ఎస్.ఆర్.డి.వైద్యనాథన్
ఎస్.ఆర్.డి.వైద్యనాథన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1929 మార్చి 15 |
మూలం | మైలదుత్తురై, తమిళనాడు, భారతదేశం |
మరణం | 2013 నవంబరు 18 | (వయసు 84)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
ఎస్.ఆర్.డి.వైద్యనాథన్ (1929 − 2013)[1] ఒక నాదస్వర విద్వాంసుడు.
ప్రారంభ జీవితం
[మార్చు]ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని మయిలదుత్తురై అనే గ్రామంలో 1929, మార్చి 15వ తేదీన సంగీతకారుల కుటుంబంలో జన్మించాడు. ఇతని తాత సెంబర్‌కోయిల్ రామస్వామి పిళ్ళై నాదస్వర కచేరీలు హెచ్.ఎం.వి. కంపెనీ రికార్డు చేయగా ఇతని తండ్రి దక్షిణామూర్తి నాదస్వర కచేరీలను కొలంబియా కంపెనీ రికార్డులుగా విడుదల చేసింది. ఇతడు తిరు మాయవరం రామయ్య పిళ్ళై వద్ద నాదస్వరాన్ని, తిరు విళుందుర్ ఎ.కె.గణేశపిళ్ళై, మదురై మణి అయ్యర్‌ల వద్ద గాత్ర సంగీతాన్ని అభ్యసించాడు.
వృత్తి
[మార్చు]ఇతడు ధర్మపురం ఆధీనం, తిరువదుత్తురై ఆధీనం, తిరుపాందాళ్ ఆధీనాల(శైవమఠాల)కు ఆధీన విద్వాంసుడిగా నియమించబడ్డాడు. ఇతడు చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో నాగస్వరం రీడర్‌గా పనిచేసి పదవీవిరమణ చేశాడు. చెన్నైలోని తమిళ ఇసై సంఘం సంగీత కళాశాలలో కూడా రీడర్‌గా పనిచేశాడు.
ఇతడు సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక, మొదలైన దేశాలలో పర్యటించి నాదస్వర ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు ఆకాశవాణి ఎ గ్రేడు కళాకారుడు. ఆకాశవాణిలో ఇతని నాదస్వర కచేరీలు అనేకం ప్రసారం అయ్యాయి. ఆకాశవాణి ఆడిషన్ బోర్డులో సభ్యుడిగా పనిచేశాడు. ఇతడికి నాదస్వర వాద్య కళలో 60 సంవత్సరాల అనుభవం ఉంది. ఇతడు రక్తి మేళంలో నిష్ణాతుడు. రాష్ట్రపతి భవన్‌లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో ఇతడు నాదస్వర కచేరీ నిర్వహించాడు. చెన్నైలోని రాజా అన్నామలై హాలులో అనేక మంది విద్వాంసుల ఎదుట "రక్తి మేళం" ప్రదర్శించి నగదు పురస్కారం గెలుచుకున్నాడు. దూరదర్శన్‌లో "అవధాన పల్లవి" అనే కార్యక్రమాన్ని వాయులీన విద్వాంసుడు ముగన్‌సింగ్‌తో కలిసి రెండు విధాలైన తాళాలను ఒకేసారి నాదస్వరం, వయోలిన్‌లలో పలికించే కచేరీ నిర్వహించాడు.
అవార్డులు, బిరుదులు
[మార్చు]- 1957లో శ్రీ షణ్ముఖానంద సభ, న్యూఢిల్లీ వారిచే 'నాద ప్రతిబింబం' బిరుదు.
- 1981లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" వారిచే 'కళైమామణి'
- 1987లో ముతమిళ్ పెరవై వారిచే 'రాజరత్న' పురస్కారం
- 'భారత్ కళాకార్'
- 2004లో మద్రాసు సంగీత అకాడమీ చెన్నై వారిచే 'టి.టి.కె.అవార్డు '.
- 2004లో కె.సుబ్రమణియం శతజయంతి పురస్కారం.
- 2004లో రసికరంజని సభ, చెన్నై వారిచే 'కళారత్న'
- 2006లో శ్రీకృష్ణ గానసభ, చెన్నై వారిచే 'సంగీత చూడామణి'
- 2006లో నారద గానసభ వారిచే 'నాదకళామణి'
- 2007లో 'సంగీత నాటక అకాడమీ అవార్డు
- 2008లో నారద గాన సభ, చెన్నై వారిచే భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా నగదు పురస్కారం.
- 2008లో అన్బుపాలం సాదనయ్యర్ సంగమ వారిచే బంగారు పతకం
- 2008లో తమిళ్ ఇసై సంఘం వారిచే 'ఇసై పెరారిజ్ఞర్'
మరణం
[మార్చు]ఇతడు తన 84వ యేట 2013, నవంబరు 18వ తేదీన మరణించాడు.
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- The Hindu coverage Archived 2008-06-09 at the Wayback Machine
- With Abdul Kalam Archived 2008-02-07 at the Wayback Machine
- Chennailives Article
- Hindu article Archived 2007-01-05 at the Wayback Machine
- Hindu news coverage