ఏకవింశతి అవతారములు
Jump to navigation
Jump to search
లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు.
21 అవతారాలు
[మార్చు]మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాథలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించ బడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.
శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు - అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.
- బ్రహ్మ అవతారము: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రాహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
- యజ్ఞ వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
- నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
- నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
- కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
- దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
- యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
- ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
- పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
- మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
- కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
- ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
- మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
- వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము . రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
- నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.
- వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
- పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్క మారులు దండెత్తి వారిని దండించాడు.
- వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.
- రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.
- బలరామ అవతారము, కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.
- కల్కి అవతారము: కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.
- బుద్ధ అవతారము: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. (బుద్ధుడు, బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.)
లీలావతారాలు
[మార్చు]భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.
- వరాహావతారం - భూసముద్ధరణం
- సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం
- కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం
- దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం
- సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం
- నరనారాయణావతారం - కామజయం
- ధ్రువావతారం - ధ్రువపదారోహం
- పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం
- ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం
- హయగ్రీవావతారం - వేదజననం
- మత్స్యావతారం - వేద సంగ్రహం
- కూర్మావతారం - మందర ధారణం
- ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం
- వామనావతారం - బలిరాజ యశోరక్షణం
- హంసావతారం - భాగవత యోగోపదేశం
- మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం
- పరశురామావతారం - దుష్టరాజ భంజనం
- రామావతారం - రాక్షస సంహారం
- కృష్ణావతారం - లోకకళ్యాణం
- వ్యాసావతారం - వేద విభజనం
- బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం
- కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం
ఇవి కూడా చూడండి
[మార్చు]వనరులు
[మార్చు]- శ్రీమన్మహా భాగవతము - ఆచార్య డా.అప్పజోస్యుల సూర్యప్రకాశరావు - ప్రచురణ:గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి
- శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు