అయస్కాంతత్వం
అయస్కాంతత్వం వలన ఒకరకమైన భౌతిక ధర్మాలు కలిగిన వస్తువులు అయస్కాంత క్షేత్రంలో ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయి, లేదా వికర్షించుకుంటాయి. అయస్కాంత క్షేత్రం ప్రాథమిక కణాల వలన కలిగే విద్యుత్ ప్రవాహం ద్వారా గానీ, లేదా వాటి అయస్కాంత గుణం వల్ల ఏర్పడుతుంది కాబట్టి విద్యుదయస్కాంతత్వం లో అయస్కాంతత్వం కూడా ఒక కీలకమైన భాగం. మనకు బాగా పరిచితమైన ప్రభావాలు లోహాయస్కాంత పదార్థాలలో (ferromagnetic materials) కనిపిస్తాయి. ఇవి అయస్కాంత క్షేత్రాల ద్వారా బలంగా ఆకర్షితమవుతాయి. వీటిని అయస్కాంతీకరణ ద్వారా శాశ్వత అయస్కాంతంగా మారిస్తే వాటంతట అవే స్వయంగా అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయస్కాంతత్వాన్ని పోగొట్టడం (డీమాగ్నటైజింగ్) కూడా సాధ్యమే. కొన్ని పదార్థాలు మాత్రమే లోహాయస్కాంతాలు. వీటిలో అత్యంత సాధారణమైనవి ఇనుము, కోబాల్ట్, నికెల్, వాటి మిశ్రమాలు.
అన్ని పదార్థాలు ఎంతోకొంత అయస్కాంతత్వాన్ని ప్రదర్శిస్తాయి. అయస్కాంతత్వంలో పలు రకాలు ఉన్నాయి. అల్యూమినియం, ఆక్సిజన్ వంటి పారా అయస్కాంత పదార్థాలు, అనువర్తిత అయస్కాంత క్షేత్రానికి బలహీనంగా ఆకర్షితమవుతాయి.
అయస్కాంత క్షేత్రం యొక్క బలం ఎల్లప్పుడూ అయస్కాంత మూలం నుండి దూరం వెళ్ళేకొద్దీ తగ్గుతుంది. అయితే బలం, దూరం మధ్య ఖచ్చితమైన గణిత సంబంధం మారుతూ ఉంటుంది.[1] పదార్థం యొక్క అయస్కాంత క్షణం, వస్తువు యొక్క భౌతిక ఆకృతి, వస్తువు లోపల ఉన్న ఏదైనా విద్యుత్ ప్రవాహ పరిమాణం, దిశ ఇంకా వస్తువు ఉష్ణోగ్రతతో సహా అనేక అంశాలు ఆ వస్తువు యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేయగలవు.
చరిత్ర
[మార్చు]భారతీయ ప్రాచీన వైద్య గ్రంథమైన సుశ్రుత సంహితలో అయస్కాంతాన్ని ఉపయోగించి శరీరంలో దిగిన బాణాల్ని వెలికితీయవచ్చని రాసి ఉంది.[2] సా.పూ 4వ శతాబ్దానికి చెందిన పురాతన చైనా గ్రంథాలలో కూడా అయస్కాంత వాడకాన్ని గురించి ప్రస్తావన ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Du, Yaping; Cheng, T.C.; Farag, A.S. (August 1996). "Principles of power-frequency magnetic field shielding with flat sheets in a source of long conductors". IEEE Transactions on Electromagnetic Compatibility. 38 (3): 450–459. doi:10.1109/15.536075. ISSN 1558-187X.
- ↑ Kumar Goyal, Rajendra (2017). Nanomaterials and Nanocomposites: Synthesis, Properties, Characterization Techniques, and Applications. CRC Press. p. 171. ISBN 9781498761673.
- ↑ The section "Fanying 2" (反應第二) of The Guiguzi: "其察言也,不失若磁石之取鍼,舌之取燔骨".