ఆమ్రపాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Amrapali greets Buddha Roundel 36 buddha ivory tusk.jpg
ఢిల్లీలోని మ్యూజియంలో ఉన్న చెక్కిన బొమ్మ - బుద్ధునికి నమస్కరిస్తున్న ఆమ్రపాలి

ఆమ్రపాలి (Amrapali) గౌతమ బుద్ధుని కాలంనాటి చారిత్రక ఇతివృత్తం. ఆమ్రపాలి అంటే సంస్కృతంలో "మామిడి చిగురు" అని అర్థం.

ఆమ్రపాలి పద్య కావ్యం

[మార్చు]

ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో 'ది స్పీకింగ్ ట్రీ' శీర్షికతో వ్యాసం ప్రచురించబడింది.[1] దీని ఆధారంగా పువ్వాడ తిక్కన సోమయాజి 2007 సంవత్సరంలో ఆమ్రపాలి అనే పద్య కావ్యాన్ని రచించారు. దీనిని అయిదు ఖండాలుగా సుమారు 160 పద్యాలుగా రూపొందించారు.

ఆమ్రపాలి కథ రసభరితమయినది. దీన్ని సినిమాలుగా కూడా తీశారు. ఇంకా తీస్తున్నారు. ఆ కథలో అంత ఆకర్షించిన అంశాలేమిటి? ఇలా ఆలోచిస్తూ మన తెలుగులో ఎవరైనా ఆమ్రపాలి కథను రాశారా? తెలుగులో చాలామంది బౌద్ధ మతేతివృత్తంతో వివిధ కావ్యాలను రాశారు. గౌతమబుద్ధుని బోధనలకు ఆకర్షితులైన వాళ్ళలో వేశ్యలు కూడా ఉన్నారు. వేశ్యగా మారడానికి కారణాలెన్ని ఉన్నా, మరలా సాధారణ స్త్రీగా ఆమె తన జీవితాన్ని గడపాలనుకుంటే, ఈ సమాజం ఎంతవరకూ అంగీకరిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న! ఆ ప్రశ్నకు సరైన సమాధానమే బుద్ధుడు ఆమ్రపాలిని బౌద్ధమతంలోకి ఆహ్వానించడం. బౌద్ధ హిందూమతంలో అనాచారులుగా కనిపించే చాలా వాటిని సంస్కరించే ప్రయత్నం కనిపిస్తుంది. సమాజ నిరాదరణకు గురయిన వాళ్ళనెంతోమందిని దరి చేర్చుకొని, తక్కువ కాలంలోనే విస్తృతంగా వ్యాపించ గలిగింది. సామాజిక నిర్బంధాల కారణంగా గణభోగ్యగా మారిన ఆమ్రపాలి కథ ఇంచుమించు అన్ని భారతీయ భాషలలోను ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగులో చాలామంది ఈ కథను రాశారు. ‘ఆమ్రపాలి’ బౌద్ధ జాతక కథను యస్.టి.జ్ఞానానంద కవిగారు ఎనిమిది ఆశ్వాసాలుగాను, కరటూరి సత్యనారాయణగారు ఏడు సర్గలుగాను విభజించి ‘ఆమ్రపాలి’ అనే పేర్లతో కావ్యాలుగా రాశారు. జ్ఞానానందకవిగారు శాంతాన్నీ, కరటూరి వారు ‘కరుణ’ను ప్రధాన రసాలుగా పోషించారు.[2] ఇరువురు కవులూ ఆమ్రవనంలో ‘ఆమ్రపాలి’ అనాధగానే దొరికినట్లు పేర్కొన్నారు. లల్లాదేవి మాత్రం పూర్తి భిన్నంగా కథను సామాజిక అంశాలతో పరిశీలించి రచించారు. ఆమ్రపాలి అసలు పేరు ‘ఉదాయి’గా మార్పు చేసి, ఆమ్రవనంలో నివసించటం వల్ల ‘ఆమ్రపాలి’గా మారినట్లు, ఆ పిల్ల పుట్టిన తరువాత తల్లిదండ్రులు చనిపోయినట్లు లల్లాదేవి మార్పులు చేశారు. యస్.టి. జ్ఞానానందకవిగారు తన కావ్యంలో పిల్లలు లేని మహానామునికి (శాక్య ధనికునికి) ‘ఆమ్రపాలి’ దొరకగా, కరటూరి వారి కావ్యంలో ఆనందుడనే కొడుకు కలిగిన శాక్యధనికునికి ఆ పసిపిల్ల దొరికినట్లు చిత్రించారు. ఆడపిల్ల పెళ్ళీడుకొస్తుంటే, పెళ్ళి చేయాలనే తపన తండ్రికి ఎలా పెరుగుతుందో అది జ్ఞానానందకవిగారి కావ్యంలో బాగా కనిపిస్తుంది. కానీ, కరటూరివారు, ‘తండ్రి రాజ్య నిర్వహణా భారంలో పడి కూతురికి వివాహం చేయటం మరచిపోయినట్లు రాశారు. ఇటువంటి ప్రయత్నమేదీ లల్లాదేవి నవలలో కనిపించలేదు. ఆమ్రపాలి తండ్రి లిచ్ఛవుల మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారి వల్ల కూతురికి ఏ ముప్పు వాటిల్లుతుందోననే భయంతో ఉండేవాడనీ, కనుక సరియైన సమయంలో తగిన వరుణ్ణి చూసి వివాహం చేయాలని భావించి స్వయంవర సభను ఏర్పాటు చేసినట్లు జ్ఞానానందకవిగారు వివరించారు.గణతంత్ర రాజ్యాలలో అందమైన యువతి కనిపిస్తే, ఆ దేశ పాలకులు గణభోగ్యగా చేసుకొనే ఆచారం ఉంది. శాక్యధనికుడు గణతంత్ర రాజ్యానికి చక్రవర్తి అయినా, పాలకులంతా ఏకమయి తీర్మానిస్తే తన కూతురినయినా గణభోగ్యగా చేయవలసిందే! కానీ, ‘స్వయంవరం’ అనేది ఒక సంప్రదాయం మాత్రం ఉంది. స్వయంవరంలో యువతికి నచ్చిన యువరాజుని పెళ్ళి చేసుకొనే స్వేచ్ఛ ఉన్నా, అది గణనాయకుడైన చక్రవర్తి చేతిలో ఉండదు. గణరాజ్యాలలో ఒక గణ పరిషత్తు ఉంటుంది. విధి, విధానాలను అన్నింటినీ ఆ గణపరిషత్తే నిర్ణయిస్తుంది. అందుకనే స్వయంవర సభలో గణపరిషత్తులో సభ్యులైన లిచ్ఛవ రాజులు అందగత్తె అయిన ఆమ్రపాలి తమకే చెందాలని, ఇతరులకు చెందకూడదనీ పట్టుపడతారు. గణనాయకుడైన శాక్యధనికుణ్ణి, లిచ్ఛవులు తమ అభిప్రాయం ప్రకారం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరిస్తారు. గణనాయకుడైనా తండ్రికి నామమాత్రమైన అధికారాలే ఉన్నాయని ఆ పరిస్థితిని గమనించి సభలోనే ఉన్న ఆమ్రపాలి ‘గణభోగ్య’గా ఉండటానికి అంగీకరిస్తుంది. అందుకుగాను కొన్ని నియమ నిబంధనలను విధిస్తుంది. తనతోపాటు మొదటినుండి సభల్లోనూ, రాచకార్యాల్లోనూ పాల్గొన్నట్లు జాగ్రత్తపడ్డారు జ్ఞానానంద కవిగారు. కరటూరివారు లిచ్ఛవుల్లో ‘అభయుడు’ అనే బలవంతుడైన మూర్ఖుడు ఆమ్రపాలి పట్ల వ్యామోహం పెంచుకుని, లిచ్ఛవులను రెచ్చగొట్టి, ఆమ్రపాలికి పెళ్ళి చేయకపోవటం వల్లనే రాకుమారులు రాజ్యంలో అశాంతిని సృష్టిస్తూ, ఒకరినొకరు చంపుకుంటున్నారని రాజైన శాక్యధనికునికి నివేదించినట్లు వర్ణించారు. సభలో మహానాముడిని ‘గణభోగ్య’గా ఆమ్రపాలిని చేయమని పట్టుపట్టడం తనకో ధర్మం, పరులకో ధర్మం పని చేయదని లిచ్ఛవులు రాజుని వ్యతిరేకించటం వల్ల మహానాముడే ఆమ్రపాలిని, ఆమె అంగీకారాన్ని కూడా తెలుసుకోకుండా ‘గణభోగ్య’గా ప్రకటించాడు. ఆ విషయాన్ని, కూతురైన ఆమ్రపాలికి చెప్పటానికి బాధాతప్త హృదయుడై ఆమె భవనానికి వెళతాడు. వెళ్ళి కూడా అక్కడే మాట్లాడకుండా కూర్చుండిపోతాడు. తండ్రిని చూసి, ఆమ్రపాలి బింబిసారుని వల్ల మోసగింపబడిన విషయం ఎక్కడ తెలిసిపోయిందోనని, అందుకే ఎంతో ప్రేమగా పిలిచి ఆదరించే తండ్రి తాను చేసిన పనికి బాధపడుతున్నాడనుకొంటుంది. ఈ సన్నివేశం చక్కని నాటకీయతతో సాగింది. జరిగిన విషయాన్ని అంతటినీ తండ్రికి చెప్పేసి, శత్రురాజైన బింబిసారుడని తెలియదనీ, దేశద్రోహం చేయననీ, క్షమించమనీ ప్రాధేయపడుతుంది. తండ్రి ఆమ్రపాలిని సముదాయించి, అనివార్యమైన పరిస్థితుల్లో గణభోగ్యగా చేయవలసి వచ్చిందని, సభా విషయాలను ఆమెకు తెలుపుతాడు. ఆ సందర్భంలోనే ఆమ్రపాలి తనకు ఆమ్రవనంలో దొరికిందనీ, స్వంత కుమారుడైన ఆనందుడినీ నిన్నూ ఒకేలా పెంచాననీ చెపుతాడు.తెలిసిన విషయాలు ఇరువురికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆమ్రపాలి దేశభక్తి (దేశంలో అల్లకల్లోలాలను ఆపడం కూడా దేశభక్తిగానే భావిస్తుంది.) దేశం కోసం దేనికైనా సిద్ధమవుతాననీ, బింబిసారుని చేతిలో మోసపోయినందుకు క్షమించమని చెపుతుంది. ఇది జరిగిన తర్వాత కూతురు గురించి బెంగ పెట్టుకొని తండ్రి కొన్నాళ్ళకు చనిపోతాడు. ఆనందుడు బౌద్ధ సన్యాసిగా మారిపోతాడు. ఆమ్రపాలికి పుట్టిన కొడుకు ‘విమలకొండ’ను వేశ్య బిడ్డగా సమాజం గౌరవించదని ఆనందుడు చెప్పటం వల్ల బౌద్ధ సంఘంలో చేరటానికి తల్లి అంగీకరిస్తుంది. కానీ కొడుకు పట్ల పుత్ర వాత్సల్యం వీడలేకపోతుంది. ఏదో ఒక నెపంతో పుత్రుణ్ణి చూడాలనే బుద్ధుని దగ్గరకు వెళ్ళి, బుద్ధుణ్ణి, ‘కొడుకుని తల్లి నుండి విడదీయడం ధర్మమేనా?’ అని నిలదీస్తుంది. బుద్ధుడు జీవిత సత్యాన్ని, దుఃఖ నివారణను చెప్పటం వల్ల ఆమె బౌద్ధ సంఘంలో చేరగలుగుతుంది. లల్లాదేవి రాసిన ‘ఆమ్రపాలి’ నవలలో కథను పరిశీలిస్తే ‘ఉదాయి’కి తల్లిదండ్రులు చనిపోవడంతో, వైశాలినీ రాజ్యంలో ఉన్న బంధువుల ఇంటికి మేనమామ ఆ పిల్లను తీసుకొని వెళుతుంటాడు. మార్గమధ్యంలో దొంగలబారిన పడటంతో మేనమామ చనిపోతాడు. భైరవుడనే మంచి దొంగ ఆ పసిపిల్లను చేరదీసి వైశాలినీ నగరానికి చేర్చి యశోదేవి దగ్గర విద్యాభ్యాసం కొనసాగేలా దోహదపడతాడు. గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అభ్యసిస్తూ రాజుగారి అనుగ్రహం పొంది, వారి ఆదరణకు పాత్రమవుతుంది. ఆమె చేసిన నాట్యానికి మెచ్చి, నర్తకి పదవినిచ్చి ఒక ఆమ్రవనాన్ని కేటాయించి, దానిలో చక్కని భవనాన్ని నిర్మించాలని రాజు చేతనుడు ఆదేశిస్తాడు. ఆమె ఆమ్రవనంలో ఉండటం వల్ల ‘ఆమ్రపాలిక’గా, తర్వాత ‘ఆమ్రపాలి’గా పిలువబడుతుంది. భవన నిర్మాణానికి వినియోగించిన శిల్పులలో లౌకిక విషయాలను పట్టించుకోని ‘ఉదయుడు’ అనే శిల్పి ఏకాగ్రతతతో శిల్పాలను చెక్కుతుంటాడు. అతని శిల్ప నైపుణ్యాన్ని ఆమ్రపాలి అభిమానిస్తుంది. అతని దగ్గరే ఎక్కువసేపు గడుపుతుండేది. ఆమె కూర్చున్న భంగిమను ఒకసారి ‘ఉదయుడు’ చూసి చక్కని శిల్పాన్ని చెక్కుతాడు. ఆ శిల్పంతోపాటు, బుద్ధుని ప్రశాంతమైన విగ్రహాన్ని కూడా ఆమెకు బహూకరిస్తాడు. ఉదయునుడి పట్ల ఆసక్తిని పెంచుకోవడం గమనించిన రాజు ఆ శిల్పిని మరొక చోటికి పంపాలనుకొంటాడు. ఉదయునుడు ఒక స్వేచ్ఛాజీవి. ఎవరి నియమ నిబంధనలకు తలొగ్గనివాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మరోచోటికి శిల్పాలను చెక్కటానికి వెళ్ళమంటే ఇష్టపడక ఆ రాజ్యమే వదిలిపోతాడు. బుద్ధుని ప్రశాంతమైన శిల్పాన్ని చూస్తూ బుద్ధుని గురించి, అతని ఆశయాలు, ధర్మాలను గురువుగారి సహాయంతో తెలుసుకొని, బుద్ధుణ్ణి దర్శించాలని తహతహలాడుతుంటుంది ఆమ్రపాలి. అదే సమయంలో ఒక బౌద్ధ భిక్షువు ఆ రాజ్యం వచ్చాడని తెలిసి తన భిక్షను స్వీకరించమని ప్రార్థిస్తుంది. ఆ బౌద్ధ భిక్షువు మొదట అంగీకరించి ఆమె ఇంటికి వెళ్ళి భిక్షను స్వీకరించాలనుకొంటాడు. అంతలో ఒక ధనస్వామి అనే ధనవంతుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ బౌద్ధ భిక్షువుతో, ‘ఆమె ఒక వేశ్య’ అనీ, ఆ భిక్షను స్వీకరించవద్దనీ, మా ధనవంతుల దగ్గర స్వీకరించమనీ చెపుతాడు. ఆ బౌద్ధ సన్యాసి వెంటనే ఆమె పెట్టే భిక్షను తిరస్కరిస్తాడు. దానితో ఆమె ఎంతో బాధపడుతుంది. వేశ్య అంటే ఏమిటో, ఆ జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ, తనకి తెలియకుండానే ఒక వేశ్యావాడలోని ఒక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ‘ఆమ్రపాలి’ని కొంతమంది పట్టుకొని వేశ్యగా ముద్రవేసి, రాజు చేత ఆమెను నర్తకి పదవి నుండి తప్పించి, రాజ్య బహిష్కార శిక్ష వేస్తారు. బుద్ధుడు ఆ నగరం వచ్చేవరకూ ఏ తిండీ బట్టా పట్టించుకోకుండా నిరీక్షించి, బుద్ధుని కరుణ వల్ల బౌద్ధ సన్యాసినిగా మారటంతో కథ ముగుస్తుంది. ముగ్గురు రచయితలూ మూడు విధాలుగా ‘ఆమ్రపాలి’ కథను తీర్చిదిద్దారు.జ్ఞానానందకవిగారు తండ్రి పాత్రను పోషించటంలో ఔన్నత్యాన్ని, నైతిక విలువలను పాటిస్తూ సమయోచితంగా, సందర్భోచితంగా వర్ణించినట్లు అవగతమవుతుంది. దీనికి ముందు నుండే కథను చక్కని ప్రణాళిక వేసుకొన్నారనిపిస్తుంది. రాచకార్యాల్లో పాల్గొనడం, ఆమ్రపాలికి ఏర్పాటుచేసిన ‘స్వయంవర సభ’లోనే గణభోగ్య నిర్ణయం జరిగినట్లూ రాశారు.కరటూరి వారి కావ్యంలో అప్పటికే తప్పు చేసి ఉండటం వల్ల, తండ్రి అప్పటికే ఆమెను గణభోగ్యగా అంగీకరించటం వల్ల ‘గణభోగ్య’గా ఆమె అంగీకరిస్తూ, పైకి దేశభక్తి పూత పూసినట్లు అనుకోవడానికి అవకాశం కలుగుతుంది. కానీ, కావ్యాన్ని చదువుతున్న పాఠకునికి ఆ నాటకీయత అబ్బురపరుస్తుంది. జ్ఞానానందకవీ, కరటూరి వారూ ఇద్దరూ కూడా ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత తండ్రి పాత్రను బాగా చిత్రించారు. జ్ఞానానందకవిగారు, ఆమ్రపాలి తండ్రి పాత్రను కావ్యంలో మరలా ప్రవేశపెట్టకుండానూ, కరటూరివారు, ఆమ్రపాలి తండ్రి బెంగ పెట్టుకొని మరణించినట్లు బాగా రాశారు. జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత కథను ఆమె నుండే చూశారు. పెంచిన తల్లిదండ్రుల కోణం నుంచి చూడలేదు. ఇది చక్కని కథన శిల్పం.లల్లాదేవిగారి నవలలో ‘ఆమ్రపాలి’ వేశ్యగా ముద్ర వేయబడుతుంది. ఆమెకు తెలియకుండానే వేశ్యావాడకు పోతుంది. అక్కడకొంతమంది యువకులు ఆమెను నిర్బంధించి వేశ్యగా మార్చినట్లు రాశారు. అక్కడ వేశ్య జీవితచిత్రణను వర్ణించటంలో లల్లాదేవి పరిశీలన చక్కగా వ్యక్తమవుతుంది. దొంగల గుంపుకి దొరికిన ఉదాయి అడవిలో పాడుపడిన దేవాలయం మీద ఉన్న నాట్యభంగిమలను చూసి, ఆమె నాట్యాన్ని అభ్యసించాలనుకొన్నది. సాధన వలన నాట్యాన్ని సాధించింది. ఆ నాట్యమే ఆమ్రవనాన్ని, నర్తకి పదవిని వచ్చేలా చేసింది. అదే ఆమెను ‘వేశ్య’గా అనుమానించేలా చేసింది. ఆ అనుమానంలో నుండి వచ్చిన అవమానమే ఆమెను బౌద్ధభిక్షువుగా మార్చి, సన్మార్గంవైపు పోయేటట్లు చేసింది. యస్.టి. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ బింబిసారుణ్ణి ప్రేమించింది. బింబిసారుడూ ఆమెను కోరుకున్నాడు. తర్వాత ఇరువురిలో ఎవరిని ఎవరూ ద్వేషించుకోలేదు. బింబిసారుడు మాత్రం ఆరురోజులు ఆమె భవనంలో ఉండి, దొంగచాటుగా వచ్చిన అతని రాకను లిచ్ఛవులు పసిట్టడం, అతడిని జాగ్రత్తగా దాచటం, ఆమెను విడిచి వెళ్ళిపోయేటపుడు ఒక ఉంగరాన్ని ఇవ్వటం, ఒకవేళ కొడుకు పుడితే, ఉంగరమిచ్చి పంపమని చెప్పి వెళ్ళిపోతాడు. తన కోసం చిత్రించిన చిత్రపటంలో బింబిసారుణ్ణి ఆకర్షించి, ఆలోచిస్తుండగా చెలికత్తె ఆమె హృదయాన్ని పసిగట్టడం, రాయబారం నడపడం వంటివన్నీ చేస్తుంది. బింబిసారుని పాత్రను కావాలనే కావ్యనాయకునిగా, కవి తీర్చిదిద్దలేదేమో ననిపిస్తుంది. ఆమెను బింబిసారుడు అనుభవించటానికే ప్రయత్నించినట్లు తేలుతుంది. అయితే ఉంగరాన్ని ఇచ్చి, కొడుకు పుడితే, ఉంగరం చూపితే తన పుత్రునిగా స్వీకరిస్తానని చెప్పటం అతని స్వభావాన్ని తేటపరిచే విషయాలుగా గమనించే వీలుంది. ‘గణభోగ్య’గా జీవితాన్ని గడుపుతున్న ఆమ్రపాలి తనలో తాను తీవ్ర సంఘర్షణకు లోనై ఒకసారి తాను దొరికిన ఆమ్రవనానికి ప్రశాంతత కోసం రావటంతో, అక్కడ తొలిసారిగా బుద్ధుని దర్శనమవుతుంది. ఆనాటి నుండే ఆమెలో బుద్ధుని ప్రవచనాలు లౌకిక విషయాల పట్ల కోరికను తగ్గించి, అలౌకిక విషయాల పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. బుద్ధుని రాక కోసం నిరీక్షిస్తూ, తీరా బుద్ధునికి భిక్షను పెట్టాలని ప్రయత్నించినపుడు ఆ నగరంలోని ధనవంతులు వ్యతిరేకిస్తారు. బుద్ధుని దర్శనాన్నీ బుద్ధుని శిష్యుడు కూడా అడ్డుకుంటాడు. కానీ బుద్ధుని జోక్యం వల్ల ఆమెకు అతని దర్శనం కలగటం, ఆమె పూర్వజన్మలో నెమలి అనీ, ఇంద్రుని శాపం వల్ల ‘ఆమ్రపాలి’గా జన్మించిందని, ఆమె జన్మ వృత్తాంతాన్ని బుద్ధుడు వివరించటంతో ప్రజల్లో ఎక్కడలేని ఆదరణ కలుగుతుంది. బుద్ధునికి భిక్షను పెట్టి, తన సర్వవిద్యలనూ బౌద్ధ సంఘ వ్యాప్తికే వినియోగిస్తూ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొంటుంది. జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని చారిత్రక తత్త్వకావ్య లక్షణాలతో చక్కగా అన్వయించే ప్రయత్నం చేశారు. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో బుద్ధుని బోధనలు అడుగడుగునా కన్పిస్తుంటాయి. మరో విశేషమేమంటే, ఈ కావ్యంలో అన్ని పాత్రలూ ఆమ్రపాలి వైపు నడవగా, ఆమ్రపాలి బుద్ధుని ధర్మాలవైపు, బుద్ధుని వైపు పయనిస్తుంది. బౌద్ధమతంలోని ఆర్యసత్యాలనూ, త్రిరత్నాలనూ, అష్టాంగమార్గాన్ని కావ్యానికి అన్వయించి బౌద్ధ ధర్మేతిహాసంగా మలచగలిగారు. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో మరికొన్ని విశేషాలు ఉన్నాయి.ఆమ్రపాలి గణభోగ్యగా జీవితాన్ని గడుపుతూ మానసిక ప్రశాంతత కోల్పోయి, సంఘర్షణ పడుతూ, తీవ్రవ్యధకు లోనై గుండెల్లో దుఃఖాన్ని పోగొట్టు కోవాలని తాను దొరికిన ఆమ్రవనంలోకి వస్తుంది. కరుణ హృదయుడైన బుద్ధుడు అక్కడ తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. అతడిని ఆమె ఎవరో ముని అనుకొని ఆమెలో తీరని కోరికను నర్మగర్భితంగా వ్యక్తీకరించి అతనిని తన ఇంటికి రమ్మనమనీ, సర్వసౌఖ్యాలనూ సమకూరుస్తానంటుంది.బుద్ధుడు ఆమె మనోవాంఛను గమనిస్తాడు. చాలా మృదువుగా, ప్రశాంతంగా, జీవిత సత్యాలను వివరిస్తాడు. అంతేకాక ఆమె బౌద్ధ భిక్షువుగా మారిన తరువాత ఆమెతోపాటు బౌద్ధారామానికి వచ్చిన మిగిలిన ప్రజలకు నాలుగు ఆర్యసత్యాలను వివరిస్తాడు.బౌద్ధధర్మ మూలసూత్రాలలో సర్వమూ క్షణికమనేది ఒక మూల సూత్రం.ఇది ప్రపంచం దుఃఖమయమనే దాన్ని స్పష్టం చేస్తుంది. పుట్టిన ప్రతివారికీ మరణం తప్పదు. అయినా ఆశలు పెంచుకుంటారు. ప్రపంచంలో దుఃఖం లేకపోవటంగాని, పుట్టిన జీవి మరణించకపోవటమనేది కనిపిస్తే ఎంతో సంతోషం కదా! అని బుద్ధుడు చెబుతాడు. మానవుని శరీరం వయః పరిణామాన్ని అనుసరించి క్షణక్షణం మారుతూ మట్టిలో కలిసిపోతుందనే విషయాన్ని కవి ‘నాల్గు దశల మధ్య నవయుచు నున్నటి’ అని వర్ణించారు. దృశ్యమాన ప్రపంచంలోని సర్వమూ అనిత్యమేనని దానివల్ల తెలుస్తుంది.దుఃఖానికి కారణం కోరికలు అనేది బుద్ధుడు బోధించిన నాలుగు ఆర్య సత్యాల్లో రెండవది.ఇంద్రియాలకు ప్రియమైన విషయ సంపర్కం, వాటి స్మృతి, కోరిక (తృష్ణ) లకు కారణమవుతుంది. ఆ కోరికలు పూర్తి కాగా త్యజించగలిగినపుడు దుఃఖం నివారింపబడుతుంది. ఇది మూడవ ఆర్యసత్యం.ఆమ్రపాలి ఎన్నో కోర్కెలతో రగిలిపోతూనే బుద్ధుని ప్రథమ దర్శనం చేసుకొన్నది. బుద్ధుడు జీవితం క్షణికమైనదనే జీవిత సత్యాన్ని బోధించడం, తన తపస్సు పూర్తయిన తరువాత భిక్షను స్వీకరించటానికి వస్తానని చెప్పి పంపితే బుద్ధుని పునరాగమనం వరకూ భిక్షను సమర్పించటానికి ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికి ఆమెలో కోరికలు నశించిపోయాయి. తాత్కాలికమైన లౌకిక భోగాల నుండి శాశ్వతమైన విముక్తి మార్గానికి సిద్ధమై ఉంది. దీనికంతటికీ కారణం ఆమెలో వివాహం చేసుకోవాలనీ, సర్వసౌఖ్యాలను అనుభవించాలనీ ఉన్న కోర్కెలన్నీ నశించటమే. కొడుకుని, తండ్రిని, సర్వస్వాన్నీ వదిలి బుద్ధుని శిష్యగణంలో చేరిపోతుంది. ఆమె దుఃఖం నుండి విముక్తి పొందుతుంది. ఈ విధంగా చారిత్రక తత్త్వ కావ్యంగా జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని తీర్చిదిద్దారు. బుద్ధుని బోధనలు సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపాయనేది తెలియజేసే కథలు ఎన్నో వస్తున్న నేపథ్యంలోనే ‘ఆమ్రపాలి’ కావ్యాలు, నాటకాలు, నవలలు కూడా వెలువడ్డాయి. మానవ విలువలను, మానవ సంబంధాలను పటిష్టపరచడంలో బౌద్ధేతివృత్త కావ్యాలు చాలావరకూ తోడ్పడ్డాయి. అలా నిరూపించే బౌద్ధజాతక కథలలో ఆమ్రపాలి కథ ఉత్తమమోత్తమ కథ. ఇంకా చాలామంది తెలుగు రచయితలు కూడా ఆమ్రపాలి కథను తీసుకొని వివిధ ప్రక్రియలలో రచనలు చేసినవారు ఉండవచ్చు.

హిందీ సినిమా

[మార్చు]

ఆమ్రపాలి ఆధారంగా 1966 సంవత్సరంలో వైజయంతిమాల కథానాయికగా హిందీలో సినిమాను నిర్మించారు.[3]

మూలాలు

[మార్చు]
  1. [Amrapali's Encounter with The Handsome Renunciate, The Speaking Tree, The Times of India, July 3, 2006]
  2. దార్ల వెంకటేశ్వరరావు, జ్ఞానానందకవి ‘ఆమ్రపాలి’పరిశీలన,ఎం.ఫిల్. గ్రంథం, ప్రచురణ: జ్యోత్స్నాకళాపీఠం, హైదరాబాదు,1999, పుట: 84
  3. Amrapali at IMdB
"https://te.wikipedia.org/w/index.php?title=ఆమ్రపాలి&oldid=3262169" నుండి వెలికితీశారు