ఆకు ఆకృతి
చెట్లకు ఉండే ఆకులు వివిధ ఆకృతులలో ఉంటాయి. చెట్లకు ఉండే ఆకుల ఆకృతిని బట్టి వృక్షశాస్త్రంలో వివిధ పేర్లను నిర్ణయించడం జరిగింది. ఆకు యొక్క ఆకృతుల పేరు చెప్పగానే ఆకు యొక్క ఆకారం, ఆకు యొక్క అంచులు, ఆకు పైన ఉండే గీతలు అన్ని ఒకేసారి స్పురణకు వచ్చేలా ఆకు ఆకృతి పేరును వృక్షశాస్త్రంలో అభివృద్ధి పరుస్తున్నారు. వివిధ ఆకారాలలో ఉన్న ఆకులను వాటి రూపుని బట్టి అవి హస్తాకారంలో ఉన్నవని, దీర్ఘచతురస్రాండాకారంలో ఉన్నవని ఈ విధంగా ఆకు యొక్క ఆకృతిని తెలియజేసే విధానాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ఆకు ఆకృతి విధానాన్ని అవలంభిస్తున్నారు.
ఆకులన్నియు నొకతీరున లేవు. వాని ఆకారమునుబట్టి దీర్ఘాకారము (పచ్చగన్నేరు) బల్లెపాకారము (నరమామిడి) నిడివిచౌకపాకారము (చింతాకుల చిట్టి ఆకులు) సమగోళాకారము (బిళ్లగన్నేరు నారింజ, తెల్లడమర) అండాకారము (మర్రి) హృదయాకారము (రావి) గుండ్రము (తామర) బాణాగ్రాకారము (చేమ) అధశ్శిర అండాకారము (మావలింగముఆకు) జీడిగింజాకారము కర్ణాకారము అనియు చెప్పుదుము. ఆకుల అంచులును ఒకతీరున లేవు. కొన్ని జామాకు వలెనే, గొగ్గి గొగ్గిలుగా నుండక సమముగా నుండును. అట్టి వాని అంచు సమాంచలము. గులాబి ఆకున గొగ్గి గొగ్గిలు ఉన్నాయి. వానికి పోలికను బట్టి రంపపు పండ్లని పేరు వచ్చింది. ఇవి తిన్నగా నుండక కొంచము అయిమూలగ నున్నవి. మందారపు టాకులలో వలె తిన్నగానుండిన వానిని దంతములందుము. కొన్నిటిలో ఈ గొగ్గిలకొన సన్నముగా నుండక గుండ్రముగా నుండును. అవి వలయదంతములు. తొగరు, నరమామిడి ఆకులయంచున గొగ్గిగొగ్గిలుగా లేదు గాని, పైకిక్రిందకు వంపులు కలిగి కెరటమువలె ఉంది. ఇట్టి దానిని తరళితమందుము. ఆకులకొనయు కొన్నిటిలో రావియాకునందు వలె వాలము కలిగియున్నది. గన్నేరు ఆకులో సన్నముగా నున్నది. మర్రి ఆకులో గుండ్రముగా ఉంది. కొన్నిటిలో గుండ్రముగా నుండి మధ్య నొక దంతమును కలిగియున్నవి. కొన్నిటిలో మధ్యకు చీలియుండి, ఆకును తలక్రిందుగా బట్టి చూచిన హృదయాకారముగ నగుపడును. వీనిని అధశ్శిర హృదయాకార మందుము. ఇట్లే అధశ్శిర అండాకారము. కొన్నిటి చివర కొంచము లోపలకు దించుకు పోయినట్లుండును, ఇట్టి దానిని ఖనితమందుము. చింతాకుల చిట్టి ఆకులలో నున్నట్లు కొన్నిటి చివర మొనదేరక, కోసివేసినట్లుండును. ఇట్టిదానిని క్షిప్తము అందుము. ఆకుల మీద సాధారణముగ మధ్యనొక పెద్ద ఈనె ఉండి దాని నుండి చిన్న ఈనెలు వచ్చి ఒక దానితోనొకటి శాఖోపశాఖలై గలియుచున్నవి. ఇట్లు ఒకదానితో నొకటి కలియుచుండిన విషమరేఖ పత్రమందుము. మెట్టతామర, కొబ్బరి మొదలగు ఆకులలో ఈనెలు కొనవరకును కలియకుండనే పోవుచున్నవి. అవి సమరేఖ పత్రములు.