ది ఆల్కెమిస్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది ఆల్కెమిస్ట్ (The Alchemist) (పరసువేది)
మొదటి ప్రచురణ కవర్
కృతికర్త: పాల్ ఖెలో Paulo Coelho
అసలు పేరు (తెలుగులో లేకపోతే): O Alquimista
దేశం: బ్రెజిల్
భాష: పోర్చుగీస్
విభాగం (కళా ప్రక్రియ): మనస్తత్వం, సాహస కృత్యాలు, నవల, డ్రామా, కాల్పనిక జగత్తు.
ప్రచురణ: హార్పర్ కాలిన్స్ (ఆంగ్ల ప్రచురణ)
విడుదల: 1988
ఆంగ్ల ప్రచురణ: 1993
ప్రచురణ మాధ్యమం: ప్రింట్ (అట్ట బైండు, పేపర్ బ్యాక్, ఐ ట్యూన్స్)
పేజీలు: 167 పేజీలు (మొదటి ఆంగ్ల పరచురణ, అట్ట బైండు)
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 0-06-250217-4 (మొదటి ఆంగ్ల పరచురణ, అట్ట బైండు)

ది ఆల్కెమిస్ట్ (The Alchemist), పాలో ఖెలో అనే రచయిత వ్రాసిన ఒక దృష్టాంత (allegorical) నవల. ఇది మొట్టమొదట 1988లో ముద్రింపబడింది. ఈ నవలలో "శాంటియాగో" అనే స్పానిష్ గొర్రెల కాపరి తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సాగించిన ప్రయాణం వర్ణింపబడింది. దీనిని ఒక modern classic గా అభివర్ణించారు.[1][2]. ఈ పుస్తకం కథాంశం హోర్హే లూయిస్ బోర్హెస్ (Jorge Luis Borges) వ్రాసిన టేల్ ఆఫ్ టూ డ్రీమర్స్ (ఇద్దరు స్వాప్నికుల కథ) అనే కథపై ఆధారపడి ఉంది.[3]. ఈ నవలను పరుసవేది పేరుతో కె.సురేష్ తెలుగులోకి అనువాదం చేశాడు.

పరిచయం[మార్చు]

ది ఆల్కెమిస్ట్ నవల మొదట పోర్చుగీస్ భాషలో ప్రచురింపబడింది. తరువాత 67 భాషలలోకి అనువదించబడింది. అత్యధిక భాషలలోకి అనువదింపబడిన జీవించి ఉన్న ఒక రచయితయొక్క రచనగా గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించింది.[4] 150 దేశాలలో ఈ పుస్తకం ఆరున్నర కోట్ల కాపీలు అమ్ముడయ్యింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన పుస్తకాలలో ఇది ఒకటి.[5]

"యువత స్వప్న సాకారంలో సహకరించే మరో గొప్ప నవల" అన్న శీర్షికతో దుప్పల రవికుమార్ సమీక్షా వ్యాసంలో ఇలా వ్రాశాడు - మన ఆత్మలన్నీ విశ్వాత్మలో అంతర్భాగమని, సృష్టిలో ప్రతిజీవీ ప్రతి వస్తువూ అసలు వస్తువు ప్రతిరూపాలేనని చెప్పిన ఉపనిషత్ సారాన్ని కథ రూపంలో మలిచి పాశ్చాత్య నవలాకారుడొకడు చెప్తే ఆ గ్రంథాన్ని యావత్ ప్రపంచమంతా హృదయానికి హత్తుకుంది. లెఫ్ తొలుస్తొయ్ అనే ప్రఖ్యాత రష్యన్ రచయిత పలకడం రాని అమెరికన్ల నోట్లోపడి లియో టాల్‌స్టాయ్ అయినట్లు లాటిన్ అమెరికన్ రచయిత పాలో కొయెల్ హొ కూడా పాల్ ఖెలో అయ్యాడు. అతను రాసిన ఆ నవల "ది ఆల్ఖెమిస్ట్".

నవలలో కథ మనమెన్నోసార్లు విన్నదే. ఒక గొర్రెలకాపరి కుర్రాడికి చర్చి పక్కన పడుకున్నపుడు ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర బంగారునిధి దొరికినట్టు కల వస్తుంది. కలను నిజం చేసుకుందామని నానాకష్టాలు పడి పిరమిడ్ల దగ్గరకు చేరిన కుర్రాడిని ఓ దొంగల నాయకుడు చితకబాది కలను నమ్మి కష్టాలుపడిన మూర్ఖుడిని చంపకుండా వదిలేసి, పోతూపోతూ తనకొచ్చిన కల గురించి చెప్తాడు. ఆ కుర్రాడు పడుకునే చర్చి దగ్గర బంగారు నిధి దొరికినట్టు దొంగల నాయకునిక్కూడా కలొచ్చిందంటాడు. చావుతప్పి కన్నులొట్టబోయిన కుర్రాడు మళ్ళీ వెనక్కివచ్చి చర్చి దగ్గర తవ్వి బంగారునిధిని సొంతం చేసుకుంటాడు. ఇంతే కథ. కానీ నిజానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు చదవడానికి కారణం ఖెలో చెప్పిన కథన విధానం. ఈ కథను ఒక సాకుగా తీసుకుని రచయిత వేదాంత తత్వాన్ని విశదీకరించడం వల్లనే అటు ఆధ్యాత్మిక పరులైన సీనియర్ పాఠకులకు ఇటు వ్యక్తిత్వ వికాస పుస్తకాభిమానులైన యువ పాఠకులకు అంతగా ఆకట్టుకోగలిగింది.

1999లో పుస్తకాలఫై సంతకాలు పెడుతున్న రచయిత పాల్ ఖెలో

నేపథ్యం[మార్చు]

బ్రెజిల్ దేశంలో రియోడిజనిరోలో 1947 ఆగస్టులో జన్మించిన పాల్ ఖెలో విప్లవోద్యమాలు అమెరికానంతటినీ ఉద్రేకంతో ఊపేస్తున్నపుడు ఆ నేలంతా పర్యటించాడు. నాటకరంగంలోను, జర్నలిజంలోను కొన్నాళ్ళు గడిపాక 2001 అనే పేరుతో ఒక ప్రత్యామ్నాయ పత్రికనొకదానిని నడిపాడు. మరింత స్వేచ్ఛా కోసం పోరాడాడు. అయితే ఇరవై ఐదోయేట పారామిలటరీ దళాలు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి వదిలాక, మనిషి పూర్తిగా మారిపోయాడు. సంగీత రంగంలోకి వెళ్లి అత్మికతను సంతరించుకున్నాడు. మొదట కలలోను, తర్వాత నిజంగాను కనిపించిన ఒక మనిషి సలహాతో కాథలిక్ గా మారిన ఖెలో రాయడాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. మొదట్లో అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నా, ఈ నవల విడుదల బ్రెజిల్ సాహిత్య చరిత్రలో మేలిమలుపు. ఖెలో నవలలు పిలిగ్రిమేజ్, ఫిఫ్త్ మౌంటెన్, ఎలెవెన్ మినిట్స్, జహీర్, వాకిరీస్.. అన్నీ ప్రపంచ పాఠకులంతా ఇష్టంతో ఆసక్తితో చదివినవే.

తెలుగు అనువాదం[మార్చు]

  • పుస్తకం పేరు : పరసువేది
  • అనువాదం చేసింది : సురేష్
  • ప్రచురణ : మంచి పుస్తకం

ఇవి కూడా చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

  • http://chaduvu.wordpress.comలో[permanent dead link] దుప్పల రవికుమార్ సమీక్షా వ్యాసం "యువత స్వప్న సాకారంలో సహకరించే మరో గొప్ప నవల" (తన రచనను తెలుగు వికీలోకి కాపీ చేయడానికి అనుమతి ఇచ్చిన రచయితకు కృతజ్ఞతలు)

మూలాలు[మార్చు]

  1. The Alchemist - 10th Anniversary Edition Books Christian.
  2. Paulo Coelho Archived 2014-02-23 at the Wayback Machine HarperCollins Publisher. "In celebration of its 20th Anniversary, Paulo Coelho's modern classic The Alchemist is now available in a special edition."
  3. "The Writers Almanac". Archived from the original on 2017-05-01. Retrieved 2020-01-07.
  4. Paulo Coelho Biography Archived 2009-10-15 at the Wayback Machine on PauloCoelho.com.
  5. Film to be made of Coelho's 'Alchemist AFP. May 19, 2008.

బయటి లింకులు[మార్చు]