అమ్మా నాన్న (1966 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మా నాన్న
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.దాదా మిరాశి
తారాగణం జమున,
కళ్యాణ్ కుమార్,
ఎం.ఆర్.రాధ,
నగేష్,
మనోరమ
సంగీతం జె.పురుషోత్తం
నేపథ్య గానం బి.రమణ
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ మోహన్ పిక్చర్స్
భాష తెలుగు

అమ్మా నాన్న 1966, డిసెంబర్ 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఇది కడువలిన్ కుళందై అనే తమిళ సినిమా యొక్క డబ్బింగ్ చిత్రం.

కథా సంగ్రహం

[మార్చు]

కథానాయకుడైన విశ్వం (కళ్యాణ్ కుమార్) వ్యాపారి, ఫ్యాక్టరీ యజమాని అయిన ఒక సంపన్నుడి ఏకైక పుత్రుడు. విశ్వం పై చదువులు ముగించుకుని విదేశాలనుండి రాగానే కారులో జోరుగా హుషారుగా షికారు చేస్తున్న సమయంలో అందాలరాశి సరోజ (జమున) తారసిల్లుతుంది. అప్పుడే వారి చూపులతోపాటు మనసులు కూడా కలుస్తాయి. అనంతరం సరసాలు, సరాగాలు ప్రారంభిస్తారు. కాని తమ ప్రేమ కథ అడ్డం తిరుగుతుందని వారికి తెలియదు. ఈలోపుగానే అయినవారికి తెలియకుండా రిజిస్టరు వివాహం కూడా చేసుకుంటారు.

నాయకీనాయకుల ప్రేమకథను, స్వార్థానికీ, నైచ్యానికీ ప్రతిరూపమైన ఫ్యాక్టరీ మేనేజరు రత్నం పసిగడతాడు. ఈ జంటను వేరుచేయకపోతే తనకు, తన ఉద్యోగానికి ముప్పు వాటిల్లుతుందని గ్రహిస్తాడు. ఇతడి కుయుక్తులకు విశ్వం మేనత్త సహకరిస్తుంది. తన కూతురు పద్మినిని విశ్వం భార్యగా చేయాలని ఆమె సంకల్పం.

ఒక వ్యాపార ఒడంబడిక మీద సంతకం చేయాలన్న మిషతో విశ్వాన్ని సింహళం పంపిస్తారు. విశ్వం కొలంబో వెళ్ళిన తర్వాత అతని ప్రేమఫలితంగా కడుపు పండిన సరోజను రత్నం ఇంటినుండి తరిమివేస్తాడు. సరోజ ఒక పేదరాలి ఇంటికి చేరుతుంది. అక్కడే బిడ్డను కంటుంది.

విశ్వం కొలంబో నుండి తిరిగి వచ్చిన తర్వాత సరోజ మరణించిందన్న వార్త విని భగ్నహృదయుడై వెర్రివాడుగా మారిపోతాడు. ఇష్టం లేకపోయినా అతడి మెడలు వంచి మేనత్త కూతురుతో పెళ్ళి చేస్తారు.

పేదరాలి ఇంటవున్న సరోజ, పసిపాప ఒకనాడు రత్నం కంట పడతారు. అతనిలో ద్వేషం తిరిగి రగులుకుంటుంది. తల్లి నుండి బిడ్డను కూడా వేరుచేస్తాడు. కాని బిడ్డ అతనికి చిక్కకుండా ఒక అనాథ రక్షకుడైన భారతి సన్నిధికి చేరుతుంది. అతడు ఆ పిల్లవాడిని పెంచుతాడు. అమ్మా నాన్న లేని ఒక పిల్లవాడిని సాకుతున్నందుకు ఆ వూరిలో కొందరు ఆయనపై ఈర్ష్యతో పగబడతారు. ఆ తపస్వి హృదయాన్నే కాక, శరీరాన్ని కూడా గాయపరుస్తారు.

సరోజ నర్సువృత్తిలో ప్రవేశిస్తుంది. విశ్వం అచేతనుడిగా కాలం వెళ్ళబుచ్చుతుంటాడు. డబ్బుకోసం రత్నం కుట్రలు పన్నుతూనే ఉంటాడు. ఈ కుట్రలన్నీ భగ్నమై చివరకు రత్నం నేరస్తుడిగా సమాజం ముందు నిలబడతాడు.

నేరస్తునికి శిక్షతప్పదని నాకు తెలుసు అంటూనే ఎదురుగా వచ్చిన పోలీసులను స్వయంగా ఆహ్వానించి బేడీలను వేయమని చేతులు చాపుతాడు రత్నం.

రత్నం కుట్రలు భగ్నమైనదశలో విశ్వం రెండవభార్య విషప్రయోగం వల్ల మరణిస్తుంది. స్వార్థానికి వంచితురాలైన ఆమె తల్లి ఉన్మాది అవుతుంది. విశ్వం రెండవ భార్య కూతురు తల్లి లేనిదవుతుంది.

విశ్వం, కొడుకు కృష్ణ, తల్లి సరోజ ముగ్గురూ ఆసుపత్రిలో కలుసుకుంటారు.[2]

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.
  2. సి.ఎస్.బి. "చిత్ర సమీక్ష". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 25 August 2016.[permanent dead link]