Jump to content

గడ్డం రాజారాం

వికీపీడియా నుండి
(ఆర్గుల్ రాజారాం నుండి దారిమార్పు చెందింది)
1952 మేలో హైదరాబాదు రాష్ట్ర శాసనసభలో సోషలిస్టు పార్టీ నాయకునిగా గడ్డం రాజారాం

గడ్డం రాజారాం నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. కాంగ్రేసు పార్టీకి చెందిన అగ్రనేత. వెనుబడిన కులాల నాయుకుడిగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయనను ఆర్గుల్ రాజారాంగానూ వ్యవహరిస్తారు. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల నుండి ఐదు సార్లు శాసనసభకు ఎన్నికై అనేక పర్యాయాలు మంత్రి పదవి చేపట్టాడు.

రాజారాం జక్రాన్‌పల్లి మండలంలోని ఆర్గుల్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి ఆర్జుల్ రాజన్న, తల్లి రాజవ్వ. కష్టపడి చదివిన రాజరాం బాల్యదశ నుండే సోషలిష్టు భావజాలంతో ఎదిగిన రాజారాం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.కాం పొందాడు. సోషలిష్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ శిష్యరికంలో రాజకీయంగా ఎదిగాడు. 1951లో సోషలిష్టు పార్టీ అభ్యర్థిగా హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు.[1] రాజారాం తొలిసారి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఆర్మూరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. హైదరాబాదు శాసనసభలో సోషలిస్టు నాయకుడుగా, రాముడు మంచిబాలుడు లాగా, తన మాటలలోనూ, చేష్టలలోనూ చాలా మందంగా ప్రవర్తించేవాడని అప్పటి పాత్రికేయులు అభిప్రాయపడ్డారు.[2] 1957లో నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభకు పోటీచేసి హెచ్.సి.హెడా చేతిలో ఓడిపోయాడు.

1962 నుండి బాల్కొండ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1967లో రాజారాం బాల్కొండ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికకావటం విశేషం. 1969లో తెలంగాణా ఉద్యమంలో అగ్రనేతగా నిలిచాడు. కొంతకాలం మర్రి చెన్నారెడ్డితో పాటు రాజమండ్రి జైలులో గడిపాడు. పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో జౌళి, చేనేత, చెక్కర పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు.

1970వ దశకపు చివర్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రేసు మూడు వర్గాలుగా చీలిపోయింది. పిడతల రంగారెడ్డి, జువ్వాడి చొక్కారావు తదితరులు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా పార్టీలో చేరగా, బ్రహ్మానందరెడ్డి వర్గం తిరుగుబాటు చేసి కాంగ్రేసు-ఆర్ (రెడ్డి) గా ఏర్పడింది. గడ్డం రాజారాం వర్గం ఇందిరా గాంధీ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రేసు (ఐ) లో చేరింది.[3] రాజారాం 1978లో ఇందిరా కాంగ్రేసు అభ్యర్థిగా బాల్కొండ నుండి పోటీచేసి గెలిచాడు. అదే సమయంలో తన ప్రధాన అనుచరుడైన శనిగరం సంతోష్‌రెడ్డిని ఆర్మూరు నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా గెలిపించాడు. 1978 ఎన్నికలలో కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో కాంగ్రేసు తిరుగుబాటు వర్గం (రెడ్డి కాంగ్రేస్) కూడా పోటి చేసిన ఎన్నికలలో ఇందిరా కాంగ్రేసు రాష్ట్రంలో ఆధిక్యత సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే తరుణంలో యధాలాపంగా ఇందిరా కాంగ్రేసులో కూడా నాయకత్వం కోసం వివిధ ముఠాలు పోటీపడ్డాయి. పి.వి.నరసింహారావు వర్గం, మర్రి చెన్నారెడ్డి వర్గం, రాజారాం వర్గాలుగా పార్టీలో విభజనలు వచ్చాయి. చెన్నారెడ్డి వర్గం, రాజారాం వర్గం వారి నాయకున్ని ముఖ్యమంత్రి చేయాలని గట్టి ప్రయత్నం చేశాయి. చివరకు రాజారాం వెనక్కి తగ్గి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేశాడు.[4] చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాజారాంకు మంత్రి పదవి ఇచ్చాడు.

రాజారాం శాసనసభ్యునిగా, మంత్రిగా ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల అభివృద్ధికి విశేషకృషి చేశాడు. ఆర్మూరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను స్థాపించి దానికి ప్రభుత్వ గుర్తింపు తెచ్చాడు. డిచ్‌పల్లిలో ఏడవ బెటాలియన్ ఏర్పడటానికి కృషి చేశాడు. ఆర్మూరు పట్టణంలోని సి.ఎస్.ఐ చర్చి ఆధీనంలో ఉన్న భూములను చట్టపరంగా పేదల ఇల్లస్థలాలకు కేటాయించేందుకు కృషిచేశాడు. వారు ఆ ఏర్పడిన కాలనీకి రాజారాం పేరును పెట్టుకున్నారు. బాల్కొండ మండలంలోని వెంచిర్యాల గ్రామంలో వందమంది షెడ్యూల్డు కులాలవారికి పంపిణీ చేశాడు.

ఈయన 1974లో జలగం వెంగళరావు, 1978 తర్వాత చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశాడు. తరువాత జిల్లాలో ప్రముఖ రాజకీయనాయకులుగా ఎదిగిన ధర్మపురి శ్రీనివాస్, శనిగరం సంతోష్ రెడ్డిలు ఈయన వద్ద శిష్యరికం చేసిన వారే.

రాజారాం భార్య సుశీలాదేవి. వీరికి సంతానం లేకపోవడంతో రాజారాం తమ్ముని పిల్లలు నరేందర్, సురేందర్, చంద్రకళలను దత్తతు తీసుకున్నాడు.

1962 నుంచి 1981 వరకు బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్న రాజారాం రాష్ట్ర కేబినెట్‌లో విద్యు త్, ఆర్థిక శాఖల మంత్రిగా పనిచేశాడు. మంత్రిగా ఉన్న సమయంలోనే 1981లో మెదక్ జిల్లా, రామాయంపేట వద్ద అప్పటి 7వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈయన మరణించిగా జరిగిన ఉప ఎన్నికలలో ఈయన సతీమణి సుశీలాదేవి శాసనసభకు ఎన్నికైంది.[5]

గోదావరి నదిపై నందిపేట మండలంలోని ఉమ్మెద గ్రామం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకానికి ఇతని స్మారకార్ధం ఆర్గుల్ రాజారాం గుత్త ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Hyderabad" (PDF). Election Commission of India. Retrieved 2014-10-14.
  2. A. V., Rajeswara Rao. "Hyderabad Legislative Assembly" (PDF). Hindustan Times. No. September 21, 1952. Retrieved 25 December 2014.
  3. R. J., Rajendra Prasad (2004). Emergence of Telugu Desam: And an Overview of Political Movements in Andhra. Andhra Pradesh (India): Master Minds. p. 127. Retrieved 26 December 2014.
  4. Shift in Indian Politics: 1983 Elections in Andhra Pradesh and Karnataka edited by George Mathew
  5. బాల్కొండ నియోజకవర్గం...వరుసగా నాలుగుసార్లు సురేష్‌ గెలుపు - సూర్య పత్రిక April 5, 2014[permanent dead link]
  6. CM to launch Argul Rajaram Gutpa LI today - The Hindu March 18, 2008