Jump to content

ఉద్భటారాధ్య చరిత్ర

వికీపీడియా నుండి
(ఉద్భటారాధ్య చరిత్రము నుండి దారిమార్పు చెందింది)
గ్రంథ కర్త తెనాలి రామలింగడు

ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగడు రచించిన తెలుగు కావ్యము. పాల్కురికి సోమనాధుడు రచించిన బసవ పురాణంలోని ఏడవ అశ్వాసంలో కల 38 పద్యాల ఉద్భుటారాద్య వృత్తాంతము ఆధారముగా రచించబడిన ఈ కావ్యము, మూడు అశ్వాసాలు, 842 పద్యాలు గల శైవ గ్రంథము. దీనిలో కథానాయకుడు ఉద్భటారాధ్యుడు. ఇందులో మదాలస చరిత్ర, ముదిగొండ వారి మూల పురుషుడు అయిన ఉద్భటారాధ్యుని చరిత్ర ఉన్నాయి. రామలింగడు ఈ కావ్యాన్ని కొండవీటి దుర్గాధ్యక్షుడైన నాదెండ్ల గోపన వద్ద ముఖోద్యోగిగా ఉన్న ఊరదేచమంత్రికి అంకితమిచ్చాడు.

కథాసంగ్రహం

[మార్చు]

నైమిశారణ్యంలో శివపార్వతుల కేళీవిలాసానికి గంధర్వులు అంతరాయం కలిగించగా, శివుడు కోపించి, వాళ్లను పిశాచాలు కండని శపిస్తాడు. వాళ్లు శరణు వేడగా, శాంతించిన శివుడు కొంతకాలానికి తన మానసపుత్రుడైన ఉద్భటుడి వల్ల వారికి శాపవిమోచనం కలుగుతుందని అనుగ్రహిస్తాడు. శివుడి అంశతో పుట్టిన ఉద్భతుడు ముంజభోజుడనే రాజుకు దీక్షా గురువౌతాడు. ఇలా వుండగా, గంధర్వుల సంగతి గుర్తుకు వచ్చి, వాళ్ల శాపవిమోచనం కోసం ఉద్భటుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఉద్భటుడి కుమారులు అతని దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అతని దేహం నుండి వచ్చిన ధూమప్రసరణం చేత పిశాచాలకు శాపవిముక్తి కలిగి శివసాయుజ్యాన్ని పొందుతారు. ఇది ఈ కావ్యంలోని ప్రధాన కథ.

కొన్ని పద్యాలు

[మార్చు]
  • కవి ఈ క్రింది పద్యంలో శివ భక్తిరసంగా రచించి తద్వారా వేదాంత సారాన్ని బోధించాడు:

కారణంబులు నీవ కార్యజాలము నీవ
  భావజ్ఞడవు నీవ భావమీవ
జనకుండవును నీవ జన్యవస్తువు నీవ
  ప్రాపకుండవు నీవ ప్రాప్య మీవ
ఆధారమును నీవ యాధేయమును నీవ
  భోక్తవ్యమును నీవ భోక్తవీవ
రక్షకుండవు నీవ రక్షణీయము నీవ
  హార్యంబు నీవ సంహర్త వీవ

పూజకుండ వీవ పూజ్యంపు బొడవు నీవ
వాచకుండ వీవ తలపోయ వాచ్యమీవ
జ్ఞానమును నీవ చూడంగ జ్ఞాని వీవ
నిటలలోచన సకలంబు నీవ నీవ.


  • కవి ఈ కావ్యంలో ఎన్నో వర్ణనలతో తన కావ్యాన్ని అందంగా తీర్చిదిద్దాడు. ఈ క్రిందీ పద్యంలో పార్వతీదేవి శివుడితో విహరించే వేళలో పంచశరు సామ్రాజ్యలక్షి లాగా ఉందట. ఈ పద్యంలోని మరో చమత్కారం ఉంది. ఇందులోని ప్రతి పాదంలోను శివుడికి ఉపమా నోపమేయాల్ని రెంటినీ చెప్పిన రామలింగడు పార్వతి విషయంలో ఉపమానాన్ని మాత్రమే ఉపయోగించాడు. ఇక్కడ కవి జగత్తున కాధారాధేయమైన శివ, శక్తి స్వరూపాన్ని ఆధ్యాత్మిక పరంగా మనోహరంగా వర్ణించాడు.[1]

తరుణ శశాంక శేఖర మరాళమునకు
  సారగంభీర కాసార మగుచు
కైలాస గిరినాథ కలకంఠ భర్తకు
  గొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీధర షట్పదమునకు
  బ్రాతరుద్బుద్ధ కంజాత మగుచు
రాజరాజ ప్రియ రాజకీరమునకు
  మానిత పంజర స్థానమగుచు

నురగవల్లభ హార మయూరమునకు
జెన్ను మీరిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి.....

మూలాలు

[మార్చు]
  1. ఉద్భటారాధ్య చరిత్ర, తెనాలి రామకృష్ణ కవి, కావ్య సమీక్షలు, సంపాదకులు: డా.ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం,1983, పేజీ: 155-66.

బయటి లింకులు

[మార్చు]