Jump to content

ఎస్.వి.పార్థసారథి

వికీపీడియా నుండి
సెవిలిమేడు వీరవల్లి పార్థసారథి
వ్యక్తిగత సమాచారం
జననం(1917-11-08)1917 నవంబరు 8
సంగీత శైలికర్ణాటక సంగీతం (గాత్రం)
వృత్తిగాయకుడు
లేబుళ్ళుకొలంబియా

ఎస్.వి.పార్థసారథి ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు.[1]

విశేషాలు

[మార్చు]

ఇతడు పంకజమ్మాళ్, ఎస్.వి.విజయరాఘవాచారి దంపతులకు 1917, నవంబర్ 8వ తేదీన జన్మించాడు.[2] ఇతని తండ్రిడ్ విజయరాఘవాచారియర్ బహుగ్రంథకర్త, న్యాయవాది. ఇతడు మొదట తన సోదరుడు ఎస్.వి.సౌందరరాజన్‌తో కలిసి తన తల్లి వద్ద సంగీతపాఠాలు నేర్చుకున్నాడు. తరువాత 1934-38లలో అన్నామలై విశ్వవిద్యాలయంలో టి.ఎస్.సబేశ అయ్యర్, కె.పొన్నయ్య పిళ్ళై, టైగర్ వరదాచారి, కృష్ణ అయ్యంగార్ వంటి మహామహుల సమక్షంలో సంగీతాన్ని అభ్యసించి "సంగీత భూషణం" పట్టాను పొందాడు. 1938లో ఇతడు తన మొదటి కచేరీని తిరువణ్ణామలైలో ఇచ్చాడు. తరువాతి ప్రదర్శనను ఎగ్మోర్‌లోని జగన్నాథ భక్త సభలో టి.కె.కృష్ణస్వామి అయ్యర్ తంబూర సహకారంతో విజయవంతగా నిర్వహించాడు. అది మొదలు 1954 వరకు ఇతడు తన సోదరుడితో కలిసి జంటగా, తరువాత ఒంటరిగా అనేక సంగీత గాత్ర ప్రదర్శనలను సభలలో, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఇచ్చాడు. ఇతడు మంచి వీణావాదకుడు కూడా. ఇతడు 1954లో అన్నామలై విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా తన ఉద్యోగాన్ని ప్రారంభించి, ప్రొఫెసర్‌గా ఎదిగి, 1988లో లలితకళల విభాగానికి డీన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇతడు తిరుచ్చి ఆకాశవాణి కేంద్రంలో కర్ణాటక సంగీతం, లలిత సంగీత కార్యక్రమాలకు ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వర్తించాడు. అనేక లలిత గీతాలకు స్వరకల్పన చేశాడు. ఆకాశవాణిలో "కీర్తనాంజలి", "రాగ విలక్కమ్‌" వంటి కొత్త కార్యక్రమాలను ప్రసారం చేసి సామాన్యులకు సంగీతం పట్ల అభిమానాన్ని పెంపొందించాడు. 20 సంవత్సరాలపాటు ఆకాశవాణీలో తిరువయ్యారులో జరిగే త్యాగరాజ సంగీత ఆరాధనోత్సవాలను ప్రసారం చేశాడు. ది హిందూ పత్రికలో సంగీతానికి సంబంధించి అనేక వ్యాసాలు వ్రాశాడు. తమిళ పత్రిక "కల్కి"లో సంగీత విభాగానికి బాధ్యుడిగా ఉన్నాడు. మద్రాసు సంగీత అకాడమీ నిపుణుల కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. ఇతడు ఎందరినో తన శిష్యులుగా స్వీకరించి సంగీతం నేర్పించాడు. 1977లో ఇతనికి "సంగీత సామ్రాట్" బిరుదు లభించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2005లో కర్ణాటక సంగీతం గాత్రం విభాగంలో ఇతడు చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డును ఇచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. web master. "S. V. Parthasarrathy". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 13 ఆగస్టు 2020. Retrieved 25 February 2021.
  2. N.Rajagopalan. "S.V.PARTHASARATHY - VOCALIST". Indian Heritage. Sumathi ALN. Retrieved 25 February 2021.