ఎలెవెన్ మినిట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రెజిల్ లో పుస్తక ముఖచిత్రం

ఎలెవెన్ మినిట్స్ (Eleven Minutes), ప్రఖ్యాత రచయిత పాల్ ఖేలో వ్రాసిన నవల. ఇది మొదట పోర్చుగీసు భాషలో Onze Minutos అనే పేరుతో ప్రచురింపబడింది కాని తరువాత అనేక భాషలలోకి అనువదింపబడింది. ఇది 2003లో మొదట ప్రచురింపబడింది. ఇందులో మారియా అనే స్త్రీ వ్యభిచారిణిగా మారిన వృత్తాంతం ఉంది.

పరిచయం[మార్చు]

(దుప్పల రవికుమార్ అనే రచయిత తన చదువు-బ్లాగు లో వ్రాసిన పరిచయం ఈ వ్యాసానికి మూలం).

పోర్చుగీసు భాషా రచయిత పాల్ ఖెలో రచనలగానే అవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవని కచ్చితంగా అనుకుంటాం. తన రచనలన్నింటిలోనూ అక్షరాలతో శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని నిండా దట్టించి రచన చేయడంవల్ల వాటిని చదివిన అన్ని దేశాల పాఠకులూ ఎంతో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ పొందుతున్నారు. ఐతే తన ధోరణికి భిన్నంగా పాల్ ఖెలో 2003లో ఒక నవల వెలువరించారు. దాని పేరు ఎలెవెన్ మినిట్స్ (పదకొండు నిముషాలు).

1970ల ప్రాంతాల్లో పాల్ ఖెలో ఒక నవల చదివారట. అది ఇర్వింగ్ వాలేస్ రచించిన సెవెన్ మినిట్స్. అప్పట్లో వ్యభిచారం గురించి రాసినందుకు ఆ పుస్తకం సెన్సార్ షిప్ పాలబడింది. అప్పట్నించి కొన్ని ఆలోచనలు పాల్ ఖెలో మనసులో ఉన్నాయి. ఆ తర్వాత 1997లో ఇటలీలో పర్యటిస్తున్నపుడు తన హోటల్ గదికి పేరులేని ఒక వ్యక్తి అందజేసిన కాగితాల బొత్తిలో ఓ బ్రెజిలియన్ వ్యభిచారి కథ ఉందట. తానెలా ఆ వృత్తిలోకి వచ్చిందీ, తనకెన్ని పెళ్ళిళ్లయిందీ, చట్టంతో తనకెన్ని సమస్యలు ఎదురైందీ ఇలాంటి విషయాలన్నీ రాసుకున్న ఒక వేశ్య తన కథనాన్ని పాల్ ఖెలోకు అందజేసిందన్న మాట. అవన్నీ మరికొన్ని ఆలోచనలను పాల్ ఖెలో మనసులో చేర్చాయి. ఇంతలో జ్యూరిచ్ లో పర్యటిస్తున్నపుడు సోనియా అనే పేరుగల ఒకామె వచ్చి తానే ఆ రాతప్రతిని అందజేశానని పరిచయం చేసుకుంది. అదే ఏడాది జెనీవాలో మరొకామె పరిచయమై తన కథనంతా చెప్పుకొచ్చిందట. వీటన్నింటినీ మనసులో దాచుకున్న పాల్ ఖెలో తనదైన శైలిలో సెక్స్ గురించిన నవలోకటి రాయాలనుకున్న ఫలితమే 2003లో వెలువడిన ఈ ఎలెవెన్ మినిట్స్.

నవల కథాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే మరియా అనే పేరుగల అమ్మాయి వ్యభిచారిగా ఎలా మారిందన్నదే కథ. కానీ దాన్ని పాల్ ఖెలో తనదైన పద్ధతిలో కథనీకరించడం వల్ల పుస్తకం ఎక్కడా ఆపనివ్వకుండా చదివిస్తుంది. ఈ నవలలో ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ఏమిటంటే కథంతా రచయితే స్వయంగా మనకు చెప్తారు. కాని మనల్ని చాలాచోట్ల (దాదాపు ప్రతి అధ్యాయం చివర) మరియా రాసుకున్న డైరీని – కొన్ని వాక్యాలనుంచి కొన్ని పేజీల దాకా – చదవనిస్తారు. కాని నవలంతా చదవడం పూర్తి చేసిన తర్వాత స్వయంగా మరియా తన కథనంతా మనకు చెప్పినట్టు ఫీలవుతాం. అదే పాల్ ఖెలో శైలి ప్రత్యేకత. అనగనగా మరియా అనే వేశ్య ఉండేది అంటూ నవల ప్రారంభమవుతుంది. ఇది చాలా చిత్రమైన వాక్యం. అనగనగా అని మొదలుపెడితే అది చిన్న పిల్లలకు సంబంధించిన కథ కావాలి కదా. మరదే వాక్యంలో వేశ్యను పరిచయం చేశారు. అంటే అది పెద్దలకు సంబంధించిన కథన్న మాట. అదే రచయిత చెప్తారు. మనమంతా నిజజీవితంలో ఎప్పుడూ రెండు రకాలుగా ప్రవర్తిస్తుంటాం – ఒక పసి మనసు మనలోనే ఉంటుంది, అన్ని అనుభవాలతో పండిపోయిన మనసూ మనలోనే ఉంటుంది.

కథ[మార్చు]

బ్రెజిల్ దేశంలో మారుమూల ప్రాంతంలో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మరియాకు అందరి ఆడపిల్లల్లాగానే ఒక రాకుమారుడు అకస్మాత్తుగా ప్రత్యక్షమై తనను తీసుకెళ్లిపోయి, ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని జయించేయాలన్నట్టు కలలు కంటూ ఉంటుంది. పదకొండేళ్ల వయసులో, పెద్ద మనిషి కాకముందే, పొరిగింటి కుర్రాడిని ప్రేమిస్తుంది. తర్వాత హైస్కూలులో పదమూడో ఏట ఒకబ్బాయి ముద్దు పెట్టుకున్నా, పదిహేనో ఏట మాత్రమే నోరు తెరిచి ముద్దు పెట్టుకోవాలని తెలుసుకుంటుంది. అదే ఏడాది చేతి వేళ్ల (మాస్టర్బేషన్) తోనే పిచ్చి ఆనందాన్ని పొందవచ్చని తెలుసుకుంటుంది. పదిహేడో ఏట మరో అడుగు ముందుకేసి ఒకబ్బాయితో కలిసి స్వర్గపు అంచులు చేరుకుంటుంది. ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తుంది గాని ఆమెకు అందులో కిక్ ఏమీ కనిపించక ప్రేమ అనే భావనమీదే విరక్తి పెంచుకుంటుంది. ఇదంతా చదివి ఇదేదో రసవత్తరమైన బూతు పుస్తకమనుకుంటే మీరంతా పొరపాటు పడ్డట్టే. మరియా జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాల కథనూ ఇరవై పేజీల్లో చెప్పేసి తర్వాతి నాలుగేళ్ల కథనూ 250 పేజీల్లో చెప్పీన ఘటికుడు పాల్ ఖెలో. ముందే చెప్పినట్టు ఇది నరాలను మెలిపెట్టే కథాంశమో, నవలో కాదు. జీవితాన్ని సరైన దృక్పథంలో పరిశీలించడానికి తోడ్పడే ఒక మంచి పుస్తకం.

తన బతుకును ఉద్ధరించడానికి ఏ రాకుమారుడూ ఎంతకీ రాకపోవడంతో తనే అతడిని వెతుక్కుంటూ వెళితే పోయింది కదా అనే పిచ్చి ఆలోచన వస్తుంది మరియాకు. పరువంతో పిటపిటలాడే ఇరవై ఏళ్ల ప్రాయంలో తన ఫిజికల్ ఫిట్ నెస్ శాశ్వతమని భ్రమపడి మరియా సినీ రంగంలోకి వెళ్లిపోవాలన్న ఆశతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మరీ పట్టణం చేరుకుంటుంది – ఒంటరిగా. నటి కావాలన్న ఆమె కోరిక జెనీవాలో రెడ్ లైట్ ఏరియా అనదగ్గ ర్యూ డె బెర్న్ అనే ఊర్లో నైట్ క్లబ్లో బార్ గాళ్ ఉద్యోగం దొరికించుకోవడం వరకూ చిత్రాతిచిత్రమైన మలుపులు తిరుగుతూ పోవడానికి రెండే రెండేళ్లు పడుతుంది. అయితే తన దురదృష్టానికి నిందించుకోక, తన ఖర్మకు మరెవరినో బాధ్యుల్ని చేసి ఆడిపోసుకోకుండా తర్వాత ఏమిచేయాలన్న ఎరుక మరియాకుంది (పాల్ ఖెలో హీరోయిన్ కదా!). ఇదంతా ప్రేమ గురించిన తన అన్వేషణ ఫలితం. అంచేత డబ్బు కాస్త వెనకేసుకుని మళ్లీ సొంతూరు చేరుకుని ఫార్మ్ హౌస్ కొనుక్కుని మరో విధమైన మార్గంలో బతుకుదామని నిర్ణయించుకుంటుంది. నిజానికి చిత్రకారుడైన కళాకారుడు పరిచయమవ్వకపోతే అనుకున్నట్టే చేసేదేమో. కాని తన ఇరవై మూడో ఏట పరిచయమైన రాల్ఫ్ హార్ట్ చిత్రకారుడు ఆమె జీవితంలో మరో సంక్షోభానికి (?) కారణమవుతాడు. రుచికోసం సెక్స్, డబ్బు కోసం సెక్స్ మాత్రమే ఇప్పటి వరకు ఆమెకు తెలుసు. ఆమె ప్రేమయాత్రలో ఇక పవిత్రమైన సెక్స్, ప్రేమ కోసం సెక్స్ ఎదురవుతాయి.

చివర్లో మరియాకు పుస్తకాలిచ్చి సాయపడ్డ లైబ్రేరియన్, థియేటర్ ఎగ్జిక్యుటివ్ నవలలో ఎందుకొచ్చారో మనకు తెలీదు. బహుశా పాల్ ఖెలో ఈ నవలకోసం రాసుకున్నా నోట్స్ లోని వివరాలు అందివ్వడానికా? లేదంటే బూతంటే ఇష్టపడే సగటు పాఠకుడి ఇగోను సంతృప్తపరచడానికా? వారిద్దరి సంఘటనలున్న కొద్ది పేజీలు అటు మరియాకు గాని, ఇటు మనకు గాని ఎలాగైనా ఉపయోగపడతాయంటారా?

లభ్యం[మార్చు]

పోర్చుగీసు నుంచి ఇంగ్లిషులోకి మార్గరెట్ జల్ కోస్తా అనువాదం ఎంత సాఫీగా సాగిపోతుందంటే నవల చదువుతున్నపుడు పాల్ ఖెలో తెలుగులోనే నవలరాశాడా అన్నట్టుగా ఉంటుంది. దీనికి మొదటి కారణం అంత సరళమైన, సులభమైన ఇంగ్లిషు పదాలు ఎంచుకోవడమైతే, రెండో కారణం ఇందులోని విషయమంతా మనం నిత్యం వింటున్న, అనుభవిస్తున్న విషయాలే కావడం. ప్రేమ కోసం, పేరు కోసం, డబ్బు కోసం పరుగులు తీస్తూ మరియా మాదిరిగానే మనకు తెలిసిన స్త్రీ పురుషులెందరో దేనికోసమో అర్రులు చాస్తూ ఏవేవో పోగొట్టుకుంటూ మరింకేవేవో పొందుతుంటారు. మరి మన సంగతేమిటి? మనలో వెలుగుతున్న "లోపలి జ్యోతి" (ఇన్నర్ లైట్) ను మనమెప్పుడు దర్శించుకుంటాం? మనచేత ఆ ప్రయత్నం చేయించడమే ఈ రచయిత ఉద్దేశం. 275 పేజీల ఈ ఎలెవెన్ మినిట్స్ నవలను మన దేశంలో హార్పర్ కాలిన్స్ ప్రచురణ సంస్థ పేపర్ బ్యాక్ ఎడిషన్ ప్రచురించింది. వెల 295 రూపాయలు.

అనువాదాలు[మార్చు]

ఈ పుస్తకం వివిధ భాషల అనువాదాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • ഇലവന്‍ മിനിറ്റ്സ് (మళయాళం)
  • Njëmbëdhjetë minuta (అల్బేనియన్)
  • أحدى عشر دقيقة (అరబిక్)
  • বাংলা (బెంగాలీ)
  • Единайсет минути (బల్గేరియన్)
  • Onze minuts (కటలన్)
  • 愛的十一分鐘 (సాంప్రదాయిక చైనీస్)
  • Jedanaest Minuta (క్రొవేషియన్)
  • Jedenáct minut (చెక్)
  • Elf Minuten (జర్మన్)
  • Üksteist Minutit (ఎస్టోనియన్)
  • Yksitoista minuuttia (ఫిన్నిష్)
  • Onze Minutes (ఫ్రెంచి)
  • Tizenegy perc (హంగేరియన్)
  • Eleven Minutes (ఇంగ్లీష్)
  • Vienpadsmit minūtes (లాట్వియన్)
  • Vienuolika minučių (లిథువేనియన్)
  • Единaeсет минути (మేసిడోనియన్)
  • Elf Minuten (నెడర్లాండ్డ్)
  • Elleve Minutter (నార్వీజియన్)
  • Ellefu Mínútur (ఊస్లాండిక్)
  • Одинадцять хвилин (ఉక్రేనియన్)
  • Jedenaście minut (పోలిష్)
  • Одиннадцать минут (రష్యన్)
  • Once minutos (స్పానిష్)
  • Έντεκα λεπτά (గ్రీక్)
  • Undici Minuti (ఇటాలియన్)
  • یازده دقیقه (పర్షియన్)
  • 11分間 (జపనీస్)
  • 십일 분 (కొరియన్)
  • 11 นาที (థాయి)
  • On Bir Dakika (టర్కిష్)
  • Једанаест минута (సెర్బియన్)
  • Elva minuter (స్వీడిష్)
  • Unsprezece minute (రొమేనియన్)
  • Sebelas Menit (ఇండొనీషియన్)
  • თერთმეტი წუთი (జార్జియన్)
  • אחת עשרה דקות (హిబ్రూ)
  • Mười một phút (వియత్నామీస్)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • చదువు బ్లాగు లో దుప్పల రవికుమార్ వ్రాసిన పరిచయం. తన రచనను తెలుగు వికీలో కాపీ చేయడానికి అనుమతి ఇచ్చినందుకు రచయితకు కృతజ్ఞతలు.