ఆస్టెరిక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆస్టెరిక్స్ (లేక ఆస్టెరిక్స్ సాహసాలు) అనేది ఫ్రెంచివారి కామిక్ పుస్తకాల సిరిస్. ఈ పుస్తకాలకు కథలను రెనీ గాసిన్నీ (Rene Goscinny) వ్రాయగా, బొమ్మలను అల్బర్ట్ యుడర్జో (Albert Uderzo) గీశాడు. 1977 లో గాసిన్నీ మరణం తర్వాత ఆల్బర్ట్ యుడెర్జో కథలను వ్రాసే బాధ్యతను కూడా తీసుకొన్నాడు. ఈ సిరిస్ మొదటిసారిగా 1959 లో పిలోట్ (Pilote) అనే ఫ్రెంచ్ వార పత్రిక 29 అక్టబర్ సంచికలో ప్రచురితమైంది. ఆస్టిరిక్స్ సిరీస్ 2009 నాటికి సుమారు 34 కామిక్స్ పుస్తకాలుగా రిలీజ్ అయినవి. నేడు ప్రపంచ వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది ఈ పుస్తకాలను సేకరించి చదువుతున్నారు. ఆస్టెరిక్స్ కామిక్స్ నేడు అంతర్జాతీయంగా సుమారు 100 భాషల్లోకి అనువదింపబడింది.

ఈ సిరీస్ లో మహాశక్తిమంతులైన గలేలియా (Gaul) గ్రామస్థులు క్లిష్టమైన సమస్యలను, ప్రధాన శత్రువులైన రోమన్ల (Romans) దాడులనూ సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. వీరి అంతులేని శక్తికి రహస్యం గెటాఫిక్స్ (Getafix) అనే మూలికా వైద్యుడు తయారుచేసే మాయా పానీయం (Magic Potion). ఇది త్రాగినవారికి తాత్కాలికంగా ఎవరినైనా లేక దేన్నైనా జయించగల శక్తి వస్తుంది. ప్రధాన కథానాయకుడైన ఆస్టెరిక్స్, అతని స్నేహితుడైన ఓబెలిక్స్ సమస్యలు వచ్చినప్పుడు గ్రామం తరపున ఇతర ప్రదేశాలకు, ఊళ్ళకు, విదేశాలకు వెళ్ళి పలు సాహసాలు చేసి విజయవంతంగా తిరిగొస్తారు. ఓబెలిక్స్ చిన్నతనంలో ప్రమాదవశాత్తు గెటాఫిక్స్ తయారుచేసిన మాయా పానీయంలో పడుట వలన అతనికి శాశ్వతముగా శక్తి వస్తుంది. రుచిగా ఉండే పానీయాన్ని ఓబెలిక్స్ త్రాగాలనుకున్నప్పుడల్లా ఆ పానీయాన్ని ఇవ్వనంటాడు గెటాఫిక్స్. ఈ సిరీస్ లో నిజమైన గలేలియా నాయకులైన వెర్సింజిటోరిక్స్, ఆర్గెటోరిక్స్, దమ్నోరిక్స్ అను పేర్లు కనిపిస్తుంటాయి. ఆస్టెరిక్స్ కామిక్స్ పుస్తకాల్లో ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యాన్ని పాలించిన జూలియస్ సీజర్ (Julius Caesar) కాలం నాటి రాజకీయ, సామాజిక, భౌగోళిక పరిస్థితులు, సంప్రదాయాలు కళ్ళకద్దినట్లు కనిపిస్తాయి.

ఆస్టెరిక్స్ సిరీస్ లో ఇతర ప్రధాన పాత్రలు - గ్రామ పెద్ద అయిన వైటల్ స్టాటిస్టిక్స్ (Vitalstatistix), అతని భార్య ఇంపెడిమెంటా (Impedimenta), పాటలు పాడే కాకోఫోనిక్స్, (Cacofonix) చేపలు అమ్ముకునే అన్‌హైజీనిక్స్ (Unhygenix), అతని భార్య ---, ముదుసలి వాడైన గెరియాట్రిక్స్ (Geriatrix), కమ్మరివాడైన ఫుల్లీయాటోమాటిక్స్ (Fulliautomatix), సముద్రపు దొంగలు, రోమా సామ్రాజ్య అధినేత అయిన జూలియస్ సీజర్ (Julius Caesar).

లంకెలు[మార్చు]