ఏడిదము సత్యవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెండువారాల పూర్వం శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథని పరిచయం చేస్తూ తెలుగులో స్త్రీల ఆత్మకథలు (సినిమాతారలవి తప్పించి) ఇంతకు ముందు చదువలేదు అని వ్రాశాను. ఆ తరువాత గుర్తుకు వచ్చింది కొన్నేళ్ళ పూర్వం చదివిన ఏడిదము సత్యవతిగారి ఆత్మచరితము.

ఈ పుస్తకం మొదటిసారి 1934లో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణశాలయందు క.కోదండరామయ్యగారిచే ముద్రించబడింది. ఈ పుస్తకం ముందుమాట (ఫిబ్రవరి 1, 1934) వ్రాసినప్పుడు సత్యవతిగారు అవనిగడ్డలో ఉన్నారు. స్త్రీలు తెలుగులో రాసిన ఆత్మకథల్లో ఇది మొదటిది కావచ్చు అని ఈ పుస్తకానికి విపులమైన ముందుమాట వ్రాసిన శ్రీ వకుళాభరణం రాజగోపాల్ భావించారు. ఆయన పరిశోధన ప్రకారం, 1934కు ముందు తెలుగులో మూడు ఆత్మకథలు మాత్రమే ప్రచురింపబడ్డాయి: కందుకూరి వీరేశలింగము స్వీయ చరిత్రము (మొదటి సంపుటము 1911, రెండవ సంపుటము 1915), రాంభొట్ల జగన్నాధ శాస్త్రి స్వీయవరిత్రము (1916, విశాఖపట్టణము), రాయసం వెంకట శివుడు ఆత్మచరితము (1933, గుంటూరు). అందుచేత తొలి తెలుగు స్వీయచరిత్రల వరుసలోనూ, సత్యవతిగారిది ఉన్నత స్థానమే.

ఉత్తమనాయకుడికి ఉండవలసిన లక్షణములన్నియు మూర్తీభవించిన తన నాధుడు శ్రీ ఏడిదము సీతారామయ్యని ఈ పుస్తకానికి నాయకుడిగా చేసుకొన్నాను అని ముందుమాటలో సత్యవతిగారు అన్నారు. ఈ పుస్తకానికి ముందు “సీతారామాస్తమయ”మని పేరు పెడదామనుకొన్నారు కాని, “వారి అర్థ శరీరిణినైన నేనును ఆ కష్టముల ననుభవించినదాని నగుట చేతను, ఇప్పటికిని మా ఆఆఖ్యాయికకు, శాంతి జరుగక రంగమధ్యమునందే యుండుట చేతను, దీనికి ఆత్మచరితము అని పేరు బెట్టితిని”.

ఈ పుస్తకం రెండుభాగాలుగా ఉంటుంది. మొదటిభాగం సత్యవతిగారు సీతారామయ్యగారు మొదటిసారి కలవటంతో ప్రారంభమై, సీతారామయ్యగారి మరణం తర్వాత ఆమె అభిప్రాయాలతో ముగుస్తుంది. రెండవభాగంలో భగవంతుని అస్తిత్వం, ఆచార వ్యవహారములు వంటి విషయాలపై సత్యవతిగారి ప్రశ్నలు, ఆమెకు తోచిన సమాధానాలు ఉన్నాయి.

సత్యవతిగారి తండ్రి బెజవాడలో డి.పి.డబ్ల్యులో ఓవర్‌సీయరు. “అయిదేండ్లు వచ్చుసరికి, మా తల్లితండ్రులు, అక్షరాభ్యాసమునకై, మా యూరఁ గల బాలికా పాఠశాలకుం బంపిరి. నాకు చిన్న తనము నుండియు, దైవభక్తి మెండు. అసత్యము బలుకుటసహ్యము. నా తోడి బాలికలెపుడైన పోరాడుచుండిన నేనచట నుండెడిదానఁ గాదు. అనారోగ్యముగ నుండు బాలికలతో నేనెప్పుడును నేస్తము గట్టలేదు. నా జననీజనకులుగాని ఉపాధ్యాయులుగాని చెప్పిన పనిని జవదాటక చేయుట నా కలవాటు. భాల్యము నుండియు సావిత్రి, చంద్రమతి, సీత మున్నగు పతివ్రతల చరితములు చదువుట యందెక్కువ ఉత్సాహ ముండెడిది.”

పది సంవత్సరముల వయసులో, సత్యవతిగారి కుటుంబము గోదావరి మండలమున కోరంగి గ్రామములో బంధువుల అబ్బాయి ఉపనయనానికి వెళ్ళారు. వడుగైన బాలుడు పదమూడేళ్ళవాడు; మూడవ ఫారము చదువుతున్నాడు; అందగాడు, తెలివిగలవాడు. ఒక నాటకీయ పరిస్థితిలో ఆ యువకుడు (?), ఈ బాలికని ఏకాంతంగా కలుసుకొని, కొంత సంభాషణ తరువాత, “నన్ను పెండ్లి చేసుకొనెదవా?” అని అడిగాడు. కొంత ఆలోచన తరువాత, “నీవే నా మనోహరుడవు, నీవే నా జీవితేశ్వరుడవు, ఇంతయేల, నీవే నా జీవనసర్వస్వమవు! నిన్నుగాక వేఱొకని వరింప జాలనని మనఃపూర్వకముగా శపథము చేయుచున్నాను,” అను మాటలు సత్యవతిగారి “నోటి నుండి అప్రయత్నముగ వెలువడినవి”. కొంతకాలానికి, వారి కోరిక ప్రకారమే సంబంధము కుదిరి పరిణయము జరిగినది.

సీతారామయ్యగారు ఎఫ్.ఏ పరీక్ష యందు ఉత్తీర్ణులైన తరువాత, పైకి చదివించటానికి ఆయన తండ్రి నిరాకరించగా (తన కుమారులందరినీ సమానముగ చదివింపవలెనని ఆయన ఉద్దేశం), సత్యవతిగారి తండ్రి ఆయనను కాకినాడ ఉన్నత కళాశాలయండు బి.ఏ. చదివించారు. డిగ్రీ వచ్చిన తరువాత చాలారోజులవరకు వేరే ఉద్యోగము దొరకక, చివరికి పోలీసు సబ్ఇన్‌స్పెక్టరు ఉద్యోగములో చేరారు. రాయవేలూరులో ఒక యేడు శిక్షణ పోందారు. గంజాం జిల్లాలోని శ్రీకాకుళములో ఆరు నెలలు పనిచేశాక ఆముదాల వలసకు బదిలీ అయ్యారు. “ఈ గ్రామ మతి క్రూరమైనదనియు, అసత్యవాదుల కాలవాలమనియు” ఒకసారి ఆయన సత్యవతిగారికి చెప్పారు. ఐదు నెలల తర్వాత, అకారణముగా ఆయనను ఉద్యోగమునుంచి తీసివేసితిమని ఆజ్ఞాపత్రము వచ్చినది. ఉద్యోగము అవసరము లేకపోయినను, పౌరుషమునకై మదరాసు వెళ్ళి పోరాడి తన ఉద్యోగము మరల సంపాదించుకొన్నారు (ఆ సమయంలో ఆముదాలవల్స పౌరులు సమర్పించుకున్న ఆరు పద్యాల అభినందన పత్రిక ఈ పుస్తకంలో పొందుపరచారు).

తన ఆర్డరుని ధిక్కరించి ఈయన మళ్ళా ఉద్యోగములో కొనసాగుతున్నాడని కోపగించిన పై అధికారి సీతారామయ్యగార్ని “ఏజెన్సీ”లో బమినిగాం అన్న ఊళ్ళో స్టేషనుకు పంపాడు. ఆ మన్యప్రదేశము ఆడువారు ఉండుటకు అనువైన ప్రదేశము కాకపోవడంతో సత్యవతిగారు విడిగా ఉండవలసివచ్చింది. బమినిగాం నుండి దారిగంబాడీ స్టేషనుకు బదిలీ అయ్యాక, “రెండవ ఆడతోడు లేనిది యిక్కడ ఒంటరిగ కాపురముండుట కష్టతరము” కాబట్టి, అక్కడకు సత్యవతిగారిని వేరే ఆడతోడు ఇచ్చి పంపించమని మామగారికి కార్డు వ్రాశారు. ఒక ముసలామెను తోడు ఇచ్చి పంపించారు. బరంపురం స్టేషన్‌లో దిగినప్పుడు సీతారామయ్యగారు కనిపించక కొన్ని ఇబ్బందులు పడ్డారు. తోడు వచ్చిన ముసలమ్మ మన్యం వెళ్ళటానికి భయపడి బరంపురం నుంచే వెనుదిరిగి వెళ్ళింది. స్థానిక పోలీసు అధికారులు ఆమెను బల్లిగుడా పంపించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తతో కలసి, అడవులగుండా రెండెడ్ల బండి, డోలీ, కాలినడక ప్రయాణాలు చేసి దారిగంబాడీకి చేరుకొని అక్కడ మళ్ళీ కాపురం ప్రారంభించారు. దారిగంబాడీలో సౌకర్యాలు లేక కష్టపడాల్సి వచ్చింది. అక్కడ ఒక డాక్టరు, కాంపౌండరు, స్కూలుమాస్టరు, ఇద్దరు తెనుగు పోలీసులు, వీరు తప్ప మిగతావారంతా కొండదొరలు. అక్కడ ఉన్న కొండస్త్రీలు దిగంబరలు. వారు సత్యవతిగారిని వింతమానిసిగా చూశారు. అక్కడి అశుభ్రత, దుర్వాసన, వారి అలవాట్లు సత్యవతిగారికి ఇబ్బంది కలిగించేవి. అక్కడకూడా సీతారామయ్యగారికి పై అధికారులతో ఇబ్బందులు తప్పలేదు.

దారిగంబాడీలో సీతారామయ్య, సత్యవతి దంపతులిద్దరికీ జ్వరం వస్తూ, తగ్గుతూ ఉండటం మొదలయ్యింది. కొంతకాలం తర్వాత ఆ ఊరులోనే సీతారామయ్యగారు జ్వరంతో మరణించారు. భర్తపోయాక తాను బ్రదికి యుండరాదని సహగమనం చేసుకొందామనుకొంటే చుట్టూ ఉన్నవారు కూడనివ్వలేదు. కత్తితో పొడుచుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. ఆ ఊరిలో ఉన్న డాక్టరుగారు కాంపౌండరుని తోడిచ్చి ఆమెను తల్లితండ్రుల వద్దకు తిరిగి పంపారు.

“నన్ను, నా జీవితేశ్వరునితోఁ పోనీయక దైవము వంచించినాడు సరియే! నేను నా జీవితేశ్వరుని, ఛాయాపటమును తీసుకొని వారి పావన నామమును, సర్వదా ధ్యానించుచు, వారి పాదపద్మములను పూజించి, వారి కర్పితము కానిది, మంచినీరైనను, పుచ్చుకొనక నియమవ్రతమును జేయుచుంటిని. నా నాధుని అనుసరించి వెళ్ళకుండ నా స్థూలదేహమును మాత్రము నిలిపినాడు. కాని వాని (sic) ననుసరించి పరిగిడు నా హృదయము నాపగలిగెనా? నా మనోహరుని నేను పరలోకమునైనను కలియగలనని ధైర్యము నాకుఁ గలదు. ఏల యన? ఈ లోకమున మా యిరువురకు సంబంధమును కూర్చిన దేవుడు, అక్కడ మాత్రము మమ్మేల కలుపడు? నా హృదయేశ్వరుని యనుగ్రహమున, నీ లోకములోనే, నేను దైవమును సాధింపఁగలనని నమ్ముచున్నాను. నా యత్నములు కొనసాగినచో మన భారతదేశమున నామమాత్రావశిష్టముగ నున్న పాతివ్రత్యమును పునరుద్ధరింతును. లేనిచో నా దైవమును శపించి నా జీవితేశ్వరుని పాదపద్మములను తలచికొనుచు, నునురుల (sic) విడిచి నా మనోహరునకును, నాకును, తిరిగి జననమరణములు లేకుండునట్లు, శాశ్వత సౌఖ్యమును చేకూర్చుకొనియెదను. ఇదియే నా మనఃపూర్వకమైన సమయము. సర్వం మత్ప్రాణేశ్వ రార్పిర్తమస్తు.” అంటూ ఆత్మచరితాన్ని పూర్తి చేశారు సత్యవతిగారు.

ఆత్మచరితమునకు అనుబంధములో, దేవుని గురించి, పూజల గురించి, ఆచారముల గురించి, నమ్మకములను గురించి చర్చ చేసిన తరువాత, అన్నీ నడుపు వాడొకడు ఉన్నాడని నిర్ణయించుకొన్నా, పుణ్యమన పరోపకారమే ననియు, నితరుల హింసించుట, కష్టపెట్టుట పాపమనియు అభిప్రాయపడి, చివరకు ఆమె చెప్పిన మాట: “ఇటువంటి మాయికుఁడగు క్రూరదైవమును నమ్ముటకన్న మనకన్ని విధముల ప్రత్యక్షముగ సహాయమొనరించు మానవులని నమ్మిన మేలని తలచుచున్నాను”.

ఈ పుస్తకంలో ఉన్న విశేషమేమంటే, సత్యవతిగారు మరణించిన తన భర్తపై చూపిన భక్తి భగవంతుడిపై చూపుతున్నట్లు కనిపించదు. ఆవిడ తనను తాను వితంతువుగా వర్ణించటం కూడా తక్కువే. నిరంతర పతి భక్తిసేవల ద్వారా తన పాతివ్రత్య నిరూపణ ఆమెకు ముఖ్యమన్నట్టు తోస్తుంది. ఆమె తన ఆలోచనలద్వారా కొన్ని నిశ్చితమైన నిర్ణయాలకు వచ్చింది. భగవంతుడున్నాడు. ఆతనికి పూజలు చేసినా ఒక్కటే, చేయకపోయినా ఒక్కటే; తనకు ఇష్టం వచ్చిన రీతిలో పనిచేస్తాడు. చనిపోయినవారి పేర తద్దినాలు పెట్టటమూ, పిండాలతో పిత్రుదేవతలు సంతృప్తిపడి పరలోకాలకు పోవడం వంటి విషయాలు తర్కానికి నిలవవు. పాపము, పుణ్యము మనము కల్పించుకొన్నవే. స్వర్గమూ, నరకమూ, పునర్జన్మలు, కర్మలు ఉన్నాయని నిశ్చయంగా అనుకోవటానికి ఆధారాలు లేవు.

ఇంకో ముఖ్యవిషయం సత్యవతి సీతారామయ్యలమధ్య ఏర్పడిన ప్రేమ, వారి దాంపత్యము, పరస్పర అనురాగము, విరహము, పునస్సమాగమముల గాఢవర్ణన కొంత ముగ్ధంగా, అమాయకంగా ఉండి వారిద్దరిపై అభిమానం కలిగిస్తుంది. ఆమె కష్టంపట్ల సానుభూతిని కలిగిస్తుంది. కొన్నిసార్లు పాత తెలుగు సినిమా చూస్తున్నట్లు, పాత బెంగాలీ నవల చదువుతున్నట్లు అనిపించింది.

సత్యవతి గారి ఆలోచనా విధానం, ఆమె వాడిన భాష, అక్కడక్కడా ఆమె వ్రాసిన పద్యాలు, ఉదహరించిన ఇతరుల పద్యాలు చదివితే ఆమె తెలుగు బాగా చదువుకున్నారని తెలుస్తుంది. ఈ గ్రంథరచనకు తమ నాయనగారి మిత్రులగు శ్రీమాన్ విద్వాన్ దీవి నరసింహాచార్యులు గారు సాహయమ్మొనర్చినట్లు ముందుమాటలో చెప్పారు.

ఇది చాలా చిన్న పుస్తకం. అనుబంధంతో కలసి ఈ ఆత్మచరితము 36 పేజీలు ఉంది. అందులో ఆఖరు 12 పేజీలు సత్యవతిగారి అభిప్రాయాలు, వాదనలు. అందుచేత అసలు ఆత్మకథ ఎక్కువ లేదు. ఈ పుస్తకం వల్ల ఆ కాలానికి సంబంధించిన కొన్ని విలువలు, విషయాలు చూచాయగా తెలుస్తాయి కాని, వివరంగా తెలీదు. ముందుమాట రాసిన తేదీ తప్ప మిగతా కాల వివరాలు తెలీదు. భార్యాభర్తలు ఎంతకాలం కలసి ఉన్నారో, భర్త చనిపోయిన ఎంత కాలానికి ఈ పుస్తకం ప్రచురింపబడిందో కూడా తెలీదు.

శ్రీ వకుళాభరణం రాజగోపాల్ ఈ పుస్తకానికి వ్రాసిన విపులమైన చారిత్రక నేపథ్య వివరణ విలువైనది. తెలుగులో స్వీయ చరిత్రల గురించి, స్త్రీవిద్య గురించి, అప్పటి స్త్రీల ఆత్మకథల గురించి విలువైన వివరాలు ఇచ్చారు.

ఈ పుస్తకాన్ని పునర్ముద్రించింది అస్మిత (రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్) సంస్థ. పుస్తకాన్ని అందంగా ముద్రించారు. అచ్చుతప్పులు బాగా తక్కువగానే ఉన్నాయి. ఆత్మచరితము ఏడిదము సత్యవతి ప్రథమ ముద్రణ: 1934 రెండవ ముద్రణ: అక్టోబర్ 2005 ప్రచురణ: అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ టీచర్స్ కాలని, ఈస్ట్ మారేడ్‌పల్లి, సికిందరాబాద్