర్ణంచబడింది.అంత రాత్రిపూట, ఊళ్ళోని పిల్లలూ పెద్దలూ లంకలోకి చేరటమే ఆవతలోడ్డు పొంగటం.

23.మే! మే! మేకపిల్ల[మార్చు]

 • ముఖ్యపాత్రలు-బాలుడు పోలయ్య, గ్రామీణులు
 • బాపు బొమ్మ-మెడనున్న తాడుతో సహా పారిపోతున్న మేకపిల్ల ఒక పక్క, అమాయకపు ఆనందంతో తెళ్ళిపోతున్న పోలయ్య మరొకపక్క, మధ్యలో నాలిక బైటపెట్టినా రౌద్రం లేని అమ్మవారు, నాకీ బలులు కావాలా అనుకుంటున్నట్టుగా చక్కటి చిత్రం.
 • కథ-ఇక్కడకూడ సంఘటనా వర్ణనమే కాని, అంతర్లీనంగా జంతుబలుల గురించిన మానవత్వపు వీక్షణ కనపడుతుంది. ముత్తాలమ్మ జాతర్లో తనకు కావలిసిన దానికోసం దేవుడి పేరు చెప్పి గణాచారి గలాభా, ఇదే సందని గ్రామీణులందరూ తప్పతాగటం, గ్రామీణ జాతర విశేషాలను అద్దంపడతాయి. బలికోసం తేబడ్డ మేక మీద జాలిపడి పోలయ్య దానిని వదిలించటం, అది సురక్షితంగా పారిపోవటం చూసి పోలయ్య అనందించటంతో కథ ముగుస్తుంది.

24.కాకితో కబురు[మార్చు]

 • ముఖ్య పాత్రలు-పల్లె పడచు జువ్వి, చింతాలు మామ,
 • బొమ్మ-జువ్వి చొట్టూ చేరిన కాకులు, ఉడుతలు, ఛిలుకలు. సూచనప్రాయపు బొమ్మ కాదిది, సీదాగా కథాంశ ప్రతిబింబమే.
 • కథ-ప్రధానాంశం జువ్వి, చింతాలు మధ్య ఉన్న ప్రేమానురాగాలు. చింతాలు కోసం పరితపించి పోతూ, జువ్వి తన మనోభావాలను కాకులతోనూ, ఉడుతలతోనూ, చిలకలతోనూ అమాయకంగా పంచుకుంటూ ఉంటుంది.చింతాలు మావ కోసం దిగులుతో ఏడ్చి, తానేడ్చినట్టు చింతాలుకి తెలియ కూడదని అనుకుంటుంది. ఆర్థిక పరంగా సమాజంలో అట్టడుగున ఉన్న చింతాలు-జువ్వి ల ఉదాత్త మనోభావాలు, వారి వారి ప్రేమ వ్యక్తీకరణ చక్కగా మలచారు రచయిత.

25.తులసి తాంబూలం[మార్చు]

 • ముఖ్య పాత్రలు-వామనాచార్లు, ఆయన భార్య తాయారమ్మ
 • బాపు బొమ్మ-తులసి కోటకు చెరొకపక్క ఆకలితో డస్సిపోయి చేరగిలిపడి ఉన్న వామనాచార్లు-తాయారమ్మ దంపతులు
 • కథ-ఏ రోజుకారోజు భక్తులు ఇచ్చే కానుకలమీద ఆధారపడి జీవించే ఒక పూజారి దీన గాథ. పాదుకల పళ్ళేంలో పడిన ఒక అర్ధరూపయతో ఆరోజు గడుస్తుందని ఆశ పడిన వామనాచారి, ఆ అర్ధ రూపాయ సుబ్బయ్య పాలిట పడటంతో దిమ్మెరపోతాడు. ఆరోజుకి తిండి లేక పోతే తులసి ఆకులే వారికి ఆహారమవుతాయి. దేవుడిచ్చింది తమకింతేనని తృప్తిపడిన ఆ పేద దంపతులకు తులసి తాంబూలంతోనే నోరు పండిందని చెప్పి కథ ముగిస్తారు రచయిత.

బయటి లింకులు[మార్చు]