ఇట్స్ ఎ వండ్రఫుల్ లైఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇట్స్ ఎ వండ్రఫుల్ లైఫ్
It's A Wonderful Life

({{{year}}} ఆంగ్లం సినిమా)
దర్శకత్వం ఫ్రాంక్ కాప్రా
తారాగణం జేమ్స్ స్టీవర్ట్
విడుదల తేదీ డిసెంబర్ 20, 1946
నిడివి 130 నిముషాలు
భాష ఆంగ్లం

[[వర్గం:{{{year}}}_ఆంగ్లం_సినిమాలు]]

1946లో ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అనే చిన్న కథ ఆధారంగా ఫ్రాంక్ కాప్రా నిర్మాణ, దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకున్నది. ఈ చిత్రం ఒక ఆణిముత్యంగా, ముఖ్యముగా క్రిస్మస్ అపుడు కుటుంబసమేతంగా చూసే చిత్రంగా ప్రాచుర్యం పొందింది.

కథాంశం

[మార్చు]

1946లో క్రిస్మస్ రోజున జార్జ్ బెయిలీ (జేమ్స్ స్టీవర్ట్) తీవ్రమయిన మానసిక క్షోభతో ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవుతుంటాడు. జార్జ్ ని రక్షించుటకు దేవదూత తన అనుచరుడయిన క్లారెన్స్ ను భూలోకానికి వెళ్ళమని చెప్పి జార్జ్ జీవితం గురించి వివరించడం మొదలు పెడతాడు.

బాల్యంలో జార్జ్ తన తమ్ముడయిన హ్యారీని కాపాడి ఒక చెవి వినికిడి శక్తిని పోగొట్టుకుంటాడు. తను పనిచేసే మందుల షాపు యజమాని పొరపాటున విషం కలిపి మందు తయారు చేస్తే అది గమనించి చెప్తాడు.

బాల్యం నుండి జార్జ్ ప్రపంచమంతా తిరగాలని, పెద్ద పెద్ద కట్టడాలను నిర్మించాలని కలలు కంటుంటాడు. తన ఊరు అయిన బెడ్‌ఫోర్డ్ ఫాల్స్ విడిచి వెళ్ళడానికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. పెద్దవాడయిన తర్వాత తన తమ్ముడు కాలేజ్ చదువు ముగించుకొని వచ్చాక అతనికి తమ కుటుంబ వ్యాపారాన్ని అప్పగించి ఆ ఊరు వదలి తన కలలు నిజం చేసుకోవాలి అనుకుంటూ తండ్రికి సహాయం చేస్తుంటాడు. హఠాత్తుగా జార్జ్ తండ్రి మరణించడంతో వాటాదారుడయిన పాటర్ వ్యాపారాన్ని మొత్తం చేజిక్కుంచుకొని పేదలకు అన్యాయం చేసి డబ్బు సంపాదించాలనుకుంటాడు.

పేదలకు జరిగే అన్యాయాన్ని ఆపడానికి విధిలేక జార్జ్ వ్యాపార బాధ్యతలు స్వీకరిస్తాడు. జార్జ్ తమ్ముడు కాలేజీకి వెళ్ళి అక్కడే ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఆమె తండ్రి కంపెనీలో ఉద్యోగం చేయడానికి నిశ్చయించుకుంటాడు. తమ్ముడి భవిష్యత్తు పాడవుతుందని జార్జ్ మౌనంగా ఉంటాడు. జార్జ్ తనను చిన్నప్పటి నుంచి అభిమానించే మేరీని పెళ్ళి చేసుకొంటాడు. తమ హనీమూన్ డబ్బుతో మరోసారి పాటర్ కుట్రను ఆపగలుగుతాడు. పేదలకోసం ఒక కాలనీ కట్టించి సొంత ఇళ్ళకు రుణాలు ఇవ్వడంతో పాటర్ అద్దె ఇళ్ళ వ్యాపారం దెబ్బ తింటుంది. రెండవ ప్రపంచ యుద్దంలో చేసిన వీరోచిత సేవలకు జార్జ్ తమ్ముడయిన హ్యారీకి సన్మానం జరుగుతుంది.

తన భార్య, కూతురుతో జార్జ్ బెయిలీ (జేమ్స్ స్టీవర్ట్)

క్రిస్మస్ రోజు బ్యాంకులో చెల్లించవలసిన డబ్బును జార్జ్ చిన్నాన్న తీసుకెళ్ళగా పాటర్ కాజేస్తాడు. బ్యాంకులో డబ్బు కట్టకపోతే తన కంపెనీ జప్తు చేయబడుతుంది, తాను జైలుకు వెళ్ళవలసి వస్తుంది అని జార్జ్ బాధపడుతాడు. విధిలేక పాటర్ దగ్గరకు వెళ్ళి డబ్బు సహాయం చేయమని, అందుకోసం ఏదయినా చేస్తానని అంటాడు. కానీ పాటర్ అందుకు ఒప్పుకొనక అవమానిస్తాడు.

తాను జీవితంలో అందరికోసం ఎన్నో త్యాగాలు చేసినా ఇలా అవమానపడడం భరించలేక ఒక వంతెన ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు. అపుడు దేవదూత మామూలు మనిషిలా వచ్చి వారిస్తాడు. అసలు తాను పుట్టడమే వృధా అంటాడు జార్జ్. అపుడు దేవదూత ఒకవేళ జార్జ్ పుట్టకపోయి ఉంటే జార్జ్ సహాయం చేసిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉండేవో చూపుతాడు.

అవి అన్నీ చూసిన జార్జ్ తన వల్ల ఎందరి జీవితాల్లో మార్పు వచ్చిందో, జీవితం ఎంత విలువయినదో తెలుసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పటికే జార్జ్ డబ్బు పోయిన విషయం తెలుసుకున్న అందరు వచ్చి తమ దగ్గర ఉన్న డబ్బంతా ఇస్తారు. తన సహాయం వల్ల ఎందరు హాయిగా బ్రతకగలుతున్నారో, తనకు అవసరమయినపుడు ఏ విధంగా తనకు సహాయపడుతున్నారో చూసి 'జీవితం చాలా అద్భుతమయినది ' అనుకుంటాడు.

నిర్మాణం, విశేషాలు

[మార్చు]

ఈ కథ 1939లోనే ప్రచురితమయినప్పటికీ ఎవరూ సినిమాగా తీసేందుకు ముందుకు రాకపోవడంతో రచయిత ఈ కథను 200 గ్రీటింగ్ కార్డులలాగా తనకు తెలిసిన వాళ్ళకు పంపించాడు. ఈ చిత్ర నిర్మాత చివరకు $10,000కు కథా హక్కులు సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం కోసం స్టూడియోలో నాలుగెకరాల విస్తీర్ణంలో సుమారు 300 గజాల పొడవున్న వీధి, 75 దుకాణాలు, ఇళ్ళు నిర్మించారు. పట్టణ సహజత్వానికి దగ్గరగా ఉండడానికి కొద్ది నెలలపాటు కుక్కలు, పావురాలు, పిల్లులు మొదలయిన వాటిని సెట్లో నివసింపచేసారు.

స్పందన

[మార్చు]

దాదాపు $3,180,000 తో నిర్మిచిన ఈ చిత్రం ఘన విజయం సాధించక నిర్మాతకు నిరాశను మిగిల్చింది. మొత్తం 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డులకు ఎంపికయినది. తర్వాతి కాలంలో ఈ చిత్రం చాలా ప్రాచుర్యం పొంది, జీవితం యొక్క విలువను తెలిపి నిరాశను దూరం చేసే చిత్రంగా ఎంతో పేరు తెచ్చుకుంది. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు జాబితాలో ఫాంటసీ విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది.
2008లో ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో ఈ చిత్రం 32 వ స్థానంలో నిలిచింది.

ఇతర లింకులు

[మార్చు]