ఢిల్లీ దర్బారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కింగ్ జార్జ్ V, క్వీన్ మేరీ ఆసీనులై ఉన్న ఢిల్లీ దర్బార్ - 1911 లో

ఢిల్లీ దర్బార్ అనేది భారతదేశంలో ఒక చక్రవర్తి లేదా చక్రవర్తి వారసత్వాన్ని గుర్తించడానికి ఢిల్లీలోని కారొనేషన్ పార్కు వద్ద బ్రిటిష్ వారు భారతీయ శైలిలో నిర్వహించిన సభ. దీనిని ఇంపీరియల్ దర్బార్ అని కూడా పిలుస్తారు. బ్రిటిషు సామ్రాజ్యం ఉచ్ఛ స్థితిలో ఉండగా 1877, 1903, 1911 లలో మూడు సార్లు దీన్ని నిర్వహించారు. 1911 దర్బారుకు మాత్రమే రాజు - జార్జ్ V - హాజరయ్యాడు. ఈ పదం మొఘల్ పదం దర్బార్ నుండి తీసుకున్నారు.

1877 దర్బారు[మార్చు]

1877 దర్బారును "ప్రకటన దర్బార్ " అంటారు. దీన్ని థామస్ హెన్రీ థోర్న్టన్ నిర్వహించాడు. విక్టోరియా రాణిని భారతదేశానికి సామ్రాజ్ఞిగా ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ఈ దర్బారును 1877 జనవరి 1 న మొదలుపెట్టారు. 1877 దర్బారు ఒక అధికారిక కార్యక్రమం మాత్రమే. పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్న కార్యక్రమం కాదు. తరువాత జరిగిన 1903, 1911 దర్బారుల్లో మాత్రం ప్రజలు భారీగా పాల్గొన్నారు. దీనికి 1 వ ఎర్ల్ ఆఫ్ లిట్టన్ - భారత వైస్రాయి, మహారాజులు, నవాబులు, మేధావులూ హాజరయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ఇండియాకు భారతదేశ నియంత్రణ బదిలీ అయిన క్రమానికి ఇది ముగింపు. 

ఈ ఘటన జ్ఞాపకార్ధం ఎంప్రస్ ఆఫ్ ఇండియా మెడల్ ను ముద్రించి అనాటి గౌరవ అతిథులకు పంపిణీ చేసారు. [1] వైస్రాయి లెట్టన్, రామనాధ్ ఠాగూర్ ను రాజా అనే గౌరవంతో సత్కరించాడు. [2]

తళుకులీనిన ఈ దర్బారు లోనే గణేష్ వాసుదేవ్ జోషి, "తెల్లటి ఖద్దరు" దుస్తులు ధరించి పూనా సార్వజనిక్ సభ అనే రాజకీయ సంస్థ తరపున ఒక ప్రశంసా పత్రాన్ని చదివాడు. ఆ సంస్థ తరువాతి కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ తరువాత పుట్టుకకు నాంది అయింది. జోషి ప్రసంగం చాలా మర్యాదపూర్వక భాషలో ఒక డిమాండును ముందుకు తెచ్చింది:

బ్రిటిష్ ప్రజలు అనుభవిస్తున్న రాజకీయ, సామాజిక హోదాను భారతదేశానికి కూడా అందించవలసినది

ఈ డిమాండ్‌తో, స్వేచ్ఛా భారతదేశం కోసం ఉద్యమం లాంఛనంగా మొదలైంది. ఇది భారతదేశంలో గొప్ప పరివర్తనకు ఇది నాంది పలికిందని చెప్పవచ్చు. [3]

ఈ దర్బారు నిర్వహణ కోసం 1876-78 నాటి మహా కరువు నుండి నిధులను మళ్ళించారు. దీనితో ఈ దర్బారు చాలా వివాదాస్పదమైంది. [4]

1903 దర్బారు[మార్చు]

లార్డ్ కర్జన్, లేడీ కర్జన్ ఢిల్లీ దర్బారుకు చేరుకున్నారు, 1903.

భారతదేశ చక్రవర్తిగా ఎడ్వర్డ్ VII, సామ్రాజ్ఞిగా అలెగ్జాండ్రా అవడాన్ని పురస్కరించుకుని 1903 లో ఈ దర్బారు జరిగింది. 

రెండు పూర్తి వారాల ఉత్సవాలను భారతదేశ వైస్రాయి లార్డ్ కర్జన్ చాలా వివరంగా రూపొందించాడు. [5] ఆడంబరం, శక్తి, స్ప్లిట్-సెకండ్ టైమింగుల అద్భుతమైన ప్రదర్శన అది. 1877 నాటి ఢిల్లీ దర్బారు గానీ, 1911 లో జరిగిన దర్బారు గానీ, లార్డ్ కర్జన్ నిర్వహించిన ఈ 1903 ఉత్సవాలతో సరితూగవు. 1902 చివరలో కేవలం కొద్ది నెలల్లో, నిర్మానుష్యమైన మైదానాన్ని విస్తారమైన గుడారాల నగరంగా మార్చేసారు. ఢిల్లీ నుండి ప్రేక్షకులను తీసుకురావడానికి తాత్కాలిక లైట్ రైలు మార్గాన్ని వేసారు. దాని స్వంత స్టాంపుతో, టెలిఫోను, టెలిగ్రాఫిక్ సౌకర్యాలతో ఒక తపాలా కార్యాలయం, వివిధ రకాల దుకాణాలు, ప్రత్యేకంగా రూపొందించిన యూనిఫాంతో పోలీస్ దళం, ఆసుపత్రి, మేజిస్ట్రేట్ కోర్టు, పారిశుధ్యం, డ్రైనేజీ సౌకర్యాలు, విద్యుద్దీపాలనూ ఏర్పాటు చేసారు. సావనీర్ గైడ్ పుస్తకాలను విక్రయించారు. క్యాంపింగ్ గ్రౌండుకు చెందిన మ్యాప్‌లను పంపిణీ చేసారు. మార్కెటింగ్ అవకాశాలను చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. ప్రత్యేక ఢిల్లీ దర్బారు పతకం, బాణాసంచా కాల్పులు, ప్రదర్శనలు, ఆకర్షణీయమైన నృత్యాలూ జరిగాయి. 

అయితే ఎడ్వర్డ్ VII హాజరుకాలేదు. అతని సోదరుడు, డ్యూక్ ఆఫ్ కానాట్ వచ్చాడు. అతడు బొంబాయి నుండి రైలు ద్వారా రాగా, కర్జన్ కలకత్తా నుండి వచ్చాడు. వారిని ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్న జనసందోహం, బహుశా ఒకే చోట కనిపించే గొప్ప ఆభరణాల ప్రదర్శన అయి ఉంటుంది. భారతీయ రాజులందరూ శతాబ్దాలుగా వారసత్వంగా వస్తూ ఉన్న అత్యంత అద్భుతమైన ఆభరణాలతో అలంకరించుకున్నారు. మహారాజులు భారతదేశం నలుమూలల నుండి పెద్ద బృందాలతో వచ్చారు. వారిలో చాలా మంది మొదటిసారిగా కలుసుకున్నారు. సైన్యాధిపతి లార్డ్ కిచనర్ నేతృత్వంలో, భారత సైన్యపు భారీ శ్రేణులు, కవాతు చేశాయి. వారు బ్యాండ్‌లు వాయించారు. సాధారణ ప్రజా సమూహాన్ని నియంత్రణలో ఉంచారు.

దర్బారు వేడుక నూతన సంవత్సర దినోత్సవం రోజున జరిగింది. పోలో తదితర క్రీడలు, విందులు, డ్యాన్సులు, సైనిక సమీక్షలు, బ్యాండ్లు, ప్రదర్శనలూ జరిగాయి. ఈ ఉత్సవాల గురించి రాసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పత్రికలు తమ ఉత్తమ పాత్రికేయులు, కళాకారులు, ఫోటోగ్రాఫర్‌లను పంపారు. ఈ ఉత్సవాల సినిమా ఫుటేజిని భారతదేశం అంతటా తాత్కాలిక సినిమాలలో ప్రదర్శించారు. [6] [7]

ఉత్సవాల అంతంలో గొప్ప డ్యాన్సు జరిగింది. ఇందులో అత్యున్నత స్థాయి అతిథులు మాత్రమే హాజరయ్యారు. కర్జను భార్య ఆభరణాలతో నెమలి గౌనులో హాజరైంది. [8]

భారత తపాలా శాఖ రెండు స్మారక సావనీర్ షీట్‌ల ను 1903 జనవరి 1 మధ్యాహ్నం 12 గంటలకు జారీ చేసింది. ఈ రోజు స్టాంపు సేకర్తలలో ఇది చాలా డిమాండున్న అంశం. 

1911 దర్బారు[మార్చు]

హైదరాబాద్ నిజాం, చక్రవర్తికీ రాణికీ ఢిల్లీ దర్బారులో నివాళి అర్పించాడు - 1911 డిసెంబరులో

జార్జ్ V, మేరీ ఆఫ్ టెక్ బ్రిటన్‌లో పట్టాభిషేకం చేసుకున్న సందర్భంగా డిసెంబరులో దర్బారు నిర్వహించబడుతుందని 1911 మార్చి 22 న చేసిన రాజ ప్రకటన ప్రకటించింది. భారతదేశంలోని ప్రతి సంస్థాన ప్రభువు, అలాగే వేలాది మంది భూస్వాములు, ఇతర విశిష్ట వ్యక్తులు, తమ సార్వభౌములకు ప్రణామం చేసేందుకు హాజరయ్యారు. 

అధికారిక వేడుకలు డిసెంబర్ 7 నుండి 16 వరకు జరిగాయి. దర్బారు డిసెంబర్ 12 మంగళవారం నాడు జరిగింది. [9] పట్టాభిషేకం దుస్తులలో 6170 వజ్రాలతో పాటు నీలమణులు, పచ్చలు, కెంపులతో కూడి 965 గ్రాముల బరువున్న భారతదేశం రాజ్యాధికార కిరీటం ధరించి చక్రవర్తి, భార్యతో పాటు పట్టాభిషేకం పార్కుకు వచ్చాడు. స్థానిక సంస్థానాధీశులు వారికి నివాళులర్పించారు. వారిలో ఒక మహిళ, భోపాల్ బేగం, కూడా ఉంది. బరోడా మహారాజా సాయాజీరావు III గైక్వాడ్, ఆభరణాలు ధరించకుండా రాజ దంపతుల వద్దకు వచ్చి, కొద్దిగా వంగి, తిరిగి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి వారికి వీపు నుంచి వెళ్ళాడు. దాంతో వివాదం చెలరేగింది. అతని చర్య బ్రిటిష్ పాలన పట్ల అసమ్మతికి సంకేతంగా భావించారు. [10] తరువాత, రాజ దంపతులు గోపురం గల రాజ మండపానికి చేరుకున్నారు. అక్కడ రాజు, భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి తరలిస్తున్నట్లు ప్రకటించాడు. అదే వేడుకలో బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. [11]

మరుసటి రోజు, డిసెంబర్ 13 న, రాజ దంపతులు ఎర్రకోటలోని బాల్కనీ కిటికీ వద్ద ప్రజలకు దర్శనమిచ్చారు. వారిని చూడడానికి దాదాపు 5 లక్షల మంది ప్రజలు వచ్చారు. ఇలా దర్శనమిచ్చే ఆచారాన్ని హ్యూమయూన్ మొదలుపెట్టాడు. తరువాత డిసెంబరు 14 న చక్రవర్తి 50,000 మంది సైనిక సైనికుల కవాతును పరిశీలించాడు.

1911 ఈవెంట్‌లో పాల్గొన్న బ్రిటిషు, భారత సైన్యాల సైనికులకు, అధికారులకు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల (26,800) వెండి ఢిల్లీ దర్బార్ పతకాలను బహూకరించారు. రెండు వందల బంగారు పతకాలను కూడా తయారు చేయించారు. [12] వాటిలో నూరింటిని భారతీయ సంస్థానాధీశులకు, అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారులకూ ప్రదానం చేసారు. [13]

ఈ ఉత్సవాలను విత్ అవర్ కింగ్ అండ్ క్వీన్ త్రూ ఇండియా (1912) -అనే పేరుతో ఒక చలనచిత్రంగా తీసి విడుదల చేసారు. దీన్ని ఢిల్లీలో దర్బారు అని కూడా అన్నారు. దీన్ని కినిమాకలర్‌లో చిత్రీకరించి, 1912 ఫిబ్రవరి 2 న విడుదల చేసారు. [14]

ఎడ్వర్డ్ VIII 1936 డిసెంబరులో తన పట్టాభిషేకానికి ముందే పదవీ విరమణ చేయగా, అతని వారసుడు జార్జ్ VI భారతదేశాన్ని సందర్శించి స్వయంగా దర్బారును నిర్వహిస్తాడని మొదట అనుకున్నారు. అతడు గద్దెబెక్కిన కొన్ని వారాలకు, అటువంటి సందర్శనను బహిష్కరించాలని భారత జాతీయ కాంగ్రెసు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పేదరికంలో మగ్గుతున్న దేశంలో అలాంటి ఉత్సవాల కోసం ఖర్చు చేయడాన్ని కమ్యూనిస్ట్ ఎంపీ విల్లీ గల్లాచర్ 1937 ఫిబ్రవరి లో ఖండించాడు. 1937 అక్టోబరులో రాజు చేసిన ప్రసంగంలో "నా భారతీయ సామ్రాజ్యాన్ని సందర్శించడం సాధ్యమయ్యే సమయం కోసం నేను ఆసక్తిగాను, ఆనందంతోనూ ఎదురు చూస్తున్నాను" అన్నాడు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవడం, భారత స్వాతంత్ర్య ఉద్యమాల కారణంగా అంటే ఈ సందర్శన జరగనే లేదు.

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. The Illustrated London News dated 20 Jan. – 17 Feb., 1877 retrieved 3/18/2007 medal
  2. Cotton, H. E. A., Calcutta Old and New, 1909/1980, p. 596, General Printers and Publishers Pvt. Ltd.
  3. KESAVAN MUKUL (Sunday, 29 May 2005) "STORY OF THE CONGRESS – Three pivotal moments that shaped early nationalism in India", The Telegraph, Calcutta, retrieved 3/19/2007 nationalism
  4. Douglas Northrop, An Imperial World: Empires and Colonies since 1750 (Boston: Pearson, 2013), pp. 2–3.
  5. Nayar, Pramod K. (2012). Colonial Voices: The Discourses of Empire. John Wiley & Sons. p. 94. ISBN 978-1-118-27897-0.
  6. Holmes Richard, "Sahib: The British Soldier in India 1750–1914". HARPERCOLLINS. 571 pages.
  7. Bottomore Stephen (Oct, 1995) "An amazing quarter-mile of moving gold, gems and genealogy": filming India's 1902/03 Delhi Durbar, Historical Journal of Film, Radio and Television, includes extensive bibliography of the event, retrieved 3/18/2007 Victoria Memorial Inside 2018 Kolkata
  8. Coronation Durbar, Delhi 1911: Official Directory with Maps. Calcutta: Superintendent Government Printing, India, 1911.
  9. Coronation Durbar, Delhi 1911: Official Directory with Maps. Calcutta: Superintendent Government Printing, India, 1911.
  10. "Indian maharajah's daring act of anti-colonial dissent". BBC News. 2011-12-10.
  11. "Delhi Durbar of 1911 - General Knowledge Today". www.gktoday.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-02-18.
  12. Howard N Cole. Coronation and Royal Commemorative Medals. pp. 37. Published J. B. Hayward & Son, London. 1977.
  13. Delhi Durbar Medals of 1911 1911 medal
  14. Filming the Delhi Durbar 1911 filming Archived 8 జూలై 2011 at the Wayback Machine