ఆరుట్ల రామచంద్రారెడ్డి
ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటయోధులు. ఆయన 1962 లో సి.పి.ఐ పార్టీ తరఫున భువనగిరినియోజక వర్గ ఎమ్.ఎల్.ఎ.గా గెలిచి, ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేశారు.
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన 1909లో భువనగిరి తాలూకాలోని కొలనుపాక గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఉండి, నాంపల్లి హైస్కూల్‌లో మెట్రిక్ చదివారు. 1930లో జరిగిన "దండి సత్యాగ్రహం" ఉత్తేజితులయ్యారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచారు. 1931-33లో ఉస్మానియా యూనివర్శిటీలో చదివారు. నిజాం ఆంధ్రమహాసభల్లో క్రియాశీలక ప్రతినిధిగా పనిచేశారు. 1945లో పాలకుర్తి కుట్ర కేసులో అరెస్టయి హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఒక సంవత్సరం ఉన్నారు. తెలంగాణ పోరాట సమయంలో, 1947లో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మొదటి గెరిల్లా శిక్షణ తరగతికి హాజరయ్యారు. ఈ శిక్షణ తర్వాత బందూకు పట్టుకొని సాయుధ పోరాటంలో సాగిపోయారు. ఈ పోరాట సమయంలో పోలీసులకు పట్టుబడి 1952 జనవరి వరకు నిర్బంధంలో ఉన్నారు.
1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల పార్టీ టికెట్ లభించలేదు. అయినా, నల్లగొండ జిల్లాలోని 14 శాసనసభ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు సి.పి.ఐ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేష కృషి సలిపారు. 1962 లో భువనగిరి శాసససభ్యునిగా ఎన్నికైనారు.
జాతీయోద్యమ ప్రభావం[మార్చు]
1930 ఏప్రిల్‌లో గాంధీజీ దండి సత్యాగ్రహం ప్రారంభించారు. దేశమంతటా జాతీయ ఉద్యమం వాయువేగంతో విస్తరించింది. విప్లవ వీరులైన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఉరికంబాలకు ఎక్కి ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి కామ్రేడ్లు.. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి కాకినాడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బ్రిటిషర్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు స్వదేశీ లీగ్ పేరుతో హైదరాబాద్‌లోని వికాజీ హోటల్ (అబిదాషాపు) ఆవరణలో బహిరంగ సభలు నిర్వహించేవారు. ఈ జాతీయోద్యమ ప్రభావం రామచంద్రారెడ్డిపై పడింది. కొత్వాల్ రాజా వెంకట్రామారెడ్డి హైదరాబాద్‌లో ‘రెడ్డి బాలుర వసతి గృహం’ స్థాపించి, ఎంతో అభివృద్ధి చేశారు. ఈయన సహకారంతో రామచంద్రారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు ‘బాలికల వసతి గృహం’ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఇదే మొట్టమొదటి బాలికల వసతి గృహం.
ఆంధ్ర మహాసభలు[మార్చు]
1931-32లో ఆరుట్ల రామచంద్రారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన కాలంలోనే ఆర్య సమాజం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ప్రథమాంధ్ర మహాసభ నిర్వహించారు. రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో సైకిల్ యాత్రా దళంలో వలంటీరుగా పాల్గొని ఆరుట్ల రామచంద్రారెడ్డి ఈ సభకు హాజరయ్యారు. ఆ తర్వాత 1944లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన భువనగిరిలో 11వ ఆంధ్ర మహాసభ జరిగింది. దీనికి రామచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి సభను విజయవంతం చేశారు. ఆంధ్ర మహాసభ మితవాద నాయకులైన కొండా వెంకట రంగారెడ్డి, మందుముల నర్సింగరావు భువనగిరి మహాసభను బహిష్కరించారు. తమదే నిజమైన ఆంధ్ర మహాసభగా పేర్కొంటూ 1945లో వీరు పోటీగా మడికొండలో మరో ఆంధ్ర మహాసభ నిర్వహించారు. 1945లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఖమ్మంలో 12వ ఆంధ్ర మహాసభ జరిగింది. పాలకుర్తి కుట్ర కేసులో ఏడాది పాటు హైదరాబాద్ సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉండటం వల్ల రామచంద్రారెడ్డి ఈ సభకు హాజరు కాలేకపోయారు. ఈ సమావేశంలో వెట్టిచాకిరీ రద్దు, రైతులు, హైదరాబాద్ సంస్థానంలో ప్రజారాజ్య స్థాపనకు సంబంధించిన తీర్మానాలు చేశారు. 1946లో నిజాం నవాబు ఆంధ్ర మహాసభలపై నిషేధం విధించాడు. మితవాద నాయకులు జమలాపురం కేశవరావు అధ్యక్షతన 1946లో కందిలో ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఇదే సంవత్సరం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌పై నిజాం నిషేధం ఎత్తేశాడు. తర్వాత మితవాదుల ఆంధ్ర మహాసభ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.
హరిజనులు - దేవాలయ ప్రవేశ హక్కులు[మార్చు]
అస్పృశ్యతా నివారణపై ఆంధ్ర మహాసభ వేదికల నుంచి తీర్మానాలు చేశారు. కొన్ని మహాసభల్లో సహపంక్తి భోజనాలు చేసేవారు. ఆ రోజుల్లో హరిజనులకు దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. మూడో ఆంధ్ర మహాసభ పులిజాల వెంకట రంగారావు అధ్యక్షతన 1934లో ఖమ్మంలో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ప్రతినిధుల్లో కొందరు సనాతన ధర్మ పారాయణులు ప్రత్యేక వంటలు చేయించుకొని, మడిబట్టలు ధరించి భోజనాలు చేశారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి హరిజనులతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రవేశం చేయించారు. భువనగిరి తాలూకాలోని పాముకుంట, జాల, కుర్రారం, నమిలె, బేగంపేట, రాజాపేట, నర్సాపురం, రేణుకుంట మొదలైన సుమారు 35 గ్రామాలకు చెందిన 400 మంది హరిజనులను సమీకరించి దీన్ని నిర్వహించారు. కుర్రారం రంగారెడ్డి ఈ విషయంలో రామచంద్రారెడ్డికి విశేషంగా సహకరించారు. ఈ హరిజన సమూహాన్ని చూసి దేవాలయ పూజారులు ఎలాంటి అభ్యంతరం తెలపకుండా వారందరికీ తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు.
తెలంగాణ విముక్తి పోరాటం[మార్చు]
తెలంగాణా ప్రజల విముక్తి కోసం ఏవిధంగానైతే ఆరుట్ల రామచంద్ర రెడ్డి గంగవరపు శ్రీనివాసరావు వలభనేని సితారామయ్య నాయుడు, నల్లమల్ల గిరిప్రసాద్,చింతలపురి రాంరెడ్డి పోరాడారో అదే విధంగా నిజాం నిరంకుశ పాలనను హతం చేయడానికి కుర్రారానికి చెందిన రాంచంద్రారెడ్డి నడుంబిగించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్న ఘనత ఆరుట్లకే దక్కింది. 1831లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభలకు ఈ ప్రాంత విప్లవ వీరుడు రావినారాయణరెడ్డితో కలిసి ఆరుట్ల సైకిల్ పై జోగిపేట వెళ్లారు. గిరిజన, హరిజన వెనుకబడిన వర్గాల ప్రజల్ని నిర్బంధంగా ముస్లీం మతంలోకి మార్పిస్తున్న తరుణంలో రజాకార్లను ఎదిరిస్తూ వారి అరాచకాలను ఎండగట్టడానికి ఆరుట్ల రాంచంద్రారెడ్డి నిజాంకు పోటీగా కొలనుపాకలో ఆర్యసమాజాన్ని నెలకొల్పారు. నిజాం పాలనకు వారి దౌర్జన్యకాండలకు నిరసనగా రాంచంద్రారెడ్డి ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు. 1945లో ఆరుట్లను నిజాం అరెస్టు చేసి కొలనుపాకలో నిర్భందించింది. ఆయన్ను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేశారు. మూడేళ్ల పాటు నిర్భందించారు. రాంచంద్రారెడ్డి కొనసాగిస్తున్న ప్రతి ఉద్యమానికి ఆయన భార్య కమలాదేవి ఊపిరిగా నిలిచింది. దీంతో 1949 ప్రాంతంలో కమలాదేవిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణా కోసం ప్రాణాలర్పించిన మహోన్నతమైన నాయకుడిగా ఆరుట్ల రాంచంద్రారెడ్డి పేరు చిరకాలం నిలిచిపోతుంది.
మూలాలు[మార్చు]
- నిజాం పాలనపై దండెత్తిన చింతలపురి, ఆరుట్ల[permanent dead link]
- తెలంగాణ పోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి[permanent dead link]
ఇతర లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జూలై 2020
- Articles with permanently dead external links
- Articles with dead external links from జనవరి 2021
- Articles with dead external links from జనవరి 2020
- తెలంగాణ సాయుధ పోరాట యోధులు
- 1909 జననాలు
- యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ నాయకులు
- యాదాద్రి భువనగిరి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు