Jump to content

ఎంప్రెస్ ఆఫ్ ఇండియా మెడల్

వికీపీడియా నుండి
ఎంప్రెస్ ఆఫ్ ఇండియా పతకం
పతకం ముందూ వెనుకా
Typeస్మారక పతకం
Awarded forవిక్టోరియా రాణిని భారత సాంరాజ్ఞిగా ప్రకటించిన రోజుకు జ్ఞాపికగా
అందజేసినవారువిక్టోరియా రాణి
Established1877 జనవరి 1
Ribbon bar of the medal

1877 లో క్వీన్ విక్టోరియాను భారత సామ్రాజ్ఞిగా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని బ్రిటిషు భారతదేశ ప్రభుత్వం ఎంప్రెస్ ఆఫ్ ఇండియా మెడల్ అనే స్మారక పతకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని KIH పతకం అని కూడా అంటారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక స్మారక సందర్భానికి గుర్తుగా జారీ చేసిన పతకాల్లో, ఇది మొట్ట మొదటి ధరించగలిగిన పతకం. ఈ పతకాన్ని భారతీయ యువరాజులు, సీనియర్ అధికారులకు బంగారు పతకాన్ని, ఎంపిక చేసిన బ్రిటిష్, భారతీయ సైనిక అధికారులకు, పౌరులకు, అలాగే 1877 ఢిల్లీ వేడుకల సమయంలో భారతదేశంలో సేవలందిస్తున్న బ్రిటిషు, భారతీయ రెజిమెంట్ల నుండి ఒక్కొక్క సైనికుడికీ వెండి పతకాన్నీ బహూకరించారు.

చరిత్ర

[మార్చు]

1547 లో కింగ్ ఎడ్వర్డ్ VI పట్టాభిషేకానికి గుర్తుగా మొదటిసారి అధికారిక పతకాలను పంపిణీ చేసారు. ఇవి స్మారక నాణేలు, ధరించగలిగేవి కావు. ధరించగలిగే మొదటి స్మారక అధికారిక పతకం, ఎంప్రెస్ ఆఫ్ ఇండియా పతకమే. ఈ పతకం 1877 జనవరి 1 న విక్టోరియా మహారాణి ఢిల్లీ దర్బారులో భారత సామ్రాజ్ఞిగా ప్రకటించిన సందర్భానికి జ్ఞాపిక. [1]

స్వరూపం

[మార్చు]

పతకాన్ని బంగారం, వెండి రెండింటిలో తయారు చేసారు. 58 మి.మీ. వ్యాసంతో ఉండే ఈ పతకం, దండయాత్ర పతకం కంటే 20 మి.మీ. పెద్దది.

పతకం బొమ్మ వైపు విక్టోరియా రాణి బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మకు ఒక పరదా తలమీది నుండి వెనుకకు వేలాడుతూ ఉంటుంది. పతకం చుట్టూ పూసల అంచుతో విక్టోరియా 1 జనవరి 1877 అని ఉంటుంది.

వెనుకవైపు ఇంగ్లీషులో ఎంప్రెస్ ఆఫ్ ఇండియా, హిందూస్తానీలో హింద్-కా-కేసర్, పర్షియన్‌లో కైసర్-ఇ-హింద్ అనే శాసనం ఉంది. అంచు చుట్టూ అలంకరణ డిజైన్ ఉంది. [2]

పతకంపై పేరేమీ ఉండదు. అయితే కొన్ని పతకాలపై తరువాతి కాలంలో గ్రహీతలు తమ పేరు స్వయంగా తామే చెక్కించుకున్నారు.

ఇది 42 మి.మీ. వెడల్పున్న రిబ్బనుతో మెడ చుట్టూ వేలాడదీసుకునేవారు. [3] క్రిమ్సన్ రంగులో, అంచుల వద్ద సన్నని పసుపు చారలతో ఉంటుంది. [4]

అవార్డు ప్రమాణాలు

[మార్చు]

ఈ పతకాన్ని భారతీయ యువరాజులు, సీనియర్ అధికారులకు బంగారు పతకాన్ని ఇచ్చారు. ఎంపిక చేసిన బ్రిటిషు, భారతీయ అధికారులకు, పౌరులకు, అలాగే ఆ సమయంలో భారతదేశంలో పనిచేస్తున్న బ్రిటిషు, భారతీయ రెజిమెంట్ల నుండి ఎంపిక చేసిన సైనికులకూ వెండి పతకాన్ని అందజేశారు. [5] [6] ఈ పతకాన్ని సైనికాధికారులు, సైనికులూ యూనిఫారంపై ధరించడానికి అనుమతించలేదు. అయితే భారత యువరాజులు, పౌరులు మాత్రం ధరించేవారు. [6]

బహుమతి ప్రదనోత్సవం

[మార్చు]

విక్టోరియా రాణిని భారత సామ్రాజ్ఞిగా ప్రకటించిన దర్బారు సమయంలో, అప్పటి వైస్రాయి, గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా వస్త్రాలలో అలంకరించుకుని, 63 మంది సంస్థానాధిపతులను ఒకరి తరువాత ఒకరరికి స్వాగతం పలికాడు. పతకాన్ని వారికి కింది విధంగా బహూకరించాడు:

... సంస్థానాధిపతి మెడ చుట్టూ క్రిమ్సన్ రిబ్బన్ను ఉంచాడు. దానికి రాణి బొమ్మ చెక్కిన చాలా అందమైన బంగారు పతకం దానికి వేలాడుతోంది. దానిపై: 'ఆమె ఆదేశం మేరకు నేను నిన్ను అలంకరించాను. ఈ పతకాన్ని మీరు దీర్ఘకాలం ధరింతురుగాక, అది వెలువడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తూ అది మీ కుటుంబంలో వారసత్వ సంపదగా ఉండుగాక. [7]

గ్రహీతలు

[మార్చు]
  • జంగ్ బహదూర్ రాణా
  • విజయ మోహన ముక్తాంబ బాయి
  • సుల్తాన్ జహాన్, భోపాల్ బేగం
  • భగవత్‌సిన్హ్ జీ
  • సయాజీరావు గైక్వాడ్ III
  • రఘుబీర్ సింగ్ జింద్
  • కస్తూర్‌చంద్ దాగా
  • కల్బ్ అలీ ఖాన్
  • మహబూబ్ అలీ ఖాన్
  • ముహమ్మద్ ముస్తాక్ అలీ ఖాన్
  • ఖెంగార్జి III
  • రానోదీప్ సింగ్ కున్వర్
  • హీరా సింగ్ నభా
  • నృపేంద్ర నారాయణ్
  • రామచంద్ర తొండైమాన్
  • చంద్ర షంషేర్ జంగ్ బహదూర్ రాణా
  • జయాజీరావ్ సింధియా
  • శివాజీ VI
  • ప్రతాప్ సింగ్
  • జస్వంత్ సింగ్
  • లక్ష్మేశ్వర్ సింగ్
  • రామేశ్వర్ సింగ్
  • రణబీర్ సింగ్
  • షాజహాన్ బేగం
  • విశాఖ తిరునాళ్
  • అయిల్యం తిరునాళ్

మూలాలు

[మార్చు]
  1. McCreery, Christopher (2012). Commemorative medals of the Queen's reign in Canada, 1952-2012. Toronto: Dundurn Press. p. 19. ISBN 9781459707566.
  2. Tancred, George (1891). Historical Record of Medals and Honorary Distinctions Conferred on the British Navy, Army & Auxiliary Forces: From the Earliest Period. Spink & Son. pp. 295–296.
  3. McCreery, Christopher (2012). Commemorative medals of the Queen's reign in Canada, 1952-2012. Toronto: Dundurn Press. p. 19. ISBN 9781459707566.
  4. "Empress of India Medal (1877)". Imperial War Museums. Retrieved 30 October 2012.
  5. McCreery, Christopher (2012). Commemorative medals of the Queen's reign in Canada, 1952-2012. Toronto: Dundurn Press. p. 19. ISBN 9781459707566.
  6. 6.0 6.1 Dorling, H. Taprell (1956). Ribbons and Medals. A. H. Baldwin & Son, London. p. 107.
  7. రాబర్ట్స్, ఎర్ల్. భారతదేశంలో నలభై ఒక్క సంవత్సరాలు. రిచర్డ్ బెంట్లీ అండ్ సన్, 1896. p. 333. ISBN 978-1402177422.