ఎర్రమల కొండప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎర్రమల కొండప్ప అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందినవాడు. రెండవ తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటిలో తగాదాపడి బయటకు వచ్చి పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరాడు. 1902లో లోకమాన్య తిలక్ బెంగళూరు నుండి బొంబాయికి రైలులో వెళ్తూ గుంతకల్లు స్టేషన్‌లో ప్రజలనుద్దేశించి చేసిన ఉపన్యాసం విని ఇతడు ప్రభావితుడై తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తిలక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1921లో మహాత్మాగాంధీ తాడిపత్రికి వచ్చినప్పుడు అతని వెన్నంటే ఉన్నాడు. ఆ సమయంలో జైలుశిక్ష అనుభవించాడు. ఊరి బయట చేనులో గుడిసె వేసుకుని ప్రత్తి పండించి, నూలువడికి సరఫరాచేశాడు. గాంధీ హరిజన ఉద్యమం ప్రారంభించక ముందే ఇతడు తన తోట దగ్గర ఉన్న మిస్సమ్మ బంగ్లాలో ఉన్న హరిజన బాలికలకు నీటి వసతి కల్పించాడు. ఆసుపత్రిలో ఒక స్త్రీ కొడుకును కని మరణిస్తే ఆ బిడ్డను పెంచి పెద్దచేశాడు. 1932 ఉప్పు సత్యాగ్రహం సమయంలో అనంతపురం ఇంజనీరింగు కాలేజీ సమీపంలోని బంజరు భూమిలోని ఉప్పుమన్ను తెచ్చి తన తోటలో ఆ మట్టిని ఒడగట్టి తేటతెల్లని ఉప్పును తయారు చేసి బహిరంగంగా పొట్లాలు కట్టి ఆ ఉప్పును అందరికీ పంచాడు. ఆ విధంగా ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తి జిల్లాలో ఇతడే. 1934లో గాంధీ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తన రెండు ఎకరాల భూమిని హరిజనోద్ధరణ కోసం గాంధీగారికి దానం చేశాడు. కేశవ విద్యానికేతన్ పేరుతో హరిజన హాస్టల్‌ను నిర్మించాడు. తన 50 ఎకరాల ఆస్తిని అమ్మివేసి ఆ ధనం మొత్తాన్ని దానధర్మాలకు వినియోగించాడు. తన స్వంతమైన 40 జతల ఎద్దులను కూడా దానం చేశాడు. ఆమరణాంతం గాంధేయవాదిగా ఉన్న కొండప్ప 1971లో తన 104వ యేట మరణించాడు[1].

మూలాలు[మార్చు]

  1. స్వాతంత్ర్య యోధుడు ఎర్రమల కొండప్ప - అనంతనేత్రం - వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక - పేజీ 137