Jump to content

ఎ.బి.బర్థన్

వికీపీడియా నుండి
అర్ధేందు భూషణ్‌ బర్ధన్‌
ఎ.బి.బర్థన్


భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ.
పదవీ కాలం
1996 – 2012
ముందు ఇంద్రజిత్ గుప్తా
తరువాత సురవరం సుధాకర్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1924-09-25)1924 సెప్టెంబరు 25
బరిసాల్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా,(ప్రస్తుతం బంగ్లాదేశ్)
మరణం 2016 జనవరి 2(2016-01-02) (వయసు 91)
ఢీల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ
వృత్తి రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త

అర్ధేందు భూషణ్‌ బర్ధన్‌ ( 1924 సెప్టెంబరు 25 – 2016 జనవరి 2) [1] లేదా ఎ.బి.బర్థన్, భారతదేశంలోని ప్రాచీన రాజకీయపార్టీ అయిన భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసారు. సంక్షుభిత సంకీర్ణ రాజకీయాల శకంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సమర్థవంతంగా నడిపించారు.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆయన సెప్టెంబరు 25 1924 న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన బరిసాల్ లో జన్మించారు. ఆయన తన 15వ యేట నుండి కమ్యూనిస్టు భావాలను కలిగియుండి నాగపూర్ వెళ్ళారు.[2] ఆయన 1940 లో నాగపూర్ విశ్వవిద్యాలయం లోని ఆల్ ఇందియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లో చేరారు.[2] ఆ కాలంలో నిషేధింపబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో అదే సంవత్సరం చేరారు. ఆయన నాగపూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. ఆయన ఆర్థికశాస్త్రం, న్యాయశాస్త్రాలలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను కూడా పొందారు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

తర్వాత కార్మిక నేతగా పలు ఉద్యమాలు చేపట్టారు. ఆ సమయంలో 20 సార్లు అరెస్టయ్యారు. నాలుగేళ్లకుపైగా జైలు జీవితం గడిపారు.[2][2] ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, 1957లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాగ్‌పుర్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీకి అధ్యక్షునిగానూ పనిచేశారు. 1969, 1980 సాధారణ ఎన్నికల్లో నాగ్‌పుర్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 1990లో దేశ రాజకీయాల్లో ప్రవేశించి, సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. 1996లో యూపీఏ1 సంకీర్ణ ప్రభుత్వంలో సీపీఐ చేరడంలో బర్ధన్‌ కీలక పాత్ర పోషించారు. అప్పటివరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఇంద్రజిత్‌ గుప్త హోంమంత్రి కావడంతో, బర్ధన్‌ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2012 మార్చి వరకూ ఆయన ఆ పదవిలోనే కొనసాగారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులకు ఆయన తన విలువైన సూచనలిస్తూ వచ్చారు. కాంగ్రెస్‌, భాజపాయేతర పక్షాలను ఖథర్డ్‌ ఫ్రంట్‌గ పేరుతో ఒక్క తాటిపైకి తీసుకురావడంలో బర్ధన్‌ విశేషంగా కృషి చేశారు.[3]

సంకీర్ణ శకంలో కీలక పాత్ర

[మార్చు]

1957లో ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించిన బర్ధన్.. అదే ఏడాది మహారాష్ట్ర శాసనసభకు నాగ్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1967, 1980 సంవత్సరాల్లో విదర్భ నుంచి పార్లమెంటుకు పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. 1990ల్లో ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చిన బర్ధన్.. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1996లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. ఇంద్రజిత్‌గుప్తా నుంచి బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో కూటమితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో.. సీపీఎం కురువృద్ధుడు హరికిషన్‌సింగ్‌సూర్జిత్‌తో కలిసి, బర్ధన్ కీలక పాత్ర పోషించారు.

ఆ ప్రభుత్వంలో సీపీఐ చేరటంలోనూ బర్ధన్ పాత్ర కీలకమైనది. ఆ సర్కారులో ఇంద్రజిత్‌గుప్తా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతర కాలంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పడటంలోనూ దానికి వెలుపలి నుంచి మద్దతు ఇవ్వటం ద్వారా సూర్జిత్, బర్ధన్‌లు కీలక పాత్ర పోషించారు.[2] పదహారేళ్ల పాటు వరుసగా నాలుగు పర్యాయాలు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన బర్ధన్.. 2012లో ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కూడా పార్టీ సభ్యులకు మార్గదర్శనం కొనసాగించారు.[4]

మరణం

[మార్చు]

ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో నివసిస్తున్న బర్ధన్ గత నెల 7వ తేదీన మధ్య మెదడు నాడిలో పూడిక కారణంగా పక్షవాత పోటు (బ్రెయిన్ స్ట్రోక్) కు గురవటంతో ఆయనను జి.బి.పంత్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బర్ధన్‌కు చికిత్స అందిస్తున్నారు.[5] [6][7] ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి 2016 జనవరి 2 రాత్రి 8:20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.[5][8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బర్ధన్‌కు కుమారుడు అశోక్ (కాలిఫోర్నియా యూనివర్సిటీలో అర్థశాస్త్ర బోధకుడు), కుమార్తె అల్కా (అహ్మదాబాద్‌లో వైద్యురాలు) ఉన్నారు. ఆయన భార్య నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే వారు. ఆమె 1986 లో చనిపోయారు.[9]

మూలాలు

[మార్చు]
  1. "Communist Party of India (CPI): The revolutionary life of Comrade A. B. Bardhan". Communistparty.in. Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-02.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "CPI veteran Bardhan passes away: He embraced Communism at 15, remained committed till end". The Indian Express (in ఇంగ్లీష్). 2016-01-03. Retrieved 2023-05-18.
  3. వామపక్ష అగ్రనేత బర్ధన్‌ కన్నుమూత
  4. బర్ధన్ అస్తమయం
  5. 5.0 5.1 "Political Leaders Unite In Condoling AB Bardhan's Death". NDTV.com. Retrieved 2023-05-18.
  6. "Veteran CPI leader A B Bardhan passes away". The Indian Express. 2 January 2016. Retrieved 2 January 2016.
  7. "Ardhendu Bhushan Bardhan Death". TelanganaNewspaper.
  8. "PM Modi condoles veteran CPI leader AB Bardhan's demise". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-05-18.
  9. బర్ధన్ అస్తమయం, సాక్షి, January 03, 2016 06:49 (IST)

ఇతర లింకులు

[మార్చు]