Jump to content

అమోఘవజ్ర

వికీపీడియా నుండి
అమోఘవజ్ర చిత్రపటం (14 వ శతాబ్దపు జపాన్ చిత్రం)
అమోఘవజ్ర తన ధర్మబోధనలో ఉపయోగించిన వజ్రధాతు మాండలం (తత్త్వసంగ్రహం నుండి గ్రహించిబడినది)

క్రీ.శ 8 వ శతాబ్దానికి చెందిన అమోఘవజ్ర (अमोघवज्र Amoghavajra) (క్రీ.శ 705-774) ఒక భారతీయ బౌద్ధ భిక్షువు. వజ్రబోది యొక్క శిష్యుడైన ఇతను గొప్ప వజ్రయాన తంత్ర విద్వాంసుడు. సుప్రసిద్ధ బౌద్ధ అనువాదకుడు. చైనీస్ మార్మిక (esoteric) బౌద్ధమత స్థాపకులలో ఒకడు. అమోఘవజ్ర టాంగ్ రాజవంశపు కాలంలో చైనాకు వచ్చి స్థిరపడ్డాడు. చైనీస్ చరిత్రలో రాజకీయంగా అత్యంత శక్తివంతమైన బౌద్ధ సన్యాసులలో ఒకడు. [1] టాంగ్ రాజవంశం యొక్క కైయువాన్ కాలానికి చెందిన ముగ్గురు గొప్ప తంత్ర గురువులలో ఒకనిగా, షింగోన్ బౌద్ధమతంలోని అష్ట పితృదేవతలలో ఒకనిగా పరిగణించబడ్డాడు.[2] చైనాలో ఇతనిని బుకాంగ్‌ లేదా బుకాంగ్‌ జిన్‌గ్యాంగ్ అని పిలుస్తారు.

ఆధార గ్రంధాలు

[మార్చు]

అమోఘవజ్ర గురించిన వివరాలు టాంగ్ రాజవంశంలో బౌద్ధ జీవిత చరిత్ర (Buddhist Biography in Tang Dynasty) యొక్క మొదటి వాల్యూమ్, బౌద్ధమత చరిత్ర చరిత్ర (Buddhism Historiography) యొక్క 40 మరియి 41 వాల్యూమ్ లు, జెన్ యువాన్ కాలంలో న్యూ బౌద్ధమత జాబితా (New Buddhism List) యొక్క ఎనిమిదవ వాల్యూమ్, బుకాంగ్‌జింగాంగ్ సంజాంగ్ జీవిత చరిత్ర మొదలగు చైనీయ గ్రంథాల నుండి లభ్యమవుతున్నాయి.

చైనాలో వజ్రయాన వృద్ధి

[మార్చు]

టాంగ్ రాజవంశపు పాలన మధ్యకాలం నుంచి ముఖ్యంగా 7, 8 శతాబ్దాలలో చైనా సామ్రాజ్యానికి ఎదురైన విపత్కర పరిస్థితుల కారణంగా నాటి చైనా పాలకులు ఆత్మరక్షక పద్ధతులను అవలంబిస్తూ వచ్చారు. అతీంద్రియ రక్షిత శక్తులను ఆశ్రయిస్తూ, వాటిని ప్రసన్నం చేసుకోవడానికి తాంత్రిక శక్తులను విశ్వసించడం ప్రారంభించారు. కరువు కాటకాల వంటి పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి మంత్ర తంత్రాల పూజలను ఆహ్వానించడమే కాక సైన్యానికి సైతం మంత్రశక్తులతో రక్షణ అవసరమని భావించారు. దానితో చక్రవర్తుల ఆదరణతో చైనాలో మిజోంగ్ (తాంత్రిక ప్రవాహం) అభివృద్ధి చెందింది. అతీంద్రీయ రక్షిత శక్తుల పట్ల టాంగ్ పాలకులలో నెలకొన్న అమితాసక్తి, అపార విశ్వాసాలను, వారి మంత్రశక్తుల ఆరాటాన్ని తీర్చవలసిన చారిత్రిక అవసరాన్ని, చైనాలో వజ్రయాన శాఖ సలక్షణంగా పూరించింది. ఒకవైపు తను జన్మించిన దేశంలో ప్రాభవం కోల్పోతున్న బౌద్ధం, చైనాలో మాత్రం వజ్రయాన రూపంలో నిలదొక్కుకోవడం ప్రారంభించింది. టాంగ్ రాజవంశపు పాలనా కాలంలో ఇటువంటి మార్మిక బౌద్ధమత ధోరణికి కైయువాన్ బౌద్ధత్రయం (శుభకరసింహ, వజ్రబోధి, ఆమోఘవజ్ర) మూలపురుషులుగా నిలిచారు. భారతదేశంలో వజ్రయానం సామాజిక నైతికత నుండి కొద్దిగా పక్కకు మరలే ప్రయత్నం చేస్తూ వున్నప్పుడు, చైనాలో మాత్రం అందుకు విరుద్ధంగా వజ్రయానం సామాజిక నైతికతకు పెద్దపీట వేస్తూనే కొనసాగింది. చైనాలో అప్పటికే వినయానికి (వినయపీటిక) అధిక ప్రాధాన్యత కల్పించడం వల్ల అక్కడి సన్యాసులు, ఆరామాలు నియమాలకు లోబడి, సామాజిక క్రమశిక్షణలో భాగంగా మెలగడమే దీనికి కారణం. అయితే టాంగ్ సామ్రాజ్యం అంతర్గతంగా బలహీనపడటం, అన్య మతశాఖలతో ఏర్పడిన శత్రుత్వం కారణంగా ఈ తాంత్రిక ధోరణి చిరకాలం కొనసాగలేక పోయింది. చాన్ సంప్రదాయం (Chan school), జింగ్టు సంప్రదాయాల (Jingtu school) ప్రభావంతో పోలిస్తే, ఈ తాంత్రిక సంప్రదాయ ప్రభావం క్రమేణా శుష్కించుకుపోతూ, చివరకు టాంగ్ రాజవంశంతో దాదాపుగా కనుమరుగైంది.

ప్రారంభజీవితం

[మార్చు]

అమోఘవజ్ర (క్రీ.శ 705-774) జన్మస్థలం గురించి చరిత్రలో భిన్నాభిప్రాయాలున్నాయి. అతను ఉత్తర భారతదేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అయితే అమోఘవజ్ర సమర్ఖండ్‌లో జన్మించాడని, [1] అతని తండ్రి ఒక భారతీయ వ్యాపారి లేదా బ్రాహ్మణుడని, తల్లి సోగ్డియన్ మూలాలకు చెందినదని మరికొన్ని ఆధారాలు పేర్కొంటున్నాయి. ఇతని మూలానికి సంబంధించి మరో కథనం ప్రకారం ఇతను సింహళద్వీపం (శ్రీలంక) లో జన్మించాడని కూడా పేర్కొనబడింది. ఏది ఏమైనప్పటికి అతను తన తండ్రి మరణం తర్వాత మేనమామను అనుసరించి పది సంవత్సరాల వయస్సులో చైనాకు వెళ్ళాడు.[1] క్రీ.శ. 719 లో, లుయోయాంగ్ (Luoyang) నగరంలో అతను ప్రసిద్ధ బౌద్ధ గురువు వజ్రబోధిని కలసుకోవడం జరిగింది. అతని ప్రభావంతో సంఘంలో చేరి అతనికి శిష్యుడైనాడు.[1] క్రీ.శ. 724 లో లుయోయాంగ్ లోని గ్వాంగ్‌ఫు ఆరామంలో (Monastery of Immense Happiness) వజ్రబోధి వద్ద బౌద్ధ సన్యాస దీక్ష తీసుకొన్నాడు.[2] సంస్కృతం, చైనీస్ భాషలపై తనకున్న తన పాండిత్యంతో గురువుని ఆకట్టుకొని, అతనికి అనువాద ప్రక్రియలో చేదోడు వాదోడుగా నిలిచాడు. వజ్రబోధి వద్ద పంచ సూత్రాలను (మహావైరోచనసూత్రం, వజ్రశేఖర సూత్రం, సుసిద్ధికర-మహాతంత్రసాధనోపాయిక-పాతాళ, వజ్రశేఖర-విమాన-సర్వయోగయోగి-శాస్త్రం, బుద్ధి సూత్రాలు), మూడు గుహ్యాలను (కాయ గుహ్యా, వాక్ గుహ్య, మనో గుహ్య) నేర్చుకొన్నాడు. క్రీ.శ. 741 లో మరణశయ్యపై వున్న తన గురువుకి ఇచ్చిన చివరి మాట ప్రకారం, అమోఘవజ్ర బౌద్ధ గ్రంథాలను సేకరించడం కోసం భారతదేశానికి వెళ్ళవలసి వచ్చింది. [1]

శ్రీలంక, భారతదేశాల పర్యటన

[మార్చు]

విదేశీ సన్యాసులందరూ చైనా నుండి బహిష్కరించబడిన తరువాత, అమోఘవజ్ర బౌద్ధ గ్రంథాలను సేకరించేందుకు తూర్పు దేశాలలో పర్యటించడానికి నాటి చైనా చక్రవర్తి జువాన్‌జాంగ్ నుండి 741లో కావలిసిన అనుమతులు తీసుకొన్నాడు. అయితే ప్రయాణానికి మునుపే అతని గురువైన వజ్రబోధి లుయోయాంగ్‌ లోని గ్వాంగ్‌ఫు (Guangfu) ఆరామంలో అనారోగ్యంతో మరణించడం జరిగింది. తన గురువుకి అంత్యక్రియలు పూర్తిచేసిన అనంతరం, అతను గ్వాంగ్జౌకు (Guangzhou) నగరానికి చేరుకొన్నాడు. గ్వాంగ్‌జౌ (కాంటన్) రేవు నుండి హంగువాంగ్, హుబియన్ వంటి 37 మంది శిష్యులతో, సహచరులతోను అమోఘవజ్ర క్రీ.శ. 741 లో బయలుదేరి సముద్ర మార్గంలో తూర్పు దేశాలలకు ప్రయాణించాడు.[2]

అమోఘవజ్ర మొదట జావా, సుమిత్ర (ఇండోనేషియా), ఆ తరువాత శ్రీలంకకు వెళ్లాడు. శ్రీలంకలో వున్నప్పుడే అతను వజ్రబోధి యొక్క గురువు నాగబోధిని కలుసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఆసిగిరి మహానాయకుని కలిసి అతని వద్ద తాంత్రిక బౌద్ధంలోని ప్రాథమిక సూత్రాలలో ఒకటైన వైరోచన-అభిసంబోధి సూత్రాన్ని, మహా కరుణ గర్భోధవ మండల సారంతోపాటు వజ్రయాన మతానికి సంబంధించిన మార్మిక గ్రంథాలను అభ్యసించాడు. తాంత్రిక బౌద్ధంలో అత్యున్నతమైన తత్త్వసంగ్రహాన్ని సుధీర్హంగా అధ్యయనం చేసాడు. ఆచార పద్ధతుల్లో శిక్షణ పొందాడు. ఆ పైన సంస్కృత మార్మిక గ్రంథాలను, సూత్ర గ్రంథాలను వెతుకుతూ భారతదేశం అంతటా పర్యటించాడు. ఈ విధంగా జావా, శ్రీలంక, భారతదేశాలలో సుమారు ఐదేళ్లపాటు పర్యటించి దాదాపు ఐదు వందల అమూల్య గ్రంథాలను సేకరించి, వాటితో క్రీ.శ. 746లో అతను చైనా (చాంగన్) కు తిరిగి వచ్చాడు.[1]

రాజాస్థానంలో అమోఘవజ్ర

[మార్చు]

జువాన్‌జాంగ్ (712-756) కాలంలో

[మార్చు]

అమోఘవజ్ర తూర్పుదేశాలనుంచి అమూల్యమైన రాత ప్రతులను తెచ్చిన విషయం తెలుసుకొన్న చక్రవరి జువాన్‌జాంగ్ ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. చక్రవర్తి ఆహ్వానంతో అమోఘవజ్ర రాజాస్థానానికి వెళ్లి అక్కడ జువాన్‌జాంగ్ కు తగు ఆచారాలతో అభిషేకం జరిపించాడు. తర్వాత జింగ్యింగ్ (Jingying) మఠంలో నివసిస్తూ తన వెంట తెచ్చిన గ్రంథాలకు అనువాదాలు చేసే ప్రక్రియకు మార్గదర్శకత్వం వహించాడు. రాజ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడినపుడు, రాజాస్థానం కోరిక మేరకు వర్షపు పూజలు నిర్వహించాడు. ఆ ప్రార్థనలు ఫలించడంతో అతని మంత్ర శక్తి ప్రభావవంతంగా నిరూపించబడింది. అతను జ్ఞానగర్భ (రిజర్వాయర్ ఆఫ్ విజ్డమ్) బిరుదుతో సత్కరించబడటంతో పాటు చక్రవర్తి నుండి ఊదారంగు వస్త్రపురస్కారం అందుకున్నాడు.[2] గౌరవాదరణలు పొందుతున్నప్పటికీ కొన్ని సంవత్సరాల తరువాత అమోఘవజ్ర భారతదేశానికి తిరిగి వెళ్లాలని ఆశించి 749 లో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొన్నాడు. కానీ అతను దక్షిణాన షావోజౌకి వెళ్లే మార్గంలో అనారోగ్యానికి గురయ్యాడు చివరకు చక్రవర్తి ఆదేశంతో భారతదేశానికి వెళ్లే యోచనను విరమించుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా అమోఘవజ్ర చైనాలో ఇరుక్కుపోయినప్పటికీ అది చైనాకి మేలు జరిగడానికే దారితీసింది. తిరిగి వచ్చిన తరువాత, డాక్సింగ్‌షాన్ ఆలయంలో నివసిస్తూ అనేక బౌద్ధ సూత్రాలను అనువదించాడు. తరువాత హింషాన్ (Hinshan) అనే మఠంలో ఉంటూ తన అనువాద పనిని కొనసాగించాడు.

కైయువాన్ ఆలయం, చైనా

చక్రవర్తి అనుగ్రహంతో పాటు టాంగ్ చైనాలోని పాలక ఉన్నత వర్గాల నుండి అతనికి మద్దతు, ప్రోత్సాహం లభించింది.[3] క్రీ.శ. 750 లో, వాయవ్యం నుండి విదేశీ చొరబాటు దారులు చైనాలో చొచ్చుకొని వస్తున్నప్పుడు, టాంగ్ రాజవంశానికి చెందిన జనరల్ గెషు హాన్ (Ge Shuhan), గ్జిపింగ్ యువరాజులు ప్రభుత్వ సైన్యానికి మంత్రశక్తులతో రక్షణ ఇవ్వమని అర్ధించారు. వారి కోరిక మేరకు అమోఘవజ్ర కైయువాన్ (Kaiyuan) ను సందర్శించి, అక్కడి కైయువాన్ ఆలయంలో పెద్ద ఎత్తున తాంత్రిక దీక్షలు, అభిషేక పూజలను నిర్వహించాడు. కైయువాన్ మఠంలో నివసిస్తున్నప్పుడే 754 లో అతను తత్త్వసంగ్రహ మొదటి భాగాన్ని అనువదించాడు. ఇది అతని అనువాదాలలో అత్యున్నతమైన గ్రంథం.

క్రీ.శ. 755 లో చైనాలో 'అన్ లుషన్' తిరుగుబాటు (Lushan Rebellion) జరిగింది. చాంగన్ ను స్వాధీనం చేసుకొన్న తిరుగుబాటుదారులు అమోఘవజ్రను బంధించారు. చక్రవర్తి ప్రవాసంలో గడపవలసి వచ్చింది. కానీ రెండు సంవత్సరాల అనంతరం క్రీ.శ. 757 లో అమోఘవజ్ర ప్రభుత్వ విధేయ దళాలచే విముక్తి పొందాడు.

సుజోంగ్ (756-762) కాలంలో

[మార్చు]

చాంగాన్, లుయోయాంగ్ వశమైన తర్వాత, టాంగ్ నూతన చక్రవర్తి సుజోంగ్ (756-762) తన రాజధాని చాంగన్ కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అమోఘవజ్ర రాజధానికి తిరిగి వచ్చి రాజవంశాన్ని బలోపేతం చేయడానికి అవసరమయ్యే శుద్ధి ఆచారాలు నిర్వర్తింఛాడు. బోధిమండ నిర్మించి హోమం (అగ్నిచయన) నిర్వహించి సుజోంగ్ చక్రవర్తిని చక్రవర్తిరాజన్గా అభిషేకించాడు. అమోఘవజ్ర లుషన్ తిరుగుబాటుకు వ్యతిరేకంగా టాంగ్ రాజవంశానికి సహాయం చేశాడు. వజ్రయాన ఆచారాలతో కూడిన అతని తాంత్రిక క్రతువులు, మంత్ర శక్తులు లుషన్ తిరుగుబాటుదారుల సైన్యాన్ని అతీంద్రియంగా నాశనం చేయడంలో విజయవంతమయ్యాయని చెప్పబడింది. ఫలితంగా లుషన్ తిరుగుబాటు జనరల్‌లలో ఒకరైన జౌ జిగువాంగ్ మరణించాడు. రాజ్య హితం కోసం అతను చేసిన తంత్ర పూజల ఫలితాలు ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు కావడంతో, అతను టాంగ్ రాజ్యంలో రాజకీయంగా శక్తివంతంగా అయ్యాడు. రాజ గురువుగా అతను ధర్మవ్యాప్తికోసం మార్మిక బౌద్ధమత ఆచారాలు ప్రారంభించాడు. చైనాలో అధికారిక మత సేవలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ బ్యూరోలో మంత్రిగా నియమించబడ్డాడు. [3] చక్రవర్తి పురోహితునిగా రాజాస్థానంలో అతని ప్రాభవం మరింతగా పెరిగింది. క్రీ.శ. 758 లో, అమోఘవజ్ర నూతన చక్రవర్తి సుజోంగ్‌ను అనువాద ప్రక్రియ నిర్వహణను కొనసాగించమని కోరాడు.

డైజాంగ్ (762-779) కాలంలో

[మార్చు]

సుజోంగ్ తదనంతరం, టాంగ్ చక్రవర్తి డైజాంగ్ (762-779) సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత, అమోఘవజ్ర మరింత ప్రభావశీలక స్థాయికి చేరుకున్నాడు. డైజాంగ్ చక్రవర్తి తన రాజవంశ పరిరక్షణ కోసం అతనిపై ఆధారపడ్డాడు. క్రీ.శ. 765 లో చాంగాన్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న రెండు లక్షల మంది టిబెటో-ఉయ్ఘర్ సైన్యాన్ని, అమోఘవజ్ర తాంత్రిక క్రతువులు సాయంతో పురోగమించకుండా నిరోదించాడని చెప్పబడింది. జనరల్ పుగు హుయెన్ (General Pugu Huaien) మరణం తర్వాత ఆక్రమణ దళాలు చెదరగొట్టబడ్డాయి. క్రీ.శ. 765లో, అమోఘవజ్ర హాంగ్లూసి (Honglusi) కి సంరక్షకుడయ్యాడు.

డైజాంగ్ చక్రవర్తి కోరిక మేరకు అమోఘవజ్ర రాజ్యంలో తలెత్తిన విపత్తులను నివారించడానికి తాంత్రిక పూజలను కొనసాగించాడు. బోధిసత్వ మంజుశ్రీ రక్షణలో సామ్రాజ్యాన్ని ఉంచడానికి చక్రవర్తిని ఒప్పించాడు. బోధిసత్వ మంజుశ్రీని చైనా రక్షకుడిగా ప్రచారం చేయడానికి అమోఘవజ్ర జింగే (Jinge) ఆలయ నిర్మాణాన్ని సంకల్పించాడు. తన శిష్యుడైన హంగువాంగ్‌ని (Hanguang) వుతాయ్ పర్వతంపై జింగే, యుహువా (Yuhua) ఆలయాలను నిర్మించడానికి పంపాడు. బోధిసత్వునికి అంకితమైన నాలుగు బౌద్ధ పర్వతాలలో ఒకటైన వుతాయ్ పర్వతంపై జింగే (స్వర్ణ మండపం) ఆలయ నిర్మాణం అతని పర్యవేక్షణలో క్రీ.శ. 766 లో ప్రారంభమై 767 లో పూర్తయ్యింది. దీని పలకలు రాగితో నిర్మించబడి బంగారంతో పూతపూయబడి నందువల్ల ఈ ఆలయానికి స్వర్ణ మండపం (గోల్డెన్ పెవిలియన్) అనే పేరు వచ్చింది. అమోఘవజ్ర ఈ ఆలయంలో కరుణ అవలోకితేశ్వరుడైన బోధిసత్వ మంజుశ్రీని ప్రధాన బుద్ధునిగా ప్రతిష్ఠించాడు. తన మనోసంకల్పమైన ఈ సంపన్న ఆలయాన్ని, చైనా యొక్క నాలుగు దిశలలో బోధిసత్వ మంజుశ్రీ యొక్క కీర్తిని చాటిచెప్పే కేంద్రంగా ఉండాలని సూచించాడు. అమోఘవజ్ర జింగే ఆలయంతో సహా ఐదు ఇతర ఆలయాల కోసం ఒక్కో ఆలయంలో 21 సన్యాసులను ఏర్పాటు చేయమని చక్రవర్తిని అభ్యర్థించాడు. భవిష్యత్తులో మార్మిక బౌద్ధమత అభివృద్ధికి అతను ఆ ఆలయాలను కేంద్రంగా చేశాడు.

అమోఘవజ్ర మహాయాన మార్మిక ఉత్కృష్ట సూత్ర యొక్క మూడు సంపుటాలను అనువదించాడు. అతని రాష్ట్రపాలప్రజ్ఞాపారమిత అనువాదానికి తొలిపలుకును చక్రవర్తి వ్యక్తిగతంగా రాసాడు. క్రీ.శ. 765 లో చక్రవర్తి నుంచి త్రిపిటకాభదంత (Master of Tripitaka లేదా Master Connoisseur of Vast Knowledge Tripitaka) బిరుదును పొందాడు.[2] క్రీ.శ. 771 లో, అమోఘవజ్ర తాను అనువదించిన 77 వర్గాలకు చెందిన 120 గ్రంథ సంపుటాలను డైజోంగ్‌ చక్రవర్తికి పుట్టినరోజు ఉత్సవ సందర్భంలో అందచేసి, వాటిని చైనీస్ త్రిపిటకాలలో విలీనం చేయాలని అభ్యర్థించాడు.[2] చక్రవర్తి అతనిని అభినందించి తదనుగుణంగా ఆ గ్రంథాల జాబితా తయారుచేయమని ఆదేశాలు జారీ చేసాడు. అమోఘవజ్ర తన మరణానికి కొంతకాలం ముందు డ్యూక్‌గా కూడా చక్రవర్తిచే నియమితుడయ్యాడు. చైనీస్ చరిత్రలో ఇంతకు ముందు లేదా తరువాత మరేతర సన్యాసి ఇంత అపారమైన శక్తిని కలిగి వుండలేదు.

అనువాద రచనలు

[మార్చు]

అమోఘవజ్ర తను మరణించేనంత వరకు 28 ఏళ్ల పాటు తూర్పు నుంచి తెచ్చిన గ్రంథాలను చైనీస్‌లోకి అనువదించడం కొనసాగించాడు. మొత్తమ్మీద డెబ్బై-ఏడు గ్రంథాలను స్వయంగా అనువదించిన ఘనత ఆయనది. ఈ విషయం డైజాంగ్ చక్రవర్తికి క్రీ.శ. 771 లో స్వయంగా తెలియచేసాడు. స్వతహాగా తాంత్రికుడు కావడంతో తాంత్రిక మార్గంలో కూడా ఎన్నో గ్రంథాలు రాసివుండవచ్చు. అనేక ఇతర మూల గ్రంథాలు అతనికి ఆపాదించబడటమే కాకుండా అతనిపేరుతోనే, చైనీస్ కానన్ (బృహత్తర గ్రంథ సంగ్రహం) లలో పేర్కొనబడ్డాయి. క్రీ.శ. 754 లోనే అతను తత్త్వసంగ్రహ మొదటి భాగాన్ని చైనీస్ లోకి అనువదించాడు. అతని ముఖ్యమైన ఇతర అనువాద రచనలు.

  • మహామయూరివిద్యా రాగిణి
  • కుండీ ధారిణి
  • మరీచిధర్మ
  • మరీచిదేవిపుష్పమాల సూత్ర
  • గతానంతముఖ ధారిణీ
  • కరందముద్రా ధారిణీ
  • మహర్షి సూత్ర
  • మహాశ్రీ-దేవి-ద్వాదశ బంధన శాస్త్ర నామం-విమలమహాయన సూత్ర
  • గంగూలీ విద్య
  • రత్నమేఘ ధారిణి
  • శాలిసంభవసూత్ర
  • రాష్ట్రపాలప్రజ్ఞాపరిమితా
  • మహామేఘసూత్ర
  • ఘనసూత్ర
  • పర్ణేశ్వరి ధారిణి
  • వైశ్రమండివరాజ సూత్రం
  • మంజుశ్రీ పరిపృచ్ఛసూత్రాక్షరమంత్రికాదయ
  • పంచతంత్రీ సద్బుద్ధనామపూజా అంగీకార పత్రం
  • అవలోకితేశ్వర-బోధిసత్వ-దిశ-భద్ర ధారిణి
  • అష్ట మండలసూత్ర
  • చక్షుర్విశోధన విద్యా ధారిణీ
  • సర్వ రోగ ధరిణి
  • గవల ప్రసన్నధారిణి
  • యోగ సంగ్రహ మహార్త ఆనంద పరిత్రాన ధారిణి
  • ఏకకుధార్య ధారిణీ
  • అమోఘ పాశ్వైరోచనబుద్ధమహాభిషేక ప్రభాసమంత్ర సూత్ర
  • నీతి సూత్రం
  • తేజప్రభ-మహాబల-గుణపాదవినయశ్రీ ధారిణీ
  • ఓ-లో-టో-లో ధారిణి
  • అశ్నీశ చక్రవర్తి తంత్రం
  • బోధిమాండత్రైకశరోశ్నిశ చక్రవర్తి రాజ సూత్ర
  • బోధిమాండ వ్యూహ ధారిణీ
  • ప్రజ్ఞాపరమిత అర్ధశతికా
  • వజ్రశేఖర యోగ సూత్ర
  • మహాప్రతిసార ధారిణి
  • గరుడగర్భరాజ తంత్రం
  • వజ్ర-కుమార-తంత్ర
  • సామంత నిదాన సూత్ర
  • మహాయాన-నిదాన సూత్ర
  • హరితిమాతృమంతరకల్ప
  • సర్వ ధారిణుల ఏకసూత్రీ

మరణం

[మార్చు]
జియాన్ నగరంలోని డాక్సింగ్‌షాన్ ఆలయం, చైనా

అమోఘవజ్ర తన చివరి రోజులలో జియాన్ నగరం (షాంగ్సీ ప్రావిన్స్‌) లోని ప్రసిద్ధ చైనీస్ బౌద్ధ దేవాలయం డాక్సింగ్‌షాన్ (Da Xingshan) ఆలయంలో నివసించాడు. తనకు మరణ ఘడియలు సమీపించాయని ముందుగానే ఊహించిన అమోఘవజ్ర తన చక్రవర్తి నుండి చివరి వీడ్కోలు తీసుకొని డాక్సింగ్‌షాన్ ఆలయంలో ధ్యానంలో కూర్చొని, తన 70 సంవత్సరాల వయస్సులో ప్రశాంతంగా మరణించాడు. క్రీ.శ. 774 లో అతని మరణంతో, చైనాలో అధికారికంగా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అతని అవశేషాలను డాక్సింగ్‌షాన్ ఆలయంలో భద్రపరిచి దానిపై ఒక పగోడా నిర్మించారు.[2] మరణానంతరం సికాంగ్, డాబియాన్‌జెంగ్ వంటి వివిధ ఉన్నత బిరుదులు అతనికి ఇవ్వబడ్డాయి.[4]

వారసత్వం

[మార్చు]

అమోఘవజ్ర ప్రధాన శిష్యులలో హుయిలాంగ్ (Huilang), హుయిగువో ( (Huiguo), హుయిలిన్ (Huilin) అనే చైనా సన్యాసులు అత్యంత ప్రముఖులు. అమోఘవజ్ర యొక్క చైనీస్ శిష్యుడు హుయిగువో (Huiguo) (746-805) అతని నుండి ధర్మజ్ఞానం పొంది చైనాలో కడపటి, ఏడవ పితృస్వామి (patriarch) గా ఆరాధించబడ్డాడు.[2] ఈ హుయిగువో యొక్క శిష్యుడు కూకై (Kukai) అనే జపానీస్ బౌద్ధ సన్యాసి. ఇతను చైనీస్ మార్మిక (esoteric) బౌద్ధమత సంప్రదాయాన్ని 774వ-835) విదేశాలలో విస్తరించాడు. [2] జపాన్‌లోని జెన్యన్ (మంత్ర లేదా True Word) సంప్రదాయం యొక్క మొదటి మూలపురుషుడైన 'కూకై', [2] చైనా నుండి తిరిగి వచ్చిన తదుపరి జపాన్ లో షింగోన్ (Shingon) సంప్రదాయాన్ని ప్రారంభించాడు. షింగోన్ అనేది వజ్రయాన బౌద్ధమతం యొక్క జపనీస్ శాఖ. నేడు జపాన్‌ బౌద్ధమతంలో షింగాన్ ఒక ప్రముఖ శాఖగా వర్ధిల్లుతుంది.

బౌద్ధధర్మంలో అమోఘవజ్ర స్థానం-అంచనా

[మార్చు]

చైనీస్ బౌద్ధమత చరిత్రలో అమోఘవజ్ర స్థానాన్ని అక్కడ వజ్రయాన బౌద్ధమతం యొక్క స్థాపకులలో ఒకనిగా, రాజకీయంగా శక్తివంతమైన సన్యాసిగా, అమూల్యమైన బౌద్ధ గ్రంథాల సేకరణకర్తగా, గొప్ప అనువాదకుడిగా అంచనా వేయవచ్చు.

చైనాలో తంత్ర సంప్రదాయ ప్రవర్తకునిగా, వజ్రయాన మతాచార్యునిగా అమోఘవజ్ర చేసిన కృషి శ్లాఘనీయమైనది. అతను చైనీస్ మార్మిక (esoteric) బౌద్ధమత స్థాపకులలో ఒకడు. శుభకరసింహ, వజ్రబోధితో కలిసి అతన్ని కైయువాన్ బౌద్ధగురుత్రయం లేదా ‘ముగ్గురు కైయువాన్ గురువులు' అని పిలుస్తారు.[2] అతను బోధించిన వజ్రయాన బౌద్ధమతం బాహ్య తంత్రాలకు కేంద్రంగా ఉంది. ఇది అతని అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి.అతను తంత్ర బోధనలను జ్ఞానోదయం పొందేందుకు అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పరిగణించాడు. చైనాలో టాంగ్ వంశపు పాలనలో వజ్రయాన శాఖ వ్యాప్తికి విశేష కృషి చేసాడు. అయితే భారతదేశంలో నెలకొంటున్న మాదిరికాకుండా అమోఘవజ్ర తన వజ్రయాన తాంత్రిక దీక్షలను చైనీయ ప్రజలలో నైతికతను పెంపొందించే రీతిలోనే వృద్ధి చేయడం గమనించతగ్గ విషయం. జావో కియాన్ యొక్క “అమోఘవజ్ర సంజాంగ్ యొక్క జీవిత చరిత్ర” ప్రకారం, 40 సంవత్సరాలకాలంలో, అమోఘవజ్ర (బుకాంగ్‌జింగాంగ్) పదివేల మందిని పైగా బౌద్ధ విశ్వాసులుగా మార్చాడు. అతని ప్రభావంతో సుమారు రెండు వేలమందికి పైగా ప్రజలు సన్యాస దీక్షలను స్వీకరించారు. కాబట్టి అతను ఒక తరానికి ఉపదేశకుడయ్యాడు. అమోఘవజ్ర కారణంగానే చైనాలో తాంత్రిక ధర్మం విస్తృతంగా వ్యాపించింది. అతను అనేక తాంత్రిక సూత్రాలు, ధారిణిలను చైనీస్ భాషలోకి అనువదించాడు. అతను వీటిని అనువదించడమే కాకుండా చైనా ప్రజలకు భారతీయ సంస్కృతిని పరిచయం చేశాడు.

రెండవది. ఒక బౌద్ధ సన్యాసిగా అతని ప్రభావశీలత మచ్చలేనిది. అమోఘవజ్ర, చైనీస్ చరిత్రలో ముఖ్యంగా టాంగ్ రాజవంశ పాలనాకాలంలో రాజకీయంగా అత్యంత శక్తివంతమైన బౌద్ధ సన్యాసులలో ఒకనిగా పరిగణించబడ్డాడు. ఒకరి తరువాత ఒకరుగా ముగ్గురు చక్రవర్తుల ఆస్థానంలో రాజగురువుగా కొనసాగినప్పటికీ రాజ్యంపై అతని ప్రభావం అంతకంతకూపెరుగుతూ వచ్చిందే కాని తగ్గలేదు. ముగ్గురు చక్రవర్తులూ తమ రాజవంశ రక్షణ కోసం అతనిపై పూర్తిగా ఆధారపడటం కనిపిస్తుంది. మంత్ర తంత్రాలకు కొలువైన వజ్రయాన బౌద్ధమతంలో అమోఘవజ్ర అతీంద్రియ శక్తులతో వ్యవహరించినప్పటికీ అతను నిబద్దత గల సన్యాసిగానే వ్యవహరించాడే తప్ప ఎన్నడూ వాటిని దుర్వినియోగం చేసిన దాఖలా కనిపించదు. రాజగురువుగా తన శక్తియుక్తులను, మంత్రం తంత్రాలను తిరుగుబాట్లనుండి, విదేశీ చొరబాట్ల నుండి రాజ్య రక్షణకై, ప్రజాశ్రేయస్సు కొరకై వినియోగించడం జరిగింది. ప్రతిగా టాంగ్ రాజవంశానికి చెందిన ముగ్గురు చైనా చక్రవర్తులు-జువాన్‌జాంగ్, సుజోంగ్‌, డై-జోంగ్ లు కూడా అతని పట్ల ఎంతో గౌరవ కృతజ్ఞతతో మెలిగారు. దీనికి టాంగ్ చైనాలో, అమోఘవజ్ర పొందిన అత్యున్నత స్థాయి, గొప్ప గౌరవ బిరుదులు, పురస్కారాలే నిదర్శనం.

మూడవది. అమూల్యమైన బౌద్ధ గ్రంథ సేకరణకర్తగా అమోఘవజ్ర చైనాకు చేసిన సేవ చిరస్మరణీయమైనది. అతను శ్రీలంక, భారతదేశంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో ఏళ్ళ తరబడి పర్యటించి, ఐదు వందలకు పైగా బౌద్ధ గ్రంథ రాతప్రతులు సేకరించాడు. అవి అంతకు మునుపెన్నడూ చైనాకు తీసుకురాని అమూల్య గ్రంథాలు. రాబోయే కాలంలో చైనాలో వజ్రయానం సుసంపన్నంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన పునాదిని ఈ గ్రంథాలు ఏర్పాటు చేశాయి. ఎనిమిదవ శతాబ్దంలో ఇంత అద్భుతమైన పనిచేసిన ఏకైక పండితుడు అమోఘవజ్రయే. అతను చైనాకు తీసుకు వచ్చిన సంస్కృత గ్రంథాలలో అత్యధికం నేడు భారతదేశంలో విలుప్తమైపోయాయి. లేదా నాశనమై పోయి ఉండవచ్చు. అమోఘవజ్ర చేసిన చైనీస్ అనువాదాలనుండి కొన్ని విలువైన వజ్రయాన గ్రంథాలను తిరిగి భారతీయ భాషలలో పునర్నిర్మించుకోవాల్సిన అవసరం కూడా కలిగింది.

నాల్గవది. అనువాదకునిగా అతని కృషి అద్భుతమైనది. నిజానికి అమోఘవజ్ర (8వ శతాబ్దం), బౌద్ధ గ్రంథాల యొక్క '"నలుగురు గొప్ప అనువాదకులలో'" ఒకనిగా ఖ్యాతి పొందాడు. [2] మొదటి ముగ్గురు అనువాదకులు కుమారజీవుడు (5వ శతాబ్దం), పరమార్థ (6వ శతాబ్దం), హుయాన్ త్సాంగ్ (7వ శతాబ్దం-హర్షుని కాలంలో భారతదేశంలో పర్యటించిన యాత్రికుడు). చైనాకు తెచ్చినప్పటి నుండి తాను మరణించే వరకు అమోఘవజ్ర 77 గ్రంథాలను స్వయంగా అనువదించాడు. అతని అనువాదాలలో తత్త్వసంగ్రహ మొదటి భాగం అతని జీవితకాలంలో అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటిగా నిలిచింది.[4]

బౌద్ధమతంపై అమోఘవజ్రుని ప్రభావం చైనా దాటి జపాన్, కొరియా వరకు వ్యాపించింది. అమోఘవజ్ర తన శిష్యుల ద్వారా జెన్యన్ (మంత్ర) సంప్రదాయాన్ని సృష్టించడం ద్వారా జపనీస్ బౌద్ధమతంపై గొప్ప ప్రభావాన్ని చూపాడు. నేడు జపాన్‌లోని బౌద్ధమతంలో షింగాన్ ఒక ప్రముఖ వజ్రయాన శాఖ. జపానీస్ బౌద్ధ సన్యాసి కూకై (Kukai) ప్రారంభించిన ఈ షింగోన్ సంప్రదాయంలో అమోఘవజ్రను ఆరవ పితృదేవతగా (patriarch) గౌరవిస్తారు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గ్రంథ సూచిక

[మార్చు]
  • Aliade, Mircea (1987). The Encyclopedia of Religion. New York: Macmillan Publishing Company. p. 238.
  • Doniger, Wendy (2006). Britannica Encyclopedia of World Religion. London: Encyclopedia Britannica. p. 43.
  • Zhang Yuhuan (2012a). "The Cradle of Chinese Esoteric Buddhism: Xi'an Daxingshan Temple" 《汉传佛教密宗的祖庭:西安大兴善寺》. 《图解中国著名佛教寺院》 [Illustration of Famous Buddhist Temples in China] (in చైనీస్). Beijing: Contemporary China Publishing House. ISBN 978-7-5154-0135-5.
  • Zhang Yuhuan (2012b). "Daxingshan Temple and the Three Prominent Buddhist Monks in the Kaiyuan Period" 《“开元三大士与大兴善寺”》. 《图解中国佛教建筑》 [Illustration of Buddhist Architecture in China] (in చైనీస్). Beijing: Contemporary China Publishing House. ISBN 978-7-5154-0118-8.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Aliade 1987.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 Buddha Sutras Mantras Sanskrit 2009.
  3. 3.0 3.1 Geoffrey Goble 2021.
  4. 4.0 4.1 Doniger 2006.
"https://te.wikipedia.org/w/index.php?title=అమోఘవజ్ర&oldid=4311674" నుండి వెలికితీశారు