ఇన్-స్పేస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్-స్పేస్
Centre వివరాలు
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధానకార్యాలయం అహ్మదాబాదు
సంబంధిత మంత్రి జితేంద్ర సింగ్, భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి
Centre కార్యనిర్వాహకులు డాక్టర్ పవన్ కుమార్ గోయెంకా, చైర్‌పర్సన్
మాతృ విభాగం భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం
వెబ్‌సైటు
www.inspace.gov.in

ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనేది భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ కింద ఏర్పరచిన సింగిల్ విండో, స్వయంప్రతిపత్త ఏజెన్సీ.

భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని ఐదు దశాబ్దాలకు పైగా ప్రజోపయోగాలను దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు సేవలందించేలా అభివృద్ధి చేసారు. ఈ ప్రక్రియలో భాగంగా నెలకొల్పిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ప్రపంచంలోని ఆరు అతిపెద్ద అంతరిక్ష ఏజెన్సీలలో ఒకటిగా ఎదిగింది. ఇస్రోకు భూసమన్వయ కక్ష్యలో సమాచార ఉపగ్రహాలు, భూనిమ్న కక్ష్యలో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలతో అతిపెద్ద ఫ్లీట్‌ను స్థాపించి నిర్వహిస్తోంది.

అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో, కేంద్ర మంత్రివర్గం 2020 జూన్‌లో అంతరిక్ష కార్యకలాపాలలో భారతీయ ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించడానికి నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) ని ఒక సింగిల్ విండో, స్వతంత్ర, నోడల్ ఏజెన్సీగా రూపొందించింది. ఇది భారత అంతరిక్ష శాఖలో స్వయంప్రతిపత్తి కలిగిన ఏజెన్సీగా పనిచేస్తుంది.

ఇన్_స్పేస్, వాహక నౌకలు, ఉపగ్రహాల నిర్మాణం, అంతరిక్ష ఆధారిత సేవలను అందించడం వంటి వివిధ అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించడం, ప్రారంభించడం, పర్యవేక్షించడం; DOS/ISRO నియంత్రణలో ఉన్న అంతరిక్ష మౌలిక సదుపాయాలు, ప్రాంగణాలను ప్రైవేటు సంస్థలు వాడుకునేలా చెయ్యడం, కొత్త అంతరిక్ష మౌలిక సదుపాయాలు, సౌకర్యాల ఏర్పాటు వంటివి సంస్థ బాధ్యతల్లో ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

ఇన్-స్పేస్ స్థాపనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపాక, 2020 జూన్ లో అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సంస్థను స్థాపించినట్లు ప్రకటించాడు. [1][2][3] అదే నెలలో భారత అంతరిక్ష శాఖ సెక్రటరీ, ఇస్రో చైర్మన్ కె శివన్ మాట్లాడుతూ, ఆరు నెలల్లో ఈ సంస్థ పని మొదలుపెడుతుందని ప్రకటించాడు. [1][2][3][4] ఈ సమయంలో దాని విధులను డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ నిర్వహిస్తుంది. [1][2][3]

విధులు[మార్చు]

ఇన్_స్పేస్ "భారతదేశ అంతరిక్ష వనరులను ఎలా ఉత్తమంగా ఉపయోగించుకోవాలి, అంతరిక్ష ఆధారిత కార్యకలాపాలను ఎలా పెంచాలి" అనే అంశంపై ఇస్రోకు, ప్రైవేట్ రంగ సంస్థలకూ మధ్య వారధిగా పనిచేస్తుంది. [4] విద్యా సంస్థలతో సహా ప్రైవేట్ రంగ సంస్థల డిమాండ్లను సంస్థ మూల్యాంకనం చేసి, ఇస్రోతో సంప్రదించి వారి డిమాండ్లను తీర్చడానికి మార్గాలను కనుగొంటుంది. [4] సంస్థ నిర్ణయాలకు ఇస్రో, ప్రైవేట్ రంగ సంస్థలు కట్టుబడి ఉంటాయని శివన్ చెప్పాడు. [2][3] అంతరిక్ష రంగాన్ని ఇంతకుముందు ఇస్రో నియంత్రించేది. కానీ ఇప్పుడు అది పరిశోధన, అభివృద్ధి పైననే దృష్టి పెడుతుంది. [2][4]

సంస్థ ఆకృతి[మార్చు]

ఇస్రో ఛైర్‌పర్సన్, కైలాసవాడివో శివన్ ప్రకారం, ఇన్_స్పేస్ అనేది దాని స్వంత బోర్డుతో కూడిన స్వయంప్రతిపత్త సంస్థ. దీని బోర్డులో ప్రైవేట్ రంగం, పరిశ్రమల నుండి కొంతమంది సభ్యులు కూడా ఉంటారు. దీనికి తొలి చైర్‌పర్సన్ డాక్టర్ పవన్ కుమార్ గోయెంకా. సంస్థలో ప్రమోషన్‌ డైరెక్టరేట్ (PD), టెక్నికల్ డైరెక్టరేట్ (TD), ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ అండ్ ఆథరైజేషన్ డైరెక్టరేట్ (PMAD) అనే మూడు డైరెక్టరేట్‌లు ఉంటాయి. [1][3] సంస్థ ప్రధాన కార్యాలయం అహ్మదాబాదులో ఏర్పాటు చేసారు.

కార్యకలాపాలు[మార్చు]

2022 జూన్ 30 న రెండు ప్రైవేటు సంస్థలకు చెందిన రెండు ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి ద్వారా అంతరిక్షం లోకి పంపించడంతో ఇన్-స్పేస్ లాంచ్ ఆథరైజేషన్ కార్యకలాపాలు మొదలయ్యాయి. బెంగళూరుకు చెందిన దిగంతర ఏరోస్పేస్, హైదరాబాదుకు చెందిన ధ్రువ స్పేస్ వారి పేలోడ్‌లను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా ప్రయోగించారు. [5] సంస్థ ఆథరైజు చేసిన తొలి రాకెట్ ప్రయోగం 2022 నవంబరు 18న జరిగింది. హైదరాబాదుకు చెందిన స్కైరూట్ సంస్థ తయారుచేసిన విక్రమ్-ఎస్ రాకెట్టును సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా ప్రయోగించారు. ఈ సబ్-ఆర్బిటాల్ ప్రయోగంలో మూడు పేలోడ్లను పంపించారు. [6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "In-Space to be new space industry regulator, says ISRO chief Sivan". The Hindu (in Indian English). Special Correspondent. 2020-06-25. ISSN 0971-751X. Retrieved 2020-07-10.{{cite news}}: CS1 maint: others (link)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Private players can build and launch space missions, says ISRO chief". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-06-25. Retrieved 2020-07-11.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Kumar, Chethan (June 25, 2020). "In-Space: New regulator to have private players on board". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-11.
  4. 4.0 4.1 4.2 4.3 "In-Space explained: what it means to the future of space exploration". The Indian Express (in ఇంగ్లీష్). 2020-06-28. Retrieved 2020-07-10.
  5. "Indian start-ups take giant leap into space with first payloads launched on ISRO rocket". Business Today (in ఇంగ్లీష్). 2022-07-01. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-18.
  6. "Mission Prarambh: నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌.. ప్రయోగం సక్సెస్‌". EENADU. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-18.